S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏం చేశాను..?

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కొన్ని పత్రికల వారు మామూలుగా సంవత్సరం చివరలో కొంతమంది పెద్ద వాళ్లను సంప్రదించి వారు ఆ సంవత్సరం చదివిన మంచి పుస్తకాలను గురించి రాయిస్తారు. నిజానికి పెద్దవారు మంచి పుస్తకాలను మాత్రమే చదువుతారు. అటువంటి చర్చలో కనిపించిన పుస్తకాలకు మరింత మార్కెట్ పెరుగుతుంది. ప్రచారం కూడా కలుగుతుంది. మన దగ్గర ఆ పద్ధతి పెద్దగా ఉన్నట్టు కనిపించదు. ఎవరో ఏదో చేయలేదని నిరాశ పడేకన్నా ఆ పని లేని పద్ధతిలో నేను చేస్తే పోతుందని ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.
2018 అనే ఈ సంవత్సరంలో నేను ఏం చేశాను? చాలానే చేసినట్టు ఉన్నాను. నిజానికి ఈ సంవత్సరం నేను రాసిన చిన్నా చితకా నుంచి పెద్ద పుస్తకాలు పది దాకా బయటకు వచ్చాయి. రచయితగా అది నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చిన విషయం. నూర్‌మహల్ అంటే మనకు తెలిసిన నూర్జహాన్ గురించి నేను ఒక నవల రాశాను. అది చాలామందిని ఆకర్షించినట్టు ఉంది. ఈ మధ్యనే అగాధా క్రిస్టీ రచన పార్టీలో పదముగ్గురు అనే నవలను తెలుగులో ప్రచురించాను. గతంలో నేను షెర్లాక్ హోమ్స్ నవలలు వేసినప్పుడు వచ్చినింత రియాక్షన్ క్రిస్టీ నవలకు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ రచయిత్రి అంతగా పాఠకులకు పరిచయం ఉన్నట్టు లేదని నా అనుమానం.
ఇంతకు నేను చెప్పాలనుకున్నది నేను చదివిన పుస్తకాల గురించి. సైన్స్ గురించి చదవడం, అందుకు సంబంధించిన పుస్తకాలను సేకరించడం నాకు ఇంచుమించు ఒక బలహీనత. అమెరికా నుంచి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తికి 100 పౌండ్లు అంటే నలభై ఆరు కిలోల వస్తువులను తెచ్చుకోవడానికి అనుమతి ఉంటుంది. నా రెండు సూట్‌కేస్‌లో కలిపి 16 కిలోల పుస్తకాలు తెచ్చుకున్నాను. అందులో ఇంచుమించు అన్ని సైన్సుకి సంబంధించినవే. ఈ సంవత్సరం నేను ఇప్పటికే చదివిన సైన్సు పుస్తకాలలో నైజేల్ కాల్డర్ వ్యాసాల సంకలనం నన్ను చాలా కదిలించింది. ఇతను సైంటిస్ట్ అనే పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వ్యాసాలను రాస్తాడు. ఒక్క రంగంలోని రకరకాల విషయాలను గురించి వేరువేరు వ్యాసాలు రాయడం ఒక పద్ధతి. వాటన్నింటినీ గుర్తుంచుకుని, వాటి మధ్య సంబంధాలను అర్థం చేసుకుని, సమీక్ష లాంటి ఒక విస్తృతమైన వ్యాసం రాయడం అందరికీ వీలు కాదు. ఆయా రంగాలను గురించి ఎంతో లోతైన పరిచయం ఉంటే కానీ ఈ రకంగా రాయడం కుదరదు. నైజేల్ ఇటువంటి వ్యాసాలను అలవోకగా రాస్తాడు. ఎన్నో రంగాలను గురించి రాస్తాడు. కనుక చదువుతూ ఉంటే గొప్ప ఆనందం కలుగుతుంది.
