S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డబ్బు- దృష్టికోణం

ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అది డబ్బుకు సంబంధించిన అంశం కావచ్చు. జీవితంలో సమస్యలు కావచ్చు.
చిన్నప్పుడు చదివిన ఒక కథ. భారీ కాయుడు ఒకరు ఒక గ్రామానికి వచ్చి అందరినీ భయపెడతాడు. అతన్ని చూడగానే గ్రామస్తులంతా భయంతో వణికి పోతారు. పొరుగూరు యువకుడు చుట్టపు చూపుగా ఆ ఊరికి వస్తే ఊరిలో ఒక్కరూ కనిపించరు. అంతా భయంతో ఊరు బయట కొండల్లో దాక్కుంటారు. ఎందుకలా పారిపోయారని యువకుడు అడిగితే భారీ కాయుని గురించి చెబుతారు. అతను ఒక్కడూ మీ ఊరి వాళ్లంతా కలిసి అతన్ని ఎదిరించలేరా? అని యువకుడు అడుగుతాడు. నీకేమన్నా పిచ్చా అతన్ని చూస్తే నువీ ప్రశ్న అడగవు. అతనెంత భారీకాయుడో నీకు తెలుసా? అని గ్రామస్తులు ఎదురు ప్రశ్నిస్తారు. ఆ యువకుడు నవ్వి అతని భారీకాయాన్ని చూసి మీరు భయపడుతున్నారు. నిజానికి ఆ భారీకాయం వల్లనే అతని ఓడించడం సులభం అని చెబుతాడు. ఎలా అంటే ఒక చీమపై మీరు దాడి చేయాలంటే అంత ఈజీ కాదు. కంటికి కనిపించని ఆ చీమ ఎటు నుంచి ఎటు పారిపోతుందో తెలియదు. పెద్ద బండ వేసినా ఆ చీమకు తగులుతుంది అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే దాని సైజు మరీ అంత చిన్నది. అతను భారీ కాయుడు కాబట్ట మీరు దాడి చేస్తే అతనికి తగలదు అనే సందేహమే అక్కర లేదు. భారీ కాయం కాబట్టి తాకి తీరుతుంది. అంటాడు. గ్రామస్తులకు ధైర్యం చెప్పి ఆ భారీ కాయుడిపై రాళ్ల వర్షం కురిపిస్తాడు. వీరి దాడికి ఆ భారీ కాయుడు మట్టికరుస్తాడు.
ప్రపంచంలో కెల్లా సంపన్నుడు బిల్‌గేట్స్ పిజ్జా కోసం క్యూలో అందరితో పాటు నిలుచున్న ఫోటో ఒకటి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఇది చూసి ఎవరి కోణంలో వారు ఆలోచించవచ్చు. అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ఏం చేసుకుంటాడు. హాయిగా ఏ స్టార్ హోటల్‌కో వెళ్లి కావలసినవి తెప్పించుకోవాలి కానీ సామాన్యుడిలా క్యూలో నిలబడడం ఏమిటి? అనిపించవచ్చు. ఎంత సంపన్నుడైనా సామాన్య జీవితం గడిపై ఆయనపై గౌరవం పెరగవచ్చు.
చాలా మంది సంపన్నుల్లో ఉండే కామన్ గుణం. డబ్బుకు విలువ ఇవ్వడం. స్టార్ హోటల్‌కు వెళ్లి లక్షల్లో బిల్లు చేస్తేనే లభించే సంతోషం కన్నా, ట్యాంక్‌బండ్‌పై చల్లని సాయంత్రం పది రూపాయల మొక్కజొన్న కంకి తింటే అంత కన్నా మించిన సంతోషం లభించవచ్చు.
డబ్బుకు సంబంధించి చిన్నప్పటి నుంచి మనలో చిత్రమైన అభిప్రాయాలు ఉంటాయి. డబ్బు చెడ్డది అని చిన్నప్పటి నుంచి చెబుతుంటారు. డబ్బు సంపాదించే జ్ఞానం, డబ్బు గురించి అవగాహన లేని వాళ్లు మాత్రమే అలా చెబుతారు. పొదుపునకు, పిసినారి తనానికి తేడా కూడా తెలియదు. కొన్ని కుటుంబాల్లో చిన్నప్పటి నుంచే డబ్బు విలువ గురించి చెబుతారు. వారికి పొదుపు, పిసినారి తానికి తేడా ఏమిటో చిన్నప్పుడే అవగాహన వస్తుంది. అది తెలియని వారికి పొదుపు కూడా పిసినారి తనంగా అనిపిస్తుంది.
