S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాజాభజంత్రీలు

అతనప్పుడే అన్నం తిని బాల్కనీలోని మంచంమీద నడుం వాల్చాడు.
ఆరుబయట బాల్కనీలో అలా పడుకోవటం అంటే ఎంతిష్టమో రామారావుకి. కాంక్రీటు గోడల్లోపల ఊపిరి సలపదతనికి. బయటే వేయించుకుంటాడు మంచాన్ని. ఊర్లోని అలవాటు.

మనవరాలిని చూసుకోవటానికి వస్తున్నారని, కుదిరేటట్టే వుందని కొడుకు కబురు చేస్తే అంతకు వారం రోజుల ముందే వచ్చారు రామారావు అతని భార్య సీతమ్మ.
చూసుకుని వెళ్లటం అయితే వెళ్ళారు కానీ ఇంకా ఏ కబురూ చెప్పలేదు. దానికోసమే ఎదురుచూస్తున్నారంతా..
పెళ్లిచూపులన్న దగ్గర్నించీ రామారావు మనసులో ఇదమిద్ధంగా ఇదీ అని చెప్పలేని ఏదో కలత. పడుకున్నాడన్నమాటేగానీ కలవరంతో నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు.
ఇంతలో కొంపలంటుకుపోయినట్టు బొయ్యిమని ఒకటే అరుపులు. కుక్కలు కొట్లాడుకుంటున్నట్టున్నాయ్. అందులో ఒకటి పెద్దగా అరుస్తూంది.
దానె్నక్కడ చంపేస్తాయేమోనని గబుక్కున లేచి పిట్టగోడ దగ్గరకొచ్చి కిందకి చూశాడు.
దాదాపుగా ఏడెనిమిది కుక్కలుంటాయేమో..! తినేసిన ప్లాస్టిక్ పళ్లాల మీద ఆధిపత్యం కోసం ఒకదాని మీదొకటి కలబడుతున్నాయి.
దీర్ఘంగా నిట్టూర్చాడు ఆ ఎంగిలి పళ్లాల వైపూ, ఆ ఇంటికి రెండిళ్ళ అవతలవున్న రెండంతస్థుల భవనం వైపూ మార్చి మార్చి చూస్తూ.
ఆ ఇంటికీ, ఈ ఇంటికీ మధ్యలో వున్న రెండు ఖాళీ ప్లాట్లలో పడేసి ఉన్నాయి ప్లాస్టిక్ పళ్లాలూ, గ్లాసులూ, కప్పులూ, ఐస్‌క్రీం తిన్న కప్పులూ.. వాటిల్లో తమ బతుకుని వెదుక్కోవాలనే ఆధిపత్య పోరులో కుక్కల కొట్లాటలు.
ఆశ్చర్యంగా అంతకు మూడ్రోజుల ముందే ఆ ఇంట్లో పెళ్ళైంది. నిశ్చయమై కూడా ఆర్రోజులే.
‘‘కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు’’ అంటారు ఇందుకేనేమో! అబ్బాయి పెళ్లికోసమనే అంత దూరంనుండి రెండు వారాల క్రితమే వచ్చినా ఏదీ కుదరక ఇక వెళ్లిపోవాలనుకుంటున్నంతలో ఎవరో వాళ్లకి ఈ సంబంధం గురించి చెప్పటం, ఇలా కుదరటం, అలా పెళ్లైపోవటం, ఆ మర్నాడే ఎంబసీకి వెళ్లి పిల్ల వీసా పన్లు చూసేసి కుర్రాడు విమానం ఎక్కెయ్యటం అంతా కలా నిజమా అన్నట్టుంది రామారావుకి.
పట్నానికి చివర్లో కొత్తగా కట్టారేమో.. ఈ రెండిళ్ళూ తప్ప పూర్తయిన ఇళ్ళేం లేవక్కడ. అన్నీ పునాదులు తీస్తూనే, గోడల వరకూ లేచో, స్లాబ్ వెయ్యటమో, సెంట్రింగ్ చేస్తూనో ఉన్నాయి ఇళ్లన్నీ. ఒకళ్ళని చూసి మరొకళ్లకి ధైర్యం.
