S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అర్థం తెలుసా..?

విషయానికి రాగలగడం చాలా గొప్ప విషయం - మెక్ లియోడ్ జి ప్రెస్టన్ (ఈయనగారెవరో తెలియదు. కానీ చాలా గొప్ప మాట అన్నారు.)
* * *
ఒక అనర్థం జరుగుతుంది. దేశం మొత్తం ఒక్కటి అవుతుంది. ఆ భావన కొంతకాలం నిలుస్తుంది. ముందే ఎన్నికల కాలం. పులి మీద పుట్రలాగా పుల్వామా అనర్థం ముంచుకు వచ్చింది. అది నిజంగా అనర్థం. యుద్ధాలు, సేనలు అంటే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకు చావడానికే కదా? యుద్ధం అన్న పద్ధతిని మొదలుపెట్టిన వారు ఎవరో తెలియదు. అంతకన్నా అర్థంలేని పద్ధతి మరొకటి లేదు. తెలివిగల మనిషి ఆ తెలివిని ఉపయోగించుకుని సమస్యలకు సమాధానాలు వెతకవచ్చు. అంతేకాని పాశవికంగా, రాక్షసంగా ఎదురుపడి చంపుకుని అందులో బలాబలాలు తేల్చుకుంటాం అంటే అంతకన్నా అమానుషం మరొకటి లేదు. అయినా చరిత్ర అంటేనే యుద్ధాల వరుస. ప్రస్తుతం యుద్ధం జరగడంలేదు. కానీ ఇరు దేశాల మధ్యన పొంతన లేదన్న సంగతి కూడా మరవడానికి లేదు. హ్యాపీమోన్ జేకబ్ అనే జె ఎన్ యు ప్రొఫెసర్ ఒకాయన ఈ మధ్యన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. దాని పేరు లైన్ ఆఫ్ కంట్రోల్. జేకబ్ అసలే మంచి పేరు లేని ఆ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు బోధిస్తూ ఉంటాడు. వౌలికాంశాలను బోధిస్తూ ఉంటే చిక్కు లేదు. ఈ పెద్దమనిషి భారత పాకిస్తాన్ సంబంధాల మీద నిపుణుడు. ఈ విషయం గురించి రెండు దేశాలలోనూ చర్చలు సమావేశాలు జరుగుతుంటాయి అంటే మనలాంటి వాళ్లకు కొంచెం విచిత్రంగానే తోస్తుంది. సైన్యం దారి సైన్యం చూస్తుంటే, విద్యావంతులు, పరిశోధకులు మరో పక్కన మాటలు, మంతనాలు సాగిస్తున్నారు అన్నమాట. తన రంగం గురించి బాగా తెలుసుకోవాలి కనుక ఈ ప్రొఫెసర్‌గారు భారతదేశంలోని సైనిక అధికారులను చాలామందిని కలిసి విషయ సేకరణ చేస్తుంటాడు. పదవిలో ఉన్నవాడు అంత సులభంగా మాట్లాడరని, రిటైర్ అయినవారు సులభంగానే ఎన్నో విషయాలు చెబుతారని ఈ పరిశోధకుడు తన పుస్తకంలో వెల్లడిస్తాడు. నేను ఆ పుస్తకాన్ని కొన్నాను. రెండు మూడు పత్రికలో సమీక్ష చదివిన తరువాత ఆ పుస్తకం చదవాలి అనిపించింది. కనుక కొన్నాను. చదివాను కూడా! పరిశోధకుడు దేశంలో సైన్యాధికారులను మెప్పించి, ఒప్పించి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట కొంతకాలం గడిపి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. ఈలోగా అటువేపు వారిని కూడా రకరకాలుగా బుజ్జగించి, పాకిస్తాన్ వెళ్లడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అంతేకాదు సరిహద్దు వెంట అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి వారితో కలిసి మంతనాలు చేయడానికి కూడా కావలసిన అనుమతులను సంపాదించాడు.
