S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కల్యాణం వైభోగమే!

=========================
ఆకాశమంత పందిరి..
భూదేవంత అరుగే కాదు..
చుక్కల లోకంలో..
ప్రతి ఒక్కరూ దిక్కులు చూసేలా..
అట్టహాసంగా.. ఆడంబరంగా..
ఆ స్వర్గమే ఇలకు
దిగివచ్చిందా అనేట్లుగా..
ఎటుచూసినా ముత్యాల పందిళ్లు..
బంగారు లోగిళ్లు..
రెడ్ కార్పెట్ మెరుపులు..
పూలరాశులు..
ప్లాటినం.. వజ్రాలు.. బంగారం.. వెండి.. నవరత్నాలు.. ముత్యాల సొగసులన్నీ అమ్మాయి శరీరంపై కొలువుతీరినట్లుగా..
=============================

అట్టహాసంగా.. దర్పంగా.. హోదాగా.. హుందాగా.. బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి కొన్ని పెళ్లిళ్లు.. ఆడంబరానికి హద్దులే లేవు అన్న చందంలో ఒక్కరోజు పెళ్లికి కోట్లు ఖర్చు పెడుతున్నారు.
ఇషా అంబానీ పెళ్లికార్డే మూడు లక్షలట.. పెళ్లి కార్డే ఇంత ఖరీదైతే.. ఇక పెళ్లికి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు పెట్టనున్నాడో..
సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతోల పెళ్లిళ్లు అక్షరాలా రూ. 552 కోట్లతో నభూతో నభవిష్యతీ అన్న చందాన జరిపించాడు..
‘మైనింగ్ సామ్రాట్’ గాలి జనార్దన్‌రెడ్డి తన కూతురి పెళ్లికి అక్షరాలు రూ. 500 కోట్లు ఖర్చు చేశాడు..
ప్రముఖ స్టీల్ వ్యాపారవేత్త అయిన లక్ష్మీ మిట్టల్ 2004లో తన కూతురు వనీషా పెళ్లిని రూ. 350 కోట్ల ఖర్చుతో ఘనంగా చేశాడు..
అప్పటి కాంగ్రెస్ మంత్రి కన్వర్ సింగ్ కుమారుడు లలిత్ పెళ్లిని ఢిల్లీలో రూ. 250 కోట్లతో చేశాడు..
ఇక వంద కోట్లతో పెళ్లిళ్లు చేసేవారి సంఖ్య చెప్పనవసరం లేదు. మంచి ముహూర్తం చూసి మూడు ముళ్ళ బంధం వేస్తే అదే పెళ్లి.. ఎలా చేసినా ఆ వివాహ బంధానికి పవిత్రత తరగదు. కానీ కొనే్నళ్లుగా వివాహ వేడుకులకు ఆర్భాటపు హంగులు పెరిగాయి. పట్టుచీరలు, బాసికాలు, తాళిబొట్టు, మెట్టెలు, పూలదండలు, జీలకర్రాబెల్లం, సన్నికల్లు, గరికముంతలు, సారె బిందెలు.. ఇలా పెళ్లి వేడుకలో ఉపయోగించే వస్తువుల జాబితా చాలానే.. వాటిని బజారునుంచి కొని తెచ్చుకోవడం సులువే.. కానీ అవి పెళ్లిళ్లలో ప్రత్యేకతంగా కనిపించాలంటే.. ఆకట్టుకునేలా, అందంగా, వైవిధ్యంగా ఉండాలంటే కొత్తగా తయారుచేసుకోవాలి.. లేదా వాటిని అలా తయారుచేయించుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిలో ప్రతీదానికీ డిజైనర్ లుక్కు తేవాలి. అలాచేస్తేనే పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ వింతగా చూస్తూ గొప్పగా చెప్పుకుంటారు.
