S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పగబట్టిన ‘పొగ’!

మనం ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండాలి. అందరికీ శుభ్రమైన గాలి, నీరు లభించాలి. పర్యావరణం పచ్చదనంతో విలసిల్లాలి. పారిశుధ్యం సరిగా ఉండాలి. మురికి నీటి ప్రవాహాలతో కంపుగొట్టే పరిస్థితులకు అతీతంగా నివాస ప్రాంతాలు చూడ చక్కనైన రీతిలో రూపుదిద్దుకోవాలి. పరిసరాలే కాదు.. మనం ప్రయాణించే మార్గాలు కూడా కాలుష్యానికి అతీతంగా ఉన్నప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకోగలం. కానీ నేడు.. వాయుకాలుష్యం విషమ సమస్యగా మారింది. పర్యావరణంతో పాటు ప్రజారోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను ఇది నానాటికీ కుంగదీస్తోంది. విపరీతమైన కాలుష్యం ఫలితంగా దేశీయ ఉత్పాదకత దెబ్బతింటోంది. ప్రజల్లో శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇతర రుగ్మతలూ తలెత్తుతున్నాయి.
భారతదేశాన్ని పోషకాహార లోపం తర్వాత అత్యంత తీవ్రంగా వేధిస్తున్న సమస్య వాయుకాలుష్యమే.. ఉత్తరాదిని.. ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీ నగర వీధుల్ని కాలుష్యం- పొగమంచు రూపంలో కమ్మేస్తోంది. ఈ పరిస్థితి సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న మోటారు వాహనాల పొగ, నగరాల్లో పరిశ్రమల ద్వారా కమ్ముకునే వాయువులు పలు కష్టనష్టాలకు దారితీస్తున్నాయి.
శీతాకాలం మంచుకు కాలుష్య మేఘాలు తోడై ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో పగలే అంధకారం అలుముకుంటోంది. ఉపరితల, గగనతల రవాణాకు అంతరాయం కలుగుతోంది. జనజీవనం స్తంభించిందా? అన్నట్లు దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. దట్టంగా కమ్ముకున్న పొగమేఘాల కారణంగా రహదారులపై కనుచూపు మేరలో ఏముందో కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలోకి విడుదలవుతున్న విషవాయువుల పరిమాణం ఎప్పటికప్పుడు పెరుగుతోందన్నది కఠోర వాస్తవం. భారతదేశంలో రోగాల బారిన పడుతున్న వారిలో ఆరుశాతానికి పైగా వాయుకాలుష్య బాధితులేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు
నగరాల్లో, పట్టణాల్లో శుభ్రమైన గాలి లభిస్తున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాల్లో అధ్యయనం చేసి నిర్దిష్ట పరిమితిని మించి కాలుష్యం బారిన పడిన నగరాల జాబితా తయారుచేసింది. మరీ ముఖ్యంగా వాయుకాలుష్యం నానాటికీ తీవ్రం కావడం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పింది. ఈ జాబితాలో న్యూ యార్క్, లండన్ వంటి నగరాలే కాక ఢిల్లీ కూడా ఉంది. 91 దేశాల్లోని దాదాపు 1,600 నగరాల్లో జరిపిన అధ్యయనాల ఆధారంగా ఒక నివేదిక తయారుచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీని ప్రకారం అత్యంత కాలుష్యం బారిన పడిన వంద నగరాల్లో భారతదేశానికి చెందిన 34 నగరాలు ఉన్నాయి. అలాగే భరించశక్యం కానంత తీవ్రస్థాయికి చేరిన యాభై నగరాల్లో 22 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. వీటిని మరింత వర్గీకరించి అత్యంత వాయుకాలుష్యం బారిన పడిన నగరాలుగా పదింటిని గుర్తించారు.
అవి...
1. ఢిల్లీ 2. పాట్నా - బిహార్ 3. గ్వాలియర్ - మధ్యప్రదేశ్ 4. రారుపూర్ - ఛత్తీస్‌గఢ్ 5. అహ్మదాబాద్ - గుజరాత్ 6. ఫిరోజాబాద్ - ఉత్తరప్రదేశ్ 7. అమృతసర్ - పంజాబ్ 8. కాన్పూర్ - ఉత్తరప్రదేశ్
9. ఆగ్రా - ఉత్తరప్రదేశ్ 10. లూథియానా - పంజాబ్
ఈ పది నగరాల్లో నిర్దిష్ట స్థాయికి మించిన అత్యంత ప్రమాదకర కాలుష్య కారకాలైన సల్ఫేట్, నైట్రేట్, బ్లాక్ కార్బన్ కణాలు గాలిలో కలుస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు వివరించాయి. వేగంగా పారిశ్రామీకరణ చెందుతున్న దేశాల్లో కాలుష్య మరణాలు అధికంగా ఉంటున్నాయి. వాయుకాలుష్యం కారణంగా ప్రపంచంలో శ్వాసకోశ వ్యాధులతో ఏటా సుమారు 38 లక్షల మంది చనిపోతుంటే వారిలో భారత్‌కు చెందినవారు సుమారు 15 లక్షల మంది ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాలుష్య మరణాలు మూడోవంతు ఉన్న భారతదేశానికి ఈ నివేదిక ఓ హెచ్చరిక.
