మరింత ముందుకు..
Published Saturday, 12 January 2019జీవులన్నిటిలోకీ మనిషి ప్రత్యేకం అన్నది మామూలు మాట. అది చెప్పడానికి నేను అవసరం లేదు. అందరికీ ఆ సంగతి అర్థమయింది. కనుక నేను పని గట్టుకుని మనుషులలో ఎవరికి వారే ప్రత్యేకం అని ఆధారాలతో సహా వారాలుగా చెపుతున్నాను. ఎన్నో ఉదాహరణలు చూపించాను. మీరు ఇప్పటివరకు ఈ అంశం గురించిన ముక్కలు చదవకున్నా ఇక్కడ మొదలుపెట్టి చదవండి.
మన శరీరంలో మనకన్నా ఎక్కువగా సూక్ష్మజీవులు ఉన్నాయంటే నమ్మగలరా చెప్పండి. ఇవి ఎక్కడో ఉండే సూక్ష్మజీవులు కావు. మన శరీరంలో ఉండేవే. ఈ విషయం మనకు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదేమో కానీ, జెరెమీ నిక్సాన్ అనే పరిశోధకుడు ‘నీవు కేవలం 0.7 శాతం మాత్రమే మనిషివి. మిగతాదంతా సూక్ష్మజీవులే ఉన్నాయి నీ శరీరంలో’ అన్నాడు. శరీరంలో మన శరీరానికి సంబంధించిన కణాల సంఖ్యకు, పది రెట్లు ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటే మరి ఆ మనిషి మనిషికన్నా సూక్ష్మజీవుల కుప్పలు అంటేనే బాగుంటుంది. మన శరీరంలో ఉండే జన్యువులు సుమారు 23వేల ప్రాంతం. కానీ 33 లక్షల జన్యువులు సూక్ష్మజీవులకు సంబంధించినవి మన శరీరం లోపల ఉన్నాయి. వెయ్యికి పైగా రకాల సూక్ష్మజీవులు మన శరీరం లోపల, బయట బతుకుతున్నాయి. ప్రతి వ్యక్తిలో కనీసం 150 రకాలు ఒక్క పేగుల్లోనే ఉంటాయి. మిగతావి ఒంటి మీద ఉంటాయి.
ప్రతి వ్యక్తి శరీరంలో ఉండే సూక్ష్మజీవులు రకాలు ప్రత్యేకమయిన కలయికతో గుర్తించడానికి అనువుగా ఉంటాయి. చర్మం మీద ఉండే సూక్ష్మజీవులే ఎవరికి వారిని వేరుచేసి చూపడానికి తగినంత వరకు వేరువేరుగా ఉంటాయి. పైగా వయసు పెరిగినా సరే ఈ ఒంటి సూక్ష్మజీవులు మారకుండా ఆశ్రయించి ఉంటాయి.
మన శరీరం మీద ఇన్ని సూక్ష్మజీవులు ఉన్నాయంటే, మనం తాకిన ప్రతి వస్తువు మీదకు అవి కూడా చేరుకుంటాయి. మీ చేతి సూక్ష్మజీవులు మీరు చదువుతున్న పుస్తకానికి అంటుతున్నాయి. అవి అక్కడ ఒకటి, రెండు వారాల దాకా బతికి ఉంటాయి. ఒకే రకంగా ఉండే కవలల్లో కూడా ఈ సూక్ష్మజీవులు వేరువేరుగా ఉంటాయి. అంటే మీరు ఈ పుస్తకం చదివారని, మీ స్వంత సూక్ష్మజీవుల ఆధారంగా తెలుసుకునే వీలు ఉందని అర్థం. అవును, అవి నిజంగా మీ స్వంత సూక్ష్మజీవులే.
