చీకటి వెలుగులు
Published Saturday, 5 January 2019రాత్రి అంటే పగలు అనే తల్లికి అప్పుడే పుట్టిన నల్లని బిడ్డ. ఆ పాప నిద్రలేస్తుంది అన్న భయంతో లక్షలాది నక్షత్రాలు చుట్టూ చేరి నిశ్చలంగా నిలబడి చూస్తూ ఉన్నాయి, అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. ఆయన మరీ భావుకుడు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక రాత్రి పుట్టింది. మధ్యరాత్రి కొత్త సంవత్సరం వచ్చింది అన్నారు కానీ మామూలుగానే తెల్లవారినట్టు ఉంది. అంతా మామూలుగానే జరుగుతుంది. మనిషికి మాత్రమే ఎక్కడలేని ఉత్సాహం. పట్టరాని ఆనందంతో పండుగ చేసుకోవడానికి మనిషికి ఏదో ఒక కారణం కావాలి. కనుక ఇది కూడా ఒక కారణం. ఏది కూడా కొత్తగా జరగనప్పుడు మరి కొత్తదనం ఎందులో వెతుక్కోవాలి? ప్రశ్న!
ఎవరో కాలాన్ని లెక్క వేసే పద్ధతి మొదలుపెట్టారు. చాలామంది అటువంటి పద్ధతులు మొదలుపెట్టారు. కానీ ఒకరి పద్ధతిని ఎక్కువమంది వాడుతున్నట్టు ఉన్నారు. ఇది మామూలుగా ప్రతిసారి వచ్చే చర్చ. కానీ కొంచెం ఎత్తుకు ఎగిసి, కాలాన్ని మరింత విస్తృతిలో చూడగలిగి, మరొక రకంగా పరిశీలన చేయవచ్చు. వెనుకకు తిరిగి చూడడాన్ని సింహావలోకనం అన్నారు. ఎందుకో? ఈ రకంగా వెనుకకు తిరిగి చూస్తే, అసలు ఏమీ కనిపించడం లేదు, అంటూ ఒక కవిత రాసినట్టు గుర్తు. కానీ సూత్రప్రాయంగా విషయాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని గురించి నెమరు వేసుకోవడానికి, సమీక్షించడానికి కొత్త సంవత్సరం తగిన సమయం.
ఒక సంవత్సరాన్ని కాక వంద సంవత్సరాల కాలాన్ని ఒకసారి పరిశీలించితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత శతాబ్ది అంటే 20వ శతాబ్ది మొదటి ఇరవై సంవత్సరాలలో ఈ ప్రపంచంలో చాలా అద్భుతాలు జరిగాయి. చాలామంది వ్యక్తులు గొప్ప పనులు చేశారు. అంతకు ముందు లేనివి కొన్ని రంగాలు మొదలయ్యాయి. కొన్ని రంగాలు అనుకోని మలుపులు తిరిగి కొత్త దారులకు అవకాశాన్ని ఇచ్చాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్న అంటే 21వ శతాబ్దపు తొలి రెండు దశకాల తీరుతెన్నులను గమనించిన వారికి బహుశా కొన్ని విషయాలు తోస్తాయి. వ్యక్తుల కృషికి గుర్తింపు బాగా తగ్గినట్టు ఉంది. ఇప్పుడంతా సామూహిక కృషి ఏ ఒక్కరికి గొప్పతనం మిగలకూడదు. చాలా మంది గొప్పవాళ్లు ఉంటారు. ఇది ఇప్పటి పరిస్థితి. నిజానికి తెలివి విలువ ఒక రకంగా తగ్గుతున్నదేమో అన్న భావం కూడా మిగలకపోదు. ముఖ్యంగా వ్యక్తుల తెలివి విలువకు అంతగా గుర్తింపు లేకపోవడం ఇప్పటి కాలపు పద్ధతి. ఏ విషయంలోనైనా వివరాలు పట్టని పరిస్థితి కూడా మొదలైంది. అది సాంకేతిక జ్ఞానం గాని, మరొక రంగం గాని వాడుకోవడమే కానీ అందులోని మెళకువలు, వెనుకనున్న యదార్థాలు ఎవరికీ పట్టనట్టు అనిపిస్తుంది. అన్నింటినీ వాడుకుంటే చాలు. అది పనిచేసే పద్ధతి గురించి పట్టించుకో నవసరం లేదు. అలాగని మరి ఇప్పటి చదువు మాత్రం అదే మార్గంలో సాగక, అంటే వాడుకోవడం గురించి కాక, ఇంకా పాతకాలం పద్ధతిలోనే, మూల విషయాలను చదవడం దగ్గరే ఆగిపోయి ఉంది.
