S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అఖండ భారతం

రామశర్మ ఆయుర్వేద వైద్యుడు. ఎంతటి మొండి వ్యాధినైనా ఇట్టే తగ్గించగల మంచి నైపుణ్యం, హస్తవాసి గల వ్యక్తి. పట్నానికి దూరంగా ఉన్న చిన్న పల్లెటూరులో అతని నివాసం. ఆ ఊరులోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చి తమ అనారోగ్యాలకు మం దులు తీసుకొనేవారు.
తన ఊరికి సమీపంలో ఉన్న అడవిలోకి పోయి అక్కడ నుంచి వనమూలికలు సేకరించి తీసుకొని వచ్చి పుటం పెట్టి గుళికలు, ద్రవాలు తయారుచేసి వాటితో వైద్యం చేస్తూంటాడు. ఒకరోజు రామశర్మ అడవికి బయలుదేరుతుంటే భార్య దమయంతి ఇలా అన్నది.
‘ఏమండీ! మన అబ్బాయి సుబ్రహ్మణ్య శర్మకు కాలేజీ ఫీజు కట్టాలి. మన కూతురు గాయత్రికి ఏలూరు సంబంధం వారు తమ ఇష్టం తెలియపరిచారట. నిన్ననే నెట్‌లో చూసి మన సుబ్బు చెప్పాడు.’
‘నిన్న రాత్రి కోమటి బాపిశెట్టి గారి దగ్గర నుంచి కావలసిన పైకం మొత్తం తెచ్చి బీరువాలో పెట్టాను. వనమూలికలు తీసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాను. రేపు ఉదయమే మన కొడుకు కాలేజీ ఫీజు కట్టి, మధ్యాహ్నం ఏలూరు పోయి పెళ్లిచూపులకు వారిని ఆహ్వానించి వస్తాను. సరేనా! నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు’ అని భార్యతో చెప్పి పెద్ద చేతిసంచీ తీసుకొని అడవికి బయలుదేరాడు రామశర్మ.
* * *
తనకు అలవాటైన అడవి దారి కనుక త్వరత్వరగా రామశర్మ నడవసాగాడు. కొండలు, కోనలు, లోయలు, గుహలలో తిరుగుతూ కావలసిన మూలికలు, కాయలు, వృక్షాల వేళ్లు, చెట్ల బెరడులు, ఆకులు సేకరించుకొని సంచీలో వేసుకొన్నాడు. మధ్యాహ్నం తను తెచ్చుకొన్న అన్నం తిన్నాడు. క్రూరమృగాలు తిరిగే అటవీ ప్రాంతం. అందుకని ఎతె్తైన పెద్ద చెట్టు ఎక్కి మంచెలా చేసుకొని నడుం వాల్చాడు. బాగా అలసిపోయి ఉన్నందున కొద్దిసేపటికే గాఢనిద్రలోకి జారుకున్నాడు రామశర్మ.
చెట్టు కింద నుంచి ఏవో శబ్దాలు వినపడుతుంటే హఠాత్తుగా రామశర్మకు మెలకువ వచ్చింది. శబ్దం చేయకుండా లేత ఆకుల సందుల నుంచి కిందకు తొంగి చూశాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు విచిత్రమైన వేషధారణలో ఉన్నారు. అచ్చం తన తాతగారి వైద్య పుస్తకాలలో వర్ణించిన గ్రహాంతర వాసుల వలె ఉన్నారు. వారి మధ్య చిన్న జాడీ లాంటిది ఉన్నది. వారి భాష అర్థం కాకపోయినా వారి హావభావాలను పట్టి ఆ జాడీ గురించి గొడవ పడుతున్నారు అని అర్థమయింది రామశర్మకు.
అంతలో ఒక పులి గాండ్రించుకుంటూ అక్కడికి వచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి ఆ వ్యక్తులు ఇద్దరూ ఆ జాడీని అక్కడే వదిలేసి పక్కనే ఉన్న పొదలలోకి పారిపోయారు. కొద్దిసేపు ఆ పులి చెట్టు కింద తచ్చాడి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.
రామశర్మ నిదానంగా చెట్టు దిగి కిందకు వచ్చి జాడీని పరిశీలించి చూశాడు. వింతైన రంగులో ఆకర్షణీయమైన మూత బిగించి ఉంది.