మరెవరూ లేకపోవటంతో ఈ రెండిళ్ల మధ్య దగ్గరతనం.. పెళ్లిపనుల్లోనే కదా కబుర్లలోనూ తెలుస్తుంటుంది.
అతనిలా ఆలోచిస్తున్నంతలోనే కింద నుంచి మళ్లీ పెద్ద, పెద్దగా కుక్కల అరుపులు.
పెళ్లయి ఇన్నిరోజులైనా అవలానే వున్నాయి. ఊరి చివర అవటంతో పనోళ్లు దొరక్క గినె్నలెందుకులే కడగాలనటం, మొత్తం ప్లాస్టిక్కునే వాడారంట. అవీ ఇవీ కలిపి ఎత్తితే లారీ నిండుతుందేమో..!
ఆర్రోజుల్లో పెళ్ళే కదా, ఒక్క పెళ్లికి ఇన్ని వ్యర్థాలా? ఇలాగే చేసేవాళ్ళమా పెళ్లంటే?
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎందుకన్నారు? పెళ్లంటే పడే హైరానాలో వున్న ఆ అందాలూ, ఆనందాలు ఎక్కడ్నించి వస్తాయి?
అందాలూ, ఆనందాలు మాట అటుంచితే ఈ ప్లాస్టిక్కుల గొడవేంటి? ఇలాగేనా వాడేసేది ఎడా, పెడా? పైగా ఇంత బాధ్యతారాహిత్యమా? కుక్కలు వాటినిలా రోడ్డుమీదకు లాక్కువచ్చేస్తుంటే వెళ్ళేవాళ్లకీ వచ్చేవాళ్లకీ ఎంత ఇబ్బంది? పైగా ఒకటే దుర్వాసన?
మరీ ముఖ్యంగా ఒక్కొక్క పెళ్లికీ ఇంతలేసి వ్యర్థాలు వదుల్తుంటే ఈ భూగోళం పరిస్థితేంటో?
ఇలా అనుకోగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది రామారావుకి.
‘‘నా మనవరాలి పెళ్లిమాత్రం భూదేవమ్మ గొంతుకి అడ్డం పడకుండా ఊళ్ళోనే చెయ్యమని పట్టుపడ్తాను. ఏం అంటాడో చూద్దాం’’
ఆలోచిస్తుంటే తన ఊరూ, తన కూతురి పెళ్లిచేసిన రోజులు గుర్తొచ్చాయతనికి.
***
‘‘‘మనవైపు వాళ్ళే మామయ్యా..! కాకపోతే వ్యవసాయాల కోసమని పొలాలు కొనుక్కుని ఎప్పుడో పిల్లోడి ముత్తాతలు అక్కడికెళ్లి సెటిల్ అయ్యారంట. మళ్లీ ఇటువైపు రావాలని వాళ్ల కోరిక. మన ఎత్తులకీ వాళ్ల ఎత్తులికీ సరిగ్గా సరిపోయింది. అందుకే పెళ్లింకా పదిహేన్రోజులుందనగా పిల్లోణ్ణి పంపుతాను. నువ్వూ, అత్తయ్యా రండి’’.
సీతంది.. దగ్గర చుట్టాలందరికీ పెళ్లి కుదిరిందని చెప్పటానికొచ్చి.
‘‘నాకు ఏం తిన్నా అరుగట్లేదమ్మా..’’’
‘‘అవును మరి. తింటాకే ఎల్తాం? అయినా నువ్వు తినకపోతే మిగిలిపోతయ్ మరక్కడ.. మాట్లాడితే ఓ పద్ధతుండాలి. నువ్వేమనుకోకమ్మా! ఈ మధ్య మీ మామయ్య ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుత్తాలేదు..’’ తరుముకొచ్చింది ముసలావిడ..
‘‘్ఫర్వాలేదులే అత్తయ్యా! నువ్వేం తినగలవో అయ్యే వండిస్తాను, తిందువుగాని. ఎక్కడ్నించో ఆత్రేయపురం నుంచి తెప్పిస్తాను వంటోళ్లని. పది రోజులు ముందే వచ్చేస్తున్నారు. ఏం కావాలంటే అయ్యే వండిస్తాను. నువ్వు రా.. మావయ్యా. పెద్ద పులల్లే నువ్వు గుమ్మాల్లోకూర్చో. నాకు అంతే చాలు.. ఏం అత్తయ్యా?’’
