S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళ స్వర్గం ( కొత్త సీరియల్ ప్రారంభం)

అర్ధరాత్రి కావస్తోంది.
నగరమంతా దాదాపు నిద్రావస్థలో ఉంది. మెయిన్ రోడ్లన్నీ దీపకాంతులతో వెలుగులు నిండి వున్నా, సి.ఎం. గారింటి పరిసరాలు మరీ పట్టపగల్లా వెలిగిపోతున్నాయి. విశాలమైన భవంతి. మెయిన్ గేటు కిరుపక్కలా వున్న సెక్యూరిటీ గార్డ్స్ గన్స్‌తో, రాతిబొమ్మల్లా స్టడీగా నిల్చున్నా డేగ కళ్లతో పరిసరాలను పరికిస్తున్నారు. భవంతి చుట్టూ వున్న మహావృక్షాలు, కోట గోడల్లావున్న కాంపౌండ్ వాల్‌ని ముద్దాడుతున్నట్టు తలలూపుతున్నాయి.
ఆ రోజు సి.ఎం. చంద్ర పెందళాడే బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఆఫీస్ రూమ్‌లో అతని పి.ఎ. ప్రభు మాత్రం సీరియస్‌గా ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు.
అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఫోన్ రింగయింది. తృళ్లిపడిన ప్రభు ఓసారి వాచ్ చూసుకున్నాడు. పనె్నండు దాటి పది నిమిషాలయింది. రిసీవర్ తీసి,
‘హలో!’ అన్నాడు మెల్లగా.
‘హలో! సి.ఎం గారున్నారా?’ అవతల్నించి ఓ ఆడగొంతు ఆదుర్దాగా అడిగింది.
‘ఆయన పడుకున్నారు. నేనాయన పి.ఏ.ని. చెప్పండి మీరెవరు?’ అన్నాడతను ఏదో ఆలోచిస్తూ.
‘నేనెవరన్నది ముఖ్యం కాదు. నేను అర్జంట్‌గా ఓ ముఖ్య విషయం ఆయనకే చెప్పాలి. ప్లీజ్.. చాలా ముఖ్య విషయం’ అందామె ఒకలాంటి ఉద్వేగంగా.
‘సారీ.. ఆయన నిద్రపోతున్నారు. విషయం నాతో చెప్పండి. మీరన్నట్టు అది ముఖ్య విషయమే అయితే ఇప్పుడే చెప్తాను’ అన్నాడు ప్రభు నిర్మొహమాటంగా.
ఆమెలో సహనం చచ్చిపోయింది.
‘ఏవిటండీ మీరు చెప్పేది? ఇంతకు ముందు కానిస్టేబుల్ దగ్గర్నుంచి డిజిపి దాకా చెప్పాను. కానీ ఎవరూ నా మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. చాలా రోజుల తర్వాత, పెద్ద దారుణం జరగబోతోందని స్వయంగా సి.ఎం. గారికి చెప్పాలని రిస్క్ తీసుకున్నాను. కానీ మీరూ పాత పాటే పాడుతున్నారు. ఇలా అయితే తర్వాత మీరు చాలా బాధ పడాల్సి వస్తుంది’ అంది చిరాగ్గా.
అయినా అతను సి.ఎం.ని నిద్ర లేపడానికి ఒప్పుకోలేదు. ఆమెకి మరింత చిరాకొచ్చేసింది. అప్పుడే చంద్ర వచ్చి, ప్రభుకి సైగ చేసి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్‌లో ఎలాంటి శబ్దం లేకపోవడంతో ఆ స్ర్తికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
‘్ఛ! సి.ఎం.గారు యువకుడు, కార్యదక్షత కలవాడు, అపర చాణక్యుడు. ఏం చేసినా ముందు చూపుతో చేస్తాడనీ, ప్రజలకు అందుబాటులో ఉంటాడనీ, తన పదవికి న్యాయం చేస్తాడనీ అనుకున్నాను. కానీ అదంతా నా భ్రమ అని ఇప్పుడు తెలిసింది. ఓ సామాన్య స్ర్తి అర్ధరాత్రి ఎంతో రిస్క్ తీసుకుని చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా రిసీవ్ చేసుకోలేని మూర్ఖుడని అర్థమయింది. ఓకే! రేపు తెల్లారాక, జరిగిన దారుణాన్ని పేపర్లలోని వార్తల్ని చూసి, లబోదిబో అని తలలు బాదుకోండి’ అంటూ ఫోన్ పెట్టేసింది.