నిశ్చయం
నిశ్చయ తాంబూలాల్లో వధువుకు తెచ్చే సారెతో మొదలవుతుంది పెళ్లి వేడుక. ఆడ, మగ పెళ్లి వారి వైపు నుంచి జరిగే తంతులను చూపించే విధంగా బొమ్మలు, పండ్లు, పూలు పెట్టే ట్రేలు, ధగధగలాడే వస్త్రాలు, చకీలు, కుందన్లతో మెరిసిపోయేలా ఎంచుకోవచ్చు. లేదా తాటాకు బుట్టలకే వివిధ రకాల చకీలు అద్ది సంప్రదాయ లుక్‌ను కూడా తీసుకురావచ్చు. ఇక అమ్మాయి, అబ్బాయి మార్చుకునే ఉంగరాల సంగతి చెప్పనే అక్కరలేదు. సింగిల్ సాలిటేర్ డైమండ్ రింగ్ మొదలుకుని ఏ ఆభరణాలైనా నిశ్చయ తాంబూలాల్లో చేరిపోతాయి. మునుపు ఎంగేజ్‌మెంట్‌కి అమ్మాయిలు చీరలు కట్టుకునేవారు కానీ నేడు అందరూ లెహంగాల్లో ఒదిగిపోతున్నారు.
మంగళ స్నానాలు
మంగళస్నానాల వేళ ఉపయోగించే నీళ్లబిందెలు, జల్లెడల రూపురేఖలే మారిపోయాయి. ఆడంబారాల పెళ్లిళ్లలో ఇవి కొత్తరూపును సంతరించుకుని వేడుకకే కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. బంగారు, వెండి బిందెలు, బంగారు, వెండి జల్లెడలకు నవరత్నాలను, కుందన్లను పొదుగుతున్నారు. ఆఖరికి పసుపు దంచడానికి ఉపయోగించే రాతి రోలు, రోకలికి కూడా కుందన్లు, పూలు, బంగారు, వెండి రంగుల్లో నెట్ వస్త్రంతో చేసిన అలంకరణలూ ‘వారెవ్వా’ అనిపిస్తున్నాయి. మెహెందీ, మంగళస్నానం సందర్భాల్లో వధువు వేసుకునేందుకు పూలనగలు, జడల డిజైన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇటు సంప్రదాయాన్ని, అటు పాశ్చాత్య శైలినీ మేళవించి కనువిందు చేసే పూల నగలు వధువుకు కొత్త సొగసును తెచ్చిపెడతాయి. పైగా వీటిని వధూవరుల దుస్తులు, మండపం అలంకరణలకి నప్పేలా తయారుచేస్తున్నారు.
కొబ్బరిబోండాం
కొబ్బరిబోండాంకి అంత సీను ఎందుకండీ? అనుకోకండి. వధువుతోపాటే చక్కగా ముస్తాబైపోతుంది కొబ్బరిబోండాం. వాటిపై సీతారాములు, వధూవరుల పేర్లు, వివాహఘట్టాల వంటి రకరకాల పెయింటింగ్స్‌ను కుందన్లు, నవరత్నాలతో అలంకరిస్తున్నారు.
బాసికం
వేడుక మొదలైందని సూచించే నుదుటి బాసికం సాదాసీదాగా ఎందుకుండాలి.. అందుకే వాటినీ బంగారం, వజ్రాలతో తయారుచేస్తున్నారు స్వర్ణకారులు. అదీ వధూవరుల నుదుటి భాగం వెడల్పు, పొడవులను అనుసరించి ఇవి తయారవుతున్నాయి.
బుట్టలు
మేనమామలు వధువును బుట్టలో కూర్చోబెట్టి మండపానికి తీసుకుని వస్తారు. ఈ వేడుక కోసం పట్టు, వెల్వెట్, బెనారస్ వంటి వస్త్రాలను, జరీ అంచులను, కలువ పువ్వులను ఉపయోగించి తయారుచేసే బుట్ట చూపరులను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఇలాగే సారె బుట్టలు కూడా ఎంతో అందంగా తయారవుతున్నాయి. అమ్మాయిని మేనమామలు తెచ్చేటప్పుడు ఉపయోగించే ముత్యాల పందిరి అందం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఇక వరుడిని కాశీకి పంపే ఘట్టంలోని గొడును మల్లెపూలతో కానీ, ముత్యాలతో కానీ అల్లేస్తున్నారు. వీటికి అదనంగా వేలాడే పూలతీగలు, కుందన్లూ వావ్ అనిపిస్తున్నాయి.
