S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరుగు ప్రయాణం..

లండన్‌ నుంచి ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్ అంటే మా అన్నయ్యగారి పెద్ద కొడుకు. అందరము కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకున్నాము. ఆ సందర్భంగా ప్రసాద్ ఒక వింత అనుభవం చెప్పాడు. ఒక పెద్ద మనిషి లండన్‌లో విమానం ఎక్కాడు. విమానం వాళ్లు ఒకటి రెండు చిన్న సంచులను మనతోపాటు వెంట తేవడానికి అనుమతిస్తారు. పెద్ద సంచులను వాళ్లు ప్రత్యేకంగా తీసుకుని వేరుగా పెట్టి మనకు కనిపించకుండానే మనతోపాటు తెస్తారు. విమానం ఎక్కిన పెద్దమనిషి వెంట ఒక చిన్న సూట్‌కేస్ తెచ్చుకున్నాడు. దాని కింద పెట్టడానికి ఉండదు. పైన అరలు ఉంటాయి. అందరూ తెచ్చిన సంచులను విమానం సిబ్బంది వారు సౌకర్యం కొద్ది వాటిలో పేర్చి పెడతారు. మళ్లీ దిగే సమయం వరకు బహుశా వాటి అవసరం రానే రాదు. కానీ ఈ పెద్ద మనిషి తన సూట్‌కేస్‌ను తన తల మీద ఉండే జాగాలోనే పెట్టలేదని విమానం వారితో పెద్ద పేచీ వేసుకున్నాడట. తీరా దిగే సమయానికి సెల్‌ఫోన్ పని చేయడం మొదలు పెట్టింది. ఆయన తెగ మాట్లాడేస్తున్నాడు. ఆ మాటలలో పడి ఆ పెద్ద మనిషి తన సూట్‌కేస్ తీసుకోకుండానే దిగి వెళ్లిపోయాడట. విమానం వాళ్లు ఇక్కడ ఎవరిదో సూట్‌కేస్ మిగిలింది అని హెచ్చరించారు. అయినా ఈయన పట్టకుండా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. చివరకు ఎలాగో తన సూట్‌కేస్ తాను తీసుకున్నాడు.
ఈ మాటలు విన్న తరువాత నాకు కూడా ప్రయాణం గురించి రాయాలి అనిపించింది. నిజానికి ప్రచురణ రంగంలోని ఒకరిద్దరు మిత్రులు నా అమెరికా యాత్ర గురించి వివరంగా ఒక పుస్తకం రాయమని అడిగారు. కానీ నేను రెండు నెలలపాటు మాత్రమే అమెరికాలో గడిపాను. లాస్‌ఏంజెల్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, ఫీనిక్స్ తప్ప మరి ఎక్కడికి వెళ్లలేదు. నిజానికి రాయదలచుకున్న ఈ మూడు ఊళ్లలో అనుభవాలు కూడా గొప్పవిగానే ఉన్నాయి. కానీ నేను పుస్తకం రాయాలని అనుకుని వివరాలను గుర్తు పెట్టుకున్నానా అన్నది అనుమానం. అదంతా తరువాత కానీ ముందు తిరుగు ప్రయాణం గురించి చెప్పాలని అనిపిస్తున్నది.
ప్రయాణం అనగానే ముందుగా వచ్చే సమస్య మన సూట్‌కేసుల బరువు గురించి. అమెరికా వాళ్లు బరువులను కిలోలలో లెక్కించరు. వాళ్లంతా పౌండ్ల పద్ధతి. ఒక మనిషికి 100 పౌండ్లు ఉండే రెండు సూట్‌కేసులు తేవడానికి అనుమతినిస్తారు. వాటిని కిలోలలోకి మారిస్తే 46 కి.గ్రా. అన్న లెక్క వస్తుంది. ఒక్కొక్క సూట్‌కేస్ ఇరవై మూడు కిలోలు ఉండవచ్చునన్న మాట. వెళ్లేప్పుడు తీసుకుపోయే ఆవకాయలు, మిఠాయిలు, సాంబారు పొడులు ఉంటాయి. నిజానికి మేము మిఠాయిలు మాత్రమే తీసుకువెళ్లాము. సూట్‌కేసులు 20 కిలోల బరువు కూడా చేరలేదు. వచ్చేటప్పుడు మాత్రం ప్రయాణానికి వారం ముందు నుంచి ఈ బరువుల గురించిన లెక్కలు మొదలయ్యాయి. మేము అక్కడ ఎక్కువగా షాపింగ్ చేసింది లేదు. కొన్నవి కేవలం దుస్తులు మాత్రమే. అవి అంతగా బరువు ఉండవు. కానీ నేను ఒక విచిత్రం చేశాను. ఏకంగా 16 కిలోల బరువు ఉండే పుస్తకాలు చేర్చుకున్నాను. నాకు జీన్స్, టీషర్ట్స్ కన్నా పుస్తకాల మీద ప్రేమ ఎక్కువ. అక్కడ నాకు రకరకాలుగా పుస్తకాలు దొరికాయి. పుస్తకాల గురించి అవి దొరికిన పద్ధతులను గురించి ప్రత్యేకంగా వ్యాసం రాయాలి. బహుశా ఆ పని కూడా ఎప్పుడో చేస్తాను. కానీ మొత్తానికి నా నలభై ఆరు కిలోలలో 16 కిలోలు పుస్తకాలు అన్నమాట. ఈ సంగతి తెలిసిన తరువాత, ఇంకేమీ కొందామన్నా అనుమానం మొదలయ్యింది. మా ఆవిడను ఒప్పించి కొన్ని పుస్తకాలు ఆవిడ సూట్‌కేసులలోకి మార్చాను. కానీ ఈ లోపల అక్కడ నుంచి తెచ్చుకోవలసిన కొన్ని చిత్రమైన వస్తువుల లిస్టు బయలుదేరింది. చివరి క్షణం వరకు సూట్‌కేసుల బరువు చూస్తూనే ఉన్నాం. అవి 50 పౌండ్లు దాటకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. చివరకు మన ఇంట్లో చూసిన బరువు కన్నా, అక్కడ విమానాశ్రయంలో బరువు ఎక్కువ వస్తాయన్న భయం మరొకటి మొదలైంది. కనుక ఒకవేళ సూట్‌కేసుల బరువులు ఎక్కువైతే మా బాబు కొన్ని వస్తువులను ఇంటికి తిరిగి తీసుకుపోవాలని పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నాము. బాబు సంచి కూడా తీసుకువచ్చాడు.
విమాన ప్రయాణం చేసే వాళ్లు అందరికీ ఇటువంటి అనుభవం తప్పక ఎదురై ఉంటుంది. నాకు మొదటిసారి కనుక నా ఉత్సాహం కొద్దీ చెప్పాను. రైల్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాం మారినట్టు అంతర్జాతీయ విమానాశ్రయాలలో టెర్మినల్ మారవలసి ఉంటుంది. రైల్లో పెద్ద తనిఖీలు లేకుండానే వెళ్లి మన సీట్లో కూర్చోవచ్చు. విమానంలో అది కుదరదు. అడుగడుగునా భద్రత పేరున పరీక్షలు చేస్తారు. అవి కొంత చికాకుగా కూడా అనిపించవచ్చు. కానీ అంతర్జాతీయంగా జరుగుతున్న నేరాలు - ఘోరాలు చూచినప్పుడు ఈ జాగ్రత్త అవసరమేనని అనక తప్పదు. ఫీనిక్స్‌లో తనిఖీ జరిగింది. లాస్‌ఏంజెల్స్‌లో విమానాశ్రయంలో నుంచి బయటకు రాకుండానే పక్క టెర్మినల్స్ మారవచ్చు అన్నారు. కానీ తెలియని చోట నడుస్తూ అంత దూరం వెళ్లడం మా వల్ల కాదని భయపెట్టారు. కనుక మేము చక్రాల కుర్చీ కోసం అడిగాము. ఆ చక్రాల కుర్చీ వాళ్లు చాలా గౌరవంగా మమ్మల్ని చకచకా పక్క టెర్మినల్ వరకు తీసుకుపోయారు కానీ అక్కడ మళ్లీ తనిఖీ అవసరమైంది. ఈసారి విమానంలో మరింత మంది భారతీయులు కనిపించారు. అందులో చాలామంది తెలుగు వాళ్లు. మా ఆవిడకు పక్కనే ఒక చక్కని నేస్తం దొరికింది. వాళ్లు బహుశా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. విమానంలో కూర్చున్న ప్రతి వాళ్లకు ముందు సీటు వెనక ఒక టీవీ ఉంటుంది. అది చాలా చిన్నదిగా ఉంటుంది. అందులో కొన్ని సినిమాలు, వీడియోలు, వార్తలు కనిపించే ఏర్పాటు చేసి ఉంటారు. మా ఆవిడగారు ఒక చక్కని తెలుగు సినిమా ఎంచుకుని పూర్తిగా చూసినట్టు ఉన్నారు. నాకు అంత ఓపిక లేదు. నాకు అసలు సినిమా చూడడమే ఓపిక లేదు. అదే బుల్లితెరలో మన ప్రయాణ మార్గం వివరాలు కూడా తెలుస్తుంటాయి. మనం ఏ ప్రాంతం మీద ఎగురుతున్నది, ఎంత వేగంగా ఎగురుతున్నది మొదలైన అంశాలన్నీ అక్కడ తెలుస్తుంటాయి. నేను అప్పుడప్పుడు వాటిని మాత్రమే చూస్తూ కూర్చున్నాను. పుస్తకం చదివే ప్రయత్నం చేశాను కానీ ఎందుకో నాకు కుదరలేదు. ఇక విమాన కన్యలను గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అందులో కొంతమంది కన్యలు కారు. నడివయసు వాళ్లు కూడా