S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పల్లె - పాట

పల్లె బతుకులో పాటకు ప్రధానమైన స్థానం ఉంది. అక్కడ అడుగడుగునా పాట వినిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమంలో పాట లేనిదే ఏ పనీ జరగదు. నాట్లకు పాట, కలుపులకు పాట, పంట కోతలకు పాట, బంతి కట్టేందుకు పాట, బాయి నుంచి నీరు తోడేందుకు పాట! పశువులను కాస్తూ పని లేకుండా ఉండే కాపరి నోట పాట వినిపిస్తుంది. ఇక సాయంత్రం గూటికి చేరిన తరువాత గుక్కెడు గంజి తాగి బయటపడితే నడి రాత్రి వరకు నానా రకాల పాటలతో, కథలతో కాలక్షేపం జరగవలసిందే.
మా ఊళ్లో భోగమాట అనే బైలాట అనే వీధి నాటకం చాలా బలంగా కొనసాగింది. ఊర్లోనే ఉన్న కేశవయ్యగారు కొత్త వీధి నాటకాలు రాయడం నుంచి మొదలు, నగలు, దుస్తులు తయారుచేయడం, పాట నేర్పించడం మొదలైనవి అన్నీ చేసేవాడు. ఇక ఊర్లో బైలాట బాగుంటుంది అంటే ఎందుకు ఉండదు? పక్క ఊరి నుంచి వాయులీనం తెప్పించి బ్రహ్మాండమైన ప్రదర్శన కొనసాగించేవారు.
భజనలకు కొదువ లేదు. శాంతయ్యకు కళ్లు లేకున్నా కడుపు నిండా భజన పాటలు ఉండేవి. అతను వచ్చి కూర్చున్నాడు అంటే తెల్లవారులు భజన సాగేది. అష్టగ్రహ కూటమి అంటూ 60 దశకంలో మా ఊరిలో జరిగిన పండుగలు అప్పటి భజనలు నాకు ఇంకా గుర్తున్నాయి.
జముకుల కథ అన్నది ఎక్కువగా వినలేదు గానీ మా ఊరిలో బైండ్ల కథ ప్రదర్శనలు చాలా చూశాను. అవన్నీ ఎవరో బయటి నుంచి వచ్చిన వారు చేసినవి. ఊళ్లో జానపద సంగీతానికి కొదువ లేదు. తెల్లవారుజామున మెలకువ వస్తే వ్యవసాయం బావుల నుండి మోట పాటలు వినిపించేవి. అవి ఓటు పాటలు కావు. మోటు పాటలు అంతకన్నా కావు. బ్రహ్మాండమైన శృంగార రసం తొణికిసలాడుతూ ఆ పాటలు అందరినీ నిద్ర లేపేవి. మోట అంటే గిలక మీద నుండి తాడు, దాని చివరన బొక్కెన వేసి కాడి కట్టిన ఎద్దులు వెనుకకు నడవాలి. ఆ నడక నెమ్మదిగా సాగుతుంది. అక్కడ కాస్త తెరపి తీసుకుని మోట కొడుతున్న మనిషి ఇనుముతో చేసిన నిర్మాణంలోకి నీళ్లు నింపుతాడు. అప్పుడు ఎద్దులు ఒక్కుమ్మడిగా ముందుకు వాలులోకి నడుస్తాయి. బొక్కెన పైకి వస్తుంది. అప్పుడు ఒడుపుగా అందులోని నీళ్లు కాలువలోకి పడేట్లు చేయాలి. ఇదంతా ఒక రకమైన లయ చక్రంతో తిరిగే కార్యక్రమం, చూస్తే తప్ప అర్థం కాదేమో అనిపిస్తుంది. కరెంటు మోటార్ల పుణ్యమా అని మోటలు మోటు అంటే మొరటు పద్ధతి కింద లెక్క అయ్యింది. ఆశ్చర్యం కాదు గాని మోట కొట్టే మనిషి పాడే పాటలు కూడా తాను, ఎద్దులు కదులుతున్న లయకు అనుగుణంగా అదే రకమైన లయ కలిగి చిత్రంగా ఉండేవి. వెనక్కు వస్తున్నప్పుడు దీర్ఘంగా రాగం తీస్తాడు. వడివడిగా ముందుకు వెళుతున్నప్పుడు మాటలు త్వరత్వరగా పలుకుతాడు. అది విని తీరవలసిందే. ఇప్పుడు ఆ మోటలు లేవు పాటలు అంతకన్నా లేవు.
