S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పంచవటి సమీపంలో మాయా మృగమైన మారీచుడు (అరణ్యకాండ)

ఇదంతా చెప్పిన మారీచుడు రావణాసురుడిని చూసి, ఇంకా తాను ఆయన మాట వినడం ఆలస్యం చేస్తే, వెంటనే చంపుతాడేమో అన్న భయంతో, ‘రావణా! లే. పోదాం పద. విల్లు, బాణాలు, కత్తి ధరించిన రాముడిని చూడగానే దిగులుతో నిలుచున్న వాడిని నిలుచున్నట్లే చస్తాను. నన్ను చంపడానికి ఆయన దర్శనమే చాలు. ఇది వాస్తవమైతే, యుద్ధరంగంలో రామచంద్రుడిని ఎదుర్కొని ఊపిరితో తిరిగి వచ్చేవాళ్లు ఉంటారా? ఇద్దరికీ యమగండం దగ్గరికి వస్తున్నది. అందువల్లే మనిద్దరికీ స్నేహం సరిగ్గా కుదిరింది. చెడిపోయే కాలం దగ్గర పడ్డ నిన్ను నేనేమి చేయగలను? చావడానికి సిద్ధంగా వున్నా నిన్ను ఎవడేం చేయగలడు? రావణా! నువ్వు చెప్పినట్లే నేనే ముందు పోతున్నాను. నీకు మేలు జరుగుగాక!’ అని అంటాడు.
మారీచుడి మాటలకు ఆయన్ను సంతోషంతో కౌగలించుకుని, ‘సై రా మారీచా! పౌరుషంతో కూడిన మాటలు ఇలా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నిజమైన మారీచుడివి. రత్నాలతో పొదిగిన నా రథం ఎక్కు. త్వరగా పోదాం. నేను నీతోనే వస్తాను. అక్కడికి పోయి జానకిని మోసగించి, నీ ఇష్ట ప్రకారం పో. నేను ఒంటరిగా వున్న సీతను బలాత్కారంగా ఎత్తుకుని లంకకు పోతాను’ అని అంటూ రావణాసురుడు ఆ ఆశ్రమ ప్రదేశం దాటిపోయాడు.
అలా రథంలో కొండ కోనలను దాటి, దండకలోని రామచంద్రుడి ఆశ్రమం సమీపానికి చేరుకున్నారు. రథం దిగి మారీచుడి చేయి పట్టుకుని, అరటి చెట్లున్న రామచంద్రుడి ఆశ్రమం చూపిస్తాడు.
వచ్చిన పని కానిమ్మని రావణుడు మారీచుడికి చెప్పాడు. ఇంద్రనీలమణుల కాంతిగల కొనకొమ్ములు, తెలుపు నలుపు గల అందమైన ముఖం, ఎర్రతామర కల్వరంగుగల ముఖం, ఇంద్రనీలాల లాంటి చెవులు, కొంచెం ఎతె్తైన మెడ, నీలాల పలుకుల్లాంటి పెదవి, మొల్లలు - చంద్రుడు - వజ్రం లాంటి తెల్లటి కడుపు, తామరల్లోని ఆకుల లాంటి వీపు, ఇప్ప పూవు లాంటి పక్కలు, వైఢూర్యాల లాంటి గిట్టలు, సన్నటి పిక్కలు, ఇంద్రధనస్సు లాగా పలు రంగుల తోకతో, నిమిషంలో మారీచుడు శ్రేష్ఠమైన జింకలాగా ఆ అరణ్యంలో తిరుగుతూ, రాముడి తపోవనం సమీపించాడు. జానకీదేవిని మోసగించడానికి ఆ రాక్షసుడు జింక వేషంలో అక్కడే ఎక్కడ తిరిగితే తనను సీడ చూడగలడో అక్కడే తిరుగుతూ, దూరంగా పరిగెత్తుతూ, వెనుకా ముందుకూ కదలుతూ సమయం కోసం వేచి చూడసాగాడు. ఈ ప్రకారం అడవిలో తిరుగుతున్న ఆ మృగాన్ని చూసి ఇతర మృగాలు నిజమైన మృగమని భ్రమించి దగ్గరకు వచ్చి వాసన చూసి బెదిరిపోసాగాయి. ఇలా అది తిరుగుతున్న సమయంలోనే జానకీదేవి కంట అది పడింది.
పూలు కోయడానికి బయటకు వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. ఆ వింత జింకను ప్రేమతో చూసింది సీత. మనోహరమైన దంతాలతో, పెదవులతో, ఆశ్చర్యంగా నవ్వుతున్న కళ్లతో చూసింది ఆ జింకను సీత. సీతాదేవి తనను చూసి సంతోషిస్తుంటే, జింక కూడా వింత వింతగా వేడుకలు చేయసాగింది. అడవిని ప్రకాశించే విధంగా తిరుగుతున్న ఆ వింత జింకను చూసి, భర్త రామచంద్రుడిని, ఆయుధధరుడైన లక్ష్మణుడిని రమ్మని పిలిచింది. దగ్గరకు వచ్చి దాన్ని చూసిన లక్ష్మణుడికి సందేహం కలిగింది. మారీచుడనే రాక్షసుడికి ఇలాంటి ఆకారంలో తిరుగుతూ మునులను, వేటకై వచ్చే రాజులను వధించే అలవాటుందని, యోగశక్తి గల ఆ రాక్షసుడే తన అద్భుత యోగ శక్తితో జింకలాగా తిరుగుతున్నాడని, ఇది నిజమైన జింక కాదని అంటాడు.
