S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘సామాజిక’ సునామీ!

ఎన్నికలు భారతీయులకు అలవాటే.. కళ్లుమూసి తెరిచేలోగా ఏదో ఒక రకమైన ఎన్నికలు వస్తూనే ఉంటాయి.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అనుకూలతలు, ప్రత్యర్థి ప్రతికూలతలను విస్తృతంగా ప్రచారం చేయడం, ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు చిట్కాలు ప్రయోగించడం ఇంత వరకూ చూశాం. పోలింగ్‌కు ముందు ఇచ్చే తాయిలాల కంటే నిరంతరం వాగ్దానాలు ఇచ్చి ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాల రూపంలో అనేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ అమలుచేస్తున్నా అధికారంలో ఉన్న పార్టీలు గెలిచే పరిస్థితి ఉందని కచ్చితంగా చెప్పలేం. చేసింది కొంతైనా, కొండంతగా చెప్పుకోవడం అనివార్యంగా మారింది. ఇందుకు సామాజిక మాధ్యమాలు కలిసొచ్చాయి.
గత పదేళ్లుగా సామాజిక మాధ్యమాలు తడాఖా చూపిస్తున్నా, ఇపుడిపుడే వాటి సత్తా తెలిసిన రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని ప్రచారం మొదలుపెట్టాయి. ఇందుకోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఐటీ విభాగాలను ఏర్పాటుచేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రతి అభ్యర్థి నేడు సామాజిక మాధ్యమాల్లో తమ పేరిట అధికారిక అకౌంట్లను తెరచి తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలతో ప్రజలను ఊదరగొడ్తున్నారు. ఇది కాస్తా ముదిరి అన్ని వర్గాల నుండి వస్తున్న ఒత్తిడులను తట్టుకునేందుకు పార్టీలు సైతం థర్డ్‌పార్టీలను రంగంలోకి దించి ప్రత్యర్థి పార్టీలపై దుష్ప్రచారానికి పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నాయి. తమకు అనుకూల ప్రచారంపై కంటే ప్రత్యర్థులపై దుష్ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందుకోసం- ‘అంతా నిజమేన’ని భ్రమింపజేసే వీడియోలు, ఆడియో టేపులు సమయం చూసి విడుదల చేస్తున్నాయి. వీటి ప్రభావం అమాయక ఓటర్లపై ఎక్కువగా ఉంటుందని తేలిపోవడంతో రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలతో వల విసురుతున్నాయి.
సర్వేల పేరుతో, ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో ఓటర్లపై ప్రత్యక్ష ప్రభావానికి ఎవరి వంతు ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని జనం ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా సామాజిక మాధ్యమాలే ఇస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వారు మాత్రమే ఎన్నికల సమరంలో విజయం సాధిస్తున్నారనేది తెలిసిన విషయమే.
మహా సంగ్రామం..
లోక్‌సభకు ఏప్రిల్,మే నెలల్లో వివిధ దశల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు ఎనిమిది రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు కూడా అదే సమయంలో జరుగుతాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వీలైతే జమ్మూ కశ్మీర్ శాసనసభలకు ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లోనూ, అదే సమయంలో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇవి ముగిసిన తర్వాత ఢిల్లీ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య జరుగుతాయి.
ఈసారి ఎన్నికల సమరంలో ప్రచారం ప్రధాన ఘట్టం కాబోతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా చేసే ప్రచారానికే రాజకీయ పార్టీలు పెద్ద పీట వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోరాహోరీగా ప్రచార యుద్ధం సాగుతుందనడం నిస్సందేహం. అమెరికా ఎన్నికల్లో రష్యా వేలు పెట్టినట్టు భారత్ ఎన్నికల్లో ప్రపంచ దేశాలు తమకు అనుకూలతను పెంచే ప్రభుత్వాల కోసం, నేతల కోసం మనకు తెలియకుండానే సామాజిక మాధ్యమాల ముసుగులో భారత్‌లో ప్రవేశించి ఓటర్లను ప్రభావితం చేసే ముప్పులేకపోలేదని ఐటీ రంగ నిపుణులు తరచూ హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన రచ్చను అగ్రదేశాలే తట్టుకోలేనపుడు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో ఇపుడిపుడే అడుగులు వేస్తున్న భారత్ ఎంత మేరకు ఎదుర్కోగలదనేది ప్రశ్నార్థకమే!
