S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్వజనామోదం.. ‘సద్గురు’ మార్గం

భారతదేశం పుణ్యభూమి. ప్రపంచానికి ఆధ్యాత్మిక సంపదను సమకూర్చిన కర్మభూమి. భక్తి, ప్రేమ, దయ, నీతి, న్యాయం, సత్యం, సత్ప్రవర్తన, సహనం ఈ ధర్మభూమిపై అనాదిగా వికసిస్తున్నాయి. మన దేశంలో జన్మించిన మహానుభావులు, గురువులు తమదైన శైలిలో మానవాళికి ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవనానికి ముక్తిమార్గం చూపిస్తున్నారు. అలాంటి వారిలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దేశ సమగ్ర అభివృద్ధికి యువశక్తి తోడ్పడేలా ఆయన అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం సద్గురు ఏర్పాటు చేసిన ‘ఈశా ఫౌండేషన్’ నేడు భారత్, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలతోపాటు అంతర్జాతీయంగా 250 కేంద్రాలలో 90 లక్షల మంది వాలంటీర్లను కలిగి ఉంది. నిబద్ధతతో ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారు. మతాలకు అతీతంగా మానవ సేవ, శ్రేయస్సు కోసం లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.
తమిళనాడులోని కోయంబత్తూరుకు 30 కిలోమీటర్ల దూరంలోని నీలగిరి కొండల్లో భాగమైన వెల్లంగిరి పర్వతాల పాదాల చెంత ఈశా ఫౌండేషన్ ప్రధాన ఆశ్రమం ఉంది. అంతర్జాతీయ ఈశా యోగా కేంద్రంగా కూడా ఇది పనిచేస్తోంది.
ప్రజలను ప్రభావితం చేస్తున్న 50 మంది భారతీయ గురువుల్లో జగ్గీ వాసుదేవ్ ఒకరుగా నిలిచారు. యోగి, మిస్టిక్, దార్శనికుడు అయిన ఆయన విశిష్ఠ ఆధ్యాత్మిక గురువు. సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2017 లో ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని అందజేసింది. సద్గురు ప్రసంగాలు ప్రజలను మంత్రముగ్దులను చేస్తాయి. సులభమైన ఇంగ్లీషులో ఆయన ప్రసంగిస్తుంటారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లోనూ మాట్లాడతారు. తర్కం, చమత్కారాల మేళవింపుగా ఉండే ప్రసంగాలు ఆయనకు గొప్ప వక్తగా, ‘ఒపీనియన్ మేకర్’గా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చాయి. మానవహక్కులు, వ్యాపార విలువలు, సామాజిక అంశాలు, పర్యావరణ పరిరక్షణ, నదుల సంరక్షణ తదితర అంశాలపై ఆయన తరచూ ప్రసంగిస్తుంటారు. మాటలే కాకుండా తాను చెప్పింది ఆచరణలో చూపిస్తున్నారు.
సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు జగ్గీ వాసుదేవ్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ తదితర శక్తివంతమైన కార్యక్రమాలను సమాజానికి అందించారు. మనిషిలో ఉన్న శక్తిని వెలుగులోకి తేవడమే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ ప్రధాన ఉద్దేశం. సద్గురు చేపట్టిన కార్యక్రమాల్లో ప్రధానమైనవి- యాక్షన్ ఫర్ రూరల్ రీజువనేషన్, ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్, ఈశా విద్య, ఈశా యోగా తదితరాలున్నాయి. యోగాలో ‘ఈశా క్రియ’, ‘ఉప యోగ’ లపై ప్రధానమైన దృష్టి కేంద్రీకరించారు. తమిళనాడులోని చాలా గ్రామాల్లో ‘ఈశా స్కూల్స్’ ప్రారంభించారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో వందలాది ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోంది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈశా స్కూల్స్ ప్రధానంగా పనిచేస్తున్నాయి.
ఈశా ఫౌండేషన్ ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ఆ వివరాలు...
ఇన్‌సైట్:
‘ఇన్‌సైట్’ అనేది వినూత్నమైన, శక్తివంతమైన వ్యాపార నాయకత్వ పథకం. ప్రతి వ్యక్తిలో ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని వెలుగులోకి తీసుకువచ్చి, ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడేలా రూపొందించడమే ఈ పథకం లక్ష్యం. వ్యక్తిగత సాధికారతను, సామర్థ్యాన్ని పెంపొందింప చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. వ్యాపారవేత్తలకు, యువతకు సద్గురు అందించే ప్రత్యేక కార్యక్రమం ‘ఇన్‌సైట్’. జాతీయ, అంతర్జాతీయంగా పేరున్న వ్యాపారవేత్తలు కూడా సద్గురు బోధనలను అమలు చేస్తున్నారు.