‘‘అంతేకదా..! మేనకోడలన్నాక ఆ మాత్రం చూసుకోవద్దా ఏటి? వస్తాంలేవే.. అన్నీ జాగ్రత్తగా చేసుకో. నగలరుూ్య జాగ్రత్త..’’ సలహాలిచ్చింది మేనత్త.
‘‘అలాగే అత్తయ్యా!.. నువ్వొచ్చాకనే వినాయకుడికి బియ్యం కట్టి పెళ్లి పనులు మొదలెట్టేది.’’
‘‘అలాగేలేవే..! రాకుండా ఎలా ఉంటాం?’’
పెళ్లి కుదిరిందనుకున్నకా పెద్దోళ్లన్నాళ్ళకి అందరికీ చెప్పి వచ్చేరు భార్యాభర్తలిద్దరూ వెళ్లి.
***
‘‘ఒరేయ్.. ఈరేసూ.. తాటాకుల్ని నరకాల్రా.. నీతోపాటు ఇంకా ఇద్దరుంటే సరిపోద్దా..?’’
‘‘ముగ్గురెందుకండయ్యగారూ? ఎక్కడెక్కడ వెయ్యాలండి పందిరి?’’
‘‘ఆ మాత్రం తెలవదేంట్రా? గుమ్మం ముందు పెళ్లి పందిరెయ్యాలా? వెనక దొడ్లో భోజనాలకి విడిగా, వంటల దగ్గరా- మొత్తం మన చేలో వున్న తాటిచెట్ల ఆకులన్నీ నరకాల్సి వస్తుందేమో! సరిపోకపోతే సుబ్బయ్యగారి చేలగట్లమీద నాల్గుయిదు చెట్లున్నయ్. నరుక్కోమన్నాడు కావలిస్తే. పన్లో పని కాళీగా వున్నపుడు తాటినార చీరి ఎండలో పడెయ్. గుంజలు ముడ్యెటానికి పనికొస్తాయ్. దాంతోపాటు గెడ కర్రలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకుంటే సరిపోద్ది..’’
‘‘అలాగేనండయ్యగారూ..!’’
‘‘పందిళ్ల పని నీదే, గుర్తుంచుకో. అన్నట్టు.. పెళ్లినాడు పొద్దున్న తాటాకుల పందిరి గుంజలకి కొబ్బరాకులు సుట్టాలి. మన కొబ్బరి సెట్లయ్యి సరిపోతాయా?’’
‘‘పది సెట్లున్నాయండి.. అయ్యగారా! సెట్టుకి నాలుగేసి ఆకుల సొప్పున నరికినా సరిపోతాయండి’’
‘‘అంతేలేరా..’’’
***
‘‘బావయ్య లేడా అక్క..? పెందలాడే వచ్చేడనుకున్నాను సేలోంచి..’’
‘‘రారా...! అన్నం తిని ఇపుడే అలా ఎల్లొత్తానని ఎల్లేరు. అలా మడత మంచంమీద కూకో! ఎక్కడదాకా వచ్చినియ్యి పెళ్లిపన్లు..?’’
‘‘అవుతా ఉన్నాయ్యక్కా..!’’
‘‘పెళ్ళయిన వెంటనే కాపరమేనంటగదా!.. ఇందాక అరుగుమీద కూర్చుంటే పక్కింటి రత్తమ్మత్తంది..’’
‘‘ఆ..! వీళ్లు పెళ్లయి అటూ ఇటూ తిరిగేసరికే రెండు మూడ్నెల్లు పడద్దక్కా! అపుడే కాపురం ఎక్కడ?’’
‘‘మనం అలా అనుకుంటాంగానీ ఇట్టే గడిసిపోతాయ్ రామారావు రోజులు. ఎంతలో వస్తాయ్? అయినా సామాన్లరుూ్య సేయించే ఉంచేరు గందా.. కాపురం పెడితే మాత్రం ఇబ్బందేవుందిలే?