అవసరం అయిన దానికి ఖర్చు చేయాల్సిందే. అదే సమయంలో అనవసరమైన దానికి ఖర్చు చేయడం అంటే డబ్బుకు విలువ ఇవ్వక పోవడమే. మనకు విలువ ఇవ్వని వారి వద్ద మనం ఎక్కువ సేపు ఉండలేం, అదే విధంగా డబ్బు సైతం అంతే తనకు విలువ ఇవ్వని వారి వద్ద ఎక్కువ రోజులు ధనం నిలువదు.
పొదుపు చేయాల్సిన చోట పొదుపు చేయాల్సిందే, అదే సమయంలో అవసరమైన ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేయాల్సిందే. ఏది అవసరం? ఏది పొదుపు? ఏది పిసినారి తనం అనే అవగాహన ఉండాలి. డాక్టర్‌కు చూపించుకుంటే రెండు వందల ఖర్చు అని నిర్లక్ష్యం చూపిస్తే అది లక్ష రూపాయలు చికిత్సగా జబ్బు ముదిరిపోవచ్చు. దీన్ని పొదుపు అనం, ఇది పిసినారి తనం అవుతుంది. కొంప కూల్చే పిసినారి తనం అవుతుంది. అదే సమయంలో విలాసాల కోసం అప్పు చేసి ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే అది జీవితం అనిపించుకోదు, బాధ్యాతారహితమైన జీవితం అనిపించుకుంటుంది.
డబ్బు అనేది కేవలం అంకెలకు సంబంధించిన శాస్త్రం కాదు. సంపద రహస్యంలో అంకెలకన్నా ఆలోచనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మన ఆలోచన ధోరణి సైతం మన సంపదపై ప్రభావం చూపుతుంది. ఎదుటి వారు ఏమనుకుంటారో ఆనే ఆలోచనతో అప్పులు చేసి విలాసవంతమైన జీవితం గడపాల్సిన అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం అనుకుని సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేసే లెక్కలు తెలిసిన వాడు జీవితంలో ఎదిగి తీరుతాడు. సంపన్నుల్లో కామన్‌గా కనిపించే లక్షణం. పాజిటివ్ దృక్ఫథం. విజయవంతమైన వారు ప్రతిదానిలో అవకాశం వెతుకుతాడు. పాజిటివ్ దృక్ఫథంతో వ్యాపార సామ్రాజాన్ని సృష్టించుకుంటాడు. నెగిటివ్ ఆలోచనా ధోరణి ఉన్నవారికి కంటి ముందు ప్రతిదీ సమస్యగానే కనిపిస్తుంది. పాజిటివ్‌గా ఆలోచించే వారికి అవకాశంగా కనిపించిన అంశాలు సైతం నెగిటివ్‌గా ఆలోచించే వారికి సమస్యలుగా కనిపిస్తాయి.
చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పాజిటివ్‌గా ఆలోచించే వారు ఆ దశ నుంచి పైకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తారు. అదే నెగిటివ్ ఆలోచనా పరులు తనకు ఎవరూ సహకరించడం లేదని, బంధువులు ఆదుకోవడం లేదని, తమ సామాజిక వర్గం ఇంతే అని సమస్యల ఆస్తిని కూడబెట్టుకుంటారు. ఇలాంటివారికి ఇతరులులు సహాయం చేయడం తరువాత తనకు తాను కూడా ఉపయోగపడరు. పైగా ఇలాంటి వారితో ఎక్కువ సమయం గడిపేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించరు. అలాంటి నిరాశావాదుల నిస్పృణ మాటలు తమ మీద ఎక్కడ ప్రభావం చూపుతాయో అని దూరంగా వెళతారు. ప్రపంచంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి, బోలెడంత సంపద ఉంది. నా శక్తి మేరకు నేను ఆ సంపదను సంపాదించలగను అనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అవకాశాలు అవే వస్తాయి. ప్రతి సమస్యలోనూ అవకాశాలు ఉంటాయి. ప్రయత్నించే వాడికే దైవం కూడా సహకరిస్తుంది అంటారు.
నెగిటివ్ ఆలోచనలు మానేసి ఈ ప్రపంచం విశాలమైంది. ప్రపంచంలో బోలెడు సంపద ఉంది. అవకాశాలకు కొదవ లేదు. అనే ఆలోచనలతో ముందడుగు వేయండి. అవకాశాల కోసం వెతికితే అవకాశాలు కనిపిస్తాయి. సమస్యల కోసం వెతికితే సమస్యలు దొరుకుతాయి. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే.
*

-బి.మురళి