గాలిలో ఉండే అత్యంత ప్రమాదకరమైన కణాలు శరీరంలోకి చేరడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇనె్ఫక్షన్స్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి రోగాల బారిన పడి ఏటా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున వాయుకాలుష్యం కూడా అదే నిష్పత్తిలో పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని, ఆర్థికరంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని పాలకులు చెబుతున్నప్పుడు వినడానికి బాగుంటుంది కానీ- ఈ ‘ప్రగతి’ ప్రాణాలను తోడేస్తున్నదని ఎవరూ ఆలోచించడం లేదు. అభివృద్ధి యావలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పాలకులకు ఈ నివేదిక హెచ్చరికలతో పాటు తక్షణ చర్యల అవసరాన్ని కూడా గుర్తుచేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పర్యావరణాన్ని, కాలుష్యాన్ని అభివృద్ధి నిరోధక అంశాలుగా చూడటమంటే ప్రజల ప్రాణాలకు ముప్పు తేవడమే..
పొగమంచు
ప్రాణాంతక పొగమంచుతో పాటు కర్మాగారాల నుండి వెలువడే వాయువులు, మోటారు వాహనాల పొగ నుంచి అనేకుల్ని రక్షించాల్సి ఉంది. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు సహా ప్రజలందరి దైనందిన వ్యవహారాలపై పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాలు అదుపుతప్పి సంభవించే రోడ్డు ప్రమాదాలు ప్రాణాల్ని హరిస్తున్నాయి. వరిగడ్డి మంటలను కట్టడి చేయడం ద్వారా కాలుష్య ధూమాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. ఆ మేరకు కేంద్రంతో పాటు పంజాబ్, ఢిల్లీ, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఉత్తరాదిలో గంగానది పరీవాహక ప్రాంతం సారవంతమైనది. వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న తదితర ఆహారధాన్యాల ఉత్పత్తికి అది పెట్టింది పేరు. దేశ రాజధాని ప్రాంత పరిసరాల్లో గల వ్యవసాయ క్షేత్రాల రైతులు.. పంట చేతికొచ్చిన తరువాత పొలాల్లో మిగిలిపోయిన గడ్డి, పంట నూర్పిడిలో మిగిలిన వ్యర్థాల్ని దహనం చేస్తారు. అప్పుడు వెలువడే పొగ వాతావరణంలోకి చేరి, మందమైన పొరలా ఏర్పడుతుంది. అంతకుముందే పేరుకుపోయిన కాలుష్యంతో పాటు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న కలుషిత ఇంధనాలు జతపడి సమస్య మరింత తీవ్రతరమవుతోంది. పైగా వివిధ నగరాల వీధులు పొగమంచుతో నిండుతున్నాయి.
ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌లోని పలు నగరాల్లోనూ రానున్న నెలల్లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంటుందని అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ ‘నేషనల్ ఓషియానిక్, అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్’ హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆయా నగరాలు అనారోగ్యకర మంచుపొరలు కమ్మిన ప్రాంతాలుగా మారిపోతాయని సంస్థ నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. ఫలితంగా కాలుష్యం మరింత పేరుకుపోతుందని ఆ సంస్థ ముందుగానే విశే్లషించింది. సాధారణంగా శిలాజ ఇంధనాలతో పాటు ఎండిన పంటల్ని, వ్యర్థాల్ని విచక్షణారహితంగా మండించడం వల్ల భారీగా పొగమంచు ఏర్పడుతుంది. ప్రధాన నగరాల్లో లక్షలాది వాహనాలు విడుదల చేసే వాయువులు గాలిని కాలుష్యమయంగా మారుస్తున్నాయి. కొత్తగా రోడ్లపైకొచ్చే వాహనాల కాలుష్యం దీనికి జతపడటంతో, వాయుకాలుష్యం పెచ్చుమీరుతోంది. దక్షిణాదిన హైదారాబాద్, విశాఖ, చెన్నైలలోనూ వాయుకాలుష్యం వల్ల వాతావరణం విషతుల్యమవుతోంది.