ఒక వ్యక్తి శరీరంలో, పైన ఉండే సూక్ష్మజీవుల ఆధారంగా ఆ వ్యక్తిలోని జీవచర్యలు కూడా వేరువేరుగా ఉండే వీలు ఉంది. అందరిలోను జీవరసాయనాలు ఒకే రకంగా ఉంటాయి. కానీ ఈ సూక్ష్మజీవుల జీవ రసాయనాలు వేరువేరుగా ఉంటాయి. శరీరంలో స్వంత రసాయనాలకన్నా సూక్ష్మజీవుల రసాయనాలు ఎక్కువ కనుక వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సూక్ష్మజీవుల చర్య ద్వారా ఎన్నో రసాయనాలు పుడతాయి. వాటిలో వైవిధ్యం ఉంటుంది. కొలెస్టరాల్, స్టెరాయిడ్‌లు ఇందుకు ఉదాహరణలు.
మనిషి శరీరంలో వేలాది రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ చర్యలో పాల్గొనే రసాయనాలు కూడా వేలాదికన్నా ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఇక మానవ కణాలతోపాటు సూక్ష్మజీవులు కూడా అదే రకంగా చర్యలను కొనసాగిస్తాయి. ఈ రెండు రకాల చర్యల మధ్యన సంబంధాలు కూడా ఉంటాయి. ఈ రకంగా మనిషి శరీరంలో వైవిధ్యానికి చక్కని ఆధారం ఏర్పడుతుంది.
ఇక శరీరం తీరు గురించి చూడవలసి ఉంది. మనిషి మరెన్నో మృగాలకన్నా మిన్నా...!
ఎన్నో జంతువులతో పోలిస్తే మనిషి ఆకారం చాలా చిన్నది. అయినా చాలా విషయాల్లో మనిషికి చేతనయిన పనుల జంతువులకు చేతకావడంలేదు.
మానవులకు ప్రత్యేకతను ఇచ్చిన శరీరం గురించి మానవులకే అర్థం కాలేదు. మొదట్లో కేవలం మెదడు కారణంగానే ప్రత్యేకత అనుకున్నారు. శరీరంలోని భాగాలను గురించి అంతటా పట్టించుకోలేదు.
కానీ మెదడు ఒక్కటే సాధించలేని విషయాలను శరీరం సాధించగలిగింది. ఈ సంగతి అర్థం కావటానికి చాలాకాలం పట్టింది. నిజానికి మన శరీరాలు చాలా అసాధారణమయినవి. మిగతా జంతువు వలె కాక మన ఒంటి మీద వెంట్రుకలన్నీ తగ్గిపోయాయి. అవి తల మీద మాత్రమే మిగిలాయి. మనం నిటారుగా నడుస్తూ బతకడం నేర్చాము కనుక ఈ పద్ధతి వచ్చింది. మరికొన్ని కారణాల వల్ల తల, మెదడు పెద్దవిగా మారాయి. ఇక తెలివి కూడా ఎక్కువయింది. మొత్తానికి ఈ రకంగా మనిషి ప్రత్యేకత మొదలయింది, అనవచ్చు. శరీరంలోని అసాధారణమయిన అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళితే ఇంతకు ముందు తెలిసినవే అయినా కొన్ని సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.
మనుషులు ప్రత్యేకత గలవారు అన్న మాట మామూలు అయింది. కానీ శరీరపరంగా మిగతా జంతువుల ముందు మనిషి నిలువలేక పోయాడు. దగ్గరి బంధువు అనుకున్న చింపాంజీ భారీ మనిషితో పోల్చినా నాలుగంతలు భారీగా ఉంటుంది. మనకంటే ఎన్నో జంతువులు ఎక్కువ దూరం దూకగలుగుతాయి. ఊడలు పట్టుకుని ఊగ గలుగుతాయి. పరుగు విషయంలో కూడా మనిషి వేగం అంతంత మాత్రమే. మనుషులను కూడా కలిపి జంతువు అన్నింటికీ ఆటల పోటీలు పెడితే అందులో మానవజాతి అందరికన్నా తక్కువ మెడల్స్ సంపాదిస్తుంది. అందులో అనుమానం లేదు. మిగతా జంతువుతో పోటీ పడలేక పోయినంత మాత్రాన మనిషిని చిన్నచేసి చూడడం మంచి పద్ధతి కాదు. ఒకటి, రెండు విషయాలలో మిగతా జంతువులకు లేని శక్తి మనిషికి ఉంది. ఈ రెండు విషయాలలోను అటు శరీర శక్తితోబాటు, దాని నిర్మాణం కూడా ప్రత్యేకంగా సహాయం చేస్తుంది. శరీరంలో ఇతర జంతువులకు లేని చిత్రమయిన ఏర్పాట్లు ఉన్నాయి కనుకనే మనిషి జాతికి మిగతా జంతువుల మీద అధికారం సంపాదించే వీలు కలిగింది.
