S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాటలు - మూటలు

చాలా సంవత్సరాల తరువాత మా అబ్బాయి, అమ్మాయి, నేను, మా ఆవిడ నలుగురము కలవడం వీలైంది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అమ్మాయి సింగపూర్‌లో ఉంటున్నది. మేము ఇంట్లోనే ఉంటాము కాని, పిల్లలు అనుకున్నంత తరచుగా ఇంటికి రారు. వచ్చినా ఇద్దరూ ఒకేసారి రారు. ఎవరికి వారు ప్రయోజకులు అయ్యారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. మాయావిడ కూడా ఇంకా ఉద్యోగం చేస్తున్నది. నేనే తిని ఇంట్లో ఉంటాను. చిత్రంగా మేము నలుగురమూ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉంటున్న మా అబ్బాయి ఇంట్లో కలవడం వీలు కుదిరింది. మేము అక్కడికి వెళ్లిన నెల రోజుల తరువాత మా అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది. అయితే కుటుంబ గాథ గురించి కాదు నేను ఇవ్వాళ చెప్పదలుచుకున్నది.
అంతా పాత రోజులను తలుచుకుంటూ కబుర్లు కలబోసుకుంటూ ఆనందంగా గడుపుతున్నాము. రాత్రి పడుకోవడానికి ఆలస్యం అవుతుంది. బారెడు పొద్దెక్కినా ఎవరూ లేచి రారు. మా అమ్మాయి నిద్ర గురించి పరిశోధన చేస్తున్నది. ఆ విషయంలోనే పిహెచ్.డి చేయాలన్న ఆలోచనలో కూడా ఉంది. ఆమె అందరికంటే ఆలస్యంగా నిద్ర లేచింది. నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. అబ్బాయి సెలవు పెట్టి మాతో గడుపుతున్నాడు కనుక ముగ్గురము హాల్లో ఉన్నాము. అమ్మాయి వచ్చి మీ అందరి స్నానాలు అయినయా, లేక అందరూ క్యూ కే నా అని అడిగింది. మీకెవరికైనా ఏదైనా అర్థం అయిందా? సాధారణంగా అందరికీ తెలియని కారణాల వల్ల ఒక్కొక్క కుటుంబంలో కొన్ని మాటలు కొత్త అర్థాలతో వాడుక అవుతూ ఉంటాయి. అటువంటిదే క్యూ కె కూడా. మా అన్నయ్య వాళ్ల ఆఫీసులో ఒక ఖాన్‌గారు ఉండేవారట. ఆయన సాధారణంగా స్నానం చేయడు అని మా అన్నయ్యకి ఎందుకో అనుమానం వచ్చింది. అతని వద్ద బహుశా చెమట వాసన వచ్చి ఉంటుంది. కొంతమంది పాపం స్నానం చేసినా సరే వాళ్ల శరీరం ఒక రకంగా వాసన వస్తూ ఉంటుంది. బహుశా ఈ ఖాన్‌గారు కూడా అటువంటి మనుషులలో ఒకరు అయి ఉంటారు. ఎవరైనా ఇంట్లో స్నానం చేయకుండా కనిపిస్తే అన్నయ్య నీవు ఇంకా క్యూ కేగా ఉన్నావా అని ఖాన్‌గారి పేరు పొడి అక్షరాలతో అడిగేవాడు. మా కుటుంబానికి ఎప్పుడూ సరదాగా మాట్లాడుకోవడం ఒక ముఖ్య లక్షణంగా నిలబడి ఉంది. అన్నయ్య అందరికంటే ఎక్కువ సరదా మనిషి. ఇక ఆ పొడి అక్షరాలు స్నానం చేయని వారికి గుర్తుగా నిలబడిపోయాయి. ఈ సంగతి తెలియని వారికి అమ్మాయి వచ్చి మమ్మల్ని అడిగిన అంశం ఏమిటో అర్థంకాక తికమక పడాల్సిందే. ఆ మాటకు అర్థం మా అన్నదమ్ములు ముగ్గురు కుటుంబాలలో మాత్రమే అందరికీ తెలుస్తుంది.
