S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యథారాజా.. తథా ప్రజా

‘అబ్బా! సెక్రటరీ! ఎప్పుడూ పనులూ, బిజినెస్సేనా? పరగడుపునే కాస్తంత పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ?
- ఔనండి!
ఔనంటూ తలూపడం కాదు. (ఆకాశం వైపు చూస్తో) కళ్లట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్లు లేదూ? ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ?
- అద్భుతం సార్!
ఆఁ! మనిషన్న తర్వాత కాస్తంత కళాపోషణుండాలయ్యా! ఊరికే తింటూ తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?
బ్రతుకుతెరువుకు బంగారు బాట వేయగల రామాయణ భారత భాగవత కథల కంటే సినీమా డైలాగులే బుర్రలో దూరి కూర్చున్న బుద్ధిమంతులు ఈ మాటలు ఎవరు మాట్లాడేరో, రాశారో, ఏ చిత్రంలోనిదో కూడా ఠక్కున చెప్పేయగలరు. బాగా పేరు గడించిన చలనచిత్రంలో అవతలి వాళ్ల కొంపలు కూల్చటమే ప్రవృత్తిగా బ్రతికే విలన్ పాత్రధారుడు పలికిన మాటలివి. మనిషి స్వభావానికి ఏ మాత్రం సంబంధం లేని మాటలు పలికించటంలోనే సంభాషణ రచయిత, చమత్కారం ఉంది. అందులో ముళ్లపూడి, బాపులు ఇద్దరూ ఇద్దరే. అసాధ్యులు.
కానీ కరడు కట్టిన క్రూర పాలనకూ, నిరంకుశత్వానికీ అర్థం చెప్పిన హిట్లర్, స్టాలిన్ లాంటి నియంతలు సంగీత ప్రియులంటే మీరు నమ్మరు. నమ్మలేరు.
రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో హిట్లర్ ఒక రహస్య స్థావరంలో వున్న సమయంలో సోదా చేసిన సైనికులకు 150కు పైగా జర్మన్ పాశ్చాత్య శాస్ర్తియ సంగీత రికార్డింగులు దొరికాయి. అందులో హిట్లర్ ఎక్కువగా అభిమానించిన బిథోవిన్ బ్రూక్‌నెర్ లాంటి పెద్ద కంపోజర్సే ఎక్కువ.
రష్యన్ నియంత స్టాలిన్ చివరి క్షణాల్లో మొజార్ట్ సంగీతమే వింటూ కన్నుమూశాడట. మొట్టమొదటిసారి మాస్కో రేడియోలో మొజార్ట్ పియానో కచేరీ యో.23 (488) విని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడుట. ముఖ్యంగా అందులో ఆర్కెస్ట్రాలో పియానో వాయించిన రష్యన్ వనిత మారియా యూదినా కౌశలాన్ని మెచ్చుకుంటూ 20 వేల రూబుళ్లు (రష్యన్ కరెన్సీ) పంపిస్తే, దాన్ని ఒక చర్చికి విరాళంగా ఇచ్చేసిందా వనిత - అంతేకాదు. కృతజ్ఞతా పూర్వకంగా స్టాలిన్‌ని ఉద్దేశించి ధైర్యంగా ఒక ఉత్తరం కూడా రాసింది. అప్పట్లో అదో సంచలనం.
నా పట్ల మీకున్న గౌరవానికీ, నా కళ పట్ల ప్రేమకు, అనురాగానికీ కృతజ్ఞురాలను. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. భగవంతుడు అపార దయాసముద్రుడు. మీరు తెలియక చేసిన పాపాలను కూడా క్షమించగల కరుణామయుడు. నిన్ను నీవే మహాజ్ఞానివని విర్రవీగిపోతున్నావు. నీకు సంగీత హృదయముందని నేనెలా నమ్ముతాను? ఈ దేశ ప్రజలకు జరిగే హాని ఎంతో నీకు తెలియకపోవచ్చు. నియంతవు కదా? కాని ‘ఆయన’ తలుచుకుంటే, కాస్త పశ్చాత్తాప బుద్ధే కనుక వుంటే నిన్ను క్షమించగల ఉదార హృదయుడు దేవుడు. మర్చిపోకు.
