S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెంటాడే క్షణాలు..

ఫరిచయాలు వ్యసనాలు కావు. జ్ఞాపకాలు ముండ్ల గులాబీల్లాంటివి; ముండ్లు, తొడిమలు, దళాలు వాడిపోయినా - వాడి’ పరిమళాలు శాశ్వతానుభూతులు! ఆశావాదులు ఎల్లవేళలా ఎదురుచూడటం - బలవంతంగానైనా అలవర్చుకుంటారు. నిరాశావాదులు ‘వర్రీ’ అవడం హాబీగా పెట్టుకుంటారు. లాటరీ టిక్కెట్ కొనడం, ఉద్యోగం కోసం అప్లికేషన్ పంపడం ఒక్కలాంటివే ననిపించింది. ఆ ప్రయత్నం చెయ్యలేదు.
మా పినతండ్రి భార్య పార్వతి (కక్కి) మా నాయనమ్మకి స్వయానా మేనకోడలే. మా నాన్నగారిని అంటే పెద్ద బావగారిని కూడా ‘ఏరా, బావా!’ అని పలకరించేది. ఆమె ఒక కథల పుట్ట. ‘కక్కి’ అని పిల్చేవాళ్లం - విజయనగరం ‘చిక్కోల్ ప్రాంతపు సంప్రదాయాన్ని బట్టి - ఆమె అరేబియన్ నైట్స్ కథలు - బేతాళ కథలు కూడా వరస తప్పకుండా - ‘టెంపో’ సడలకుండా విసుక్కోకుండా చెప్పేది. కాశీ మజిలీ కథలు ఎంత బాగా చెప్పేదీ అంటే ‘మధిర సుబ్బన్న దీక్షితులుగారు మా పిన్ని దగ్గరే విన్నాడా?’ అన్నట్లు చెప్పేది. శ్రద్ధగా ఆలకించేవాడ్ని. అలా శ్రద్ధగా ఆలకించే అలవాటు, నాకు ఆనక స్కూల్లో చాలా బాగా పనికొచ్చింది. సరే, పోయిన సారి మద్రాసు వెళ్లినప్పుడు ‘కనె్నమెరా’ లైబ్రరీకి వెళ్లాను. వెతుక్కుంటూ, తెలుగు సెక్షన్‌కి పోయాను. అక్కడ శిథిలమైన కొన్ని మ్యాగజీన్లు దొరికాయి. ‘పాపాయి’ అన్న మాసపత్రికలు దొరికాయి. ఈ పత్రిక ‘బాల’కి సమకాలీన పత్రిక. ‘సింహబలుని సాహస యాత్రలు’ అన్న సీరియల్ రాశాను. దీనికి ఆడబోయిన తీర్థం ఎదురొచ్చినట్లు.. ఆ పత్రికలు ఎదురొచ్చాయి. అట్లాగా పిల్లల కథలు చెప్పడం అన్నది అలవాటు అయిపోయింది.
‘శ్రీవాత్సవ’గారు ఎలా పరిచయమయ్యారో జ్ఞాపకం లేదు గానీ - మరీ చిన్నప్పుడే ఆయన రాసిన ఉత్తరాలు ఒకటి రెండు దొరికాయి.
‘అబ్బాయ్! భావోద్రేకం నీలో జలపాతం అంత వున్నది. కానీ దాన్ని పట్టుకునేందుకు ఆల్చిప్పలంత ‘మాటలు’ చాలవు. పద సంపద ముఖ్యం’ అన్నాడాయన. గొప్ప కోపం వచ్చింది నాకు. కానీ పర్యాయ పద కోశాలు, అర్థానుస్వార, పూర్ణానుస్వార పరిచ్ఛేదాలు వగైరాలు తిరగేయడం - తెలుగులోను, ఇంగ్లీషులోనూ అలవాటు అయింది. ఈ సన్నివేశం ఎందుకు జ్ఞాపకం వచ్చిందీ అంటే అరవై - అరవై ఒకటీకి మధ్య - ‘అంటే అప్పుడు ఈ ఎపిసోడ్ అన్న మాట) అభిమాని, స్టూడెంట్ ఐన ఆరాధన ఉత్తరం రాస్తూ... ‘కొంతమంది పెద్దలకి నా మీద ప్రిజుడిస్ ఏర్పడింది’ అన్నారు కదా, మీరు అని ప్రస్తావించింది.