రామశర్మ బలవంతంగా దాని మూత తీసి జాడీలోకి చూశాడు. వింతైన రంగులో కొద్దిగా ద్రవం ఉన్నది. ఎటువంటి వాసన రావడం లేదు. స్వతహాగా వైద్యుడు కనుక ఆ ద్రవం యొక్క రుచి పరీక్షించడానికి కొద్దిగా తాగాడు. కొద్దిగా పుల్లగా అనిపించింది. అంతేగానీ దేహంలో ఎటువంటి ప్రకోపము కలగలేదు. ఇంటికి పోయి తరువాత దీన్ని పరీక్ష చేద్దాము అని నిశ్చయించుకొని ఆ జాడీని తన సంచిలో వేసుకొని నడక ప్రారంభించాడు.
సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోతున్నాడు. ఆ రోజు తన దినచర్యను ముగించుకొన్నాడు. అయిదు నిమిషాల తర్వాత రామశర్మకు మెదడు మొద్దుబారుతున్నట్టు అనిపించింది. శరీరం తూలుతూ అడుగులు తడబడసాగాయి. ఎతె్తైన రాయిపై కూర్చోబోయి స్వాధీనం తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడి దొర్లుకుంటూ పోయి ఒక చీకటి గుహ లోపల గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ఇరుక్కొని విగత జీవుడిగా పడిపోయాడు.
* * *
రామశర్మ కళ్లు తెరిచేటప్పటికి బారెడు పొద్దెక్కింది. ‘రాత్రంతా తను ఒళ్లు తెలియకుండా పడి నిద్రపోయాడా? బహుశ ఇది ద్రవం యొక్క ప్రభావం అయి ఉంటుంది’ అని మనసులో అనుకొన్నాడు. గుహ లోపల నుంచి జాగ్రత్తగా కొండ మీదకు వచ్చాడు. తన వనమూలికలు సంచి కనపడలేదు. రాత్రి జరిగిన ప్రమాదంలో ఎక్కడో పడిపోయినట్లుంది. తను ధరించిన వస్త్రాలు పూర్తి జీర్ణావస్థ దశలో ఉన్నాయి. ఈ అవతారంలో ఊళ్లో ఎవరు చూసినా తనను ఎగతాళి చెయ్యటం ఖాయం. దయమంతి తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. త్వరగా ఇంటికి పోయి సుబ్రహ్మణ్య శర్మ కాలేజీ ఫీజు చెల్లించాలి. కూతురు గాయత్రి పెళ్లి సంబంధం విషయం మాట్లాడాలి అని ఆలోచిస్తూ పరుగులాంటి నడకతో తన ఊరికి బయలుదేరాడు రామశర్మ.
* * *
తన పెంకుటిల్లు స్థానంలో రెండంతస్థుల భవనం కట్టి ఉంది. ఇంటి ముందు మురికి కాలువ జీవనదిగా ప్రవహిస్తూ ఉండేది. అలాంటిది బ్రహ్మాండమైన సిమెంటు రోడ్డు వేసి శుభ్రంగా ఉన్నది. ఆ వీధి అంతా పూర్తిగా మారిపోయింది. అన్నీ పెద్ద పెద్ద భవంతులు వాటి ముందు పెద్ద కార్లు నిలిపి ఉన్నాయి. అసలు తను దారితప్పి వేరే ఊరికి వచ్చానా అని అనుమానం వచ్చింది రామశర్మకు.
వీధిగేటు తీసుకొని ఇంటి లోపలికి పోయాడు. వరండాలో గోడపై తన ఫొటో పెట్టి గంధపు చెక్కలతో చేసిన మాల వేసి ఉన్నది. ఈ తెలివితక్కువ వెధవలు తను బ్రతికి ఉండగానే ఫొటోకు దండ వేశారు. బుద్ధిలేకపోతే సరి అని మనసులో తిట్టుకుంటూ ‘దమయంతీ ఇలా బయటకు రా’ అని పిలుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు.
ఒక అమ్మాయి మూడు సంవత్సరాల చిన్నబాబును ఎత్తుకొని అక్కడకు వచ్చి ‘ఎవరండీ మీరు?’ అని రామశర్మను అడిగింది.