గత శతాబ్ది మొదటి కాలాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఒక ఐన్‌స్టైన్, డార్విన్, ఫ్రాయిడ్, కార్ల్‌మార్క్స్ లాంటి వారంతా ఆకాశమంత ఎత్తున నిలబడి కనబడతారు. వాళ్లు ఈ ప్రపంచాన్ని మార్చిన తీరు గురించి ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వైజ్ఞానిక రంగంలో అప్పుడే లోపలికి తొంగి చూసే పద్ధతి మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే మొదలయ్యి మూడు తరాల పాటు అణువులు చీల్చుతూ లోపలికి తొంగి చూసిన వాళ్లు కనబడతారు. ఒక్క సైన్స్‌లోనే కాక అన్ని రంగాలలోనూ గత శతాబ్ది మొదటి రోజులలో ఉత్తుంగ శృంగాలు అనదగిన కొందరు వ్యక్తులు అంత ఎత్తున నిలిచి కనపడతారు. ఒక పికాసో గురించి చెబితే చాలు. చిత్రకళారంగంలో అప్పట్లో వచ్చిన కొత్త పోకడలను గురించి సులభంగా అర్థమవుతుంది.
సరిగ్గా ఆ సమయంలోనే ప్రపంచంలో రేడియో మొదలైంది. టెలిఫోన్ కూడా మొదలైంది. ఇవి రెండూ కలిసి సమాచార ప్రసారాన్ని మార్చిన తీరు మనందరికీ తెలిసిందే. అప్పట్లో రేడియో కనుగొన్న మనిషిని ఆకాశానికి ఎత్తారు. చరిత్రను మలుపులు తిప్పిన శాస్తజ్ఞ్రులు అంటూ పుస్తకాలు రాసుకున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ఇటువంటి ఒకానొక పుస్తకాన్ని నేను సంవత్సరం క్రితమే తెనుగీకరించి ఇచ్చాను. వాళ్లు ఇంకా అచ్చు వేయలేదు. అందులో ప్రసక్తికి వచ్చిన శాస్తజ్ఞ్రులంతా గత శతాబ్ది తొలి కాలంలో పనిచేసిన వారే. డీజిల్‌ను కనుగొన్న వ్యక్తి మొదలు మరెందరో ఆ పుస్తకంలో మనకు కనబడతారు. నిజానికి డీజిల్ అన్నది ఒక వ్యక్తి పేరు అని ఇప్పుడు చాలామందికి గుర్తులేదు. సరిగ్గా అదే పద్ధతిలో ఒక సెల్‌ఫోన్‌ను, ఒక రంగుల టెలివిజన్‌ను, ఇంటర్నెట్‌ను, వాట్సాప్ అనే ప్రసార పద్ధతిని కనుగొన్న మనిషి గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. గత శతాబ్దిలో ఒక్క డీజిల్ విషయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు మాత్రం అంతా సామూహిక విజ్ఞానమే. ఏ ఒక్క వ్యక్తికి గొప్పతనం లేదు. మొన్న మొన్నటి వరకు సినిమా రంగంలో కూడా పెద్ద పేర్లు అంటూ వినిపించేవి. హిందీ సినిమాల పేరు ఎత్తగానే దేవానంద్, దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్‌లను గురించి చెప్పిన తరువాత మాత్రమే మిగతా వారి ప్రసక్తి వచ్చేది. మన సినిమాలో కూడా మొన్న మొన్నటి వరకు ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్నార్ రాజ్యమేలారు. ఇప్పుడు చాలామంది కుర్ర నటులు బాగా నటిస్తున్నారు. వాళ్ల అందరి పేర్లు గుర్తు ఉండే అవకాశం కూడా లేదు. సంగీతం రంగంలో కూడా ఇటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. హిందీ సినిమాలో పాట పాడాలంటే ఒక మహమ్మద్ రఫీ, ఒక లతామంగేష్కర్, ఆ తర్వాతే మిగతా వారంతా. తెలుగులో ఒక ఘంటసాల, ఒక సుశీలమ్మల తరువాత మిగతా వారు ఎవరైనా! ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? ప్రపంచం మొత్తంలోనే ఇటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇందులో తప్పేమీ లేదు. అందరూ ఉన్నత శిఖరాలను ఇదే ఉంటున్నారు. ఇది ఒక ట్రెండ్ అంటున్నాను. అంతేకాని తప్పు పట్టడానికి నేను ప్రయత్నించడం లేదు.