నేను మనిషి తీరుతెన్నులను గురించి విస్తృతంగా చదివి ఒక మంచి పుస్తకం రాయాలన్న ప్రయత్నంలో ఉన్నాను. ఆ దిశగా ఎన్నో పుస్తకాలు సేకరించాను. చదువుతున్నాను. వాటిని గురించి ఎక్కువగా చెప్పను. సైన్సును సరదా కోసం చదివే పద్ధతి మాత్రం నాకు లేదు. ప్రతి నిత్యం ప్రపంచంలో వస్తున్న పత్రికలను, పుస్తకాలను గురించి వెతికి వాటి గురించి పరిచయం కలుగజేసుకోవటం అలవాటుగా మారింది. అక్కడ చదువుతున్న, చూస్తున్న పుస్తకాలను గురించి చెప్పడం కొంచెం కష్టమే. అయితే ఈ సంవత్సరం నేను రిచర్డ్ డాక్సిన్ అనే రచయిత పుస్తకాలతో పరిచయం ఏర్పరచుకున్నాను. అవి నన్ను ఇంచుమించు కదిలించాయి. అయితే నేను ఇంకా వాటిని చదవవలసి ఉంది.
నేను కథా సాహిత్యాన్ని గురించి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. పెద్ద సంఖ్యలో దేశదేశాల నుంచి కథా సంకలనాలను సేకరించాను. వచ్చిన ప్రతి సంకలనంలోని కనీసం ఒకటి రెండు కథలను చదివి, రచయిత గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుని పక్కన పెడుతున్నాను. వాటిని గురించి సమగ్రమైన కృషి చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. ఏడాది క్రితమే అమెరికా కొడుకు- అనే పేరున ఒక అనువాద కథల సంకలనాన్ని ప్రచురించాను. కానీ దాన్ని పాఠకులు గుర్తించినట్టు కనిపించలేదు. కనుక ఆ తరువాత తయారుచేసిన మరో రెండు సంకలనాలను నిలిపివేశాను.
ఇక కేవలం నా ఆనందం కోసం చదివిన పుస్తకాలు కూడా ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వాటన్నింటినీ చదివే ముందు నాకు ఒక ఆలోచన పుడుతుంది. బాగుంటే ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించాలి అనిపిస్తుంది. కనీసం ఆ పుస్తకం గురించి అయినా చెప్పాలి అనిపిస్తుంది. అన్నిసార్లు అటువంటి అవకాశం దొరకదు. రాబర్ట్ హారిస్ అనే రచయిత వెలువరించిన మూడు పుస్తకాల సంకలనం ఒకటి చదివాను. గ్రీకు చరిత్రకు సంబంధించిన నవలలు అవి. సిసిరో అని ఒక లాయర్ ఉంటాడు. అతను నిజానికి చాలా మామూలు మనిషి. కానీ చివరికి దేశాన్ని మొత్తాన్ని నడిపించే నాయకుడు అవుతాడు. ఆ విషయాన్ని రచయిత అందించిన తీరు అద్భుతంగా ఉంటుంది. మూడు నవలలు దేనికదే వేరువేరుగా చదివిన వారికి ఎలా అర్థం అవుతుందో తెలియదు కానీ, నేను మాత్రం క్రమంగా మూడింటిని చదివాను. చారిత్రక నవలల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదువుతున్నాను. కనుక నాకు ఇది మరీ నచ్చింది. బైజాంటైన్, ఇరానియన్, మంగోలియన్, జపనీస్, చైనీస్ చారిత్రక నవలలను గురించి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. టోంగ్వాన్ సిటీ అనే ఒక చైనా నవల చదివాను. అందులో బౌద్ధ భిక్షువు గురించి కూడా ఉంటుంది. భారతదేశం నుంచి వెళ్లిన ఆ భిక్షువు చైనా దేశంలో చిత్రమైన పరిస్థితిలో బతుకుతాడు. దేశమంతా తిరుగుతాడు. ప్రభువులతో తలపడతాడు. ప్రభువు విచిత్రమైన మనిషి. గొప్ప నగరాన్ని నిర్మిస్తాడు. కానీ అటువంటి నవలను బహుశా తెలుగు పాఠకులు ఆదరించలేక పోతారన్న అనుమానం నాకు కలిగింది.