ఎవరిష్టం వచ్చినట్టు వారు వాస్తవాలకు పొంతన లేకుండా సొంత అభిప్రాయాలను, వ్యాఖ్యానాలను జోడించి అయినవి కానట్టు, కానివి అయినట్టు సామాజిక మాధ్యమాల్లో ‘పోస్టులు’ పెడుతున్నారు. సినీనటుడు, ‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివాదంతోపాటు టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ వీడియోలు, బ్లాగుల్లో వివాదాస్పద అంశాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. అత్యుత్సాహంతో కొంతమంది ఈ ‘పోస్టింగ్’ల్లో వాస్తవం ఎంతో తేల్చుకోకముందే వాటిని గుడ్డిగా ‘్ఫర్వర్డ్’ చేస్తున్నారు. కొన్ని వీడియోలు, సంచలన వ్యాఖ్యలు సామాజిక మీడియాలో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారాన్ని ఎంతవరకూ విశ్వసించాలనేది విద్యావేత్తలు యోచిస్తున్నా , సామాన్యులు మాత్రం సోషల్ మీడియా సౌరమండలంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఎన్నికలకు, ప్రముఖులకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలు సాధారణంగానే ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అయితే, ఈ అంశాలపై కొన్నిసార్లు వాస్తవానికి భిన్నమైన కథనాలు, వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి. ఆన్‌లైన్‌లో లభించే సమాచారం వచ్చే పదేళ్లలో ఎలా ఉండబోతోందనే దానిపై ఈలాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇమేజింగ్ ది ఇంటర్నెట్ సెంటర్ వృత్తి నిపుణులు, మేధావులు కలిసి ‘ప్యూ’ (పీఈడబ్ల్యు) పరిశోధనా సంస్థ సహకారంతో సమాలోచనలు నిర్వహించారు. 2016లో ‘బ్రెగ్జిట్’పై ఓటింగ్ సందర్భంగా సామాజిక మాధ్యమాలు సత్తా చూపాయి. ఎన్నడూ మేధావులకు సైతం అందని ‘బ్రెగ్జిట్’ వంటి అంశాలు ఈసారి సామాజిక మాధ్యమాల పుణ్యమాని సామాన్యుడికి కూడా అదేమిటో ఇట్టే అర్థమయ్యాయి. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను సైతం వ్యక్తం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజావాణిగా అది రూపాంతరం చెందింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిందే. ఫలితాలు వచ్చే వరకూ అంతా ఊహించింది ఒకటైతే, జరిగింది మరొకటి. దానికి కారణం తెరవెనుక సామాజిక మాధ్యమాలు చేసిన ప్రచారమే. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, వెలువడిన వార్తలు, సామాజికంగా, సాంస్కృతికంగా వెల్లడైన అభిప్రాయాలు అత్యధిక సంఖ్యాకులపై విశేష ప్రభావం చూపాయి. ఈ విధంగా ఏర్పడిన కొత్త సమాచార కేంద్రాల ద్వారా వివిధవర్గాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సమాచారాన్ని అందజేసే ప్రయత్నం కూడా జరిగిందని ఈ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు లక్షకు పైగా న్యూస్ అవుట్‌లెట్ల ద్వారా 37.6 కోట్లమంది ఫేస్‌బుక్ వినియోగదారులు జరిపిన సంభాషణల్లో ప్రజలు తమ భావాలు, అభిప్రాయాలకు అనువైన కోణంలో సమాచారాన్ని కోరుకుంటున్నట్టు మరో అధ్యయనంలో తేలింది. మన దేశంలో 2015లో ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 13.5 కోట్లు, అది 2018 నాటికి 21.9 కోట్లకు పెరిగింది. 2019లో 24.2 కోట్లకు చేరనుంది. 2014 గణాంకాల ప్రకారం మన దేశంలో 83.4 కోట్ల మంది వరకూ ఓటర్లు ఉండగా, అందులో పోలింగ్‌లో పాల్గొంటున్న వారు 55.38 కోట్ల మంది మాత్రమే.
సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వియ్ చాట్, ఇన్‌స్టాగ్రామ్, క్యూజోన్, క్యూక్యూ, టిక్‌టాక్, సినా వైబో, ట్విట్టర్, లింకెడిన్, బైదు, రెడిట్, స్కైప్, స్నాప్‌చాట్, వైబర్, పింటర్‌సెట్, లైన్, టెలిగ్రాం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు దాదాపు 3వేలకు పైగా సామాజిక మాధ్యమాలు పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 759.4 కోట్ల జనాభా ఉండగా, 402.1 కోట్ల మంది ‘అంతర్జాలం’ వినియోగిస్తున్నారు. 319.6 కోట్ల మంది సామాజిక మాధ్యమాల్లో చైతన్యవంతగా ఉంటున్నారని ‘గ్లోబల్ డిజిటల్ రిపోర్టు-2018’ పేర్కొంది. 513.5 కోట్ల మంది కొత్తగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుండగా, మరో 295.8 కోట్ల మంది నిరంతరం సామాజిక వేదికను అతుక్కుపోతున్నారని తేలింది. భారత్‌లో 36 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్‌కు అనుసంధానమైనట్లు ఈ నివేదిక పేర్కొంది. మరికొన్ని సంస్థలు ఈ గణాంకాలను స్వల్పంగా మార్చి చెబుతున్నాయి. ఇదంతా చూస్తుంటే రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా, డేటా అనలైటిక్స్ చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ అంశంపై ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న డైకీన్ యూనివర్శిటీ కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ ఉషా ఎం రోడ్రిగ్స్ మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలూ సోషల్ మీడియాను

విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు.
ప్రత్యర్థిపై విషం చిమ్మేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనే పైత్యం వచ్చే ఎన్నికల్లో తారస్థాయికి చేరుతుందని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుదా పేర్కొంటున్నారు. విచిత్రం ఏమంటే ప్రధాన పార్టీలు అన్నీ ఇదే పనిచేస్తూ, పరస్పరం బురద జల్లుకుంటూ అసత్య కథనాలను శరవేగంగా ప్రచారం చేస్తూనే మరో వైపు తాము ఎలాంటి అనైతిక ప్రచారానికి పాల్పడటం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసేందుకు వీలుగా ఈ వ్యవహారాలను చూసే బాధ్యతను ‘్థర్డ్ పార్టీల’కు అప్పజెప్తున్నాయని ఇంటర్నేషనల్ పీస్ సంస్థలో రీసెర్చి ఫెల్లోగా ఉన్న మిలాన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలపై, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ మాటల దాడి చేస్తుంటే, అధికార భారతీయ జనతాపార్టీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూనే, ‘ప్రజలకు దూరమైన పార్టీ’ అంటూ కాంగ్రెస్‌ను అదే సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది. 2014లో బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ అవినీతిపై ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరించిన బహిరంగ వ్యూహం - సామాజిక మాధ్యమాలే. తమ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ల నుండి ‘ట్వీట్ల’ ప్రవాహాన్ని కొనసాగించడమేగాక, తమ పర్యటనల చిత్రమాలికలను నాయకులు ఓటర్లకు అందించారు. ఇదంతా బీజేపీకి బాగా కలిసొచ్చింది. దీనిని కాస్తా ఆలస్యంగానైనా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల జరిగిన పలు ఉపఎన్నికల్లో ఉపయోగించుకుని లాభపడింది.
ప్రధాని నరేంద్ర మోదీ 46 లక్షల మంది ఫేస్‌బుక్ ఫాలోయర్లతో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో క్రికెటర్ విరాట్ కొహ్లీ,సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే, హానీ సింగ్, సచిన్ టెండూల్కర్, శ్రేయ ఘోష్,అమితాబ్ బచ్చన్, కపిల్ శర్మ తదితరులున్నారు. ఈ రేటింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ట్విట్టర్‌లో 8.1 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉండగా, ఫేస్‌బుక్‌లో 2.2 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ఇపుడిపుడే సామాజిక మాధ్యమాలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నెటిజన్లను ఆకట్టుకునే పనిలో పడింది. భారత్‌లో దాదాపు 30 కోట్ల మంది ప్రజలు సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నారనేది సుస్పష్టం. ఇంత యాక్టివ్‌గా కోట్లాది మంది ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నపుడు వారిపై ఆయా సోషల్ మీడియా ప్రభావం ఉండదని ఎవరనుకుంటారు?