విలోమపొర
మానవ చర్యల ఫలితంగా వాతావరణంలో ‘విలోమపొర’ ఏర్పడుతోంది. కాలుష్య కారకాలన్నీ ఒకేచోట పేరుకుపోయే స్థాయిలో గాలి నిశ్చలంగా మారిపోతుంది. అది చల్లబడకుండా ఉండటం వల్లనే విలోమపొర రూపొందుతుంది. భూ వాతావరణానికి పైన ఉన్న చల్లని, దట్టమైన గాలిపై వేడిగాలి ఆవరిస్తుంది. శీతల పవనాలు ఎటూ కదలలేని స్థితిలో కాలుష్య కారకాలు పేరుకుపోతాయి. దుప్పటిలా మారిన మంచుపొర నగర వీధుల్ని కప్పేసి, అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల్ని సృష్టిస్తుంది. పెచ్చుమీరుతున్న వాయుకాలుష్యం దృష్ట్యా సరోన్నత న్యాయస్థానం దీపావళి పండుగకు మునుపే ఢిల్లీలో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించింది. దేశ రాజధానిలో దీపావళి మర్నాడు 403గా నమోదైన గాలి నాణ్యత సూచీ , మరో పక్షం రోజులకే 491కి చేరింది. కాలుష్య తీవ్రత నానాటికీ ఎలా కమ్మేస్తుందో దీన్ని బట్టి గమనించవచ్చు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో విద్యాసంస్థలకు ఎప్పటికప్పుడు సెలవులు ప్రకటించాల్సి వస్తోంది. కాలుష్య మహమ్మారిని అరికట్టడంలో అలసత్వం తగదంటూ కేంద్రంలోని సంబంధిత విభాగం ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు నోటీసులు జారీచేసింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన ఘజియాబాద్‌లో గాలి నాణ్యత సూచీ 475, నోయిడాలో 468, ఫరీదాబాద్‌లో 406, గుర్‌గావ్‌లో 368గా నమోదైంది. గ్రీన్ పీస్ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం.. అలహాబాద్, కాన్పూర్, బరేలీ, రాంచీ, ఝరియా, పాట్నా వంటి నగరాల్లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దేశంలో 75 శాతానికి పైగా నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత ప్రమాణాలు దిగజారిపోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, గుంటూరుల్లో వాయుకాలుష్య తీవ్రత కలవరపరుస్తోంది. దేశంలోని 90కిపైగా నగరాలకు సంబంధించి.. గాలిలో విషపూరిత ధూళికణాల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని నిర్ధారిస్తున్నాయి తాజా అధ్యయనాలు.
నివారణ ఉందా?
వాయుకాలుష్యం కారణంగా జ్ఞాపకశక్తి, చురుకుదనాన్ని కోల్పోవడం, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు, అలర్జీలు, ఆస్థమా, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, చర్మం, కళ్లు, గొంతునొప్పి.. ఇలా ఎన్నో రకాల సమస్యలు కలుగుతాయి. వాయుకాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో 2006 నుంచి 2015 వరకు దేశంలో 35,616 మంది మరణించారు. మృతుల సంఖ్య పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 6, 423 ఉండగా, ద్వితీయస్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు (3, 768 మంది), మూడోస్థానంలో ఉత్తర ప్రదేశ్ (2,458 మంది) ఉన్నట్లుగా వెల్లడైంది.
కాలుష్యం మనిషి సృష్టించిందే తప్ప ప్రకృతి వైపరిత్యం కాదు. సమస్య సృష్టికర్తలే పరిష్కారాన్నీ ఆలోచించాలి. ఒకరినో, ఇద్దరినో కాక దేశ ప్రజలందరి ఆరోగ్యాన్నీ తోడేస్తున్న అంశం కనుక దీనిని ప్రజారోగ్య సంక్షోభంగా భావించాలి. దేశంలో వాయుకాలుష్యం ఏటా లక్షల మంది ప్రాణాలు తీస్తున్నదనీ, కోట్లాదిమంది ఆయుర్దాయం కుంచించుకుపోతున్నదని నివేదికలు, అధ్యయనాలు అనాదిగా హెచ్చరిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలకే కాదు, ఈ విష ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ప్రజలకూ సమస్య తీవ్రత పట్టడం లేదు. వయోవృద్ధులను మరింత దెబ్బతీస్తూ, భావితరాలను బలహీనులుగా మార్చేస్తూ, ప్రజలను ఆస్పత్రుల పాల్జేస్తూ వారిని ఆర్థికంగా ముంచేస్తున్న ఈ సమస్య విషయంలో ప్రభుత్వాల నుంచి ఏమాత్రం చొరవ కనిపించదు. చైనా కూడా విపరీతమైన కాలుష్య సమస్య ఎదుర్కొంటున్న మాట నిజమే కావచ్చు కానీ, భారతదేశంతో పోల్చితే ఆ దేశం ముందే మేల్కొని ఉపశమన చర్యలకు సిద్ధపడింది. ముఖ్యంగా 2008 ఒలింపిక్స్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా అప్రదిష్ట రావడంతో వాయుకాలుష్యాన్ని తగ్గించుకునే దిశగా చర్యలను చేపట్టింది. అభివృద్ధి దెబ్బతింటుందన్న హెచ్చరికలను సైతం పక్కనబెట్టి కాలుష్య కారక పరిశ్రమలపై ఉక్కుపాదం మోపింది. 2014లో పరావ్యవరణ పరిరక్షక చట్టాలను మరింత కఠినంగా మార్చి స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన అధికారాలు ఇచ్చింది.