వు చెంగెన్ అనే రచయిత రాసిన చారిత్రక నవల నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. నవల పేరు మంకీ. అంటే కోతి. యువన్ చువాంగ్ లేదా హుయాన్ సాంగ్ లాంటి పేర్లతో మన దేశపు చరిత్ర పుస్తకాలలో పరిచయమైన బౌద్ధ భిక్షువు ఒకతను భారతదేశానికి బయలుదేరుతాడు. వాళ్ల చక్రవర్తి తమ దేశంలో ప్రచారంలో ఉన్న హీనయాన బౌద్ధానికి బదులు మహాయాన బౌద్ధం తేవాలని, అందుకు సంబంధించిన పుస్తకాలు దేశంలో ఉన్నాయని, వాటిని తేవడానికి ఈ భిక్షువును భారతదేశానికి పంపిస్తాడు. ప్రయాణంలో అతనికి ఒక కోతి, ఒక పంది సాయం చేసినట్టు చెబుతారు. ఇదే అసలు సిసలైన పురాణ గాథ అనిపిస్తుంది. ఈ కథలోని కోతి రాతిలోనుంచి పుట్టినవాడు. వాళ్ల స్వర్గ్ధాపతిని కూడా ఎదిరిస్తాడు. అతనికి ఎన్నో మంత్రశక్తులు ఉంటాయి. కొంత వరకు మన హనుమంతుని పోలికలు ఉన్నప్పటికీ ఈ కోతి చాలా విలక్షణమైన వ్యక్తి. నానా కష్టాలు పడి వాళ్లు భారతదేశం వస్తారు. ఈ నవల చదువుతున్నప్పుడు మన పురాణాలన్నీ ఒక్కసారి మెదడులో మెదిలాయి. ప్రపంచంలో అంతటా ఒకే రకమైన ఆలోచనలు ఉన్నట్టు భావన కలిగింది. మనకు తెలిసిన బౌద్ధ భిక్షువు కేవలం ప్రయాణికుడుగా వచ్చాడు అన్నారు కానీ, ఈ కథలో అతని తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బహుశా ఈ పుస్తకాన్ని కొంచెం కుదించి తెలుగులో చెబితే మన వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నాకు తోచింది. సరైన సమయం చూసి ఆ ప్రయత్నం చేస్తాను.గిల్గమేష్ అనే పేరు మన వాళ్లు చాలామంది విని ఉండకపోవచ్చు. మెసొపొటేమియాలో రాత మొదలైన కాలంలో మట్టి బిళ్లలలో రాసి పెట్టిన కవితాత్మక నవల ఒక దానిలో ఈ రాజు చరిత్ర ఉంది. చాలాకాలం వరకు ఆ భాష ఎవరికీ అర్థం కాలేదు. ఈ మధ్యనే దాన్ని అర్థం చేసుకున్నారు. కథను యథాతథంగా రాసుకోగలిగారు. ఇంగ్లీషులోకి అనువదించారు కూడా. నేను ఆ పుస్తకాన్ని సేకరించి చదివాను. మళ్లీ పురాణాల పద్ధతి కనిపించింది. కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందులోని పాత్రలు వాటి పేర్లలో భారతీయ ధోరణులు కనిపిస్తాయి. ఇది కవితాత్మక రచన. దీన్ని వచనంలాగా మార్చాలి. నిజానికి ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నవల అంటున్నారు. ఇటువంటి పుస్తకాన్ని గనుక మన పాఠకులకు అందించగలిగితే అంతకన్నా కావలసింది ఉండదు. నేను చదివిన ప్రతి పుస్తకాన్ని అనువదించి అందించాలని అనిపిస్తుంది. కానీ అది కుదిరే పని కాదని తెలుసు.