‘నా ఇంటిలో నుండి వస్తూ నువ్వు నన్ను పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతావా? ఎంత ధైర్యం? ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అసలు దమయంతి ఎక్కడ ఉంది? ఈ సుబ్బుగాడు ఎక్కడ చచ్చాడు. ఇంట్లోకి అడ్డమైన వారినందరినీ రానిస్తారు’ అని విసుక్కొన్నాడు.
‘ఏమండీ! ఏదో పెద్దవారు.. ఎండనపడి ఇంటికి వచ్చారు అని లోపలికి రానిస్తే మంచీ మర్యాద లేకుండా మా నాన్నమ్మను, మా నాన్నను అనరాని మాటలు అంటున్నారు. మర్యాదగా బయటకు నడవండి. లేకపోతే మా అమ్మను పిలుస్తాను’ అని బెదిరించి ‘అమ్మా ఇలా రా’ అని గట్టిగా పిలిచింది ఆ అమ్మాయి.
‘పిలవమ్మా పిలువ్. నీ సంగతి, మీ అమ్మ సంగతి ఇప్పుడే తేలుస్తాను’ అని మొండిగా అన్నాడు రామశర్మ.
‘ఏమిటే నీ అరుపులు. సాయంత్రం నీ ప్రయాణంలో హడావిడిగా ఉంటే’ అంటూ వంట గదిలో నుంచి ఆమె చీర కొంగుకు, తడి చేతిని తుడుచుకుంటూ వరండాలోకి వచ్చింది.
‘అమ్మా! ఈయనెవరో? నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావ్. మీ నాన్నకు బుద్ధి లేదు. నాన్నమ్మ ఎక్కడికి పోయింది?’ అని బెదిరిస్తున్నాడు అని ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి వచ్చిన ఆమెతో.
‘మీకు ఏమైనా మర్యాదగా ఉందాండీ. చూస్తే పైకి పెద్దమనిషిలా ఉన్నారు. మా ఇంటికి వచ్చి మా వారిని, మా అత్తగారిని దూషించే అధికారం మీకు ఎవరిచ్చారు?’ అని కోపంగా అందామె.
‘అసలు నువ్వు ఎవరవమ్మా ముందు చెప్పు?’ అని కోపంగా అడిగాడు రామశర్మ.
‘నా పేరు భారతమ్మ. నా భర్త పేరు సుబ్రహ్మణ్య శర్మ. ఇది మా కూతురు. పేరు మీనాక్షి దాని మగడు బంగ్లాదేశ్‌లో ఢాకా పట్నంలో చెన్నకేశవస్వామి వారి ఆలయ ప్రధాన పూజారిగా పనిచేస్తున్నాడు. ఇవి చాలా ఇంతకన్నా వివరాలు ఏమైనా కావాలా?’ అని వ్యంగ్యంగా అన్నది భారతమ్మ.
‘నువ్వు చెప్పేది వింటుంటే అదేదో విఠలాచార్య జానపద సినిమా చూస్తున్నట్లుగా ఉన్నది. నా కొడుకు వయసు నీ వయసులో సగం కూడా లేదు. అలాంటిది వాడు నీకు మొగుడు. ఈ పిల్ల మీ సంతానమా? మన దేశం యొక్క బద్ధశత్రువైన దేశంలో ఈ అమ్మాయి భర్త ఉంటున్నాడు. నాకు అంతా అయోమయంగా ఉంది. అసలు నాది బుద్ధితక్కువ. ఆ వెధవకు నా వైద్యవృత్తి నేర్పించక ఇంగ్లీషు చదువులు చదివించితే ఇలాంటి నిర్వాకాలు వెలగబెడుతున్నాడు. అసలు నా భార్య దమయంతికి బుద్ధి లేదు’ అని గట్టిగా విసుక్కోసాగాడు రామశర్మ.
‘మా అత్తయ్యగారు మీకు భార్య ఏమిటండీ? మీరేమైనా పిచ్చాస్పత్రి నించి పారిపోయి వచ్చారా? మా మామగారు పోయి 50 సంవత్సరాలు దాటింది. అదిగో ఆయనగారి ఫొటో’ అని చెప్పి గోడవైపు చెయ్యి చూపిస్తూ అన్నది భారతమ్మ.
‘నాకు పిచ్చి ఎక్కిందా? మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. నేను బ్రతికి, మీ ఎదురుగా ఉంటే చనిపోయాను అని అబద్ధాలు ఆడుతున్నారు. అసలు మా సుబ్రహ్మణ్య శర్మను రానివ్వండి. మీ అందరి పని చెబుతాను’ అని అన్నాడు రామశర్మ.