అడ్డుతెర
కాబోయే వధూవరుల దోబూచులాటకు అడ్డుతెర అదనపు హంగుని తెచ్చిపెడుతుంది. మునుపు దీనికోసం కొత్త దుప్పటిని కానీ, పట్టు పంచెను కానీ వాడేవారు. ఆ స్థాయి నుంచి నేడు పట్టువస్త్రాలపై వధూవరుల చిత్రాలు, సీతారాముల పెళ్లి సంబరాలు, మల్లెపూలు, ఆర్కిడ్లు, గులాబీలు, లిల్లీలతో అల్లేసిన అడ్డుతెరలే ప్రత్యేకం.
జీలకర్ర-బెల్లం
జీలకర్ర, బెల్లాన్ని అలా వదిలిపెడితే ఏం బాగుంటుంది? అనుకున్నారేమో.. అందులో కూడా చకీలు, కుందన్లు, ముత్యాలు అద్ది అదరగొట్టేస్తున్నారు.
పూలదండలు
పెళ్లిలో వధూవరుల దుస్తులకు నప్పేట్లుగా పూలరేకలతో తయారుచేసిన దండల ప్రత్యేకతే వేరు. విదేశీ పూలు, కలువ పూలు, గులాబీలు, మల్లెలు, లిల్లీలు, ఆర్కిడ్లు, తులిప్‌లు వంటివాటితో పూలదండలు కొత్తందాలను సంతరించుకుంటు న్నాయి. వీటితో పాటు ముత్యాలు, పగడాలతో కలిపి చేసిన దండలు, కర్పూర దండలు, యాలకుల దండలు కూడా
హంగులు అద్దుకుంటున్నాయి.
కన్యాదానం

కన్యాదానం చేసే బంగారు పళ్లెం, నీళ్లుపోసే బంగారు చెంబులకు కూడా నూలు దారపుపోగులు కాకుండా ముత్యాలు, పచ్చలు, కెంపులు, నీలాలు వంటివాటితోపాటు రంగురంగుల పట్టుదారాలను వాడేస్తున్నారు.
తలంబ్రాలు
మునుపు బియ్యాన్ని శుభ్రం చేసి పసుపు, చిటికెడు కుంకుమ, ఆవునెయ్యితో తలంబ్రాలను కలిపేవారు. ఇప్పుడు తలంబ్రాలుగా పచ్చలు, కెంపులు, నీలాలు, ముత్యాలు.. వంటివాటిని ఉపయోగిస్తూ ఆడంబరాల పెళ్లిని మరింత ఆడంబరం చేస్తున్నారు.
సన్నికల్లు
పెళ్లి ఘట్టంలో చివరి అంకం సన్నికల్లు తొక్కడం.. దీన్ని కూడా జరీ నెట్, పచ్చలు, ముత్యాలను పోలి ఉండే కుచ్చులతో అందంగా అలంకరిస్తున్నారు.
* ఇక పెళ్లిళ్లలో గరికముంత ప్రత్యేకతే వేరు. గరికముంతను సున్నంతో డిజైన్ చేయడం పాతమాట. ఇప్పుడు వాటికి కాంతివంతమైన రంగులేసి కుందన్లు, అద్దాలు అద్ది, పట్టు నగిషీలతో అందంగా మార్చేస్తున్నారు.
* కొబ్బరిచిప్పలకు కూడా కుందన్లు, పట్టుదారాలతో నగిషీలద్దుతున్నారు.