మరోవైపు గూగుల్, వాట్సాప్, బీబీసీ సంస్థలు నకిలీ వార్తలను అరికట్టే పెద్ద యుద్ధమే ప్రారంభించాయి. అది వేరే విషయం. ‘బీబీసీ ఫ్యూచర్’ ఇటీవల 50 మంది నిపుణులను 21వ శతాబ్దంలో ఎదుర్కోబోయే పెను సవాళ్ల గురించి ఇంటర్వ్యూ చేసినపుడు వారు చెప్పిన అంశాలు అన్నీ దాదాపు టెక్నాలజీకి సంబంధించినవే. కొత్త కోణంలో సత్యాన్ని, వాస్తవాన్ని వార్తలుగా అందించడం సవాల్‌గా మారనుందని వైర్డ్ మ్యాగజైన్ సహ వ్యవస్థాపకుడు కెవిన్ కెల్లీ అభిప్రాయపడ్డారు.
అంతెందుకు..? అల్విన్ టోఫ్లెర్ , హెయిదీలు ఫ్యూచర్ షాక్, ద థర్టు వేవ్ , యాన్ హేండ్లీ, గై కవసకి, పెగ్ ఫిట్జిప్యాట్రిక్, ఎకతెరిన వాల్తెర్‌లు సైతం ముంచుకొస్తున్న సామాజిక మాధ్యమాల సునామిపై ఎన్నడో ఊహించి చెప్పారు.
ఏదైనా విషయానికి సంబంధించి అధికార వర్గాలు చెప్పే దానిని విశ్వసించడం కన్నా తోటివారు, సహచరులు వెల్లడించే అంశాలను నమ్మే పరిస్థితి ఇపుడు ఏర్పడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓ పరిశోధనా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో అవాస్తవ కథనాలు గందరగోళానికి గురిచేశాయని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. కల్పిత రాజకీయ కథనాలను ఇతరులకు ‘షేర్’ చేసినట్టు, ఇది కొన్ని సందర్భాల్లో ఉద్దేశ పూర్వకంగానూ, కొన్నిసార్లు తమకు తెలియకుండానే చేసినట్టు 23 శాతం మంది ఒప్పుకున్నారు. సమచారం దగ్గరగా మారుతుందని 49 శాతం మంది, అధ్వానంగా మారుతోందని 51 శాతం తెలిపారు. నిజానికి ఇది చాలా కీలక మైన ఘట్టం. సమాచారాన్ని సాంకేతికంగా వడపోయడం, అవాస్తవాలను పక్కకు తీసేసి, వాస్తవిక సమాచారమే ప్రజలకు చేరేలా చేయడం ద్వారా మాత్రమే ప్రజలు నాణ్యమైన వార్తలను అందుకోగలుగుతారు. దీనికి సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వినియోగించే ‘ఫైర్‌వాల్స్’గా చెప్పుకోవచ్చు. పత్రికారంగం సిద్ధాంతాల్లో ‘గేట్ కీపింగ్’ అనే సిద్ధాంతం ఇదే చెబుతుంది. అయితే, అవన్నీ కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
తప్పుడు వార్తలు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు మన దేశంలో కఠినమైన శిక్షలే ఉన్నాయి. అందుకు రాజ్యాంగంతో పాటు వివిధ శిక్షాస్మృతులు సైతం స్పష్టమైన చట్టాలను వివరిస్తున్నాయి. అయినా ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఒకపుడు ఐదారుగురు సిద్ధాంతకర్తలతో భేటీ జరిపి రాజకీయ పార్టీల నేతలు తమ భవిష్యత్ ప్రణాళికలను, వ్యూహాలను రూపొందించేవారు. కానీ, ఇపుడు యాజమాన్య బృందాలను సిద్ధం చేసుకుని టెక్నాలజీ వినియోగించుకుంటూ ప్రజల నాడిని, విపక్షాల ఎత్తులను, పై ఎత్తులను సమీక్షించుకుంటూ , ఎప్పటికపుడు న్యూస్ చానళ్లను గమనిస్తూ సోషల్ మీడియాలో ‘పోస్టులు’ పెడుతూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈబృందాల సంఖ్య నేడు పెరుగుతోంది. ప్రతి పార్టీ ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఐటీ బృందాలను ఏర్పాటుచేసుకుంటున్నాయి. అక్కడ ఉన్న డజను మంది నిపుణులు ఆడియో, వీడియో, గ్రాఫిక్స్ నిపుణులు పబ్లిక్ వెబ్‌సైట్లలో మెరుపు వేగంతో అప్‌లోడ్ చేస్తున్నారు. మిగిలిన వారికి దానిని వాట్సాప్ సందేశాల రూపంలో చేరవేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టే క్రమంలో ఐదుగురికి మించి ఒకే మారు షేర్ చేయడానికి వీలు లేకుండా ‘వాట్సాప్’ సంస్థ నిబంధనలు విధించింది. అయితే వాట్సాప్‌లో బ్రాడ్ కాస్ట్ ఆప్షన్‌ను వినియోగించుకుని వెనువెంటనే సమాచారాన్ని చేరవేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా జరగని సంఘటనలు జరిగినట్టు ప్రచారం చేయడం అందరికీ అనుభవమే. జైపూర్‌లో కూడా ఒక సంఘటన వైరల్‌గా మారింది. వాట్సాప్‌ను అత్యధికంగా వాడుతున్న దేశాల్లో ఇండియా, బ్రెజిల్, మెక్సికో, రష్యా ఉన్నాయి. భారత్ ఎన్నికలకు సహవేదికగా వాట్సాప్‌ను తీసుకుని రష్యా వేలుపెట్టే వీలు లేకపోలేదు. వీరందిరికీ సమాచార ఆయుధం ఒక్కటే. అదే స్మార్ట్ ఫోన్. రాత్రికి రాత్రి వాట్సాప్‌లో వేలకు వేలు గ్రూప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆటోమెటిక్‌గా అనవసరపు మెసేజ్‌లను పంపించే అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ ఇప్పటికే పేజీల కొద్దీ ప్రకటనలు జారీ చేసింది. ఎవరు ఎన్ని చెప్పినా సామాజిక మాధ్యమాల ప్రయోజనాలను గ్రహించి, ప్రమాదాన్ని అర్థం చేసుకుని వ్యవహరించడం ప్రతి ఒక్కరి విధి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల సమయంలో కలకలం రేపే ప్రయత్నాలను అడ్డుకోవడం, ఎన్నికల సమగ్రతను కాపాడటం కూడా ప్రభుత్వానికే పరిమితమైన అంశం కాదు, ప్రతి భారతీయుడి బాధ్యత కూడా. ఎన్నికల విధానాన్ని పరిరక్షించడం, హానికరమైన చర్యలను అడ్డుకోవడం రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై ఉన్న పెద్ద బాధ్యత.
సమాచార విస్తృతి పెరిగే కొద్దీ ప్రజలు అందుకు అనుగుణంగా ఎలాగూ వాస్తవాలను అర్థం చేసుకుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆయా సమస్యలను అధిగమించేలా చేస్తుంది. కేవలం సాంకేతికత మాత్రమే ఈ మొత్తం సమస్యను అధిగమించగలుగుతుందని భావించలేం. సరైన సమాచారం వెలువడేలా ఎవరికి వారు తమ సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో సమాచార సాక్షరత పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సాంకేతికత సరికొత్త సవాళ్లను ముందుకు తెస్తున్నందున సమాచార నాణ్యత మనం చెప్పుకునేంత వేగంగా పెరగకపోవచ్చు. ఈ సమస్య మనుష్యుల మనస్తత్వానికి సంబంధించింది కనుక సమాచార విస్తృతి పెరగడం కూడా కష్టమే. ఈ సవాలును అధిగమించడమే మనలో ఉన్న పరివర్తనకు ప్రతీక.
*

-బీవీ ప్రసాద్ 98499 98090