‘‘ఆ..! సేయించేసేం కదా అక్కా! మా నాన అప్పట్లో ముందుసూపుతో సేలో అయిదారు సెట్లేసేడు గాబట్టి కలప కొనక్కరలేకపోయింది. టేకు సెక్క కొనాలంటే మాటలా ఇప్పుడు? ఎలాగైని ఇయ్యేడు పెళ్లి సేసేద్దావనే.. వడ్డావోడ్ని పిల్సి అడిగేం. అన్నీ అయ్యేతలికి ఎన్ని రోజులడద్దని.. పందిరి మంచం, పెద్దబల్ల, రెండు పట్టె మంచాలు, రెండుమడత మంచాలూ ఒక టేబులూ, డ్రెస్సింగు టేబులూ.. సిన్నాసితకా అన్నీ కలిపి ఏడెనిమిది నెలలన్నా పడతాదన్నాడు. ఈలోపు కుదరాపోద్దా అని సేయించేసేం. కాపురం పెట్టేటప్పటికీ సామానే్లవీ సేయించకపోతే ఎంత నామర్ధా..! అపుడు సేయించేం కాబట్టి సరిపోయింది.. ఇప్పుడైతే సేయించలేం’’.
‘‘అదీ నిజవేలే..’’
‘‘సర్లే.. మళ్లొత్తా.. సుబ్బయ్యగారి కిట్తమ్మని కలిసొత్తా ఈలోపు..’’
‘‘య్యే..?ఏదైనా పనిమీదొచ్చావా ఏటి? అన్నం తిన్నవా?’’
‘‘తినే బయల్దేరేనక్కా! అదే..’’ అని ఒక్క నిమిషం ఆగి...
‘‘..పెళ్లినాడు ఆకులమీదేత్తానికి మంచి సెక్రకేళీ అరటి గెల్లు అట్టే పెట్టమందావనొచ్చాను. పాతిగ్గెల్లన్నా పడతాయ్. గెల్లతో వున్న అరటిసెట్లు కడదాం తంబాలకి అంటన్నాడు కుర్రోడు. అయ్యయితే మనం సారె పెట్టేనాటికి మగ్గుతాయ్ అంటంది ఈవిడి. బావకి సెప్పు.. మల్లొత్తాలే.. అరిటాకుల సంగతి కూడా మాట్లాడాలి..’’
‘‘ఏ మాత్రం అవుతున్నారేటీ భోజనాలకి..’’ గుమ్మందాకా సాగనంపటానికొచ్చి అడిగింది..
‘‘ఆళ్ళు మూడొందల మందొత్తానన్నారక్కా..! ఊళ్ళో ఆడోళ్ళూ, మగోళ్ళూ, ఆళ్లూ, ఈళ్లూ కలిపి ఎంతలేదన్నా ఆరొందలవుతారు. ఇక పిల్లా పితకా పాలేళ్ళు ఓ వందవుతారేమో.. మొత్తంమీద సూసుకుంటే ఓ ఎనిమిదొందలాకులు లేత్తాయేమోనని లెక్కేసుకున్నాం’’.
‘‘అవుతార్లే. అటూ ఇటూగా..’’
‘‘సర్లేక్కా..! మల్లొత్తా..! బావతో సెప్పు..మర్చిపోకు..’’
‘‘అలాగేలేగానీ.. బియ్యం ఏరేటపుడు, పిండిలో పోటెయ్యటానికి కబురెట్టమని అమ్మాయితో సెప్పు.. పోటయితే ఎయ్యలేనుగానీ కూచ్చుని జల్లిత్తాను. జల్లిత్తానంటే గుర్తొచ్చింది.. జల్లిళ్ళు ఉన్నాయో లేదో. కావాలంటే పాలేర్ని పంపమను’’.
‘‘అలాగేలే..!’’
***
‘‘అమ్మగారా..! అమ్మగారండా..!’’
తలుపుమీద చప్పుడయ్యేసరికి వసాట్లో మడత మంచంమీద పడుకుని వినసకర్రతో విసురుకుంటున్న నర్సాయమ్మ. దొడ్లో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి దొడ్డి తలుపు గెడ తియ్యమంది.
