S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పందెం

బ్రిటీష్ జైళ్లల్లోంచి ఇటీవల తప్పించుకునే ఖైదీల సంఖ్య పెరిగింది. ఓ రోజైతే ఏకంగా ఐదుగురు ఐదు జైళ్ల నించి తప్పించుకున్నారు. దినపత్రికల్లో ఈ అంశం మీద హాస్యంగా వ్యాసాలు, కార్టూన్లు చాలా వెలువడ్డాయి. మీడియా తమని అపహాస్యం చేస్తూండటంతో జైళ్ల అధికారులు ఖేదీలు పారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి నడుం బిగించారు.

ఈ నేపథ్యంలో పందెం వ్యాపారం అభివృద్ధి చెందింది. ఓ రోజు జైలు నించి ఓ ఖైదీ తప్పించుకుంటాడా? లేదా? అని పందెం కాసేవాళ్లు అధికం అయ్యారు. పందెం వ్యాపారం ఇంగ్లండ్‌లో ప్రభుత్వ లైసెన్స్‌తో నడుస్తుంది. లండన్‌లోని దాదాపు ప్రతీ వీధిలో పందెం దుకాణాలు కనిపిస్తాయి. హైడ్ పార్క్‌లోని స్పీకర్స్ కార్నర్‌లా పందెం దుకాణాలు కూడా మా ఇంగ్లీష్ ప్రజల స్వేచ్ఛకి గుర్తించబడని చిహ్నం. ఒక్క గుర్రాల మీదే కాక ఏ విషయం మీదైనా ఇంగ్లండ్‌లో పందెం కాయచ్చు. ఏదీ చట్ట వ్యతిరేకం కాదు. ఇలా లండన్ వాతావరణం మీద, లండన్‌లో ఆ రోజు ఎంతమంది పుడతారు? వారిలో మగాళ్లెంత మంది? ఆడవాళ్లెంత మంది? అలాగే ఎంత మంది మరణిస్తారు? లాంటి ఎన్నో వింత అంశాల మీద పందాల ప్రకటనలని మీరు ఇంగ్లీష్ దినపత్రికల్లో చదవచ్చు. తమ అదృష్టం మీద నమ్మకం ఉన్న వాళ్లంతా వాటిలో పాల్గొంటూంటారు. సాధారణంగా పందెంరాయుళ్లు ఓడిపోయి వ్యాపార సంస్థలు గెలుస్తూంటాయి.
ఓ రాత్రి క్వీన్స్ హెడ్ పబ్‌లో నా మిత్రుడు, బుకీ ఐన టిమ్ టబ్ హాస్యంగా, ‘ఇంకో పనె్నండు గంటల్లో బ్రిటన్‌లోంచి ఏదో జైల్ నించి ఓ ఖైదీ పారిపోతాడు’ అని ఐదు రెట్ల పందాన్ని ప్రకటించాడు. అక్కడి పందెం రాయుళ్లు ఎవరూ పారిపోరనే పందెంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అక్కడ వచ్చిన స్పందన ప్రేరణతో మర్నాడు పేపర్లో అతను ఓ వ్యాపార ప్రకటనని ఇచ్చాడు. తర్వాతి ఇరవై నాలుగు గంటల్లో బ్రిటీష్ జైలు నించి ఓ ఖైదీ పారిపోతాడని పందెం. ఒక్కరు పారిపోతే 3-1, ఇద్దరు పారిపోతే 5-1, ముగ్గురు పారిపోతే 10-1, నలుగురు పారిపోతే 20-1, ఐదుగురు పారిపోతే 33-1. ఏ జైల్ నించి పారిపోతారో పందెం కాస్తే పందెం సొమ్ము రెట్టింపు ఇస్తాడు.
చాలామంది నా దగ్గరికి వచ్చి నేను అలాంటి పందాన్ని స్వీకరిస్తానా అని అడిగారు. ఐతే నేను దేవుడు ఇచ్చే దాంతో తృప్తిపడే వాడిని తప్ప నా స్నేహితుడి వ్యాపారాన్ని దొంగిలించే వాడిని కాను కాబట్టి వారిని అతని దగ్గరికి పంపాను.
తర్వాతి వారం మధ్యలో ఓ పందెంరాయుడు నా షాప్‌కి వచ్చి ఓ అసాధారణ పందెం గురించి చెప్పాడు. లంచ్ చేశాక నిద్రకి కునికే ఆ సమయంలో అతను వచ్చాడు. సాయంత్రం అవగానే గెలుచుకున్న వాళ్లు వచ్చి డబ్బు తీసుకుంటారు కాబట్టి నాకు విశ్రాంతి లభించేది భోజనానంతరమే.