మనిషిలో దాగి ఉన్న శక్తిని పూర్తిగా

ఉపయోగించుకునేందుకు ఇన్నర్ ఇంజనీరింగ్ అనే యోగ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. వ్యక్తి తన మనస్సును, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ఉత్తమమైన ఫలితాలను సాధించే ప్రక్రియ- ‘ఇన్నర్ ఇంజనీరింగ్’. 21 నిమిషాల పాటు శ్వాసపై ధ్యాస ఉంచే ‘శాంభవి మహాముద్ర క్రియ’ ఇందులో భాగంగా ఉంటుంది.
ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్
అడవులను పెంచేందుకు సద్గురు చేపట్టిన పథకమే ‘ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్’. ఈ పథకం కింద తమిళనాడులో దాదాపు 12 కోట్ల మొక్కలను నాటారు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఇంత భారీ కార్యక్రమం చేపట్టడం విశేషమే. మన సమాజంలో అటవీ సంపద 33 శాతం ఉండాలని శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా పచ్చదనం 33 శాతం ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ వల్ల ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టును మూడు భాగాలుగా అమలు చేస్తున్నారు.
‘ట్రీ ఫర్ ఆల్’ అనేది మొదటి భాగం. ఈ పథకం ద్వారా వాలంటీర్లు మొక్కలను పెంచి ప్రజలకు వాటిని పంపిణీ చేస్తారు. ఇళ్లల్లో పెంచేందుకు ఈ మొక్కలను ఉపయోగిస్తారు. గత 10 సంవత్సరాల్లో 450 నర్సరీల్లో రెండుకోట్ల మొక్కలను పెంచి తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో నాటారు.
‘ట్రీ ఫర్ లైఫ్’ అనేది రెండో భాగం. ఈ పథకం ద్వారా రైతుల చేత మొక్కలు నాటిస్తారు. రైతుల పొలాల్లో పళ్లు, పూలు పూసే మొక్కలు, చెట్లను పెంచుతారు. దీని వల్ల ఒకవైపు పచ్చదనం పెరగడంతో పాటు మరోవైపు రైతులకు ఆర్థికంగా లాభం జరుగుతుంది.
‘గ్రీన్ స్కూల్ మూవ్‌మెంట్’ అనేది మూడో భాగం. విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు, సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా రూపుదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. విద్యార్థుల చేత మొక్కలు నాటించడమే కాకుండా వాటిపోషణ బాధ్యత కూడా అప్పగిస్తారు. ఇప్పటికి పదిలక్షల మంది విద్యార్థులు దాదాపు 30 లక్షల మొక్కలను నాటారు.
ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ పథకం కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించింది. ఈ పథకం సక్రమంగా నడుస్తోందని, సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం ‘ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం’ అందచేసింది. చికాగోలో ‘బియాండ్ స్పోర్ట్స్ సమ్మిట్’ లో ‘ది స్పోర్ట్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ అవార్డు, కూడా ఈ పథకానికి లభించింది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర పర్యావరణ పురస్కారం అందచేసింది.
ఈశా విద్య
ఈశా విద్య పథకం ద్వారా విద్యార్థులకు మేలైన విద్యను అందించాలన్నది సద్గురు ఆశయం. పిల్లలకు చదువే పరమార్థం కాదని, యోగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లల్లో దాగి ఉండే ప్రతిభను వెలికి తీయాలనేది ప్రధాన లక్ష్యం. తమిళనాడులోని అనేక గ్రామాల్లో ఈ పథకం కింద పాఠశాలను నడిపిస్తున్నారు. ఈ పాఠశాలల్లో 40 శాతం మంది విద్యార్థులు నామమాత్రపు ఫీజు చెల్లిస్తారు. మిగతా 60 శాతం మంది విద్యార్థులు ఉచితంగా చదుకుంటారు. వీరికి పుస్తకాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. ఆధునిక విజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. లక్షలాది మంది విద్యార్థులకు ఈ పథకం లబ్దిచేకూరుస్తోంది. ఈశా సంస్కృతి పేరుతో విద్యార్థులకు సాంస్కృతక కార్యక్రమాలు తదితర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు.
