డబ్బు రహస్యం చెప్పే కథ
Published Saturday, 19 January 2019డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు కాదు లేనప్పుడు దాని శక్తి ఏంటో మనకు తెలిసొస్తుంది. డబ్బు శక్తి ఏంటో తెలిసినప్పుడు దానికి విలువ పెరుగుతుంది. చాలా మంది జీవితం సగం గడిచిపోయాక, పరిస్థితి తమ చేయి దాటి పోయిన తరువాతనే డబ్బు విలువ గ్రహిస్తారు. జీవితం ముగింపు దశకు చేరుకున్న వారికి డబ్బు విలువ తెలియడం కన్నా, జీవితం ప్రారంభించే సమయంలోనే డబ్బు విలువ తెలిస్తే ఎక్కువ ప్రయోజనం.
డబ్బు శక్తి ఎంతో మనకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. డబ్బుకు సంబంధించిన రహస్యం మీకు తెలుసా? డబ్బు డబ్బును సంపాదిస్తుంది. ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసా? ఎలా సంపాదిస్తుందో తెలుసా? డబ్బు డబ్బును సంపాదించే రహహ్యం గురించి అద్భుతమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది.
ఒక రాజు తన మంత్రితో కలిసి చదరంగా ఆడుతుండగా, దర్బారులోకి ఒక తెలివైన కవి ప్రవేశిస్తాడు. తన కవిత్వంతో రాజు అభిమానాన్ని సంపాదిస్తాడు. సంతోషంగా ఉన్న రాజు కవిగారూ మీకేం కావాలో కోరుకోండి అంటాడు. కవి వౌనంగా ఉంటే, రాజు కవిగారు సందేహించాల్సిన పని లేదు. ఈ రాజు ఒకసారి మాట ఇస్తే కట్టుబడి ఉంటారు. మీ ఇష్టం మీరేం కోరుకున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. రాజు ఆడుతున్న చదరంగం వైపు కవి చేయి చూపిస్తూ మహాజా! నాకేమి పెద్ద కోరికలు లేవు. మీకు ఇష్టం అయితేనే నేను కోరుకున్నన్ని బియ్యపు గింజలు ఇవ్వమని కోరుతాడు. రాజు పక పక నవ్వి. కవీ ఎంతటి అమాయకుడివయ్యా మహారాజును అడగాల్సిన కోరికేనా ఇది అని ప్రశ్నిస్తాడు.
మహారాజా మీరు ఇస్తానని మాటిచ్చారు. మీకు నచ్చితేనే లేకపోతే లేదు అంటాడు.
రాజు నవ్వి మాటంటే మాటే సరే ఎన్ని బియ్యం గింజలు కావాలో చెప్పు అంటాడు. కవి అమాయకుడు అని జాలి చూపుతూ.. మీరు ఆడుతున్న చదరంగంలో ఎన్ని గళ్లు ఉన్నాయో వాటికి తగినట్టు నాకు బియ్యం గింజలు ఇవ్వండి. మొదటి గడిలో ఒక బియ్యపు గింజ ఇవ్వండి. అలా ప్రతి గడిలోనూ రెట్టింపు చేస్తూ పోవాలి. అంటే రెండవ గడిలో రెండు బియ్యపు గింజలు, మూడవ గడిలో నాలుగు గింజలు, నాలుగవ గడిలో ఎనిమిది, ఐదవ గడిలో పదహారు ఇలా రెట్టింపు చేస్తూ పోవాలి అని కోరుతాడు. నువ్వేంతటి అమాయకుడివి కవి బియ్యపు గింజల కోరిక కూడా ఒక కోరికేనా అని నవ్వుతాడు. మంత్రి రాజువైపు చూసి మెల్లగా మహారాజా కవి అమాయకుడు కాదు గడుసువాడు మన రాజ్యానికి ఎసరు పెడుతున్నాడు అని హెచ్చరిస్తాడు. చదరంగానికి 64 గడులు ఉంటాయి. ప్రతి గడి నుంచి అలా రెట్టింపు చేస్తూ పోతే దేశంలోని ధాన్యాగారాలు అన్ని ఇచ్చేసినా సరిపోవు. మంత్రి లెక్క వివరించే సరికి రాజుకు మతిపోయినంత పనవుతుంది. ఆ బియ్యాన్ని కేజీల్లా లెక్కించి ధర కడితే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి. చిత్రంగా అనిపించవచ్చు. కానీ క్యాలుక్యులెటర్ తీసుకుని లెక్క వేసి చూడండి ఆశ్చర్యం కలుగుతుంది. 64 గడులకు సరిపోయే బియ్యం రాజు ఇవ్వలేడా అనిపిస్తుంది కానీ తీరా లెక్క చూస్తే కళ్లు తిరుగుతాయి. ఈ కథలో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్. అంటే చక్రవడ్డీ రహస్యం. కంపౌండింగ్ పవర్‌ను ఐన్‌స్టిన్ లాంటి వారు ప్రపంచంలో ఎనిమిదవ వింత అన్నారు.