వధూవరుల ముస్తాబు
ఇక వధూవరుల ముస్తాబు సంగతి చెప్పనక్కరలేదు. పెళ్లికూతురికైతే ఒళ్ళంతా వజ్రాల నగలే.. పాపిడిబొట్టు దగ్గర నుంచి, హారాలు, వడ్డాణం, బంగారు జడ, పట్టీలు.. ఇలా ఎన్నో.. వీటితో పాటు బంగారం, వెండి కలగలపుతో నేసిన పట్టుచీరలు.. వెరసి పెళ్లికూతురి ముస్తాబు రెడీ. నిశ్చయ తాంబూలం దగ్గర నుండి అప్పగింతల వరకు వేడుకను అనుసరించి వస్త్రాలు ముందుగానే తయారు. దుస్తులను అనుసరించి నగలు, వీటన్నింటినీ అనుసరించి అమ్మాయిని ముస్తాబు చేయడానికి ఓ బ్యూటీషియన్. ఇలా.. పెళ్లంటే అంతా ఖర్చే..
అబ్బాయికి కూడా వేడుకను అనుసరించి దుస్తులు, వాటిపైన యువరాజులు వేసుకున్నట్లుగా ముత్యాలు పొదిగిన నగలు, వీటన్నింటికీ సూటయ్యే పాదరక్షలు.. ఇలా ఎన్నో..
మండపాలు
అన్నింటి గురించీ మాట్లాడుకున్నాం.. కానీ పెళ్లి మంటపం సంగతి మరిచిపోయాం. పెళ్లి తారీఖు పక్కా అయిన తర్వాత ముందుగా అందరూ చూసుకునేది పెళ్లి మంటపానే్న. స్వాగత ద్వారం నుంచి పెళ్లి జరిగే స్థానం వరకు ఏ థీమ్ డెకరేషన్‌లో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు కాబోయే వధూవరులు. ఎటుచూసినా పూల పందిళ్లు, విద్యుత్ అలంకరణలే.. బాహుబలి సెట్టింగో.. రాజమహల్ సెట్టింగో వేసి పెళ్లిచేస్తే వధూవరులు యువరాజు, యువరాణుల్లా ఆ సెట్టింగులో ఇట్టే ఒదిగిపోతారు.
భోజనాలు
పెళ్లంటే.. ప్రస్తుతం అట్టహాసం, ఆడంబరం. ఫలానా వారి పెళ్లిలో స్పెషల్ ఏంటో తెలుసా.. ఆకు చూసే కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఒక్కో ఆకు ఖరీదు దాదాపు రెండు వేలు. అంతెందుకు అంటారా.. ఆకుపై 125 ఆహార పదార్థాల రకాలు వేశారు మరి.. అందుకే అంత ఖర్చు.
ఫొటోలు
లాస్ట్.. బట్ నాట్ ద లీస్ట్.. అన్నట్లుగా ఇవన్నీ అందంగా, పదికాలాలపాటు జ్ఞాపకాలుగా నిలవాలంటే ఫొటోగ్రఫీ తప్పనిసరి. వెడ్డింగ్ ఫొటోషూట్ పేరుతో పెళ్లికి ముందే వధూవరులను తీసుకెళ్లి సినిమా హీరోహీరోయిన్లలా ఫొటో షూట్లు చేయడం నేటి ఫ్యాషన్.