మనదేశంలో కాలుష్యం వంటి ఒక ఉమ్మడి సమస్యపై సంఘటితంగా స్పందించే లక్షణం లేకపోవడం ప్రభుత్వాలకు ఉపకరిస్తున్నది. తద్వారా ఈ రంగంలో కృషిచేస్తున్న సంస్థల ఆవేదన, హెచ్చరికలను అది బేఖాతరు చేడయానికి వీలుకలుగుతున్నది. మిగతా కాలుష్యాల సంగతి అటుంచితే.. వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి ఆరోగ్యాలనూ దెబ్బతీస్తున్న వాయుకాలుష్యం విషయంలోనూ మూకుమ్మడి స్పందన లేకుండాపోవడం ఆశ్చర్యకరం. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు సుస్థిర, దీర్ఘకాలిక, సమగ్ర ప్రణాళికలు అత్యవసరం. ఆ కార్యాచరణలో ప్రధానంగా ఎదురవుతున్న అవరోధాలు అనేకం. ముందు వాటిని అధిగమించగలగాలి. వాతావరణ సూచనల్లో శాస్ర్తియత కావాలి. ప్రజారవాణా రంగంలో తగిన మార్పులు రావాలి. వీటన్నింటినీ సమన్వయం చేయగలిగే ప్రభుత్వ నియంత్రణ విధానం అన్నింటికంటే ఆవశ్యకం. పారిస్‌లో ప్రజారవాణా పూర్తిగా ఉచితం. మనదేశంలో ఆ వ్యవస్థను బలోపేతం చేసే పనులు వేగవంతం కావడం లేదు. బస్సుల కుదింపు, ఛార్జీల బాదుడు వల్ల ప్రజల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రజారవాణా అందరికీ పూర్తిగా అందుబాటులోకి తెచ్చిననాడు తప్ప వాహనాల కాలుష్యాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు. వాహనాల రద్దీని నియంత్రించడానికి ఢిల్లీలో అనుసరించిన ‘సరి-బేసి’ విధానం ఆచరణలో అనుకున్నంత ఫలితమివ్వలేదు. అందువల్ల సమగ్ర నియంత్రణ విధానాన్ని రూపొందించి ఆచరణకు తేవాలి. వాయుకాలుష్య నియంత్రణలో అగ్రగామిగా ఉన్న చైనా తరహాలో, మనదేశంలోనూ ప్రత్యక్ష పర్యవేక్షణ కేంద్రాల్ని ఏర్పాటుచేయాలి. అవన్నీ అవినీతి రహితంగా ఉండాలి. పర్యావరణ నియమాల్ని నిక్కచ్చిగా అమలుచేయడంలో భారత్ ముందడుగు వేయాలి. మొక్కలను నాటించడం, వాటిని సంరక్షణను ఉద్యమస్థాయిలో చేపట్టడం ప్రభుత్వాల ముఖ్య బాధ్యతలు. పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలు పడేలా చూడాలి. అప్పుడే ప్రాణవాయువును కొంతవరకైనా నిలబెట్టుకోవచ్చు. మన దేశంలో కాలుష్యం కూడా ఎన్నికల అంశంగా మారితే తప్ప అమాత్యుల దృష్టి అటువైపు పోదేమో!