గెడ తీసారో లేదో లోపలకంటా వచ్చిన ఆ మనిషిని కళ్ళజోళ్ళోంచి తేరిపార చూసి.. ‘‘ఏట్రా.. ఈరేసు..? ఏటిలాగొచ్చేవ్?’’ అప్పటికే లేచి కూర్చుందేమో.. ఆరాగా అడిగింది నర్సాయమ్మ.
‘‘అయ్యగారు లేరాండి?’’ చుట్టూ చూస్తా అడిగేడు.
‘‘లేరు? ఏ? నాకు సెప్పగూడదా? సచ్చినోడా? సల్లకొచ్చి ముంత దాత్తావెందుకు? సెప్పేడవక?’’
ఆమె మాట తీరే అంత కావటంతో నవ్వేడు ఈరేసు.
‘‘అది కాదులెండమ్మగారూ! బంతి సాపలు ఇమ్మన్నారండి మా అయ్యగారు.. మీరు లెగలేరు గదండి? అందుకని అయ్యగార్నడిగేనండి..’’’
‘‘ఎన్ని కావాలన్నారేటి?’’
‘‘ఎన్నుంటే అన్నీ ఇయ్యమన్నారండి..’
‘‘ఎలా పట్టికెల్తా మరి?’’
‘‘ఎడ్లబండేసుకొచ్చేనండి..’’
‘‘అయితే ఉండు. అమ్మాయి ఇపుడే పడుకుంది.. లోనకెల్లి లేపుకొత్తాను..’’
***
‘‘సింతపండూ, కుంకుడుకాయలూ ముందు రోజేనానబెట్టి సుకాల ముగ్గుతో కడిగిచ్చమన్నానని సెప్పు మీ అమ్మగారితో..’’
అంతకుముందు రోజే మసిరి మీద నించి పాలేళ్లతో కిందకి దింపిచ్చిందేమో.. ఇత్తడి గుండుగుల్నీ, రాగి డేకిశాలనీ వాటన్నింటినీ ఎడ్ల బళ్లమీదకి ఎక్కిచ్చుకున్నాకా ఆఖర్న తేలికపాటి సాంబారు కళాయిల్ని పట్టుకెళ్తన్న రత్తాలుతో అంది సుండ్రోరు సూరయ్యమ్మ.
‘‘సెప్తానండమ్మగారా..! అయినా అమ్మగారికి సెప్పక్కర్లేదండి. నేనే గదండీ తోవేదాన్ని..’’
‘‘అన్నట్టు ఇత్తడి గళాసులు ఎన్నుంటే అన్నీ పట్రమ్మన్నారండి..’’
‘‘పాతికుంటాయేమో..! మళ్ళొత్తావా? ఇపుడే పట్టుకుపోతావా?’’
‘‘ఇచ్చేయ్యండమ్మగారా.. ఒకేపాలి ఎల్లిపోతాయ్.. ఎలాగూ బండేసుకొచ్చేను గదండీ..’’
‘‘ఎవరు తోంతారోగానీ బాగా తోవాల్రా! బాగా కిళ్లం పట్టేసినియ్యి..’’
‘‘అలాగేనండమ్మగారూ!’’
***
‘‘పెద్దమ్మా..! పెద్దమ్మా..!’’
‘‘ఎవరూ..?’’ సుట్టింట్లో.. పాలు కాస్తున్న సుజాత సాగదీసింది.
‘‘పెద్దమ్మా..! నేను రేవతిని. నున్నోరి అమ్మాయిని..’
‘‘ఓ.. రేవ్తా..! వత్తన్నానుండమ్మా.. పాలు పొంగుతున్నాయి. కొరకంచు బయటికి లాగి వత్తాను..’’
అన్నంతలో రానే వచ్చింది రేవతి. పాలకుండమీద మూతేసి..
‘‘రావే..! పెళ్లిపనుల్లో ములిగిపోయి కాలేజీకి ఎగ్గొట్టేతన్నవా?’’ అంది పైకి లేసి నిలబడి పైట సవరింపుకుంటా.