గ్రామీణ పునరభివృద్ధి కార్యక్రమం (యాక్షన్ ఫర్ రీజివినేషన్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు. ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ క్రీడాపోటీలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు చేయూత ఇస్తున్నారు. దేశంలోని వెయ్యి గ్రామాల్లో పది లక్షలమంది దీనివల్ల లబ్దిపొందుతున్నారు. డాక్టర్లు గ్రామాలకు వెళ్లి రోగులకు పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు ఇవ్వడం కొనసాగుతోంది.
ర్యాలీ ఫర్ రివర్స్
దేశంలోని నదులను కాపాడేందుకు సద్గురు జగ్జీవాసుదేవ్ నడుం కట్టారు. ‘ర్యాలీ ఫర్ రివర్స్’ పేరుతో ఉద్యమం ప్రారంభించారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో సమావేశాలు, ఉరేగింపులు నిర్వహించారు. అనేక కారణాల వల్ల నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోతోందని, 2030 కల్లా నదుల్లో నీటి ప్రవాహం సగానికి సగం తగ్గిపోతుందని అంచనావేశారు. మరోవైపు నదులన్నీ కాలుష్యానికి గురువుతున్నాయని, కాలుష్యం నుండి నదులను కాపాడాలని సద్గురు ప్రయత్నిస్తున్నారు. నదీ జలాలు కలుషితం కాకుండా చూస్తూ, నదుల్లో జలాలు పూర్తిస్థాయిలో ప్రవహించేందుకు ఇప్పటి నుండి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఒక ఉద్యమాన్ని సద్గురు తీసుకువచ్చారు. ఈ ఉద్యమం కారణంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నదీ జలాల సంరక్షణ చర్యలు చేపట్టారు. ‘నీతి ఆయోగ్’ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సమగ్రంగా అధ్యయనం చేసి ప్రధానికి త్వరలోనే నివేదిక సమర్పించాలని ప్రధాని ఆదేశించారు. ఈ మేరకు అధ్యయనం సాగుతోంది..
ఆహ్లాద వాతావరణం - ఈశా సెంటర్
‘ఈశా’ ప్రధాన కేంద్రంలో ఆహ్లాద వాతావరణం నెలకొని ఉంటుంది. ఈశా ప్రధాన కేంద్రం తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని వెల్లంగిరి పర్వత పంక్తుల కింద ఉంది. ఈ ప్రాంతంలో యోగులు, సాధువులు, సిద్ధులు సంచరించారని, తపస్సు చేశారని తెలుస్తోంది. స్వయంగా శివుడే ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపాడని అంటారు. అలాంటి ప్రాంతాన్ని ‘ఈశా ఫౌండేషన్’కు ప్రధాన కేంద్రంగా సద్గురు ఎంపిక చేశారు. ఈ పర్వతాలు హిమాలయాల్లోని మానస సరోవరం పక్కనే ఉన్న కైలాస పర్వతాలను తలపించే విధంగా ఉన్నాయి. అందుకే వెల్లంగిరి పర్వతాన్ని ‘దక్షిణ భారత కైలాస పర్వతం’’గా పిలుస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈశా పౌండేషన్ ప్రధాన కేంద్రంగా ఉండాలని సద్గురు నిర్ణయించారు. ప్రశాంతమైన వెల్లంగిరి పర్వత శ్రేణుల ప్రాంతాన్ని ఈశా ప్రధాన కేంద్రం కోసం ఎంచుకున్నారు. జగ్గీ వాసుదేవ్ ఏడాదిలో చాలా కాలం ఇక్కడే ఉంటారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో దేశ, విదేశీ భక్తులు నెలల తరబడి గడుపుతారు. సద్గురు బోధనలకు పరివర్తన చెందిన యువతీ యువకులు వందలాది మంది స్వచ్ఛంద సేవా కార్యకర్తలుగా (వాలంటీర్లు) గా మారి పనిచేస్తున్నారు.
(మిగతా 13వ పేజీలో)

సద్గురు మార్గం.. (8-9 పేజీ తరువాయ)
ఈశా ప్రధాన కేంద్రంలో ధ్యాన లింగం ఆలయం, లింగభైరవి ఆలయం, 112 అడుగుల ఎతె్తైన ‘ఆదియోగి’ (శివుడు) బస్ట్ సైజ్ విగ్రహం ఉన్నాయి. 10 వేల మంది కూర్చునేందుకు వీలైన ఆడిటోరియంతో పాటు, మూడువేల మంది, రెండు వేల మంది, వెయ్యిమంది, ఐదొందల మంది సమావేశం అయ్యేందుకు వీలుగా చిన్నా, పెద్దా ఆడిటోరియంలు ఉన్నాయి.