‘నేను నీ కోసం రాత్రింబవళ్లు ప్రార్థిస్తూనే వున్నాను. వుంటాను కూడా. నీకు ఆ దేవుడు సద్బుద్ధి నొసగుగాక!’ అంటూ సుదీర్ఘంగా మారియా యూది వ్రాసిన ఆ ఉత్తరానికి తగిన శిక్షను కొనే్నళ్లు అనుభవించింది కూడా. అది వేరే విషయం. అందులో ఆశ్చర్యం లేదు. రాజు తలుచుకుంటే దేనికి లోటు?
కానీ మూర్ఖులైన ప్రభువులూ, వారి ప్రభుత్వాల పట్ల ప్రజలెంత విముఖులుగా ఉంటారో నిర్భయంగా, చాలా ధైర్యంగా, ఒక నియంత ముఖం మీద చెప్పిన వనితగా చరిత్రకెక్కింది. సాధారణంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే బుద్ధిమంతులు ప్రభుత్వ శాఖల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. పొరపాటున ఒకవేళ ఏ ఒకరో ఇద్దరో వున్నా వారి మాట సాగనివ్వని ప్రబుద్ధులు వారి పక్కనే వుంటారు. మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి నిజం. అందరికీ దక్కనివీ, చిక్కనివీ ఈ లలిత కళలు - ఈ సంగతి ప్రభుత్వాధినేతల కంటే ప్రజలకే ఎక్కువగా తెలుసు. నూటికి తొంభై మంది శ్రోతల్లాగానే మిగిలిపోతారు. కళాకారులు మాత్రం ఏ నూటికో, కోటికో కొందరే పుడ్తారు. భౌతికమైన సంపదలన్నీ భగవంతుడిచ్చేవే - కానీ సాంస్కృతిక సంపదే అన్నిటికంటే గొప్పది. ‘మా దేశం’ లేదా ‘మా రాష్ట్రం’ ‘మా ఊరు’ ఇంత గొప్పది, అంత గొప్పదీ అని బాహాటంగా చాటి చెప్పుకోగల ధైర్యాన్నివ్వగలిగేవారు మాత్రం కవులూ, గాయకులూ, చిత్రకారులూ, నాట్య విశారదులే. ప్రభుత్వాలుంటాయి. పోతాయి. కానీ ఏ మార్పూ లేనిది, రానిదీ ఒక్క కళాకారుడికే. భగవత్ప్రసాదమైన విద్యను నమ్ముకున్న నిజమైన కళాకారుడు ప్రశంసల కోసమో, అవార్డుల కోసమో రికార్డుల కోసమో వెంపర్లాడడు. పాడడు. నమ్ముకున్న కళకే తమ జీవితాల్ని పణంగా పెట్టి బ్రతికన వాళ్లే మనకు నిదర్శనం. అజ్ఞాత కళాకారులై, వాగ్గేయకారులై పోయారని మనం ఇప్పుడు చింతిస్తాం గానీ వారికే బాధ అప్పుడు లేదు. ఉండదు కూడా.
గుర్రానికీ, గాడిదకూ తేడా తెలియని వాళ్ల వల్లే సమాజం పెడదోవలోకి నెట్టబడుతుందనే ‘చాణక్యనీతుల’ సారాంశమే ఇది. ఏమీ తెలియని వాడికి పట్టం కట్టి అన్నీ తెలిసిన పండితుల్ని బలవంతంగా పిలిచి సభామధ్యంలో కూర్చోపెట్తే ఒరిగే ప్రయోజనం ఏమీ వుండదు. మీకు బాగా గుర్తుండే వుంటుంది. ఎప్పుడో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంలో ‘రాయల వారెదురుగా వదరుబోతులైన కవుల ఆర్భాటాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు.
పెద్దలైన వారి కవిత్వంలో తప్పులు పడ్తావా? అని రామకృష్ణుడు, ముఖం మీద దుమ్మెత్తి పోయడం, దానికి స్థితప్రజ్ఞుడైన రాయల వారు సంతోషించటం మనం ఎరుగుదుం. తెలిసీ తెలియని మందభాగ్యులు వారి స్వప్రయోజనాల కోసం ప్రభువుల మెప్పుల కోసం నిజాలను తాకట్టు పెట్టేసే సందర్భాలు ఇప్పుడూ వున్నాయి. వేదికపై అప్పటికప్పుడు ఓ రాగాన్ని అనర్గళంగా పాడటం, అప్రయత్నంగా ఒక కీర్తనకు, మనోధర్మంతో స్వరాలల్లి చిత్రవిచిత్ర గతుల విన్యాసాలతో సంభ్రమంగా పాడి రంజింపచేయటం లాంటి సన్నివేశాలెప్పుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి మనందరితోబాటు కూర్చుని ఆనందించటం ఎరుగుదురా? చూశారా? విన్నారా? సంగీత రుచి లేనివాళ్లకు పండితుడెవడో మామూలు గాయకుడెవడో తెలిసే అవకాశం లేదు. వుటుందా? కానీ మీకో రహస్యం చెప్పనా? అవార్డుకో, రివార్డుకో పండితుల్నీ కళాకారుల్నీ విద్వాంసుల్నీ ఎంపిక చేసేది మాత్రం వాళ్లే. అర్హులుగా ప్రకటించగలిగేదీ వాళ్లే. అసలు కళాకారులెవరో మరొకర్ని అడిగే దుస్థితిలో వ్యవస్థాగతమైన లోపాల్లో కొట్టొచ్చినట్లు కనిపించేదిదే.