ఇక నాకు అంతకన్నా బాగా గుర్తున్న పాటలు పీర్ల పండుగకు సంబంధించినవి. మా ఊరి మసీదులో మూడు పెద్ద పీర్లు ఉండేవి. ఒకదాని పేరు మొగులాలి. అంటే వౌలా అలీ. రెండవది కాసిమన్న. అంటే ఖాసిం సాహెబ్. మూడవది ఉస్సేన్ పచ్చ. అంటే హుస్సేన్ బాద్షా. నాకు అప్పటికి హసన్, హుస్సేన్ వృత్తాంతం గాని, వారి తల్లి ఫాతిమా గురించి గానీ, కర్బలా గురించి గానీ ముక్క తెలియదు. కానీ కోయిలకొండ ఖిలా మీద కూత పెట్టిరా కాసిమా, అంటూ పాడే పాటలు అర్థం తెలియకున్నా, ఆ లయ మాత్రం చాలా బాగుండేది. కథ జరిగింది మన దేశంలో కానే కాదు. కానీ దాన్ని స్వంతం చేసుకుని మన వాళ్లు అది కోయిలకొండలో జరిగిందేమో అన్న భావం కలిగించేవారు. ఫాతిమా గురించి కూడా పాడేవారు. ముహర్రం వెనుకగల కథ తెలియని వారికి ఈ నాలుగు మాటలు కూడా తికమకగానే ఉంటాయేమో. మా పల్లెలో హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా ఈనాటికీ ఈ పండుగను అందరూ కలిసి జరుపుకుంటారు. అది నిజానికి పండుగ కాదు. వీరులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించే సందర్భం. అందుకు తగినట్టే మసీదుకు ముందు అలావా అనే పేరున చాలా వెడల్పు గుంట తోడేవారు. అందులో కర్రలు వేసి మంటలు వేసేవారు. ఆ నిప్పులో నుంచి మనుషులు ఉరికేవారు అని జ్ఞాపకం. అదేమో గానీ భూమి దద్దరిల్లేలా ఆ గుంట చుట్టూ ఎగురుతూ పాటలు పాడుతూ గుండ్రంగా తిరగడం మాత్రం గుర్తుంది. ఆ పాటల్లో కొంతపాటి బూతు కూడా ఉండేది. అది ఎవరికీ అసహ్యంగా తోచేది కాదు. నా గురించి కూడా అక్కడ పాట పాడే వారా లేక నాకు అట్లా గుర్తు ఉందా? చెప్పలేను. కానీ ఒక అమ్మాయిని మాటలతో మోసపుచ్చిన యువకుని గురించి ఆ పాటల్లో వినడం మాత్రం గట్టిగా గుర్తుంది. ఇస్తానన్న జంపులజోడు ఇచ్చేనేమో జంబీలీ, అంటూ సాగే ఆ పాటలలోని లయ, ఆంతర్యం, హంగులు జానపద సంగీతం సేకరించేవారు ఎవరికీ చేతికి అందినట్టు లేదు. ఆ పాట ఏమైందో తెలియదు. జంబులమ్మ లేదా జంబిలి అని ఒక పేటకు ఉంటుందని ఎంతమందికి తెలుసు?