ఉద్యోగంలో చేరినప్పుడు పిఎఫ్ రిటైర్ అయ్యేనాటికి కొండలా పెరగడం వెనుకు రహహ్యం ఇదే. పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఓ పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే వడ్డీకి వడ్డీ లభించి పెద్ద మొత్తం అవుతుంది. ఇదే సూత్రం ప్రకారం ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే ఎంతో కొంత ఇనె్వస్ట్ చేస్తే మన ఇనె్వస్ట్‌మెంట్‌తో పాటు వడ్డీకి సైతం వడ్డీ లభించి సంపద పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే, 50 ఏళ్ల వయసులో ఓ 50 లక్షలు అయింది అనుకుందాం. మరో ఐదేళ్ల పాటు అలానే ఉంచితే ఆ 50 కాస్తా కోటి రూపాయల వరకు కావచ్చు. అంటే 25 నుంచి 50 వరకు పాతికేళ్ల పాటు చేసిన ఇనె్వస్ట్‌మెంట్‌కు మరో ఐదేళ్లు కలిపితే అది రెట్టింపు అవుతుంది. చక్రవడ్డీలోని మహత్తు ఇది. ఎంత త్వరగా ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే, రిటైర్‌మెంట్ నాటికి అంత భారీ మొత్తం చేతిలోకి వస్తుంది.
కష్టపడితేనే సంపద అంటారు. కష్టం అంటే ఏమిటి? నిజానికి కష్టం కంటే కూడా ఇక్కడ తెలివి, డబ్బుగురించి అవగాహన ముఖ్యం. కష్టపడిన వారే సంపన్నులు అంటే ఇంట్లో పనిమనుషులు, భవన నిర్మాణ కార్మికులు, రిక్షాకార్మికులు పడినంత కష్టం ఎవరూ పడరు. ఆ పనులతో వాళ్లు సంపన్నులు అవుతారా? అలా ఎంత కాలం కష్టపడినా కారు. ఐతే తెలివిగా వ్యవహరిస్తే వారు కూడా సంపన్నులు అవుతారు. అవుతారు కాదు చాలా మంది అలా ఐనవారు ఉన్నారు. తమ కోసం తాము కష్టపడి పని చేయడమే కాదు. తాము సంపాదించిన డబ్బు తమ కోసం పని చేసేట్టు తెలివిగా వ్యవహరించిన వారే సంపన్నులు అవుతారు. తన కోసం తాను కష్టపడడం కాదు. తన కోసం తన డబ్బు పని చేస్తే సంపద చేకూరుతుంది. స్విగ్గిలో ఆర్డర్‌పై ఇంటికి ఆహార పదార్థాలు తెచ్చి ఇచ్చే కుర్రాడికి 30 రూపాయలు వస్తాయేమో కానీ స్విగ్గి అనే ఆలోచన చేసిన వ్యక్తికి లక్షల్లో ఆదాయం వస్తుంది. డబ్బు సంపాదనకు కష్టం ఒక్కటే సరిపోదు. కష్టానికి మించి తెలివి, డబ్బు ఎలా సమకూరుతుంది అనే అవగాహన అవసరం.