మన దేశంలోలాగే అటు పాకిస్తాన్‌లో కూడా ప్రజలకు పక్క దేశం ప్రజల మీద నిజంగా ఏవగింపు లాంటివి లేవు. అయితే రాజకీయంగా అవసరం గనుక, మీడియా వారు అంతకన్నా చేయగలిగింది లేదు గనుక రకరకాల మార్గాల ద్వారా అవతలి దేశం మీద అందరికీ గుండెల నిండా అసహ్యం కలిగే పరిస్థితులను కావాలని తయారుచేస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. ప్రజలకు ప్రజలకు మధ్యన వైరుధ్యం ఉండవలసిన అవసరం లేదు. నేను ఈ రకం మాటలు చెబితే నన్ను కూడా దేశభక్తి లేని వాడు అని తన్ని తగలేస్తారు. ఇక్కడ దేశభక్తి గురించిన ప్రసక్తి లేనేలేదు. అవతలి దేశంలో ఉంటున్న వాళ్లు కూడా మనుషులే. కానీ దేశాన్ని నడిపిస్తున్న వారు మాత్రం బహుశా మనుషులు కారు. ఇది రెండు వైపులా సత్యమే. వీళ్లకు తగినట్టే మిలిటరీ ఉంటుంది. నిష్కారణంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఇరు వైపుల నుంచి కాల్పులు జరుగుతుంటాయని, అమాయకుల ప్రాణాలను బలికొంటారని అర్థం కానివ్వరు. హ్యాపీమోన్ జేకబ్ పుస్తకం మొత్తం చదివితే విషయం అర్థమవుతుంది.
నిజానికి ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్నది పాకిస్తాన్, భారతదేశాల మధ్యన ఉన్న సంబంధాలను గురించి కానే కాదు. అందుకే విషయానికి రావడం కష్టం అన్న ఒక మంచి మాటను ముందే ఉటంకించాను. దేశంలో అందరికీ ఈ మధ్యన కొంచెం మరుపు పాలయిన దేశభక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. పంద్రాగస్టు, ఛబ్బీస్ జనవరి వచ్చాయంటే పాటలు పాడుతూ వీధుల వెంట ఊరేగింపులు చేసిన చిన్నతనపు అనుభవాలు గుర్తుకు వస్తాయి. తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తరువాత జరిగిన చైనా, పాకిస్తాన్ యుద్ధాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన దేశభక్తి మరొకసారి కళ్ల ముందు మెదలుతుంది. అప్పటికి నేను అవగాహన లేని కుర్రవాడిని. అయినా దసరా, దీపావళి లాగే స్వాతంత్య్ర దినం కూడా ఇవ్వాళటికి నాకు పండుగలాగా కనిపిస్తుంది. దసరా, దీపావళి గురించి తెలియని నేటి యువతరానికి ఇక దేశభక్తి గురించి ఎవరు చెప్పాలి?
మొత్తానికి అందరికీ ఈ గడ్డు సమయంలో సైనికుల పట్ల తమకు గల భావాలను వ్యక్తం చేయవలసిన అవసరం ఉందని అర్థమైంది. మా వీధి చివరన కూడలిలో బహుశా ఆటోవాళ్లు, మరి కొంతమంది కలిసి ఒక జెండా ఎగురవేసి అక్కడ దేశభక్తి పాటలు వినిపించారు. కానీ సందర్భానికి తగినట్లు కాకుండా వాళ్లంతా హాయిగా జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. అసలు విషయం చెప్పడానికి వాళ్లకు తగిన నాయకత్వం లేదు. నాలాంటివాడు ఎవడైనా ముందుకు వెళ్లి చెబుతానంటే, బహుశా వాళ్లు వినే లక్షణం కనిపించదు. వాళ్లను వదిలిపెట్టవలసిందే. ఒక సాయంత్రం మా కాలనీలోని ఆడవాళ్లు కొంతమంది చేరి కొవ్వొత్తులు వెలిగించి వీధుల వెంట నినాదాలు చేస్తూ తిరిగారు. (నేను వాడిన ఆడవాళ్లు అన్నమాట బాగుండలేదు.) స్ర్తి జనం అనడంకన్నా ఇదే కొంత మేలు అనుకున్నాను. వీళ్ల భావన చాలా బాగుంది. కానీ వీరిలో కూడా సందర్భానికి అవసరమైన సమాచార దృష్టి మాత్రం లేదు. మరేమీ తోచలేదు కనుక అదే పనిగా భారత్ మాతాజీ జై అంటూ ఉన్నారు వాళ్లు. అప్పుడప్పుడు ఎవరో కలుగజేసుకుని వి వాంట్ జస్టిస్ అని కూడా నినాదాన్ని ఇస్తున్నారు. వాళ్లకు ఏమి న్యాయం కావాలి అన్నది వాళ్లకే తెలియదు. మృతవీరులకు నివాళులు అర్పిస్తున్నారు కనుక వారి గురించి నినాదాలు ఉండాలి. చిత్రంగా మన దగ్గర ఏ నినాదం కావలసి వచ్చినా అది మరొక భాషలో ఉండాలి. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి అనడానికి మజ్దూర్ యూనియన్ జిందాబాద్ అంటారు. ముర్దాబాద్ అనే మాట మరొకచోట వాడుకుంటారు. లేదంటే ఇంగ్లీషులో నినాదాలు చేస్తారు. మన భాష మీద మనకు పట్టులేదు. కనుకనే పెద్దపెద్ద మాటలు సంస్కృతం నుంచి అరువు తెచ్చుకుని వాడుకునే పద్ధతి చాలాకాలంగా కొనసాగుతున్నది. ఇక నినాదాల విషయానికి వస్తే సంస్కృతంలో నినాదాలు ఇచ్చేవారు ఎవరు బహుశా అందుబాటులో లేరు. వీర జవాన్ అమర్ రహే అంటే సరిపోయేది. ఆ రెండు ముక్కలు కూడా వీరికి దొరకలేదు. భారత్ మాతాకీ జై అన్నారు. ఎవరు ఈ భారత్ మాత? ఇది నా ఇవాళటి విషయం.