నా అసిస్టెంట్ నా దగ్గరికి నీలం రంగు సూట్‌లోని నలభై ఏళ్ల వ్యక్తిని తీసుకువచ్చాడు. ఆ కొత్త వ్యక్తిని చూడగానే పెద్దమనిషై ఉండడని నాకు అనిపించింది. ఐతే చాలామంది పెద్దమనుషులు నా షాప్‌కి రారు. కారణం వాళ్లు పందాలు కాయరు.
‘మీరు మిస్టర్ గాడ్‌ఫ్రే బాడ్కిన్సా?’ అతను ప్రశ్నించాడు.
‘అవును. నా పేరదే. కొందరు ‘పందెం రాయుడు బాడ్కిన్స్’ అనే ముద్దు పేరుతో కూడా పిలుస్తూంటారు’ నవ్వుతూ చెప్పాను.
‘తర్వాతి ఇరవై నాలుగు గంటల్లో జైలు నించి పారిపోయే పందాలని మీరు స్వీకరిస్తారు అనుకుంటాను?’ అడిగాడు.
‘అవును. బయట బోర్డ్ మీద ఆ సంగతిని లోపలకి వచ్చేప్పుడు మీరు చదవలేదా?’ అడిగాను.
‘నేను కొంత సొమ్ము కాయాలని వచ్చాను’
నేను నా సహాయకుడితో అతని సంగతి చూడమన్నాను. అతను వెంటనే చెప్పాడు.
‘కాని మీతోనే మాట్లాడమన్నాను సార్. ఇతను చాలా పెద్ద మొత్తం కాస్తానంటున్నాడు’ నా అసిస్టెంట్ వెంటనే చెప్పాడు.
‘ఎంత?’
‘పది వేల పౌన్లు’
అది చాలా పెద్ద మొత్తం. నేను ఒకర్నించి అంత పెద్ద మొత్తాన్ని ఎన్నడూ పందెంగా స్వీకరించలేదు.
‘మీ పేరు?’ అడిగాను.
‘స్మిత్’
‘మిస్టర్ స్మిత్. నేను పందెం స్వీకరిస్తాను. మీరు దేని మీద పందెం కాయాలని అనుకుంటున్నారు?’ అడిగాను.
‘తర్వాతి ఇరవై నాలుగు గంటల్లో స్మర్త్‌వెయిట్ జైల్ నించి ఐదుగురు ఖైదీలు తప్పించుకుంటారని’ అతను చెప్పాడు.
నేను అతని వంక కొన్ని క్షణాలు నోరు తెరచుకుని చూస్తూండిపోయాను. తర్వాత చెప్పాను.
‘మీకోసారి ఆ పందెం నియమాలు చెప్తాను వినండి. మీరు గెలిస్తే ఒకటికి ముప్పై మూడు పౌన్లు ఇస్తాను. ఏ జైలు నించైనా ఐదుగురు తప్పించుకుంటే, ప్రత్యేకంగా మీరు చెప్పిన స్మర్త్ వెయిట్ జైల్ నించి తప్పించుకుంటే అంతకు రెట్టింపు ఇస్తాను. అంటే మీరు చెప్పినట్లు జరిగితే మీరు కాసే పందెంలో మీకు ప్రతీ పౌన్‌కి అరవై ఆరు పౌన్లు వస్తాయి.’
‘అది నేను రాబోయే ముందు లెక్క చూసుకున్నాను. నాకు కావాల్సిందల్లా మీరు పందెం స్వీకరిస్తారా? లేదా? అన్నది’
‘నేను నా బెట్‌ని కవర్ చేసుకునేందుకు నాకో గంట టైం ఇస్తారా?’ అడిగాను.
‘గంటైతే ఆలస్యమవుతుంది. ప్రయోజనం ఉండదు. ఇప్పుడే కాయాలి’ అతను స్థిరంగా చెప్పాడు.
నేనా పందాన్ని ఒంటరిగా కవర్ చేయలేను. దాంట్లో కొంత భాగం ఇంకో షాప్‌లో అతను కాసిన పద్ధతిలో కాసి, ఒకవేళ నేను ఓడిపోతే దాన్ని అలా భర్తీ చేయాల్సి ఉంటుంది. అతను నన్ను తొందర పెట్టడంతో నా తల్లో మెరుపు లాంటి ఓ ఆలోచన కలిగింది.
