S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త నిర్ణయం (కథ)

అది ఒక జిల్లా పరిషత్ హైస్కూల్. సుమారు మూడు వందల మంది విద్యార్థులు చదివే ఆ పాఠశాలలో పది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పిల్లలందరికీ సైన్స్ టీచర్ సతీష్ అంటే చాలా ఇష్టం. అతను యువకుడు కావడం చేత విద్యార్థులతో చాలా స్నేహంగా ఉంటాడు. విద్యార్థులందరికీ అర్థమయ్యేలాగా పాఠాలను ప్రయోగాత్మకంగా చెబుతాడు.
సతీష్ ఎనిమిదవ తరగతికి క్లాస్ టీచర్. ఎప్పటిలాగే మొదటి పీరియడ్‌లో ఎనిమిదవ తరగతికి వెళ్లి పిల్లలకు హాజరు వేసి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా కనపడ్డారు కానీ, వారి ధ్యాస పాఠం మీద ఉన్నట్టు కనపడలేదు. అందుకు గల కారణాన్ని ఆరా తీశాడు. మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మొదలు కాబోతోంది. కనుక పిల్లలందరూ కొత్త సంవత్సర వేడుకల మీద దృష్టి పెట్టారని, గ్రీటింగ్ కార్డులు తయారుచెయ్యడం గురించి, కొత్త బట్టలు కుట్టించుకోవడం గురించి, జనవరి మొదటి తారీఖున కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షికారుకు వెళ్ల డం గురించి ఆలోచిస్తున్నారని తెలుసుకొన్నాడు. తన మనసులోని ఆలోచనలను అమలు చేయడానికి ఇదే సరియైన సమయం అని భావించాడు.
‘చూడండి పిల్లలూ! కొత్త సంవత్సరం వస్తోంది కదా! కొత్త సంవత్సరం మొదటి రోజున మనమందరం కొత్త బట్టలు వేసుకొని, అందరికీ శుభాకాంక్షలు చెప్పుకొని, బంధువులతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరుకొంటాం. అలాగే గడుపుతాం కూడా. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే. కాకపోతే ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా మీరందరూ వ్యక్తిగతంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మీరు తీసుకొనే నిర్ణయం మీలోని చెడ్డ అలవాట్లని తొలగించేదిగానూ, మీ భవిష్యత్తుకు ఉపయుక్తంగానూ ఉండాలి. దాన్ని సాధించడం కోసం మీరు ఈ ఏడాదంతా కష్టపడాలి. మీరు ఈ రోజంతా బాగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. రేపటి క్లాస్‌లో మీరు తీసుకొన్న నిర్ణయాలను, ఏర్పరచుకొన్న లక్ష్యాలను నాకు చెప్పాలి’ అని ముగించాడు.
* * *
మరుసటి రోజు క్లాస్‌లో పిల్లలందరూ మరింత ఉత్సాహంగా కనపడ్డారు. సతీష్ ఒక్కొక్కరినీ నిల్చోబెట్టి వారు తీసుకొన్న కొత్త నిర్ణయం గురించి, ఏర్పరచుకున్న కొత్త లక్ష్యం గురించి అడిగాడు.
‘నాకు ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉంది. కనుక కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి చదువుకోవాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పాడు హరి.
‘నేను చిన్నప్పటి నుండి లెక్కల్లో వెనకబడి ఉన్నాను. లెక్కల మాస్టారి సహాయంతో ఈ ఏడాది ఎలాగైనా లెక్కల్లో పురోగతి సాధించాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పాడు వేణు.
‘నాకు ఈత రాదు. ఎలాగైనా ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను’ చెప్పింది లత.
‘డబ్బులు వృథాగా ఖర్చు చేస్తానని మా నాన్న నన్ను తిడుతూ ఉంటారు. కనుక డబ్బులు పొదుపు చెయ్యడం అలవాటు చేసుకొంటాను’ చెప్పాడు ఫరూఖ్.
‘ఇంటి పనుల్లో మా అమ్మకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పింది వాణి.
‘మంచిమంచి పుస్తకాలు సేకరించి చదవాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పింది రేఖ.
‘నేను లావుగా ఉన్నానని స్నేహితులు ఆటపట్టిస్తూ ఉంటారు. కనుక చక్కటి వ్యాయామాలు చేసి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను’ చెప్పాడు శేఖర్.
‘గత ఏడాది జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయాను. ఈ ఏడాది మరింత సాధన చేసి జిల్లా స్థాయి జట్టులో చోటు సంపాదిస్తాను’ చెప్పాడు సూరి.
పిల్లలందరూ తాము తీసుకొన్న నిర్ణయాలు చెప్పారు. టీచర్ పిల్లల పేర్లు, వారు తీసుకొన్న నిర్ణయాలను వారి ముందే తన డైరీలో రాసుకొన్నాడు.
‘మీరు తీసుకొన్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వీటిని మీరు ఆచరణలోకి తీసుకొని వస్తే నేను మరింత సంతోషపడుతాను. ప్రతి నెలా ఒకటవ తారీఖున మీరు తీసుకొన్న నిర్ణయాల మీద నేను సమీక్ష నిర్వహిస్తాను. మీరు సాధించిన పురోగతి గురించి చర్చిస్తాను. ఈ సంవత్సరం మీలాగే నేను కూడా ఒక నిర్ణయం తీసుకొన్నాను. మన పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచాలని నిర్ణయించుకొన్నాను. అందుకు కావలసిన మొక్కలను నేను సేకరిస్తాను. వాటిని నాటడంలో, పాదులు తీయడంలో, నీళ్లు పట్టడంలో మీరందరూ నాకు సహాయం చెయ్యాలి’ చెప్పాడు మాస్టారు.
‘అలాగే మాస్టర్’ పిల్లలందరూ ముక్త కంఠంతో తమ అంగీకారాన్ని తెలిపారు.
పిల్లలూ! మీరు కూడా కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకొనే నిర్ణయాలు మీలోని చెడ్డ అలవాట్లని తొలగించేవిగాను, మీ భవిష్యత్తుకు ఉపయోగపడేవిగానూ ఉండాలి. కేవలం నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు, వాటిని ఆచరించడంలో శక్తివంచన లేకుండా కృషి చెయ్యాలి.

-పేట యుగంధర్ 94925 71731