విషయానికి చేరుకునే సరికే నాకు అందుబాటులో ఉన్న ఈ పేజీ అడుగుకు చేరుకున్నాను. అయినా మునిగింది లేదు. భారతమాత అన్న మాట ఒక భావన మాత్రమే. తెలుగులో కొంతమంది భరతమాత అని కూడా రాస్తారు. సంస్కృతం, వ్యాకరణం తెలిసిన వారికి ఇక్కడ ఒక చిక్కు ఎదురవుతుంది. భరతుని మాత భారతమాత, అంటే శకుంతల. ఆమెను కాదు మనం ప్రార్థిస్తున్నది. భారతదేశం అనే మాతను ఊహించుకుని పూజించుకుంటున్నాము. మాతృదేశం అన్న భావన మనలో గట్టిగా ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ! మరి ఇప్పుడు ఎవరు ఈ భరతమాత?
భక్తి కావాలంటే అందుకు ఒక ఆలంబన కావాలి. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అజాయమానుడు అని ఆయన గురించి ఒక పక్కన చెప్పుకుంటూనే ఆయనకు వేలాది ఆకారాలను ఆపాదించుకుని, అర్చావతారములు అంటూ పూజలు చేస్తున్నాము. అందులో ఒక దేవుడు సరిపోక లెక్కలేనన్ని దేవుళ్లను తయారుచేసుకున్నాము. కనుక గజిబిజి పుట్టింది తెలియజెప్పే వారు లేక కొంతమందికి విషయం అర్థం కావడంలేదు.
అచ్చంగా ఇదే పద్ధతిలో దేవం మీద అభిమానం ఉండాలంటే, ఆ దేశాన్ని ఒక మనిషిగా చూడగలగాలి. దేవుడిని కూడా మనిషిగా చూచిన మనం దేశాన్ని ఒక తల్లిగా చూచి పూజించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అభ్యంతరం అంతకన్నా ఉండకూడదు.
ఇంకొక తికమక గురించి ఇక్కడే చెప్పుకుంటే పోతుంది. వందేమాతరం అంటూ బంకించంద్రుడు తన నవలలో వాడుకున్న ఒక పాటను జాతీయగీతం, నేషనల్ సాంగ్గా వాడుకుంటున్నాము. ఏవో కొన్ని విశేషణాలు ఉన్న మొదటి భాగాన్ని మాత్రమే అవసరం వచ్చినప్పుడు పాడుకుంటున్నాము. సప్తకోటి కంఠ కలకల నినాద అంటూ తరువాత సాగే చరణాలు ఉన్నాయి అని కూడా చాలామందికి తెలియదు. ఇక అసలైన జాతీయ గీతానికి వస్తే జనగణమన అధినాయక అంటూ ఒక పురుషుడిని ప్రార్థిస్తున్నాము. రవీంద్రుని దృష్టిలో ఈ పురుషుడు జార్జి చక్రవర్తి అని నేను ఇవాళ అంటే అందరూ నన్ను తన్ని తగలేస్తారు. ఎవరు ఈ అధినాయకుడు? భారతమాత అనే భావన ఒక పక్కన ఉండగా ఎందుకు ఒక పురుషుడిని ప్రార్థించడం? ఆ పురుషుడు ఒక దేవుడు అనుకుందామా? అప్పుడు అంతకన్నా పెద్ద చిక్కు మొదలవుతుంది? ఆ దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు? రవీంద్రుడు ఏ మతానికీ చెందని ఒక దేవుని గురించి పాడుకున్నాడు. అంత భావనా బలం మనకు ఉన్నదా చెప్పండి! ఈ విషయం గురించి ఇక్కడ నేను ఇంతకన్నా ఎక్కువ ప్రస్తావించదలచుకోలేదు.
అందరూ నాకంటే ఎక్కువ తెలిసినవారే! ఆలోచించండి! ఆలోచన లేని వారికి కనీసం మీరైనా చెప్పండి! తికమకలో పడి తెలియకుండా ముందుకు సాగేకన్నా, ఉన్నచోట నిలబడి ఆలోచించడం మేలు కదా!

-కె.బి.గోపాలం