‘అడుగో! మా నాన్నగారు వస్తున్నారు. మీ సంగతి ఆయనే తేలుస్తారు’ అంటూ గేటు తీసుకొని లోపలికి వస్తున్న డెబ్భై సంవత్సరాల ముసలి వ్యక్తిని చూపిస్తూ అన్నది మీనాక్షి.
* * *
‘ఎవరండీ ఈ పెద్ద మనిషి. వచ్చిన దగ్గర నుంచీ ఒకటే గోల. మీరు అతని కొడుకట. అత్తయ్యగారు ఈయనగారి భార్య అట అని ఏవేవో అవాకులు, చెవాకులు పేలుతున్నాడు. ఇతగాడి సంగతి చూడండి’ అని భర్తతో అన్నది భారతమ్మ.
సుబ్రహ్మణ్య శర్మ దగ్గరకు వచ్చి రామశర్మను చూసి గుర్తు పట్టి ఆనందంతో గట్టిగా అరుస్తూ ‘నాన్నగారూ! ఇన్ని రోజులు మీరు ఎక్కడికి పోయారు?’ అని తండ్రిని కౌగిలించుకుని ఏడవసాగాడు.
ఈ దృశ్యాన్ని వింతగా ఆశ్చర్యంగా చూడసాగారు తల్లీ కూతుళ్లు.
‘ఇదేమిట్రా ఇలా ముసలివాడివైపోయావ్? జుట్టు అంతా తెల్లగా నెరిసిపోయింది. అమ్మ ఎక్కడికి పోయింది? చెల్లెలు గాయత్రి ఏది? వీళ్లు ఎవరు మన ఇంట్లో ఉన్నారు? ఒక్క రోజులోనే ఇన్ని మార్పులు జరిగాయా’ అని ఆదుర్దాగా అడిగాడు రామశర్మ.
‘ఒకరోజు కాదు నాన్నగారు మీరు మన ఇంటి నుంచి వెళ్లి 50 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు వనమూలికల కోసం అడవికి పోయి ఇదిగో ఇప్పుడు వచ్చారు. మీ కొరకు ఎన్నోచోట్ల వెదికాము కానీ మీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక లాభం లేదు అని మా ప్రయత్నాలు మానుకొన్నాం. ఇప్పుడు క్రీ.శ. 2068వ సంవత్సరం నడుస్తున్నది’ అని చెప్పాడు సుబ్రహ్మణ్యశర్మ.
‘అలా అయితే ఆ గుహలో నేను 50 సంవత్సరాలు నిద్రపోయానన్న మాట’ అని ఆశ్చర్యపోతూ అన్నాడు రామశర్మ.
‘ఏం జరిగిందో వివరంగా చెప్పండి నాన్నగారూ’ ఆదుర్దాగా అడిగాడు సుబ్రహ్మణ్య శర్మ.
ఆ రోజు తను అడవిలో చూసిన వింత ఆకారాల మనుషులు, తాగిన విచిత్రమైన ద్రవం గురించి అన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు రామశర్మ.
‘మీరు త్రాగిన ఆ ద్రవ ప్రభావం వలన శారీరక పెరుగుదల, మానసిక స్థితి ఏ మాత్రం మారకుండా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యోగ నిద్రలో ఉన్నారు. దీని మూలంగా మీ శరీరంలోనూ, ఆలోచనలలోను ఎటువంటి మార్పులు లేకుండా ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆనాటి స్థితిలోనే ఉన్నారు. ఇది నిజంగా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా అంతుపట్టని గొప్ప రహస్యం. మన పూర్వీకులు కనుగొన్న ఇలాంటి ఎన్నో గొప్పగొప్ప ఔషధాలు సరియైన ఆదరణ, పోషణ, శ్రద్ధ లేక మరుగున పడిపోయాయి’ అని ఉద్వేగంగా అన్నాడు సుబ్రహ్మణ్య శర్మ.
‘అది సరే కాని అసలు విషయం చెప్పు. అమ్మా చెల్లెలు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగారు రామశర్మ.
‘అమ్మ పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వెళ్లింది. చెల్లెలు గాయత్రి కూతురు ప్రసవిస్తే సహాయం చేయడానికి వెళ్లింది’ అని అన్నాడు.