ధ్యాన లింగం
ధ్యాన లింగాన్ని ఈశా ప్రధాన కేంద్రంలో వాసుదేవ్ ప్రతిష్ఠించారు. ఏడు చక్రాలు శక్తివంతంగా ఉన్న ఒక లింగంతో ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని తరతరాలుగా ప్రయత్నాలు జరిగాయి. ధ్యాన లింగాన్ని ప్రతిష్ఠించేందుకు వెయ్యి సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో ఒక ప్రయత్నం జరిగిందని చరిత్ర చెబుతోంది. కాని భోజ్‌పూర్‌లో ప్రతిష్ఠాపన జరగలేదు. మూడు సంవత్సరాల పాటు సద్గురు చేసిన సాధన తర్వాత ధ్యాన లింగ ప్రతిష్ఠ చేశారు. 13 అడుగుల తొమ్మిది అంగుళాల ఎతె్తైన శివలింగం (్ధ్యన లింగం) ఉంది. ఏడు చక్రాలుగా ఇది కనిపిస్తోంది. ధ్యాన లింగం అత్యంత శక్తివంతమైందిగా చూపరులకెవరికైనా అనిపిస్తుంది. ధ్యాన లింగం అర్ధచంద్రాకారంగా గర్భాలయం (హాలు) మధ్య ధ్యాన లింగాన్ని ప్రతిష్ఠించారు. పైకప్పునకు స్తంభాలు (పిల్లర్స్) ఏవీ లేకుండానే అత్యంత అద్భుతంగా దీన్ని నిర్మించారు. సాంకేతిక నిపుణులకు కూడా అందని టెక్నాలజీకి అతీతంగా విశాలమైన గర్భాలయం నిర్మించడం సద్గురు నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. గర్భాలయంలో సుమారు వెయ్యి మంది కూర్చునేంత స్థలం ఉంది. ఈ గర్భాలయంలోకి వెళ్లేవారు లోపల నిశ్శబ్దంగా ధ్యానం చేస్తారే తప్ప, ఎవరూ మాట్లాడరు. గట్టిగా ఓంకార నాదం గానీ శ్లోకాలు గానీ పఠించరు. సూది పడేసినా వినిపించేంత నిశ్శబ్దం ఉంటుంది. గర్భాలయంలోకి వెళ్లిన ప్రతి ఒక్కరి మనస్సులోకి ధ్యాన లింగం నుండి ఒక శక్తి ఏదో వచ్చి చేరినట్టు అనిపిస్తోంది. ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది.
గర్భగుడి ముందుభాగంలో ‘సర్వ ధర్మ స్తంభం’ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అన్ని మతాలూ సమానమేనని చెప్పేందుకు ఈ ధర్మ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మతాల గుర్తులు ఈ స్తంభంపై చెక్కి ఉన్నాయి. ప్రధాన ద్వారం వద్ద మూడు భారీమెట్లు ఉన్నాయి. గులకరాళ్లను పోలి ఉండే ఈ మెట్లపై నుండి వెళ్లేవారి పాదాల్లో గులకల వల్ల నాడులు, నాడీ కేంద్రాలు జాగృతం అవుతాయి. గర్భాలయంలో వెళ్లేవారు ధ్యాన లింగం శక్తిని గ్రహించేందుకు ఈ విధమైన జాగృతం అవసరం అవుతుంది. ధ్యాన లింగం మందిరం ఎదుట వరండాలో సప్త రుషుల జీవిత విశేషాలు ఉన్నాయి.
భారతీయ సాంప్రదాయం ప్రకారం గుడిలోకి వెళ్లేవారు తలారా స్నానం చేసి వెళ్లాలి. ధ్యాన లింగం ఆలయంలోకి వెళ్లే ముందు మగవారు ‘సూర్యకుండ్’ పేరుతో ఉన్న కోనేరులో స్నానం చేస్తారు. సూర్యకుండ్ అనేది ఒక కోనేరు. చాలా విశాలంగా, లోతుగా దీన్ని సద్గురువు ఏర్పాటు చేశారు. సూర్యకుండ్‌లో పాదరస లింగం ఉంది. మొత్తం మూడు శివలింగాలు ఏర్పాటు చేశారు. ఈ నీరు చల్లగా అతిస్వచ్ఛంగా ఉంటుంది. మహిళలు ‘చంద్రకుండ్’ పేరుతో ఉన్న కోనేటిలో స్నానం చేస్తారు. ఆ తర్వాత ధ్యాన లింగం దర్శనానికి వెళతారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అభిషేకాలు జరుగుతాయి. భక్తులే స్వయంగా అభిషేకంలో పాల్గొనే అవకాశం ఇస్తున్నారు.