ఉన్నట్టుండి నాకు ఎం.టి.వాసుదేవన్ నాయర్ నవలల మీదకు దృష్టి మళ్లింది. ఇప్పటికే ఆయన రచనల ఆధారంగా ఆయన రూపొందించిన సినిమాలు చూశాను. గొప్ప రచయిత మాత్రమే కాదు. ఆయన గొప్ప సినిమా నిపుణుడు కూడా. దేవుని గురించి ఒక చిత్రమైన నవల రాశాడు. అది చదువుతుంటే వింత ఆలోచనలు కలుగుతున్నాయి. ఇటువంటి నవలలు తెలుగులో ఎందుకు రావడం లేదు అని అనుమానం కూడా కలుగుతుంది. ఇక కన్నడ రచయిత అనంతమూర్తి నవల భావ కూడా చదివాను. చిత్రమైన రచన. ఆయన పోకడ అంతకు ముందు కూడా తెలిసిందే. ఆయన రచనల ఆధారంగా కూడా సినిమాలు వచ్చాయి.
ఇంతకాలం తరువాత నాకు రవీంద్రనాథ్ ఠాగూర్‌లోని భావుకతను సందర్శించే అవకాశం కలిగింది. ఎపిక్ అనే టీవీ చానల్ వాళ్లు రవీంద్రుని కథలను ఎంచుకుని ఎపిసోడ్లుగా చూపించారు. కొన్ని కథలు రెండు మూడు ఎపిసోడ్లుగా కూడా వచ్చాయి. అనుకోకుండా నెట్‌ఫ్లిక్స్‌లో నేను వాటిలో నుంచి ఒక ఎపిసోడ్ చూశాను. మిగతావి చూడకుండా ఉండలేక పోయాను. ముఖ్యంగా మొట్టమొదటిలోనే ఉన్న చోఖేర్ బాలీ అనే కథ నన్ను కుదిపివేసింది. రవీంద్రుడు మాత్రం ఈ కథ నేను రాయకుండా ఉంటే బాగుండేది అన్నాడు. మిగతా కథలన్నీ కూడా బాగున్నాయి. వాటిని దృశ్యమానం చేసిన తీరు మరింత బాగుంది. అయితే ఆనాటి కాలంలో వేషభాషలు ఈ రకంగా ఉండేవా? అని అనుమానం కలిగిన మాట వాస్తవం. మొత్తానికి రవీంద్రుని రచనల మీదకు మళ్లింది. చోఖేర్ బాలీ పుస్తకం కోసం తెగ వెతికాను. కంటి మెరమెర అనే పేరున అది ఎప్పుడో తెలుగులో కూడా వచ్చింది. చదివే ఉంటాను. కానీ అది నాకు ఇప్పుడు దొరకలేదు. కనీసం ఇంగ్లీష్‌లో కూడా దొరకలేదు. నిరాశ చెంది ఊరుకున్నాను. కానీ తెలుగు రోజుల తరువాత నా పుస్తకాలను తిరగ వేస్తుంటే అందులో నాకు ఈ నవల హిందీ రూపాంతరం కనిపించింది. నా ఆనందం అంబరాన్ని తాకింది. రవీంద్రునిలోని లోతును నేను అంతకు ముందు కనుగొనలేక పోయాను. గోరా లాంటి నవలలు కనిపించే రవీంద్రుడు వేరు. చిన్న కథలలో రవీంద్రుడు వేరు. నాకు చదవడం ఒక వ్యసనం. జో నెస్బో అనే ఒక స్కాండినేవియన్ రచయిత గురించి విని అతని నవలల అనువాదాలు వెతికి సంపాదించాను. అవి అపరాధ పరిశోధక రచనలు. ఒకటి రెండు బాగున్నాయి. కానీ అన్నీ నాకు నచ్చలేదు.
పుస్తక సేకరణ అన్నది నాకు నిత్య కార్యక్రమం. రోజు కనీసం అంతకు ముందు చూడని ఒక పుస్తకాన్ని అయినా నేను చూడాలి. అలా సేకరించిన వాటిలో చాలా పుస్తకాలను చదువుతాను కూడా. చదవని పుస్తకాలు మిగిలి ఉన్నాయి. వాటి గురించి చెప్పినా లాభం లేదు. సరేగాని, ఈ సంవత్సరం మీరు చదివిన పుస్తకాల గురించి నాకు ఎవరు చెప్పాలి?

-కె.బి.గోపాలం