‘ఓరి అప్రాచ్యపు వెధవా. నేను ఇంటలేనని నీ చెల్లెలి కూతురును ఒక తురకవానికి ఇచ్చి పెళ్లి చేసి మన వంశం పరువు తీశావు కదరా?’ అని కోపంగా అన్నాడు రామశర్మ.
‘నాన్నగారూ! మీరు అనవసరంగా ఆవేశపడకండి. గాయత్రి భర్త పేరు చతుర్వేదుల జగన్నాథశాస్ర్తీ. ఆయన ఇస్లామాబాద్‌లోని పశుపతినాథ ఆలయంలో ప్రధాన అర్చకులు. మీ వియ్యంకుల వారు కోటేశ్వర శాస్ర్తీగారు గొప్ప పండితులు. ఘనాపాఠి. అక్కడ వేద పాఠశాలలు గోశాలలు నడుపుతున్నారు. ఇక నా భార్య పుట్టింటివారు భాగవతుల వారు. మా మామ్మగారు నరసింహ శాస్ర్తీగారు పంచకావ్యాలు చదువుకున్న సంస్కృత తెలుగు పండితులు. లాహోర్‌లో ఉన్న

మహమ్మద్ అలీ జిన్నా యూనివర్సిటీలోని తెలుగు భాషా విభాగానికి అధిపతి. వారికి పాకిస్తాన్‌లోని సింధూ రాష్ట్రాలలో హిందూ ధర్మాల ప్రవచనాల వక్తగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతేకాదు మన ఊరిలోని వెంకయ్య చౌదరిగారు, సుబ్బారెడ్డిగారు, జాన్ పీటర్, సయ్యద్ హుస్సేన్, యశ్వంత్‌సింగ్‌గారు ఆ దేశంలో ఉన్న తమ బంధువర్గంతో వియ్యమందారు’ అని చెప్పాడు సుబ్రహ్మణ్య శర్మ.
‘ఈ విషయాలు అన్నీ నమ్మలేకపోతున్నాను. మన దేశానికి పక్కన ఉన్న పొరుగు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదరా? ఇది అంతా ఎలా సంభవించింది? చెప్పు’ అని ఆశ్చర్యం ఆనందం కలగలసిన ముఖంతో అడిగాడు రామశర్మ.
సుబ్రహ్మణ్య శర్మ ఇలా చెప్పసాగాడు. ‘గత 50 సంవత్సరాలలో ప్రపంచ దేశాలలో ఎన్నో మార్పులు, చేర్పులు సంభవించాయి. అక్కడ ఉన్న మతాధిపతుల కులపెద్దల స్వార్థపూరిత దురాలోచనలకు, దురాగతాలకు అడ్డూ ఆపు లేకుండా పోయింది. ఇతర మతాల మీద ద్వేషంతో జరిపే మారణహోమాలకు, ఆత్మాహుతి దాడులకు అక్కడ ప్రజల జీవన విధానాలు అస్తవ్యస్థమై పోయాయి. తెల్లవారితే ఎవరు నిద్రలేస్తారో, సాయంత్రానికి ఎవరు మిగులుతారో తెలియనటువంటి భయంకర పరిస్థితులలో జీవించసాగారు.
ఆ దేశాలు అప్పుల ఊబుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభాల్లో కొట్టుమిట్టాడి పోయాయి. ప్రజలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ వారి దేశాలలో నివసించలేక శరణార్థులై వలసపోసాగారు. ఇతర దేశాల వారు వారిని ఆదరించక నిర్దాక్షిణ్యంగా వెనుకకు పంపనారంభించారు. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక నివసించటానికి నివాసం లేక పుట్టకొకరు చెట్టుకొకరుగా దిక్కులేనివారై పశువుల వలె దయనీయమైన జీవితాలను గడపసాగారు.
ఈ తరుణంలో మన దేశంలోని ప్రజలందరూ ఆనందకరమైన జీవితాలను గడుపుతూ అన్ని మతాలు, కులాల వారు కలసిమెలసి జీవిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నారు. దీనికి మూల కారణం మన సనాతన భారతీయ సంప్రదాయాలు. ఋషులు, ఆచార్యులు పరంపరానుగతంగా అందించిన వేదాలు, భాష్యాల సూత్రాలు, అహంబ్రహ్మాస్మి అని మానవసేవే మాధవసేవ అనే ధర్మంతో సర్వేజనా సుఖినోభవంతు అనే గురు వాక్యంతో నడిచే జాతి మనది. నిబద్ధత, నిజాయితీ, జాతీయ సమైక్యత, పరమత సహనంతో కలసి సహజీవనం సాగిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాం. మన రాజ్యాంగ వ్యవస్థ కూడా ఆ మహా పురుషుల ప్రవచనాలపై సెక్యులర్ వ్యవస్థ మీదనే ఆధారపడి నడుస్తున్నది.