మాటలకు అర్థాలు మారతాయి. కొత్త మాటలు పుడతాయి. వాటిని ఎక్కడో తెలివిగలవాళ్లు వాడుకుంటారు. ఆ రకంగా అవి అందరి నోట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముళ్లపూడి పుట్టించిన బుడుగు కారణంగా చాలా కొత్త మాటలు పుట్టి మాలాంటి వాళ్ల నోళ్లలో నానుతున్నాయి. కన్యాశుల్కంలోని మాటలను కూడా మేము ఈ రకంగా వాడుతూ ఉంటాము. ఇవి అందరికీ అందుబాటులో ఉండే విషయాలు. అయితే ఇందాక నేను చెప్పింది మాత్రం చాలా ప్రైవేట్ రకం. అట్లాంటి మాటలు మా ఇంట్లో ఉన్నాయి. మా వర్గంలోను ఉన్నాయి.
ఉపనిషత్తులో ఎక్కడో ఒకచోట కుర్వాణా చీరమాత్మనః అని మంత్రం వస్తుంది. ఇంకేముంది. సరదా కొరకు వెతుకుతూ తిరిగే మా వాళ్లు చీరలకు కుర్వాణం అని పేరు పెట్టారు. ఇటువంటి మరెన్నో ఉన్నాయి. దిభ్యో వడాయై అని ఇంకొక మంత్రం మాట ఉంది. కనుక మాకు వడలకు పేరు దిభ్యలు. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. దాని ధర అవతారం అంటారు మా వాళ్లు. అంటే పది అని అర్థం. కానీ ఇటువంటి మాటలన్నీ నేను చెప్పందే ఎవరికీ తెలియవు.
ఇంట్లో పైకప్పు నుంచి ఒక ఎదురుగడ్డను అడ్డంగా కట్టి ఉంటారు. రెండు చివరలు తాళ్లు కప్పులో కట్టి ఉంటే గడ కొంచెం కింద అడ్డంగా వేలాడుతూ ఉంటుంది. దాని పేరు దండం. దాని మీద తడి బట్టలు, పొడి బట్టలు వేసి పెట్టడం అలవాటు. అప్పట్లో ఇంట్లో బట్టలకు అలమరలు ఉండేవి కావు. ఇప్పటికీ చాలాచోట్ల ఉండవు. తడి బట్టలు దండాలు వేరు. ఆరిన బట్టలను అట్టిపెట్టుకునే దండాలు వేరు. ఉండే బట్టలన్నీ వాటి మీదే ఉండేవి. మొత్తానికి బట్టలు వేసే సదుపాయాన్ని దండెం అంటారు అని పిల్లలకు పెద్దలకు అందరికీ తెలుసు. ఇక అప్పట్లో బావులకు వెళ్లి బట్టలు ఉతుక్కుని, స్నానాలు చేసి రావడం అలవాటు. అట్లా వచ్చేటప్పుడు తడిబట్టలు పిండి తల మీద, భుజం మీద వేసుకుని రావడం మామూలుగా జరిగే పని. చిన్నపిల్లలము కూడా కనీసం వేసవిలో తప్పకుండా బావులకు వెళ్లేవాళ్లం. ఒకనాడు అలా వస్తుంటే పెద్దవాళ్లు అందరూ భుజాల మీద బట్టలు వేసుకోవడం కనిపించి మా తమ్ముడు నా దండెం మీద కూడా బట్టలు వేయండి అని అడిగాడు. అప్పటి నుంచి మా ఇంట్లో భుజాలను దండెం అనడం అలవాటయిపోయింది. వాడు సంచి దండెం మీద ఏసుకొని పోతున్నడు అని మా ఇంట్లో వాళ్లము అంటే మిగతా వాళ్లు ఆశ్చర్యంగా చూచేవాళ్లు.