మన రాష్ట్రంలో సకల విద్యలకు పుట్టిల్లుగా విజయనగరానికి పేరుంది. సకల కళాపరిపూర్ణుడు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు పుట్టిందక్కడే. ‘హరికథ’ అంటే తెలియని కాలంలో ఆంధ్ర దేశానికి అందులోని రుచిని చూపించి, శిష్యుల్ని తయారుచేసిన ఘనుడి సంగతి ‘ఆ వూళ్లో వున్న ప్రభువుల కంటే ముందుగా తెలుసుకున్న వారు ఇతర రాష్ట్రాలలోని సంగీత సాహిత్య రసికులు. అదీ గమ్మత్తు. అందుకే ఆయన రచ్చ గెలిచిన తర్వాతే, యింట గెలిచాడు. ఎవర్నీ లెఖ్ఖ చేయలేదు.
విజయనగర ఆస్థాన ప్రభువులు మాత్రం ఎలా గౌరవించాలో అలాగే గౌరవించి సంగీత కళాశాలకు ప్రధానాధికారిగా నియమించి వాళ్లను వారు గౌరవించుకున్నారు. ప్రభువులకైనా ప్రజలకైనా రసజ్ఞత కలిగి వుండటమే అర్హతగా భావిస్తేనే అర్హులుగా గుర్తించబడతారనడానికి ఇంతకంటే సాక్ష్యం లేదు. ఈ విషయంలో విజయనగర ప్రభువులు సంస్కారులే.
కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతాలకు వేరువేరు ప్రమాణాలున్నాయి. సంగీతంలో స్వరాలన్నీ ఒకటే కావచ్చు. కానీ ఎవరి దారులు వారివి.
ఒక బాణీ వినడానికి అలవాటుపడ్డ చెవులకు మరోటి రుచించదు. ప్రతి బాణీకి వారికి తగ్గ శ్రోతలు వారికెప్పుడూ వుంటూనే వుంటారు. అభ్యంతరం లేదు. కానీ ఏ జానపద సంగీతం ఇష్టపడే కళాకారుడో, లలిత సంగీతమో, సినిమా పాటలు పాడే గాయకుడినో అధికారిగా చేసి శుద్ధమైన కర్ణాటక సంగీతం తెలిసిన విద్వాంసుల మధ్యలో రమ్మని కూర్చోబెట్టి, కాస్త సత్కరించి మాట్లాడమంటే ఏవౌతుంది? త్యాగరాజు, దీక్షితర్, శ్యామాశాస్ర్తీ గారల కీర్తనలు, జానపద శైలిలో పాడితే మరింతగా ప్రచారం జరుగుతుందని చెప్పి ఒక కీర్తన పాడి చూపిస్తాడు. అంతటితో ఆగడు. అధికారిగా తన ప్రతాపం లోకానికి తెలియాలిగా!
విద్వాంసులంతా అలా పాడి ప్రచారం చేయాలని నిర్దేశించినప్పుడే ప్రమాదం. ఇప్పుడు సహస్ర గళార్చన, లక్ష గళార్చన, కుంభాభిషేకాలు, పట్ట్భాషేకాల పేరిట జరుగుతున్నది ఇదే. ఈ మాయే.. ఇటువంటి పరిణామాలు సంభవించరాదని ఏ సంగీతజ్ఞుడైనా వాంఛిస్తాడు.
స్వచ్ఛమైన భారతావనికి శుష్కమైన నినాదాలు కాదు. స్వచ్ఛమైన ఆలోచనలే పునాదులు.

- మల్లాది సూరిబాబు 90527 65490