‘ఎవరికి? భద్రిరాజు వారికా? శ్రీవాత్సవ గారికా? పోతుకూచి వారికా? మా ‘తెలుగు సార్‌కా?’ అంటూ హైద్రాబాద్ కాలేజీ పిల్లలు లెటర్సు రాశారు నాకు.
‘అయ్యయ్యో! భద్రిరాజు వారు చాలా పెద్దవాడు. ఆయన రాసిన భాషా చరిత్రయే చదువుకుంటున్నాను. సాంబశివరావు గారింక ‘యమా’ క్లోజయిపోయాడు. ‘విశ్వరచన’ ‘యూనిలిట్’ వగైరాలు - తన విశ్వసాహితీ ప్రచురణలు అన్నీ టంచన్‌గా టపాలో వస్తున్నాయి. ఇక ‘మంజుశ్రీ’ జిగ్రీ దోస్త్ అయినాడు’ అంటూ సమాధానాలు రాశాను.
ఇప్పుడు పెద్దయినాక రేడియో స్టేషన్‌కి తరచు పోయి రావడంతో శ్రీవాత్సవగారు - అనగా యండమూరి సత్యన్నారాయణ గారు నేరుగా పరిచయం అయి, ‘క్లోజ్’ అయ్యాడు. మా ఇంటర్‌మీడియెట్‌లో కాబోలు (1956)లో ‘ఖాసా’ వారు స్వర్గస్థులైనారు. తరువాత వారి తెలుగు ‘స్వతంత్ర’ని స్వంతంగా, నాన్నా తంటాలూ పడి తీసుకొచ్చిన వారిలో శ్రీవాత్సవ గారున్నారు.
అరవైలో వచ్చిన తెలుగు స్వతంత్ర నవలలు మీద వార్షిక సమీక్ష ఆంధ్రజ్యోతి, డైలీలో - ఎనిమిది కాలమ్స్ వెడల్పున - ‘ఈ ఏడాది పలువురిని ఆకర్షించిన పది నవలలు’ అంటూ సమీక్ష రాశాడాయన. అందులో నావి రెండు నవలలు, అలా ‘సన్మానం’ అందుకున్నాయి (ఓహోయ్!)
అప్పట్లో చాలా స్పీడుగా నవలలు రాస్తున్న వేళ - నారీమణి ‘లత’ అను తెనే్నటి హేమలత - ఆకాశవాణిలో అనౌన్సర్ గానీ, ఆమె గ్లామర్, పేరు ప్రఖ్యాతులు ఇంకా అదనంగా ఉండేవి. నాకు అభిమానులయిన ఆరాధనా, సుభద్ర, శశికళా, విక్టోరియా, బాబూరావు, ఆనందమోహన్ లాంటి కళాశాలల యువతరం - లతగారికి కూడా ఫ్యానే్స - పరిచయం లేకపోయినా.
నేను మద్రాసు నుంచి తిరిగి 1965 తర్వాత బెజవాడ తిరిగి వచ్చేశాక నేనూ, లతా జిగ్రీ దోస్తులై పోయాం. కానీ, 14.11.1960న ఆరాధనా - నాకు లెటర్ రాస్తూ, హిందూ పేపర్‌లో ‘వాంటెడ్ కాలమ్స్’ చూడమని సలహా ఇచ్చింది. ‘అన్నట్లు’ అంటూ, అండర్‌లైన్ చేసి అదే లెటర్‌లో ఇలా రాసింది. ‘విశాలాంధ్ర పత్రిక సండే పేపర్‌లో మహీధర రామ్మోహన్ గారు లత నవల (రాగజలధి) మీద రాసిన అభిప్రాయాన్ని చదివాను. మిమ్మల్ని పొగుడుతూ ‘లత దిగజారిపోతున్నది’ అన్నారు. మరి ఆవిడెందుకలా చేసిందో అర్థం కావడంలేదు’ అంటూ బాధపడింది.
ఆ అమ్మాయి రిఫర్ చేసిన నవల లతగారి ‘రాగజలధి’ అన్న కొత్త నవల. రామ్మోహన్ గారి దగ్గరకు పరిగెత్తాను - విశాలాంధ్ర ఆఫీసుకి. ఆయన రాసిన రివ్యూలని కత్తిరించి ఒక నోట్‌బుక్‌లో అంటించే వారాయన. నేనూ ఆయనని ఇమిటేట్ చేశాను అటు తర్వాత. ఆయన నవ్వుతూ క్లిప్పింగుల బుక్ నా చేతికిచ్చి, ‘తిట్టింది నేను రాసింది నేను. నువ్వెందుకలా చలికి వణికే పిల్లికూనలాగా ముడుచుకు పోతున్నావ్?’ అన్నారు ఇలా నవ్వేసి. ‘గర్వపడు. గానీ గర్వం ప్రదర్శించకు - ఎందుకంటే, లత మంచి పేర్గాంచిన రచయిత్రి. టాలెంట్ వున్న ‘తెంపరి’ అటువంటిది, ఆమె నీ నవల తొలి మలుపుని చదవటమే కాదు - మెచ్చి - ఆ నవలలోని యాభై రెండవ ఛాప్టర్‌లోని రెండు పేజీలు ఇంచుమించు ఎత్తి రాసేసుకుంది’ అన్నారు.