చంద్ర మొహం గంభీరంగా మారింది. రిసీవర్ పెట్టేసి ప్రభుకేసి చూశాడు. ప్రభు ఆమె మాటలన్నీ చెప్పాడు. చంద్ర కళ్లు చిత్రంగా ముడుచుకున్నాయి.
‘మీరేం వర్రీ అవకండి సార్! ఇలాంటి ఫోన్‌కాల్స్ మనకి కొత్తేం కాదు. కొందరికి ఇలా ఫోన్లు చేసి కంగారు పెట్టడం సరదా’ నవ్వాడు ప్రభు. అయితే చంద్ర నవ్వలేదు.
‘లేదు ప్రభూ! అసలు తనేం చెప్పబోయిందో వింటే బావుండేది’ అన్నాడు.
‘మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం...’
‘అంతకు ముందు పోలీసు డిపార్ట్‌మెంట్‌కి కూడా ఏదో చెప్పానంది కదూ?’ అతని మాటలు పూర్తి కాకుండానే అన్నాడు చంద్ర. ‘ఎస్సార్’
‘అయితే ఓసారి డిజిపి కి ఫోన్ చేసి కనుక్కో’
‘ఓకే సర్! మీరెళ్లి పడుకోండి’ అన్నాడు ప్రభు.
చంద్ర లేచాడు. అప్పుడే మళ్లీ ఫోన్ మోగింది. గభాల్న రిసీవర్ తీసి ‘హలో’ అన్నాడు ప్రభు, ఒకలాంటి ఉద్వేగంగా.
అతననుకున్నట్టు ఫోన్ చేసింది ఇందాకటి స్ర్తియే.
‘జరగాల్సిన దారుణం జరిగిపోయింది. మీ సి.ఎం.ని హాయిగా నిద్రపోనీయండి. పొద్దున లేచాక ఇద్దరూ నెత్తిన చెంగేసుకుని ఏడుస్తూ కూర్చోండి.’ ఆవేశం, ఆవేదనా సమపాళ్లలో వున్నాయామె గొంతులో.
‘హలో! అసలేం జరిగింది?’ ఆమె మాట్లాడిన తీరుకి మనసులో మండిపడినా, పైకి సరళంగానే అడిగాడు ప్రభు. ఆమె చెప్పేలోపలే రిసీవర్ లాక్కున్నట్టు తీసుకున్నాడు చంద్ర.
‘ఏం జరిగిందా? సింగపడవి దగ్గరి అమ్మవారి గుళ్లోని అమూల్యాభరణాలన్నీ మాయమై పోయాయి’ అందామె కఠినంగా.
‘వ్వాట్?’ అరిచినట్టు అన్నాడు చంద్ర.
‘ఎవరు మాట్లాడేది?’ అందామె అనుమానంగా.
‘సి.ఎం. చంద్రని. మీరేమన్నారు?’ ఆతృతగా అన్నాడు చంద్ర.
‘అర్థం కాలేదా? సింగపడవి దగ్గర గుళ్లో అమ్మవారి అత్యంత విలువగల జహ్వరీ అంతా దొంగల పాలయింది. ఇలా జరుగుతుందని ఆర్నెల్ల క్రితమే నాకు తెలిసింది. అందుకే పిచ్చిదానిలా ఆ విషయాన్ని గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ ఏం లాభం? మీలాగే మీ సిబ్బంది కూడా నిద్రపోతున్నారు. నిద్రమత్తు వదిలి ఓసారి వెళ్లి చూసుకోండి. లేకపోతే తీరిగ్గా నిద్ర లేచాక వెళ్లి చూసుకోండి’ ఆవేశంగా అందామె.
‘మీరెవరు? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు?’ నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు చంద్ర.
‘ఎందుకు? ఆ దొంగతనానికీ, నాకూ సంబంధం అంటగట్టి నా వెంటపడ్డానికా?’ చిరాగ్గా అందామె.
‘ప్లీజ్! ఆవేశపడకుండా విషయం క్లియర్‌గా చెప్పండి’ అన్నాడు చంద్ర.