దోసకాయను గురించి అందరికీ తెలుసు. ఇక కొంత పులుపు రుచి ఉండే బుడంకాయ లేదా బుడుమకాయ గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇప్పట్లో అన్నింటిని దోసకాయలు అని అంటున్నారు. బుడుమకాయ అంటే దోసకాయ కాదు. అది పొట్టిది. పులుపు కలిగి ఉంటుంది. పప్పులోకి పచ్చడి చేసుకోవడానికి దానికి సాటి మరొకటి లేదు. అమ్మ బుడమకాయలను నిప్పులో కాల్చి తొక్క తీసేసి చేసిన పచ్చడి రుచి బహుశా అమృతానికి ఒక్క మెట్టు మాత్రమే తక్కువ. ఇంతకు విషయం ఏమిటంటే మా పొట్టి బుడంకాయ తమ్ముడు, వాడు ఇప్పుడు ఆ మాట అంటే ఒప్పుకోడు. వాడు నిజంగా పెద్ద మనిషి. ఆకారం కూడా పెద్దదే. అప్పట్లో పొట్టివాడు, నాకంటే గడ్డివాడు. ఆ బుడమకాయలను తన భాషలో డుబ్బుడు కాయలు అన్నాడు. ఇక ఆ తరువాత ఇప్పటి వరకు కూడా మా కుటుంబంలో వాటికి పేరు డుబ్బుడుకాయలు. కానీ బజార్లో వెళ్లి అడిగితే పేరు ఎవరికీ అర్థం కాదు. ఇటువంటిదే మరొక మాట మాకు బాగా అలవాటయింది. పిల్లలు, పెద్దవాళ్లు రకరకాల వస్తువులను పోగేసుకుని చూసి ఆనందిస్తూంటారు. వాటివల్ల ప్రయోజనం ఉండవచ్చు లేకపోవచ్చు. జ్ఞాపకాలు మాత్రం చాలా ఉంటాయి. కొన్నింటి వల్ల లాభం కూడా ఉంటే ఉండవచ్చు. ఎవరికి వారు ఇటువంటి సేకరణను సర్ సాలార్‌జంగ్ లాగా పోగేసుకుని దాచుకుంటారు. సాలార్ జంగ్ కూడా ఇలాగే సరుకులను పోగేసి ఏకంగా ప్రదర్శనశాల పెట్టేవాడు. నేను మీరు ఆ పని చేయలేము. ఎవరి కలెక్షన్ వారి వద్దనే ఉంటుంది. నాకు అన్నయ్య అయ్యే శేషాద్రి, నేను చిన్నప్పుడు కలిసినప్పుడల్లా మామా కలెక్షన్లను ప్రదర్శించుకుని ఆనందించే వాళ్లం. శేషాద్రి కలెక్షన్‌కు ఒక పేరు పెట్టాడు. దాన్ని వాడు సర్పరాయి సామాను అన్నాడు. ఈ మాటకు అర్థం తెలియదు. అసలు అర్థం లేదు. అందులో సర్పం లేదు. రాయి అంతకన్నా లేదు. సరఫరా లేనే లేదు. మాకు మాత్రం ప్రత్యేకంగా అర్థం ఉంది. మిగతా వాళ్లకు ఆసక్తి ఉండనీ లేకపోతే, మనకు మాత్రం ఆసక్తిగల సంబంధం లేని పదార్థాల సమూహం అని ఆ మాటకు మేము చేసుకున్న అర్థం. ఈ సంగతి ఇంకా ప్రపంచానికి తెలియదు. మా ఇంట్లో వాళ్లకు కూడా చాలామందికి ఈ సంగతి తెలియకపోవచ్చు. మా అబ్బాయికి మాత్రం అది తలకెక్కింది. ఏదో ఒక వస్తువును చూపించి ఏమిటది అని అడిగితే సర్పరాయి సామానులే అనేస్తాడు. నాకు చివరికి ఒక ఆలోచన వచ్చింది. నేను చేతనవుతుంది కదా అని కవితలు, అనువాదాలు, ఫొటోలు, బొమ్మల సేకరణ మొదలైనవన్నీ నా బ్లాగులో అందరితో పంచుకున్నాను. వాటిలో ఎవరికి నచ్చాయి అన్న సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం అన్నీ నచ్చాయి. కనుకనే నేను వాటిని పంచుకున్నాను. తెలుగు నుంచి ఇంగ్లీషులోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు, నేను నా పిల్లలు తీసిన ఫొటోగ్రాఫ్‌లు మరెన్నో ఉన్నాయి బ్లాగులో. కథలు కవితలు అయితే సంకలనంగా పుస్తకం వేసుకోవచ్చు. కానీ బ్లాగులోని అన్ని విషయాలు అలా పుస్తకంగా రావడం కొంచెం కష్టం. అయినా సరే ఆ గజిబిజి సంకలనాన్ని ఒక పుస్తకంగా తీసుకురావాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకానికి శీర్షిక కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాలా? దాని పేరు సర్పరాయి సామాను. పుస్తకం కోసం మీరు కూడా ఎదురుచూడండి. అందులోని అంశాలను చూడదలుచుకుంటే లోకాభిరామం అని నెట్లో వెతకండి. నిజానికి చాలామంది పత్రికలలో వచ్చిన వ్యాసాలను బ్లాగులో పెట్టి పంచుకుంటారు. నా విషయంలో మాత్రం సర్ పరాయి సామానుతో లోకాభిరామం ముందు మొదలైంది. తరువాత ఇదిగో ఈ పత్రికలోకి వచ్చింది. అది వేరే కథ.
బిఎస్‌ఎన్‌ఎల్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఇటువంటి పొడి అక్షరాలు మరిన్ని చెప్పినా తెలిసి ఉంటుంది. కానీ పియుజిపి అంటే తెలుసునా? తెలియదు గాక తెలియదు. బల్ల కనుక ఉంటే నమ్మకంగా గుద్ది చెప్పగలను. ఎందుకంటే ఇది మేము తయారుచేసుకున్న ఒకానొక ఎక్రోనిం. అంటే పొడి అక్షరాల కలయిక అని అర్థం. వెనకటి నుంచి ఎవరైనా మరి బిగిసిపోయి మిగతా వారితో కలవకుండా బిర్రుగా ఉంటే అటువంటి వారిని వర్ణించడానికి పుట్టెడు ఉప్పు, గడ్డపార మింగినట్టు ఉన్నాడు అనడం అలవాటు. ఉప్పు మింగితే డీహైడ్రేషన్ అవుతుంది. మనిషి కర్రలాగా మారిపోతాడు. ఇక గడ్డపార మింగడం కుదురుతుందా తెలియదు గాని ఉప్పు కూడా పుట్టెడు మింగడం ఎవరి వల్ల కూడా కాదు. మొత్తానికి ఆ పనులు చేయకుండానే మనుషులు బిగిసిపోవడం మాత్రం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. అటువంటి వారిని చూసి ఆ పాతకాలపు మాట అనవసరం లేకుండా మేము పి యు జి పి అంటూ ఉంటాము. ఈ మాట మీద మాకేమీ కాపీరైటు లేదు. మీకు నచ్చితే మీరు కూడా వాడుకోవచ్చు. కావాలంటే సినిమా డైలాగులు రాసేవాళ్లకి చెప్పండి. వాళ్లు కావలసిన చోట ఎక్కడో వాడుకుంటారు. ఇప్పుడది అందరి నోటా నానుతుంది. ఎవరి వెర్రి వారికి ఆనందం. ఇందాక బీఎస్‌ఎన్‌ఎల్ అన్నానా? మా అమ్మాయి దాన్ని కొంచెం మార్చి బసనల్ అన్నది. అప్పుడా అమ్మాయి నిజానికి చాలా చిన్నది. ఆమె చేసిన ప్రయోగం మాత్రం నాకు చాలా గొప్పగా కనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఒకానొక పరిశోధన సంస్థను వలంతారి అంటారు. ఆ మాటకు అర్థం లేదు. అవి నిజానికి పొడి అక్షరాలు. సాగునీరు, వ్యవసాయ క్షేత్రాలు, ఆ రెంటి సంబంధం గురించి శిక్షణ, పరిశోధనలు చేసే సంస్థ ఇది. సులభంగా పలకడానికి అనువుగా ఉంటుందని దాని పేరు అలా మార్చేశారు. బి ఎస్ ఎన్ ఎల్ ను బసనల్ అంటే ఎవరికి మాత్రం అభ్యంతరం ఉండాలి? అవసరం లేదు కదా? నేను ఈ ఫార్ములాను ఒకచోట సమయానికి తగిన పద్ధతిలో వాడుకున్నాను. అప్పట్లో నేను హెచ్ ఎం ఆర్ ఐ అనే సంస్థలో పనిచేసేవాడిని. అది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని గొప్ప ఉద్దేశంతో పుట్టిన సంస్థ. అందులో కార్యకలాపాలను గురించి ప్రజలకు తెలియజేయవలసిన విభాగంలో నేను ఉన్నాను. ఒకానొక మీటింగులో మన సంస్థ పేరు పొడి అక్షరాలను పలకడం అంత వీలుగా లేదు. కనుక మా అమ్మాయి ఫార్ములా ప్రకారం దీన్ని హమారీ అంటే బాగుంటుంది. ఆ మాటకు మనది అన్న అర్థం వస్తుంది. అప్పుడది ప్రజలకు మరింత దగ్గరగా అవుతుంది. ప్రజలే సంస్థ స్వంతదారులు అవుతారు అంటూ ఏవో చెప్పేశాను. అందరికీ నచ్చింది. చప్పట్లు చరిచారు. సంస్థ ఉంది. అందులో నేను లేను. కానీ ఆ సంస్థను ఎవరు హమారీ అనుకోవడం లేదు. అది పూర్తిగా వేరే విషయం.
మీకు పిషరొట్టె అన్న మాటకు, అలాగే బరొట్ట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మొదటి మాట పెసరట్టుకు మా అమ్మాయి చిన్నతనంలో పెట్టిన పేరు. ఇక బరొట్ట అన్నది మద్రాస్‌లోని ఒక క్యాంటీన్ వారు పరాఠాకు పెట్టిన పేరు. మేము ఇప్పటికీ ఈ మాటలను వాడుకొని నవ్వుకుంటూ ఉంటాము. అట్లాగే పింగనాష్టకము అన్న మరో మాట కూడా ఉంది. ఆ మాటకు అర్థం ఏమిటో నాకు కూడా తెలియదు. అంటే అర్థం లేని విషయం అని అర్థం. మా పిల్లలు అర్థం లేని విషయాలను పింగనాష్టకము, పిషరొట్టె అంటుంటారు.
నేను ఇలాగా ఎన్ని మాటలైనా చెప్పగలను. అవి చదువుతున్న మీకు, మీ ఇంట్లో ఇటువంటి మాటలు తప్పకుండా ఉండి ఉంటాయని నా నమ్మకం. వాటిని గురించి నాకు ఎవరు చెప్పాలి? అదే మరి!
చివరకు రెండు మాటలతో సోది కట్టేసాను. ఉదబంతిక జియ్యమ అంటే ఏమిటి చెప్పండి. నాన్న వాళ్లకు సిలబస్ అంటూ వచ్చిన ఆదేశాలలో ఈ మాట ఉందట. అర్థం లేని మాట అనడానికి నాన్న అది ఒక ఉదబంతిక జియ్యమ అనేవాడు. నాన్నగారు, అనేవారు అనలేదని ఆశ్చర్యపడకండి. ఇక ఈ మధ్యనే నేను గమనించిన మరొక మాట స్వాస్థ్య జాగ్రుక్తమా. ఈ మాటను మహా ఘనత వహించిన రాష్ట్ర ప్రభుత్వం వారు తయారుచేసిరి. అర్థమయితే చెప్పండి. ఇతి శం. అంటే ఇంక చాలు.

-కె.బి.గోపాలం