వసంతం తొడిగింది, కోకిలలు కూసేయి.. గత శిశిరంలో రాలిన ఆకులెన్ని?’ అని ఏ వసంతాన్ని అడుగుతావ్.. ఇప్పుడు తొడుగుతున్న చిగుళ్లు చూడు.. ఇదే జీవితం...’ అంటూ నేను రాసిన ఓ పది పదిహేను లైన్లు ‘రాగజలధి’లో కూడా, అచ్చం అట్లాగే వున్నాయి.
లత రచనని ప్రశంసిస్తూనే, గట్టి చురకలు అంటించాడాయన. ‘వీరాజీకిది గొప్ప. లతకి పతనం’ అన్న అర్థంలో సాగింది ఆ రివ్యూ. స్వతంత్రమైన కథలు, నవలలూ రాజ్యం ఏలే రోజులవి. అప్పటికే ఆమె ‘ఊహాగానం’ కాలమ్ ప్రభలో రాస్తున్నట్లు వుంది. సరే, నాటికి పత్రికలే రాజులు. లత దగ్గరికి రుూ ‘వివాదం’, వెళ్లింది. ఆమె స్పందించింది యిలా - (రివ్యూలు అందరూ చదివారు) -కుర్రాడు వీరాజీ. అతడే నన్ను కాపీ కొట్టి వుండొచ్చును అనుకోవచ్చునుగా. ఆ ‘ముసిలాడు’ (రా.మో.గారు) అలా, ఎంతో పరుముకుందిట. రేడియో కేంద్రం ‘టాక్ సెంటర్’ అయింది. ‘ఏమో ఓ ప్రెస్‌లో నా నవల రాసిన కాయితాలు చాలా కాలం పడేశాను. ఈ కుర్రాడు అక్కడికి పోయి, ఆ పేజీలు చూశాడేమ? ‘ఎత్తేశాడు కాబోలు’, అన్నదిట. ఇలా ‘్ఫడ్ బ్యాక్’ వస్తున్నా నేను చలించలేదు. తొలి మలుపు అచ్చయి, పాఠకుల నోళ్లలో నలిగిపోయింది. అటు తర్వాత ‘రాగజలధి’ వచ్చింది. ఈ వాస్తవం లత వంటి ప్రతిభావంతురాలు గ్రహించడానికి ఎంతోకాలం పట్టలేదు.
‘ఏమిటోనయ్యా! అదేదో స్టూడెంట్ లైఫ్ కదా పడుక్కొని, అలా చదువుతూ, ఇలా మగతగా, నిద్దరొస్తోందని చిన్న కునుకు తీశాను. ఆనక లేచి, ఈ ‘రాగజలధి’ పేజీలు రాయడం చేశాను. పోనిద్దురూ’ అంటూ దొడ్డ మనసుతో సర్దుకున్నది.
రేడియోలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌స్ (ట్రాక్స్0 అంతా మా వాళ్లే కొండముది, ప్రసాదరావు, మా రూమ్మేట్ గోపాలం అంతా ఆంధ్రా యూనివర్సిటీ వాళ్లే. (సుత్తి) వీరభద్రరావు, జలసూత్రం వారు, నండూరి రామ్మోహన్, సుబ్బారావులు, రామవరపు, వోలేటి వారు - ఇలా పెద్దలు అందరికీ నా మీద వాత్సల్యమే. దాంతో రాయడమే పని!