ఇలా పెళ్లి ఓ స్టేటస్ సింబల్లా మారిపోయింది. ఒకప్పుడు ఖరీదైన ఇళ్లు, కార్లు సమాజంలో స్టేటస్ సింబల్. ఇటీవలి కాలంలో పెళ్లి కూడా ఆ జాబితాలో చేరిపోయింది. తమ ఆర్థిక పరిస్థితిని పెళ్లి వేడుకలో నిరూపించుకుంటున్నారు బడాబాబులు. ప్రతి ఒక్కరికీ జీవితంలో వచ్చే ఒకే ఒక్క వేడుక పెళ్లి.. అందుకే అట్టహాసంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తహతహలాడుతున్నారు. ఎందుకంటే చుట్టాల నుంచి స్నేహితుల వరకు అందరూ పెళ్లికి వస్తారు. వధూవరులను ఆశీర్వదిస్తారు.. అందుకే పదిమంది పది కాలాలపాటు గొప్పగా చెప్పుకునేలా ఏర్పాట్లు చేయాలని తహతహలాడుతున్నారు. దీనిలో భాగంగానే కోట్లు ఖర్చుపెడుతున్నారు. అదిరిపోయే సెట్టింగ్‌లు.. ఆహా అనిపించే విద్యుత్ అలంకరణలు.. అందంగా అలంకరించిన పెళ్లి మంటపాలు కళకళలాడుతున్నాయి. ఇక ఇవి కాకుండా నూతన వధూవరుల అలంకరణ వస్తువులు కూడా అదిరిపోయేలా ఉంటున్నాయి. భారీ వివాహాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్స్ కూడా ఉంటున్నారు. ఖర్చయినా ఫర్వాలేదు.. పెళ్లి అట్టహాసంగా సినిమా స్టైల్లో జరిపించుకోవాలనుకుంటున్నారు.
ఉపాధికి మార్గం..
ఆర్భాటపు వివాహాలు చేయడం మంచి విషయమే.. ఇంతింత ఖర్చుపెట్టి పెళ్లిళ్లు చేస్తే అది మంచి విషయం అంటున్నారా? అని దబాయిస్తున్నారా? వినండి.. ఒక ఊరిలో ఫాక్టరీ కట్టడానికి ఊరి యువతకు ఉపాధి దొరుకుతుందని ఒప్పుకుంటాం.. ఇదీ అలాంటిదే.. ప్రతి వస్తువు అలంకరణకూ ఎంత మంది పనిచేయాలి? బంగారం, వెండి కలగలసిన పట్టుచీర నేయడానికి ఆ నేతన్న కుటుంబం ఎన్ని రోజులు పనిచేయాలి? మండపం సెట్టింగు, పూల అలంకరణ, విద్యుత్ అలంకరణకు ఎంత మంది పనిచేస్తే ఆ పనులన్నీ అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. నగలు తయారుచేయడం.. వధూవరులను తయారుచేయడం.. వంటలను తయారుచేయడం.. గోరింటాకు పెట్టడం.. ఇలా.. ఎన్ని పనులు? అన్ని పనులనూ వెడ్డింగ్ ప్లానర్స్, కాంట్రాక్టర్స్, డెకరేటర్స్ సాయంతో ఆడంబరాల పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగిపోతుంది. చాలామందికి ఉపాధి దొరుకుతుంది.
ఈ ఆడంబరాల పెళ్లిళ్లల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటో తెలుసా.. నల్లధనం సమాజంలోకి రావడం.. నల్లధనాన్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం నానాతంటాలను పడుతోంది. ఇందులో భాగంగానే పెద్దనోట్ల రద్దు జరిగింది. అయినా సరే నల్లధనాన్ని దేశానికి రప్పించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. దేశసంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా దాచుకునే ఒక్క పెద్ద చేపను కూడా పట్టుకోలేకపోయారు పాలనాధికారులు. ఇలాంటి ఆడంబర పెళ్లిళ్ల వల్ల కొద్ది మొత్తంలోనైనా నల్లధనం సమాజంలోకి వస్తుంది కదా అనిపిస్తుంది ఇలాంటి పెళ్లిళ్లను చూస్తుంటే.. తమ ఆస్తులకు తగిన టాక్సులు కట్టకుండా బహిరంగంగా కోటానుకోట్లు ఖర్చుపెట్టి పెళ్లిళ్లు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుంటుంది ప్రభుత్వం. ఒక్కరూపాయి నల్లధనాన్ని కూడా వెలికితీయలేని చేతకాని ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఇలాంటి ఆడంబరాల పెళ్లిళ్లు ఎన్ని జరిగితే అంత మంచిది అనుకోవాలి సమాజం. అంతే.. అంతకుమించి ఏం చేయగలం? *

-- ఎస్.ఎన్. ఉమామహేశ్వరి