‘ఇంకా ఏం చెప్పను సర్? ఇప్పటికి చాలామందికి చెప్పాను. ఏ ఒక్కరూ... కనీసం ఇంతకు ముందు నా మాట విన్నా ఈ దారుణం జరిగేది కాదు!’
‘మీరెక్కణ్నించి మాట్లాడుతున్నారు?’ అసహనంగా అడిగాడు చంద్ర.
‘వల్లకాట్లోనించి!’ కసిగా అందిమె.
చంద్రకి పిచ్చి కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు.
‘జరిగిందేదో జరిగిపోయింది. ప్లీజ్! మాకు కాస్త కోపరేట్ చెయ్యండి. మీపేరేవిటి?’ అన్నాడు అనునయంగా.
‘ఇప్పుడదంత ముఖ్యం కాదు. నేనొక స్ర్తిని. దేశ ప్రగతే నా ప్రగతి అనుకునే పిచ్చిదాన్ని. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోయింది. ఇప్పటికైనా కళ్లు తెరచి తగిన చర్యలు తీసుకోండి. కనీసం దోషుల ఛాయలైనా దొరకొచ్చు’ అంటూ రిసీవర్ పెట్టేసిందామె.
‘మైగాడ్’ అంటూ కూలబడిపోయాడు చంద్ర.
కంగారుగా చూస్తున్న ప్రభుతో ‘హోమ్ మినిస్టర్‌కి కనెక్షనివ్వు’ అన్నాడు గంభీరంగా.
మారు మాట్లాడకుండా ప్రభు ఫోన్ చేస్తుంటే అసహనంగా చూస్తున్నాడు చంద్ర. క్షణాల్లో లైన్‌లోకొచ్చాడు హోమ్ మినిస్టర్.
విషయం చెప్పి ‘దీన్ని గురించి మీకేమైనా తెలుసా?’ అన్నాడు చంద్ర ఆతృతగా. అతను తేలిగ్గా నవ్వేశాడు.
‘అదంతా డ్రామా సర్! ఇలాంటి ఫోన్స్ వస్తూనే ఉంటాయి. వీటిని ఆధారంగా తీసుకుని కంగారుగా పరిగెత్తుకెళ్లిన మా వాళ్లు ఫూల్స్‌లా తిరిగి రావడం చాలాసార్లు జరిగింది’ అన్నాడు నవ్వుతూనే.
‘అలా కాదు. మీరోసారి డిజిపిని కనుక్కోండి’
‘ఓకే సర్. ఇప్పుడే కనుక్కుంటాను’ అంటూ డిజిపికి ఫోన్ చేశాడు హోమ్ మినిస్టర్.
‘ఆఁ! ఆ మధ్య ఎవరో ఒకామె అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆ గుడిని గురించి, నగల గురించి చెప్పింది. దాన్నంతగా పట్టించుకోలేదు. అయినా ఆ గుడికి బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉంది. అక్కడికి దొంగలు రావడం ఇంపాజిబుల్. మీరు నిశ్చింతగా వుండండి’ అన్నాడు డిజిపి.
అతని మాటలన్నీ తు.చ తప్పకుండా సిఎంకి చెప్పాడు హోమ్ మినిస్టర్.
‘నో! అలా కాదు. వెంటనే బయల్దేరా గుడి పరిసరాలు చూసి రమ్మనండి’ స్థిర స్వరంతో అన్నాడు చంద్ర.
‘ఎస్సార్’ అని పోలీసు బలగాన్ని క్షణాల్లో సిద్ధం చేశాడు హోమ్ మినిస్టర్.
అరగంట గడిచిందో లేదో ఓ దారుణమైన వార్త గుప్పుమంది. సింగపడవిలోని గుడిలో భారీ దొంగతనం జరిగింది. పోలీసు బృందానికే కాక పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలతో కిటకిట లాడిపోతోందా ప్రాంతమంతా.
సింగపడవి చాలా పెద్దది. అడవి మొదట్లోనే వున్న పెద్ద కొండ మీద అమ్మవారు వెలసింది. దైవభక్తి గల జమీందార్లు, ధనికులు కలిసి బ్రహ్మాండమైన ఆలయం, దానికి తగ్గ హంగులు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలువైన వజ్రాలని తెప్పించి దైవాలను అలంకరించారు. ఇది ఏనాడో జరిగినా ఇప్పటికీ దాని వైభవం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు ఆ కొండ చుక్కల పర్వతంలా వెలిగిపోతూండేది.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్