‘అలాగే. నగదు చెల్లిస్తారా? చెక్కా?’ అడిగాను.
బదులు అతను కోట్ జేబులోంచి ఓ కవర్ తీసి నాకు అందించి చెప్పాడు.
‘రసీదు రాసివ్వండి’
అవన్నీ వంద పౌన్ల నోట్లు. అవి దొంగనోట్లు కావని నిర్ధారించుకుని లెక్క పెట్టుకున్నాక అతనికి రసీదు రాసిచ్చాను.
‘రేపు ఈ సమయానికి పందెం ముగుస్తుంది’ రసీదులోని తేదీని, సమయాన్ని చూపించి చెప్పాను.
‘నేను గెలిస్తే, ఎక్కడ ఏ సమయంలో మీరు నాకు డబ్బు చెల్లించాలో చెప్తాను. మా ఇంటి అడ్రస్ అప్పుడు చెప్తాను. ఇక్కడికి వచ్చి అంత డబ్బు తీసుకెళ్లడం ప్రమాదం. అంగీకారమేనా?’ అడిగాడు.
అది అంతా చేసేదే. మా వ్యాపారంలో అది ఆచారం కాబట్టి ఒప్పుకున్నాను.
అతను బయటకి వెళ్లేప్పుడు సాధారణంగా నేను చేయని పనిని చేశాను. తలుపుని మర్యాదగా తెరచి పట్టుకున్నాను. అతను షాప్‌కి చాలా దూరం వెళ్లే దాకా ఆగి, టెలీఫోన్ రిసీవర్ని అందుకుని స్కాట్‌లేండ్ యార్డ్ నెంబర్ని తిప్పాను.
స్మిత్ ‘గంట తర్వాత ఆలస్యం అవుతుంది’ అన్నది నాలో ఆలోచనల్ని రేపింది. గంటలోగా ఆ జైల్ నించి ఐదుగురు ఖైదీలు తప్పించుకోబోతున్నారని అతనికి విశ్వసనీయంగా తెలీకపోతే అంత డబ్బుని పందెం కాయడు. అతనికా సమాచారం ఎలాగో అందింది. దాన్ని తన ప్రయోజనానికి వాడుకుంటున్నాడు. నాలాంటి పందెంరాయుళ్లని దోచడమే అది. అందుకు నేను సిద్ధంగా లేను.
స్మర్త్‌వెయిట్ జైల్ మా లండన్‌లోని అతి ముఖ్యమైన జైళ్లల్లో ఒకటి. అందులోకి దేశంలోని అతి ప్రమాదకరమైన ఖైదీలనే పంపుతారు. వాళ్లల్లోని ఐదుగురు తప్పించుకుంటున్నారని తెలిసాక బ్రిటీష్ పౌరుడిగా అది పోలీసులకి తెలియచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అనుకున్నాను. పైగా అది నా వ్యాపారానికి కలగబోయే నష్టాన్ని కూడా పూర్తిగా తొలగిస్తుంది. ఎవరికి తెలుసు? ఇది చెప్పకపోతే నేను ఓ నేరంలో భాగస్థుణ్ని కూడా అవుతానేమో?
నా పేరు చెప్పకుండా ఓ బుకీ దగ్గర ఒకరు కొద్ది నిమిషాల మునుపు స్మర్త్‌వెయిట్ జైల్ నించి ఐదుగురు ఖైదీలు ఇంకో గంటలో తప్పించుకుంటారని పది వేల పౌన్లకి పందెం కాసారని ఓ సిఐడి ఆఫీసర్‌కి చెప్పాను. వాళ్లు తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే మర్నాడు పేపర్లో ఈ పందెం గురించి వార్త వెలువడుతుందని, మరోసారి స్కాట్‌లేండ్ యార్డ్, జైళ్ల శాఖ అప్రతిష్ట పాలవుతాయని హెచ్చరించాను.
‘మీ పౌర బాధ్యతని నిర్వర్తించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం’ అతను చెప్పాక లైన్ కట్ చేశాను.