‘‘లేదు పెద్దమ్మా! ఎల్తన్నాను. పెళ్లి దగ్గరకొచ్చాకా మానేద్దావని. ఇప్పట్నించీ ఎందుకంది అమ్మ’’
‘‘అంతేలే? ఏటి విశేషాలు? పెళ్లి పనె్లంత వరకూ వచ్చినయ్యి..’’
‘‘ఎయ్యో.. జరుగుతున్నయ్ పెద్దమ్మా..! రేపు పిండి వంటలు సేత్తారనుకుంటా’’
‘‘అవునే్ల దగ్గరకొచ్చేసింది గదా పెళ్లి’’
‘‘అవును పెద్దమ్మా..! అయితే అమ్మ నీకో మాట సెప్పమంది. పెళ్లి ముందునాడు, పెళ్లినాడు, తర్వాత రోజు మూడ్రోజులు మీ ఇంటికి పడుకోటానికి వత్తారంట పెళ్లికొచ్చిన సుట్టాలు. అదేలే.. మా అమ్మమ్మా.. అత్తయ్యా.. ఆళ్లందరూ వచ్చేరు గదా.. ఆళ్ళందరూ వత్తారనుకుంటా..’’’
‘‘సెప్పాలేటే ఇదిగూడాను.. ఎప్పుడో నవ్వారు ఉడికిచ్చేసుకుని మంచాలన్నీ నేసేయిచ్చేను.. దుప్పట్లు గూడా ఉతికేసి తెచ్చేసేడు మడేలు. రేపు గోడలకి సున్నాలు ఎత్తాకి రమ్మన్నాం..’’
‘‘మీ ఇంట్లోనూ ఓ పెళ్లిలాగే ఉందైతేనీ..’’ సంభ్రమంగా అంది రేవతి.
‘‘మరి కాదేటి? ఊళ్ళో ఆడబిడ్డకి పెళ్లిజేసి అత్తారింటికి సాగనంపాలంటే ఊరంతా తలో సెరుూ్య ఎయ్యొద్దా?’’ అని నవ్వి.. ‘‘రేపు నీ పెళ్ళైనా అంతే..’’
‘‘ఊరుకో.. పెద్దమ్మా..’’ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడగా పరిగెత్తిన రేవతి.. అంతలోనే ఎనక్కొచ్చి..
‘‘పెద్దమ్మా..! సెప్తుం మర్సిపోయేను.. ఆ నాల్రోజులూ పొయ్యి ముట్టిచ్చొద్దంది అమ్మ. పడుకున్న సుట్టాలతోపాటు అందరికీ టిఫిన్లు, కాఫీలు పంపిత్తానని సెప్పమంది’’
‘‘ఆ ఇప్పణ్ణుంచీ ఎందుకు మీయమ్మ సేదత్తంగానీ! పెళ్లినాడొత్తాంలే’’
‘‘అమ్మో.. నాకు తెల్దు.. మళ్లీ నేను సెప్పలేదంటది’’
***
తిన్న కంచాలు తూవులో పడేసి పండు వెనె్నల్లో ఆరుబయట మంచాలమీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లల్లా.. దొడ్డి తలుపు చప్పుడై తలెత్తి అటు చూశారు.
పట్టుచీరల రెపరెపలకంటే ముందే ముక్కుపుఠాల్ని చేరిన సెంటు వాసన పెళ్ళోళ్లని చెప్పకనే చెప్పగా ‘‘నున్నోరు భోజనాలకి పిలుత్తాకనుకుంటా..’’ అంటూనే లేసి కూచ్చుంది సుభద్రమ్మ.
‘‘సుభద్రక్కా! బాగున్నావా? ఎన్నాళ్లైందో సూచి..’’ నవ్వుతూ అంది సేతిలో కుంకం భరిణెతో.. మంచాల దగ్గరకంటూ వచ్చిన పెళ్లికూతురు మేనత్త మంజుల సుభద్రని చూసి నవ్వుతూ...
‘‘మంజూ.. నువ్వా? ఎప్పుడొచ్చేవ్? రా కూచ్చో..’’ అంటూ వెనక్కెళ్ళి దుప్పటి సరిచేస్తానే మంజుల కూడా వచ్చినావిడ ఎవరాని ఒక కంట సన్నగా పరిశీలిస్తూ కూర్చోమని ఆహ్వానించింది.