గత శతాబ్ది మొదట్లో ప్రపంచ యుద్ధం జరిగింది. దాని ప్రభావంగా విశాల వర్గీకరణ మొదలైంది. రాజకీయంలో కొత్త పోకడలు కనిపించాయి. ప్రపంచ దేశాలు సమూహాలుగా విడిపోయాయి. అప్పటి సమూహాలకు ఇప్పటి తీరుకు ఎక్కడా పోలిక కనిపించదు. ఇక శతాబ్ది మొదట్లో చూస్తే ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెద్ద మాటతో చెప్పాలంటే ఒక రకమైన ప్రతిష్టంభన, మామూలుగా చెప్పాలంటే ఒక రకమైన గజిబిజి కనబడుతున్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. కానీ ఎవరు ఎంత సుఖంగా ఉన్నారు, ఎవరు ఎంత సౌకర్యంగా ఉన్నారు, అన్న ప్రశ్నలకు మాత్రం సులభంగా జవాబులు దొరకడం లేదు. అటు అమెరికాలో అధ్యక్షుడు ఉన్నాడు కానీ, అతనికి మంచి పేరు లేదు. రష్యాలో ఏమవుతున్నదో ఎవరికీ అర్థం కాదు. ప్రపంచం మొత్తం మీద చిత్రమైన అర్థంకాని పరిస్థితి కనబడుతుంది.
గత శతాబ్ది మొదటి కాలంలో సామ్రాజ్యవాదపు పద్ధతులు వెనుకకు తగ్గాయి. విక్టోరియనిజం వెనుకకు తగ్గింది. అప్పుడు వచ్చిన కొత్త ఆలోచనా విధానాన్ని మోడర్నిజం, నవీన వాదం అన్నారు. ఆ తరువాత పోస్ట్ మోడర్నిజం వచ్చింది. అంటే కొత్తదనం ఏమంత కొత్తగా లేదన్న భావన అందరికీ కలిగింది. మామూలు ప్రజలకు కూడా తమ గురించి తమకు అర్థం అవుతున్నట్టు స్ఫుటంగా కనబడుతున్నది.
గ్లోబలైజేషన్ అని శత్రువు ఏదో వచ్చినట్టు అందరూ భావించారు. కానీ ఆ విధానం కొంత మంచి కూడా చేసిందని అంటున్న వారు ఉన్నారు.
దేశానికి నాయకత్వం వహించడానికి గాని, కళా సాహిత్య రంగాలలో గాని, ఒకరిద్దరు పేరు చెప్పి అందరూ వాళ్ల వెనుక నడుస్తామంటే ఎవరికీ నచ్చడంలేదు. మళ్లీ మొదటికి వస్తే ఇప్పుడంతా సామూహిక వాదానికి, పద్ధతికి గౌరవం మెండు. ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే, ఒక వ్యక్తితో అవసరం లేదు. గూగులమ్మకు అన్ని సంగతులు తెలుసు. ఇది బాగుంది కానీ, గూగుల్ తెలివి ఎవరి సొంతం? వందలాది వేలాది మంది చెప్పిన సంగతులు అన్నింటిని ఒకచోట చేర్చి, జల్లెడ పట్టి, ఒక క్రమంలో పేర్చి ఉంచుకుంటుంది గూగుల్. ప్రశ్న అడిగిన మరుక్షణం తనకు తెలిసిన జవాబు ఏదో చెబుతుంది. తెలియకపోతే నాకు తెలియదు అని కూడా అంటుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా తనకు తెలియని విషయం గురించి ఇంత సులభంగా ఒప్పుకునే పద్ధతి ఏనాడూ లేదు. తెలివి విషయంలో, ఇతర చాకచక్యం విషయంలో, ఏ ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ప్రాముఖ్యత కాక, ఎక్కువమంది గొప్ప వాళ్లు ఉండడం అన్నది ఇప్పటి పద్ధతిగా మారిందని కనీసం నాకు తోచింది. కొత్త సంవత్సరంలో ఆలోచన మొదలుపెడితే, ఈ సంగతి మీకు చెప్పాలి అనిపించింది. నా పని నేను చేశాను. ఇక తరువాతి వంతు మీది. ఆలోచించండి! నా మాటను ఖండించండి! లేదా అంగీకరించండి! అంతేగాని చదివి పక్కన పెట్టకండి!