మాస్కే రక్ష
ప్రపంచంలో ఎటు చూసినా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం.. ఇలా రకరకాల కాలుష్యాలు. నీటి కాలుష్యం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఫిల్టర్‌లను ఉపయోగిస్తాం. శబ్ద కాలుష్యం నుండి కాపాడుకోవడానికి చెవులు మూసుకుంటాం.. మరి వాయుకాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ముక్కుని మూసుకోలేం కదా..!? ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉందంటున్నాడు అతను. మనిషికి ప్రాణం పోయాల్సిన గాలి కలుషితమై ప్రాణం తీస్తుండటం అతన్ని కలిచివేసింది. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు. అలా ఆ సంకల్పంతోనే ఓ ఉత్పత్తి ఆవిష్కృతమైంది. ఇంతకీ ఏంటా ఉత్పత్తి? ఎవరు కనుగొన్నారు? అంటే..
స్వీడన్‌కు చెందిన అలెగ్జాండర్.. 2014వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. ఐఐఎంలో విద్యాభ్యాసం కోసం ఆరునెలల పాటు అహ్మదాబాద్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తొలినెల్లోనే వాయుకాలుష్యం కారణంగా అతనికి ఆరోగ్య సమస్యలొచ్చాయట. పరీక్షల్లో అది ఆస్తమాగా తేలింది. ఓ మంచి మాస్క్ కోసం మార్కెట్ అంతా తిరిగాడట అలెగ్జాండర్. రోజూ తొడుక్కోవడానికి వీలుగా ఉండే సురక్షితమైన మాస్క్ ఏదీ అలెగ్జాండర్‌కు దొరకలేదట. వీధుల్లో తిరిగే వాళ్లందరూ స్కార్ఫ్‌తో వాయు కాలుష్యం నుండి రక్షణ పొందడం చూశాడట. అంతేకానీ శ్వాసకోశవ్యాధులతో పాటు తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదేంటి? అని ఆలోచించి.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడట. తిరిగి స్వీడన్‌కు వెళ్లినప్పుడు స్టాక్ హోం బిజినెస్ స్కూల్‌లో ఫ్రెడ్రిక్ కెంప్, జొహనె్నస్ హెర్మన్, హెహ్దీ రెజ్రాజీలను కలుసుకున్నాడు అలెగ్జాండర్. తన ఐడియా గురించి వారికి వివరించాడు. వారికీ ఆ ఐడియా బాగా నచ్చింది. తన ఆలోచనకు బలమైన ప్రయోజనం ఉంటుందని నమ్మిన అలెగ్జాండర్.. ఇది ప్రపంచంలో గొప్ప మార్పుగా భావించాడు. అలా.. అందరూ కలిసి అత్యాధునికమైన బ్రీతింగ్ మాస్క్‌ను తయారుచేశారు. బయట మార్కెట్లో దొరికే మాస్కులకు ఇది పూర్తిగా భిన్నం. స్వచ్ఛమైన గాలి పీల్చడం అందరి ప్రాథమిక హక్కు అనే నినాదంతో మార్కెట్లోకి ఈ మాస్కును విడుదల చేసింది అలెగ్జాండర్ స్థాపించిన ‘ఎయిరినం’ సంస్థ. వాయు కాలుష్యంతో పాటు బ్యాక్టీరియా, వైరస్, ఇతర కాలుష్యం నుంచి కాపాడుతుందీ మాస్క్. నిత్యం స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఇవ్వడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం అంటాడు అలెగ్జాండర్. ఎయిర్ లీకేజీ కాకుండా, వేరు వేరు ముఖాలకు సరిగ్గా ఫిట్ అయ్యేలా మాస్క్‌ను తయారుచెయ్యడంలో అలెగ్జాండర్ బృందం విజయం సాధించింది. అందరి ముఖాలకు సులువుగా బిగుసుకుపోయేలా సాగే గుణమున్న పాలిస్టర్‌ను ఎంచుకున్నారు. అధిక రక్షణ అందించేందుకు అడ్వాన్స్‌డ్ మల్టీలేయర్ టెక్నాలజీతో తయారుచేసిన ఫిల్టర్‌ను ఇందులో ఉపయోగించారు. శ్వాస తీసుకున్నప్పుడు దుమ్ము, ధూళి, దుర్వాసన, బ్యాక్టీరియా, వైరస్, పోలెన్, పీఎం 2.5 కణాలను 99.9 శాతం ఈ మాస్క్ ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్లను అప్పుడప్పుడూ మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ధూళికణాలతో నిండిపోతాయి కదా.. ఈ మాస్కు ధర ఐదు వేల నుండి ఆరువేల వరకు ఉంటుంది. డాక్టర్లకు, మందులకు డబ్బులు పెడుతూ అనారోగ్యంతో బాధపడే బదులు.. ఇలాంటి మాస్క్ కొనుక్కుంటే మేలేమో కదూ.. ఆలోచించాలి.

- ఎస్.ఎన్. ఉమామహేశ్వరి