పరుగు విషయంలో మిగతా జంతువులతో మనిషి పోటీ పడగలుగుతాడు అంటే, నమ్మకం కుదరకపోవచ్చు. ఒలింపిక్ పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ గంటకు 45 కిలోమీటర్లు పరుగెత్త గలుగుతాడు. అది అతను సాధించిన అన్నిటికన్నా ఎక్కువ వేగం. అయితే చిరుత పులులు చాలా సులభంగా అంతకు రెండంతల వేగాన్ని అందుకుంటాయి. గ్రే హౌండ్ కుక్కలు, గుర్రాలు, కొన్ని చింపాంజీలు కూడా బోల్ట్‌ను ఓడించగలుగుతాయి. ఒలింపిక్స్‌లో కిలోమీటర్ పందెన్ని అరగంటకు తక్కువ సమయంలో గెలుస్తున్నారు. రేస్ గుర్రాలు మాత్రం ఆ దూరాన్ని ఇరవై నిమిషాల్లో దాటగలుగుతాయి. ఈ పద్ధతి చూస్తే మరి మనిషి పరుగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం కనిపించదు. కానీ పట్టుదలగా ఎక్కువ దూరాలు పరుగు తీయవలసిన చోట మనిషి బలం బయటపడుతుంది. మారథాన్ అనే పరుగు పోటీలో మనిషి శక్తి పరీక్షకు వస్తుంది. బాగా శిక్షణ పొందిన పరుగు వీరుడు గంటకు ఇరవై కిలోమీటర్ల ప్రకారం కొన్ని గంటలపాటు పరుగు పెట్టగలుగుతాడు. ఈ రకంగా ఓపికగా ఎక్కువ దూరం పరుగుపెట్టే జంతువులు కొన్ని మాత్రమే ఉన్నాయి. అడవి కుక్కలు, జీబ్రాలు, జింకలు, మరి కొన్ని రకాలు మాత్రమే ఎక్కువ దూరాలు పరుగు పెడతాయి. చిరుతలు ఎక్కువకాలం పరుగెత్తలేవు.
మనిషి లేదా మరొక జంతువు చాలా దూరం, చాలాసేపు పరుగెత్తాలంటే శరీరంలో కొన్ని ఏర్పాట్లు ఉండాలి. లక్ష సంవత్సరాల నాడే మనిషి అరికాళ్లు, కాళ్లు, తరువాత పిరుదులు, వెనె్నముక, చివరకు ఎదలోని ఎముకల గూడు అందుకు తగినట్టు మారాయి. ఎక్కువ దూరం పరుగెత్తడానికి అనువుగా మనిషి శరీరం మారడానికి కారణంగా వేటను పరిశోధకులు సూచిస్తున్నారు. వేటాడదలచుకున్న జంతువును మనిషి అది అలిసిపోయేదాకా తరిమాడట. ఇక పరుగుతీయలేని పరిస్థితి వచ్చినప్పుడు జంతువును చంపడం సులభం అయింది. ఇక కుక్కలు, దుమ్ములగొండ్లతో పోటీ పడి పరుగు పెట్టి జంతు శరీరాలను వశం చేసుకోవడం కూడా మనిషికి వీలయింది. మొత్తానికి ఎక్కువ దూరం పరుగెత్తినందుకు మనిషికి మంచి తిండి దొరికింది. ఆ తిండి కారణంగా శరీరం, మెదడు, రెండూ పెరిగాయి.