ప్రేరణ
Published Saturday, 23 February 2019
నేను సిద్దిపేటలో మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఒకరోజు ఉదయమే ఓ తెలిసిన జర్నలిస్ట్ మిత్రుడు ఓ అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయి పైన నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ అత్యాచారం చేశారని, ఈ విషయం పోలీసులకి చెబితే ఎలాంటి చర్యలు ఉండవని, అందుకని నా దగ్గరకు వచ్చానని చెప్పాడు.
ఈ నేపథ్యం గురించి ఓ నవల రాద్దామని ఓ రెండు సంవత్సరాల తరవాత అన్పించింది. సినాప్సిస్ కూడా రాశాను. దాన్ని చదివిన మిత్రులు చాలా బాగుందని చెప్పారు. దాదాపు 24 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు రాయలేదు. రాయకపోవడానికి కారణం ఏమిటి?
టైం లేకపోవడమా?
కాదు.
ఈ మధ్యకాలంలో చాలా పుస్తకాలు రాశాను. వాటి సంఖ్య యాభై దాటాయి.
ప్రేరణ లేకపోవడమా?
చాలా వ్యాసాలు రాశాను.
మా వూరి కథలు రాశాను.
మనకు ప్రేరణ ఎవరు కల్పిస్తారు.
కొంతమందికి పుస్తకాలు చదివితే ప్రేరణ వస్తుంది. మరి కొంతమందికి సంగీతం వింటే ప్రేరణ వస్తుంది. ఇంకా కొంతమందికి ప్రయాణాలు చేస్తే వస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా వుంటుంది. భార్యాభర్తల నుంచి మిత్రుల నుంచి ఇలా ఎందరి నుంచో ప్రేరణ రావొచ్చు. ఇవన్నీ వాస్తవవమే.
ప్రేరణ కలగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎంతోమంది వుండవచ్చు.
వీటన్నింటి కన్నా ముఖ్యమైంది.
మనకి మనమే ప్రేరణ కల్పించుకోవడం.
నా విషయంలో జరిగింది ఇదే!
నేను ప్రేరణ కల్పించుకోకపోవడం వల్ల ఆ నవలని రాయలేక పొయ్యాను.
ఇది నా విషయంలోనే కాదు.
అందరి విషయంలో కూడా ఇలాగే ఉంటుంది.
మన స్పార్క్‌ని మనమే గుర్తించాలి.
మనకి మనం ప్రేరణ కల్గించుకోవాలి.