ఇప్పుడు మన దేశం సాంకేతికంగానూ, ఆర్థికంగానూ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందు ఉన్నది. మన రూపాయి విలువ డాలర్‌తో, యూరోతోను సమానంగా ఉన్నది.
రామకృష్ణ మఠం, ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి యోగ, స్వామి వివేకానంద మిషన్ లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రాజ్యాధికారం కోరకుండా సమాజానికి సేవలు చేస్తూ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయి.
ఈ విషయాలన్నీ గ్రహించిన మన ఇరుగు పొరుగు దేశాలు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అవలంబించటానికి ముందుకు వచ్చాయి. ఇతర మతాలలోకి మారిపోయిన వారు తమ పూర్వ మతమైన హిందుత్వానికి మళ్లారు. షేక్‌లుగా మారిన బ్రాహ్మణులు, హింసాత్మక చర్యలకు పావులుగా ఉపయోగపడే తక్కువ కులస్థులైన అజ్లాఫ్‌లు, గుజ్జర్‌లు, హాంజీలు, దోఖీలు, గిల్కర్‌లు ఇలా అన్ని తెగల వారు హిందూ మతాన్ని స్వీకరించి ఋజు మార్గంలోకి మళ్లి జీవించసాగారు.
ఇందుమూలంగా అక్కడ ఉన్న పాలకులు, అధికార దాహానికి అలవాటు పడిన రాజకీయ నాయకులు గత్యంతరం లేక ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం సెక్యులర్ వ్యవస్థకు జైకొట్టి అక్కడి ప్రజల అభీష్టాల మేరకు పరిపాలన చెయ్యసాగారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆ దేశాలలోని ప్రధానమంత్రులు కూడా హిందూ మతస్థులే.
మన పొరుగు దేశాలకు మనం యధేచ్ఛగా వెళ్లి రావచ్చు. నిబంధనలు ఏమీ లేవు. మన దేశంలోని వారితో అక్కడి వారు వివాహ సంబంధాలు జరుపుకుంటూ అన్యోన్యంగా కలసిమెలసి జీవిస్తున్నారు. త్వరలో అఖండ భారతంగా కలసిపోవాలని మన దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి’ అని ఆవేశంగా చెప్పాడు.
‘నేను అడవికి వెళ్లే ముందు రోజు పేపర్‌లో ఒక వార్త చూశాను. మన పొరుగు దేశంలో మొదటిసారి ఒక హిందూ మతస్థుడు ప్రజలచే ఎన్నుకొనబడి పార్లమెంటులోకి ప్రవేశించాడట. మన అఖండ భారతం యొక్క ప్రతిభ ఆసియా ఖండంలో మరలా వెలిగిపోతుంది అని ఆనాడే ఊహించాను. ఇదిగో ఇప్పటికి నా కల నిజమైన రోజు వచ్చింది’ అని ఆనందంతో అన్నాడు రామశర్మ.
‘మామయ్యగారూ! మీరు కూడా మాతోపాటు ఇస్లామాబాద్ రండి. అత్తయ్యగారు మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. త్వరగా స్నానం చెయ్యండి. బయలుదేరుదాం’ అని అన్నది కోడలు భారతమ్మ.
‘ఎందరో మహానుభావులు, మన తాతముత్తాతలు నడయాడిన ఆ పుణ్యభూమిని చూడాలనే నా కోరిక ఈనాటికి నెరవేరబోతున్నది. అంతా ఆ దేవి అనుగ్రహం’ అని గోడపై ఉన్న భరతమాత ఫొటోకు భక్తితో నమస్కరించి స్నానం చెయ్యడానికి ఇంటిలోకి వెళ్లాడు రామశర్మ.
*
-జన్నాభట్ల నరసింహ ప్రసాద్ 79959 00497
============================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయిల్‌లో పంపాలి.
*