ప్రభలో ‘ఎద్దు’ కథ రాశాను. ఒక్క పేజీ కథ పడ్డది (1961) అది చదివి వైజాగ్ నుంచి రావిశాస్ర్తీగారు (ఓ కార్డు) ‘ప్రభ’కి రాశారు. రావూరు సత్యన్నారాయణ రావుగారు ‘మా వాళ్లు దీన్ని (వీక్లీలో) వెయ్యడం లేదుట. మీ అన్నయ్యకియ్యి తీసుకుపోయి’ అంటూ తమ్ముడి చేత, ఆ కార్డు పంపించారు. రావిశాస్ర్తీ గారు ‘వీరాజీ రాసిన గిత్త కథ, శానా బాగుంది’ అంటూ ఇంకా మంచి రెండు వాక్యాల కార్డు రాశారు. ఎగిరి గంతేశాను. క్యాంపస్‌లో ‘జ్యేష్ట’ కారణంగా నాకు కూడా ఆయన ఫ్రెండయిపోయాడు, గతంలో రావూరు గారు ‘ఆషామాషీ’ రాసేవారప్పుడు. చెయ్యి తిరిగిన కాలమిస్టు కూడానూ ఆయన. ‘చంద్రవంక’ అన్న నవల కాబోలు విజయ సాహితీలో చదివాక ప్రచురణ అయింది. రావూరుగారూ, నేనూ గాంధీనగర్‌లో శాంతికేఫ్ (వెల్‌కమ్ ప్రక్కనే)లో కలిసేవాళ్లం. ఓ కప్పు కాఫీ తాగేవాళ్లం, ఆయన ‘ఇంటర్‌వెల్’లో. నాకయితే అంతా ఇంటర్ వెల్లేగా!..
* * *
రాధాకృష్ణగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అంటే ఆంధ్రపత్రిక వీక్లీ ఎడిటర్‌గారు రచయిత వీరాజీకి రాశారు - ‘ఆంధ్ర పత్రిక వీక్లీ - ఒక కథల ప్రత్యేక సంచిక తెస్తున్నాం. అందులో కేవలం మేము అడిగి తీసుకున్న వారి ప్రత్యేక కథలు మాత్రమే వేస్తాము. వేరే కథలు, శీర్షికలు అన్నీ ఎత్తేసి - కథలకి ఒక స్పెషల్ ‘ట్రీట్’గా ఇది వేస్తున్నాం. మీరు తప్పక ఫలానా తేదీలోగా మీ కథ పంపండి’ అని. కంగారుపడ్డాడు ఈ ‘వీరాజీ’. లెటర్ పట్టుకొని మాబడే సాయిబు వీధిలోకి - మా ‘జాఫ్రీ’లో నుంచి ఇలా - ‘స్టెప్ అండ్ జంప్’ చేసి, సందు కొసదాకా, గబగబా - అర్జెంట్ పని వున్నవాడిలా నడిచి,తిరిగి ‘పరుగున’ తిరిగి ఇంట్లోకి వచ్చేశాను.
కథ అడిగారో? అప్పట్నుంచీ మస్తిష్కంలో సాగర మధనం షురూ. గడువు తీరే వేళకి - సిజేరియన్ బేబీ లాగ ‘సుఖం’ కథ బయటపడ్డది - పైలా పచ్చీస్ రూమాన్సు కాదది. సమాజంలో - వ్యవసాయ సంపన్నుల జాగాలో చాలా భాగం పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ బడా ఆసాముల ‘హవా’ వీస్తున్నది అప్పుడు.. లక్షాధికారి సుందరయ్య - కష్ట్ధాకారి ‘సీతారాముల’కీ మధ్య - ‘టెండర్ ఫీలింగ్స్’ని ‘బొమ్మ కట్టే’ ఈ కథ పేరు ‘సుఖం’. ఆ రోజుల్లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో - సెంటర్ స్ప్రెడ్‌లో - బాపు డబుల్ స్ప్రెడ్ బొమ్మతో కథ రావడం మా కథకులకు పండుగే! దాంతో ఈ కథ నన్నొక అంతస్తు పైకి తీసుకుపోయింది.
ఈ థీముని ‘నవల’గా ‘సుఖం కోసం’ పేరిట రాయడానికి నాకు ఇంచుమించు ఐదేళ్లు పట్టింది. మద్రాసు లొకేల్‌గా రాశాను. చాలా శ్రమపడ్డాను. ఫలితం దక్కింది. నా మీద ‘ఎగ్జిస్టెన్సిలిజమ్ మోజు, గతి తార్కిక భౌతిక వాదం ప్రభావం పడ్డాయి. - ఇక్కడో ‘కామా’ పెట్టాలి. ‘సుఖం కోసం’ (కథ) కన్నా ముందే ‘విడీవిడని చిక్కులు’ నవల ఆంధ్ర పత్రిక కోటలో - ‘పాగా’ వేసింది. తదుపరి ఏం జరిగిందంటే..

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com