ఉన్నారు. కానీ అందరూ ఎంతో కలగలుపుగా, స్నేహభావం ప్రదర్శిస్తూ సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నారు. అందరికీ తిండి అందిస్తున్నారు. ఆ తిండి గురించి చెప్పకుండా ఉండటమే మేలు అనుకుంటాను. అది బాగుంది బాగోలేదు అన్నట్టు ఒక బుధవారం మధ్యాహ్నం బయలుదేరాము. కనీసం 12 గంటలు ప్రయాణం చేసి ఒక గురువారం మధ్యాహ్నానికి లండన్ చేరుకున్నాము. అక్కడ బయలుదేరి మరో పనె్నండు గంటలు ప్రయాణం చేసి శుక్రవారం తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్నాము. గడిచింది 24 గంటలు మాత్రమే. మరి గురువారం ఏమైనట్టు? కాలానికి వ్యతిరేకంగా, అంటే భూమి తిరిగే దిశకు వ్యతిరేకంగా కదులుతూ వచ్చినందుకు ఒకరోజు కలిసిపోయింది. వెళ్లేప్పుడు పరిస్థితి అందుకు వ్యతిరేకంగా ఉంటుంది. తెలిసిన వారికి ఇది మామూలుగా తోచినా విమానాల అనుభవం లేనివారికి చిత్రంగా తోస్తుంది. అటువంటి ప్రయాణంలో సమయాసమయాలు చూడకుండా వాళ్లు మొక్కుబడిగా తిండి పెడతారు. పెట్టినందుకు మనం తింటాము. అందులో నాణ్యత గురించిన ప్రశ్న రానే రాదు. కనుక విమానంలో తిండి గురించి ఆలోచించకూడదు.
తిరుగు ప్రయాణంలో పంజాబీ డ్రెస్ అనే దుస్తులలో ఒక చక్కని అమ్మాయి విమాన కన్యగా పని చేస్తూ కనిపించింది. మొత్తానికి బ్రిటీష్ విమాన సంస్థ వారు కూడా మన దేశపు దుస్తులను అంగీకరించారు అని అర్థం అయింది. ఆ అమ్మాయి ఎంతో కలుపుగోలుగా ఉంది. ఒకరిద్దరు జంటల వద్ద చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ల కోసం విమాన కన్యలు ప్రత్యేకంగా పడుకునే ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో నా వరుసలోనే కూర్చున్న ఒక జంటతోపాటు వాళ్ల బాబు కూడా పడుకొనే లేదు. వాళ్లు ఎంతసేపు అందరు పడుకున్నారా సరే తమ మీద లైట్ వేసి ఉంచి గోల చేస్తూనే ఉన్నారు. విమాన కన్య వాళ్లకు అవసరాలు తీరుస్తూనే ఉన్నది. ఈ అమ్మాయి బ్యాగ్‌ను తీసుకువెళ్లి ఒకచోట ఎక్కడో దాచింది. దాన్ని నేను చివరి వరకు అడగలేదు. ఆమె నాకు ఇవ్వలేదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అర్థం కాదు. ముందున్న బుల్లితెరలో కింది ప్రాంతాలను గురించి చూస్తున్నాను అన్నాను కదా. అసలు ఫీనిక్స్ నుండి బయలుదేరగానే కింద కనిపించిన సోనోరన్ ఎడారి దృశ్యాలు ఎంతో ఆశ్చర్యకరంగా కనిపించాయి. అరిజోనా అన్నది ఎడారి ప్రాంతం. అయితే ఇసుకమేటలుగా ఉండే ఎడారి కాదు అది. కొండలు గుట్టలు, చెట్లు చేమలు కూడా ఉంటాయి కానీ, పెద్ద జలాశయాలు ఉండవు. ఒక నది ఉంది. అయితే ఆకాశంలో కొంత ఎత్తు నుంచి చూసినప్పుడు మాత్రం ఆ ప్రాంతమంతా నిజమైన ఎడారిలాగా కనిపించింది. అనుభవం అద్భుతంగా ఉంది. విమానం ఎక్కడం నాకు మొదటిసారి. బహుశా లోకాభిరామం చదువుతున్న వాళ్లలో కొంతమంది అసలు విమానం ఎక్కలేదేమో అని నా అనుమానం. విదేశాలకు విమానంలో వెళ్లదలచిన వాళ్లకు వివరాలు తెలిసేలాగా రాయాలని ఉంది. కానీ ఆ పని ఎప్పుడు జరుగుతుందో తెలియదు. తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణం కొంత చిత్రంగా ఉంటుంది. అందులో సస్పెన్స్ ఉండదు! మొత్తానికి మళ్లీ ఒకసారి నా దేశం భూమి మీద కాలు పెట్టినప్పుడు నాకేమీ కొత్తదనం తోచలేదు!

-కె.బి.గోపాలం