‘‘అమ్మో..! ఇప్పటికే చీకటడిపోయింది.. ఇంకా ఎల్లాల్సిన ఇళ్లు చాలానే ఉన్నాయ్..’’ అంటూ దగ్గరకంటా వెళ్లి బొట్టు పెట్టి..
‘‘పొయ్యి ముట్టిచ్చద్దని చెప్పమన్నారు అమ్మ, వదినా. ఖాళీ వుంటే ఒకడుగు తనే వేద్దామనుకుంది వదిన. కుదరలేదు’’.
‘‘ఆ.. ఎక్కడ కుదురుద్దిలే..! పెళ్లంటే మాటలా మరి?’’
‘‘పిల్లలేం చదువుతున్నరు మంజూ..’’ చానాళ్లైందేమో.. సంభ్రమంగా మంజులనే చూస్తా అంది సుభద్ర.
‘‘పెద్దోడు ఇంజనీరింగ్‌లో చేరాడు అక్కా.. చిన్నోడు ఇంటర్ ఫస్టియర్.. అత్తయ్యెలా ఉంది? ఆరోగ్యంగా తిరుగుతుందా?’’
‘‘ఆ.. బాగానే ఉన్నారు. మా బావగారి వాటాలో ఉన్నారు. ఎలాగూ అటెల్తావ్ గదా. కనపడతారేమో! ఇంకా పడుకునుండరు..’’
‘‘బావయ్యేడి..?’’
‘‘ఇపుడే తిని బయటికెల్లేరు. మీ ఇంటికాడే ఉన్నారేమో..! ఓసారొచ్చి కనపడమని పెద్దనాన్న కబురెట్టారంట’’
‘‘సరే.. అక్కా మరి. టిఫినూ, కాఫీల కాడ్నించీ అక్కడే అని, పొయ్యిలో నిప్పెయ్యద్దని మరీ మరీ చెప్పమంది అమ్మ..’’
***
పెళ్లి రేపనగా రాత్రి తొమ్మిదిన్నరకి..
‘‘సుండ్రోరు సూరయ్యమ్మగారు పాలిచ్చేరండి..’’ అక్కడున్న పెద్దాయనకి.. పాల తపేలా అందిస్తా అన్నాడు ఆ కుర్రోడు..
వాటిని తీసుకుని అక్కడే వున్న తెల్లగా తోమిన ఇత్తడి గుండుగలో వున్న పాలల్లో పోసేసి ఖాళీ చెంబు తిరిగిచ్చేసేడతను వెనుకనున్న మరో కుర్రాడికేసి.. ‘అవెవరు పంపా’రన్నట్టుగా చూస్తా.
‘‘రాంబాబుగారి పాలేర్నండి...’’
‘‘ఏ రాంబాబు?’’
‘‘ఆలపాటోరి రాంబాబుగోరండి..’’
ఆ మర్నాడు మరో రెండు గుండిగలు తెప్పిస్తే తప్ప సరిపోలేదు ఊరోళ్ళు పంపిన పాలకీ, పెరుక్కీ.
***
‘‘అరేయ్ ఈరేసూ.. పందిరి ఇప్పేసిన తాటాకులన్నీ మేటెట్టు.. ఏగోరింట్లో పెళ్ళుంది గదా! టాట్టరు పంపుతానన్నాడు. ఎక్కిచ్చాల. అన్నట్టు ఆ పురికొస ఉండగట్టి గూట్లో బెట్టి ఎండిపోయిన మావిడాకులు కూడా గుంటల్లో అరిటాకుల మీదేసేసి పారతో మట్టోసి గుంట పూడ్సెయ్యండి..’’
‘‘అలాగేనయ్య..’’
‘‘బంతిసాపలూ, ఇత్తడి గళాసులూ అన్నీ ఎవరియ్యాళ్లకి అప్పజెప్పేసేవా?’’
‘‘అప్పజెప్పేసేనండి.. లెక్కట్టుకున్నారు. ఒకటి తక్కువైందంట..’’