బంగారు వనె్న, నవరత్నాల కాంతులు, చుక్కలు, అవయవాలు కల ఇలాంటి జింకను ఇన్నాళ్లు అడవుల్లో తిరిగినా మనం చూడలేదనీ, శాస్త్రాలు - లోకులు చెప్పగా కూడా వినలేదనీ, కాబట్టి ఇది మోసపు వేషమే అనీ లక్ష్మణుడు ఒకవైపు చెప్తుండగానే, ఆయన మాటలకు అడ్డు తగిలి, చిరునవ్వుతో భర్త దగ్గరకు పోయి, సీత ఇలా అంటుంది. ‘ప్రాణేశ్వరా! ఈ జింక మీద ఆశ కలిగింది. వల్లభా! మహాబాహూ! దీనిని సులభోపాయంగా పట్టుకో. నేను అడిగానని ప్రయాసపడవద్దు. నాకెందుకంటే, ఆడుకోవడానికి ఇది కావాలి. ఈ అడవిలో మనమెన్నో మృగాలను చూశాం కాని దీని దేహకాంతి దేనికైనా ఉందా? ఇంత వింతైన కాంతి గల మృగాన్ని మనం ఇంతవరకు చూడలేదు కదా? లోకంలో ఎన్ని జింకలు లేవు? వింత మృగాలు లేవు? వాటన్నిటినీ మనం చూడలేదా? ఈ అందమైన వనె్న, పొందిక దేనిలోనైనా వుందా? దీన్ని చూడు. నాలుగు పక్కలా తన దేహకాంతులు దట్టంగా చల్లుకుంటూ చంద్రుడిలా ఉంది. నా మీద దయ వుంచి దాన్ని పట్టితే’
‘ఆహా! ఏమి దీని అందం? ఔరా! దీని కాంతి సంపద బలేగా వుందే! దీని స్వరమాధుర్యం, ప్రశస్తం, నిర్దుష్టం, అయిన ఈ జింక ప్రాణేశ్వరా! నా మనస్సును బాగా ఆకర్షించింది. ఈ మృగం ప్రాణంతో దొరికితే అంతకంటే కావాల్సింది ఏమిటి? మన వనవాస కాలం పూర్తయిన తరువాత నగరానికి పోయినప్పుడు, మన అంతఃపురంలో ఇది ఒక భూషణమై అలరారదా? రాజ చూడామణీ! నేను చెప్పేది నిజం కాదో నువ్వే ఆలోచించు. దీన్ని చూసి సంతోషించేది నేనొక్కదానే్న కాదు. భరతుడికి, నీ ఇతర తమ్ములకు, నాకు, మా అత్తలకు, స్పష్టంగా ఈ జింక ఆశ్చర్యం కలిగిస్తుంది. పురుషశ్రేష్ఠా! ఈ సంగతి కూడా ఆలోచించు. ఒకవేళ ఇది ప్రాణాలతో దొరక్కపోయినా, దీని చర్మమైనా నాకు ఆనందం కలిగిస్తుంది. లేపచ్చికతో చేయబడిన దర్భాసనం మీద దీన్ని పరచుకుని, నీతో కూర్చోవాలని అనుకుంటున్నాను.’
‘ప్రాణేశ్వరా! నాకది లేదు.. ఇది లేదు.. అది కావాలి.. ఇది కావాలి, అని భర్తను ఇబ్బంది పెట్టడం స్ర్తికి సమంజసం కాదు. ఇది తగదని నా అభిప్రాయం. ఆ కారణాన నేనేదీ మిమ్మల్ని అడగలేదింత వరకూ. అలాంటప్పుడు, ఇది కావాలని మిమ్మల్నెందుకు కోరుతున్నానంటారా? దీని దేహకాంతి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆడదాన్ని కాబట్టి నిబ్బరించుకోలేక పోతున్నాను. దీన్ని తేవడం మీకు సులభసాధ్యమని తెలుసు. అదీ కాకుండా, నగరానికి పోయిన తరువాత, చెల్లెళ్లు, స్నేహితురాళ్లు, అడవి నుండి ఏం వింత వస్తువు తెచ్చావంటే, దీన్ని చూపిస్తాను. క్షమించు.’
సీతాదేవి మాటలకు పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు, ఆ జింక ఆశ్చర్యకరమైన కొమ్ములను, బంగారు వనె్న వెంట్రుకలను, రత్నకాంతుల కొమ్ములను, సూర్యకాంతితో నక్షత్రాల్లాంటి చుక్కలను చూసి సంతోషించాడు. -సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12