మాకు కూడా కొంతపాటి వ్యవసాయం ఉండేది. కనుక పొలంలో చాలాకాలం గడిచింది. అక్కడ పని పేరున చేరిన ఆడవారు రకరకాల పాటలు పాడేవారు. ఇప్పటి వలె ఆసక్తి ఉంటే, లేక ముందు ముందు ఉంటుందని తెలిస్తే ఆ పాటలన్నీ సేకరించే వాడినేమో? ప్రకృతి గురించి, మనుషుల మధ్య ప్రేమ గురించి, రకరకాల పాటలు వారు పాడుతూ ఉండేవారు. వాళ్ల అందరికన్నా ఎక్కువగా మా జీతగాడు బుడ్డన్న చాలా బాగా పాడేవాడు. వాడు ‘ఇంకా ఉన్నాడు కానీ పెద్దవాడు అయిపోయాడు. వెళ్లి పాడమంటే బహుశా కొన్ని పాటలు పాడుతాడేమో? చూడాలి!
రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను అప్పట్లో కలలో కూడా అనుకోలేదు. అంతకు ముందు రోజు వరకు కూడా నేను అనుకోలేదు. అదేదో అనుకోకుండా జరిగింది. కానీ అప్పటి వరకు నేను రేడియోకు చాలా విధేయుడుగా వినే శ్రోతను. ఉదయం భక్తిరంజని మొదలు రాత్రి కర్ణాటక సంగీతము, హరికథ ఇలాంటివి ముగిసేదాకా రేడియో పాడుతూనే ఉండేది. మధ్యమధ్యలో వచ్చే జానపద సంగీతం మమ్మల్ని బాగా ఆకర్షించింది. అయితే విజయవాడ వారి జానపద సంగీతం ఎక్కువగా ఆకర్షించింది అని నొక్కి చెప్పగలను. మల్లిక్ గారు, ఓగిరాల నరసింహమూర్తి ఇలాంటి వారి పేర్లు గొంతులు బాగా గుర్తున్నాయి. అప్పట్లో ఒక పదిహేను నిమిషాల కథ ఒకదాన్ని పాట రూపంలో మళ్లీ మళ్లీ వినిపించేవారు. ఒక సవతి తల్లి కిరాయి గూండాలని పెట్టి, కొడుకును చంపించడానికి ప్రయత్నం చేసుకుంది. అందులో మల్లిక్ గారు కూడా పాడినట్టు నాకు బాగా గుర్తుంది. నా పెండ్లం, కమలమ్మా, నీళ్లాడి, ఆర్నెల్లు, తన మొగమూ నేనెరుగా, నా మొగమూ తానెరుగా, అంటూ పాడిన గొంతుక బహుశా ఆయనదేనేమో? కాకపోవచ్చు కూడా. ఎందుకో ఈ రికార్డింగ్‌ను మళ్లీమళ్లీ వేసేవారు. అది మొదలైతే చాలు, అమ్మ చాలా బాధగా ఎందుకురా ఆ పాట వింటావు అంటూ నన్ను అడిగేది! ఆమె గుండెను ఆ కథ అంతగా కదిలించింది.
విజయవాడ, జానపద సంగీతం అనగానే నాకు ఒక పాట చటుక్కున గుర్తుకు వస్తుంది. చేపలన్ని రెక్కలొచ్చి చెట్లెక్కినై... అంటూ ఆ పాట సాగేది. అది ఆ తరువాత వివిధ భారతిలో కూడా మధ్యాహ్నం పూట వినిపించేది. అలాగే పొలిగాని పాట, ఏటికి ఏతం బెట్టి అంటూ సాగే మరొక పాట నాకు ఇవాళటి వరకు జ్ఞాపకం వున్నాయి. అవన్నీ ఇంకా ఎవరి దగ్గరయినా ఉంటే మళ్లీ వినాలని.
