S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురువుగారి ఆజ్ఞ (కథ)

గురుకులంలోని శాండిన్యుడు వద్ద అక్షయ, మురారి అనే ఇద్దరు రాజకుమారులు శిష్యరికం చేస్తున్నారు. శాండిన్యుడు ఇద్దరికీ అనేక విద్యాబుద్ధులు, యుద్ధ విద్యలు నేర్పిస్తున్నాడు. ఇద్దరిలో మురారి కొంచెం పిరికివాడిగా ఉన్నట్టు శాండిన్యుడు గమనించాడు. ఏది ఏమైనా మురారికి కూడా ధైర్య సాహసాలు అబ్బేట్టు చేయాలని నిశ్చయించుకొన్నాడు.
ఒకరోజు శాండిన్యుడు తన మంత్రశక్తితో అరణ్యం మధ్యలో ఒక భీకరుడైన రాక్షసుణ్ణి సృష్టించాడు. అక్షయ, మురారి ఇద్దరినీ పిలిచి విల్లులు, బాణాలు ఇచ్చి ఈ విధంగా చెప్పాడు.
‘మీరిద్దరూ మన గురుకులానికి దక్షిణం వైపున ఉన్న అడవికి వెళ్లి, అక్కడ ఉన్న కర్కోటకుడనే రాక్షసుణ్ణి సంహరించి రండి. చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల్ని వాడు హింసిస్తున్నట్టు తెలిసింది. ఈ బాణాలు విల్లంబులు అతి శక్తివంతంగా నా మంత్రశక్తితో చేయబడినవి. వెళ్లి వాణ్ణి సంహరించి రండి’.
శాండిన్యుడు ఎంత చెప్పినా మురారి కొంత భయపడ్డాడు. అయినా అక్షయుడు తోడు వస్తున్నాడు కనుక కొంత ధైర్యంతో బయలుదేరాడు. అలా ఇద్దరూ అతి కష్టం మీద అరణ్యం మధ్యకు చేరుకున్నారు. వారికి రాక్షసుడి అరుపు భీకరంగా వినపడింది. ఇంచుమించు ఓ చిన్న పర్వతం అంత భారీ శరీరం కలిగి ఉన్న రాక్షసుడు లేచి నిలబడి, ‘ఎవరురా మీరు.. నా అరణ్యంలోకి రావడానికి మీకు ఎన్ని గుండెలు?’ అంటూ పెద్దగా అరిచాడు.
ఇంత చిన్న బాణాలతో అంత పెద్ద రాక్షసుణ్ణి చంపడమెలా? బ్రతికుంటే పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చి రాక్షసుణ్ణి తుదముట్టించవచ్చు కదా అని ఆలోచిస్తూ ‘అక్షయా ఇంత పెద్ద రాక్షసుణ్ణి చంపడం మన తరం కాదు. వెళ్లిపోదాం పద’ అని పిరికిమందు నూరిపోశాడు.
‘గురువుగారు మనకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడమే మన పని. చావును గురించి భయపడకు. నేను వీణ్ణి చంపిగాని రాను’ అని చెప్పాడు.
‘ఇక నీ ఇష్టం...’ అంటూ విల్లుతో గురుకులం వైపు వడివడిగా అడుగులు వేయసాగాడు.
అక్షయ మటుకు ‘వీడు పెద్ద ఆకారంలో ఉన్నాడు, నా గురి తప్పదు. నేరుగా నా బాణాన్ని వాడి గుండెల్లో దింపుతాను’ అంటూ గురువును స్మరించుకొని, బాణాన్ని రాక్షసుడి గుండెకు గురిపెట్టి వదిలాడు.
బాణం నేరుగా వెళ్లి రాక్షసుడి గుండెల్లో దిగబడింది! అంతే వాడు పెద్ద హాహాకారాలతో అరణ్యం మధ్యలో పడిపోయాడు.
రాక్షసుడి చావుకేక విని మురారి కూడా పరుగున అక్షయ వద్దకు వచ్చాడు.
ఇంతలో ఇద్దరి ముందు గురువు శాండిన్యుడు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు.
‘మురారీ! అప్పజెప్పిన పని ధైర్యంతో ఎదుర్కోవాలి. చూడు. అక్షయ రాక్షసుడి భీకర ఆకారాన్ని చూసి, గురి తప్పదు అని భావించి నేను అప్పగించిన పనిని, నా వాక్కు మీద గౌరవంతో నేను ఇచ్చిన విల్లంబుల మీద నమ్మకంతో సాహసంతో పూర్తి చేశాడు. నీవు లేనిపోని ఆలోచనలతో రాక్షసుడి మీదకు విల్లు ఎక్కుపెట్టలేక పోయావు. అక్షయలోని కొండంత ధైర్యం ముందు రాక్షసుడు ఓడిపోయాడు. నీవు కూడా నీ పిరికితనం వదలి ధైర్యంతో ఏ పని అయినా చేపట్టు. తప్పక నిన్ను విజయం వరిస్తుంది. మీ ఇద్దరినీ పరీక్షించడానికే ఆ భీకర రాక్షసుణ్ణి సృష్టించాను’ అని మురారికి ధైర్యాన్ని గురించిన సూక్ష్మాన్ని తెలియపరిచాడు.
‘నా కళ్లు తెరిపించారు గురుదేవా! పిరికితనమే మనిషిని సగం చంపుతుందని తెలుసుకున్నాను. ఇక మీదట మీరు చెప్పినట్టు ధైర్యంతో, మంచి ఆలోచనలతో ఏ పని అయినా సాధిస్తాను’ అని గురువుగారికి నమస్కరించాడు.
మురారిలో వచ్చిన మార్పునకు శాండిన్యుడు సంతోషించి ఇద్దరినీ ఆశీర్వదించి తన గురుకులం వైపు అడుగులు వేశాడు.

-కంచనపల్లి వేంకట కృష్ణారావు 93486 11445