‘‘ఏదోటి సూసి ఇత్తావని సెప్పకపోయేవా?’’
‘‘అలాగే సెప్పేనండి..’’
‘‘సర్లేగానీ.. తాటి నార ఏదన్నా పుల్లముక్క తీసుకుని సుట్టి ఓ సోటెట్టు..’’
***
‘‘పెళ్ళైన కాడ్నీంచీ పిల్లసారెతో అత్తారింటికి ఎల్లేదాకా. అడుగడుక్కీ ఊళ్ళోని ఎంతమంది తలో చెరుూ్య వేస్తే అయ్యేను పెళ్లి? ఆ చెయ్యి వెయ్యటంలో ఎంత సహకారం, ఆ హడావిడిలో ఎంత సరదా.. ఎంత అచ్చటా, ఎంత ముచ్చటా? ఏవీ ఆ రోజులు.. పైగా అరిటాకులు కూడా నేల్లో కలిసిపోయేవే? ఒక్కటంటే ఒక్కటైనా వ్యర్థం ఉండని ఆ పెళ్లిలో, ఆ సంప్రదాయాల్లో ఎంత అర్థం, అనురాగం?’’ నిట్టూర్చాడతను. అంతలో..
మిన్నంటిన కుక్కల అరుపుల్తోపాటు కొడుకు పిలుపు.. ‘‘నాన్నా.. కునుకట్టిందా?’’ అంటూ.
‘‘లేదురా..! నిద్దరట్తలేదు. అయ్యన్నీ అలా పడేసేరేమో.. ఒకటే రొద, వాసనా..! గట్టిగా గాలేత్తే పైక్కూడా ఎగిరొచ్చేత్తాయేమో ఆ ప్లాస్టిక్కు పళ్ళేలు.. అని భయం..’’ అన్నాడు కొడుకొచ్చాడని లేచి కూర్చుంటా..’’
‘‘అద్సరేగానీ.. పెళ్ళోళ్ళు ఫోన్ చేసేరు నాన్నా?’’ ఇంత ముఖం చేసుకుని అన్నాడు రామారావు కొడుకు ... తండ్రితో.
‘‘ఆ.. ఏటో సంగతి..?’’ కొడుకెనక్కే చూస్తా అన్నాడు ఏం చెప్తాడా అని..’’
‘‘ఏవుంది? నిశ్చయ తాంబూలాలకి డేట్ పెట్టించమన్నారు పంతులుగారితో మాట్టాడి..’’’
‘‘సంతోషం. నాదో మాటరా?’’
‘‘ఏంటి నాన్నా..?’’
‘‘మనూళ్లో చేద్దాంరా పెళ్లి... నాకిలా నచ్చుతుల్లేదు..’’ అన్నాడు మొన్న పెళ్ళైన ఇంటికేసి.. ఎంగిలి పళ్ళాలకేసి మార్చి మార్చి చూస్తా..’’
‘‘ఊళ్ళో మాత్రం అప్పట్లాగే ఉన్నారా నాన్నా? వాళ్ళూ చాలా నేర్చుకున్నారు కదా..!’’
‘‘నేర్చుకుంటే నేర్చుకున్నార్లే.. మళ్లీ మనల్ని చూసి మారతారేమో.!’’ అన్న తండ్రి మాటకి కొడుకింకా ఏమీ బదులివ్వకుండానే...’’
‘‘ఎందుకు మారరు? ఆళ్లే మారతారు. రోళ్ళూ, రోకళ్ళూ ఒక మూల పడేడుస్తున్నాయ్.. పదండి పని చెప్దాం..’’ భర్త మాటకి వత్తాసుగా అంది అపుడే అక్కడికి వచ్చిన సీతమ్మ, ఇద్దరికీ చెరో టీ గ్లాసూ అందిస్తా.
‘‘అలాగేనమ్మా!..’’ అన్నాడు కొడుకు తల్లిదండ్రుల ముఖాల్లోకి పొంగుకొచ్చిన ఆనందాన్ని అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తూ..
కుక్కల అరుపులు భజంత్రీల మోతలా అనిపించాయి రామారావుకి.

===============================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-కన్నేగంటి అనసూయ