ఇంత చెప్పి నేను ఆకాశవాణి హైదరాబాదులోని లలిత సంగీతం గురించి చెప్పకుంటే ఒక రకంగా అన్యాయం అవుతుంది. ఇక్కడ ఆ విభాగానికి స్థానికేతరులు ఆఫీసర్లుగా ఉన్నారు. ఇందులో మోమాటం లేదు. వింజమూరి సీత గారు నాకు అత్యంత సన్నిహితులు. ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తల్లి ఆమె. కానీ ఉద్యోగపరంగా ఆమె చేసిన అన్యాయాన్ని మాత్రం నేను తరువాత అర్థం చేసుకున్నాను. తెలంగాణ జానపదం పాటలను సేకరించి వాటిని అసలు గొంతుకలో వినిపించకుండా, లలిత సంగీత కళాకారుల చేత ఆమె మళ్లీ పాడించేది. మొరటుగా ఉండవలసిన జానపద సంగీతాన్ని ఒక లలిత సంగీత స్థాయికి ఆమె మార్చింది. ఆ సంగతి నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఎవరో ఒకరిద్దరు తప్ప అసలు కళాకారులు వచ్చి పాడిన గుర్తులేదు. స్థానిక కళారూపాలకు అవకాశాలు తక్కువ. పైగా వాటిని సాయంత్రం వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా వినిపించేవారు. ఎందుకిలా జరిగింది? నా మనసులో ఇంకా ప్రశ్న మిగిలి ఉంది.
నేను హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాను. ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ తరువాత జానపద సంగీతం విషయంలో హైదరాబాద్ రేడియోలో మంచి కృషి జరిగింది అని తెలుసు. ఒక్క సంగతి నేను చెప్పగలను. నేను ఉన్నప్పుడే చుక్క సత్తయ్య అనే పెద్ద మనిషి ఒగ్గు కథ చెప్పేవాడు. అతను బాగా చెబుతాడు అన్న సంగతి అతనికి గానీ మరి ఎవరికి గానీ అర్థం కాలేదు అని నాకు తరువాత అర్థమయింది. జానపద సంగీతంలో కూడా కళాకారుల స్థాయిలో తేడాలు ఉంటాయి అన్న సంగతి ఎవరూ పట్టించుకోలేదు. అతను అన్నింటికన్నా తక్కువ అయినా ‘బి’ క్లాస్ గాయకుడుగా పాడుతూనే ఉండేవాడు. స్థాయి పెంచుకోవడం గురిచి అతనికి ఎవరూ చెప్పినట్టు కూడా లేదు. అసలు ఎవరికి తోచినట్టు లేదు. ఎందుకు వచ్చిందో కాని ఆ ఆలోచన నాకు వచ్చింది. నా కారణంగా అతనికి స్థాయి పెరిగి కొంత డబ్బు ఎక్కువ ముట్టింది అని నేను ఇవ్వాళ చెబితే ఎవరైనా ఒప్పుకుంటారా? వదిలేద్దాం!
వింజమూరి సీతగారు పోయారు. వాళ్ల అక్కయ్య అనసూయ గారి పుస్తకానికి నేను సమీక్ష రాశాను. అందులో చెల్లెలు గురించి ఒకటి రెండు ముక్కలు తప్ప ఎక్కువ లేదు. రిటైర్ అయిన తరువాత చెన్నైలో ఉంటున్న సీతమ్మ ఇంటికి వెళ్లి భోజనం చేశాను. ఆ తల్లి మంచి మనసు గలది. ఆమెకు సినిమా రంగంలో కూడా అన్యాయం జరిగింది. అయితే అవన్నీ అప్రస్తుతాలు! ఆ అక్క, చెల్లెళ్లు ఒకప్పుడు జానపద సంగీతాన్ని ప్రజలందరికీ నచ్చే విధంగా పాడేవారు అన్నది మాత్రం నిజం.
జానపద సంగీతం వేరు. జానపద శైలి సంగీతం వేరు. మరి మా పల్లెలో వారు తమ పాటల్లో నెహ్రూ గురించి, ఆయన భార్య కమలా నెహ్రూ గురించి పాడినట్టు గట్టిగా గుర్తుంది. అది మరి జానపదమేనా చెప్పలేను.

-కె.బి.గోపాలం