లింగభైరవి
ధ్యాన లింగం ఆలయం పక్కనే లింగభైరవి ఆలయం ఉంది. లింగభైరవి విగ్రహం ప్రశాంతమైన మోముతో ఉంది. దేవి కరుణామయి. లింగభైరవి చైతన్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. తాము కోరుకున్న కోరికలు ఆమె తీరుస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నిత్య పూజలు జరుగుతుంటాయి. లింగభైరవిని పోలిన చిన్నచిన్న విగ్రహాలు ఇక్కడ లభిస్తాయి. భక్తులు వీటిని కొనుగోలు చేసి తమ ఇళ్లకు, వ్యాపార కేంద్రాలకు తీసుకువెళ్లి, నిత్యపూజలు చేసుకోవచ్చు.
* * *
ప్రపంచంలో మతాలేవీ ఏర్పాటు కాక పూర్వమే దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఆదియోగి యోగాశాస్త్రాన్ని తన శిష్యులైన ఏడుగురు రుషులకు (సప్తరుషులు) బోధించారని పురాణాలు చెబుతున్నాయి. మనిషి ఉత్కృష్టమైన స్థానాన్ని పొందేందుకు 112 మార్గాలుగా ఉన్న యోగ శాస్త్రాన్ని సప్తరుషులు ఆదియోగి అయిన శివుడి నుండి నేర్చుకున్నారు. ఈ 112 మార్గాలకు గుర్తుగానే ఆదియోగి విగ్రహాన్ని 112 అడుగుల ఎత్తులో సద్గురువు ఏర్పాటు చేయించారు. ఈ విగ్రహానికి రోజువారీ పూజలు చేయడం లేదు. విగ్రహం ఎదుట శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగానికి అభిషేకం, అర్చనలు చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. 2017 మహాశివరాత్రి నాడు ప్రధాన మంత్రి మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదియోగి విగ్రహాన్ని ప్రముఖమైన పర్యాటక కేంద్రంగా గుర్తించాయి. రోజూ వేలాదిమంది పర్యాటకులు ఈ విగ్రహ సందర్శనకు వస్తుంటారు.

ప్రపంచ రికార్డు.. ‘ఆదియోగి’
ఈశా ప్రధాన ఆశ్రమం ఆవరణలో పూర్తిగా నలుపు రంగులో ఉన్న ‘ఆదియోగి’ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఆశ్రమానికి ప్రధాన ఆకర్షణగా అలరారుతోంది. 112 అడుగుల ఎతె్తైన ‘ఆదియోగి’ బస్ట్ సైజ్ విగ్రహం ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ‘లార్జెస్ట్ బస్ట్ సైజ్ స్టాట్యూ ఆన్ ది ప్లానెట్’ (గిన్సీస్ వరల్డ్ రికార్డు) గా నమోదైంది. సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. విగ్రహం డిజైన్ రూపకల్పనకు రెండున్నరేళ్లు పట్టినా, దాని నిర్మాణం మాత్రం ఎనిమిది నెలల్లోనే పూర్తయింది. 500 టన్నుల మైల్డ్ స్టీల్‌ను విగ్రహం తయారీకి వినియోగించారు. చిన్న చిన్న చతురస్రాకారాల్లో ప్రత్యేకంగా ఉక్కు ముక్కలను తొలుత రూపొందించారు. వీటిని ఒక దానికి మరొకదాన్ని జత చేస్తూ డిజైన్‌కు అనుగుణంగా అత్యంత జాగ్రత్తగా విగ్రహాన్ని రూపొందించారు. ఐదారు అడుగుల ఎత్తుండే మనుషులు ఈ విగ్రహం ముందు నిలబడితే అతిచిన్నగా కనిపిస్తుంటారు. ఆదియోగి విగ్రహానికి రెండులక్షల ఎనిమిది రుద్రాక్షలున్న మాలను వేస్తుంటారు. ఏటా కొత్త రుద్రాక్ష మాలను వేసి, పాత మాలను తీసివేస్తుంటారు. తొలిగించిన రుద్రాక్షలను మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు కానుకగా ఇస్తారు.

- పి.వి.రమణారావు 98499 98093