వెంటనే నేను నా కార్లో ఆ జైల్ పరిసరాలకి వెళ్లాను. నార్త్ లండన్‌లోని చాలామంది పోలీసులు నాకు అక్కడ కనిపించారు. ఆ జైలుకి వెళ్లే సందుల్లో నిలబడ్డ యూనిఫాంలోని పోలీసులు నన్ను లోపలకి వెళ్లనివ్వలేదు. ఆ లోపల నివాసం ఉండే వారికి మాత్రమే ఆ రాత్రి అనుమతిని, అందుకు నిదర్శనంగా ఇంటి చిరునామా గల ఐడి కార్డ్‌ని చూపించి వెళ్లాలని వాళ్లు నిక్కచ్చిగా చెప్పారు. ఏం జరుగుతోందని అడిగాను కాని వాళ్లకి తెలీదు. కేవలం తమ బాధ్యతనే వాళ్లు నిర్వర్తిస్తున్నారు. డ్రైనేజీ మూతల దగ్గర కూడా కాపలా ఉంచారు. లోపల ప్రతీ సెల్ కారిడార్లో అటు, ఇటు ఇద్దరు పోలీసులని కాపలా ఉంచారని మర్నాడు దినపత్రికల్లో చదివితే తెలిసింది. ఆ రాత్రి ఆ జైల్ నించి తప్పించుకోవడం కన్నా భూమ్యాకర్షణ శక్తి నించి తప్పించుకోవడం తేలిక.
* * *
ఇరవై నాలుగు గంటల తర్వాత రేడియో వార్తల్లో, గత రాత్రి లండన్‌లోని ఓ జైల్ నించి ఓ ఖైదీ మాత్రమే తప్పించుకున్నాడని, అది స్మర్త్‌వెయిట్ జైల్ నించి కాక మరో జైల్ నించని. ఆ పదివేల పౌన్లు గెలుచుకున్నందుకు నా తెలివికి సంతోషం వేసింది.
దినపత్రికలోని మరో వార్తని నేను చదివాకే అసలు రహస్యం తెలిసింది. ప్లమ్ స్ట్రీట్‌లోని హౌస్ ఆఫ్ డిటెన్షన్ అనే జైల్లోంచి ఎడ్డీ పామర్ అనే మోసగాడు తప్పించుకున్నాడు. జైలు బయట అతని కోసం కారుని ఆపిన డ్రైవర్ వర్ణన నా దగ్గరికి వచ్చి పందెం కాసిన స్మిత్ వర్ణనకి సరిపోతుంది. నీలంరంగు టోపీ. అదే రంగు సూట్.
పౌర బాధ్యతలో నేను అపజయం పాలైనా, బుకీగా గెలిచాను.
ఎడ్డీ పామర్ తప్పించుకునేందుకు నాకు తెలీకుండానే సహకరించాననే బాధ నాలో చాలాకాలం ఉంది. అందుకు ఖర్చు చేసిన పదివేల పౌన్లు పామర్‌కి ఓ లెక్కలోది కాదు. అతను అనేక మందిని మోసం చేసి సంపాదించిన లక్షల పౌన్లు జైలు బయట అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
నేను టిమ్ టబ్ బార్‌కి వెళ్లి నా ఘన విజయాన్ని చెప్పాను. అతను నన్ను అభినందించలేదు. మొహం మాడ్చుకుని చెప్పాడు.
‘నేను చాలా నష్టపోయాను’
‘ఎలా?’ అడిగాను.
‘నిన్న నీ దగ్గరికి రాబోయే ముందు అలాంటి మనిషే నా దగ్గరికి వచ్చి స్మర్త్‌వెయిట్ జైల్ నించి తర్వాతి ఇరవై నాలుగు గంటల్లో ఎవరూ తప్పించుకోరని పందెం కట్టాడు. కాబట్టి నేనూ పందెం కాసాను’
నేను వెంటనే నా చేతిలోని గ్లాస్‌ని బల్ల మీద ఉంచి అడిగాను.
‘ఎంత?’
‘పదివేల పౌన్లు. ఓడిపోవడంతో నేను అతనికి ఇరవై వేల పౌన్లు ఇచ్చాను. తన పందాన్ని గెలవడానికి అతను లండన్‌లోని ప్రతీ పోలీసుస్టేషన్‌కి ఫోన్ చేసి స్మర్త్‌వెయిట్ జైల్ నించి ఆ రాత్రి తప్పించుకునే పథకం ఉందని హెచ్చరిస్తాడని నేను ఊహించలేదు’
ఎడ్డీ పామర్ పారిపోతూ కూడా పదివేల పౌన్లని మోసంతో గెలిచాడు!
నా మొహంలోని చిరునవ్వుని చూసి టిమ్ కోపంగా అడిగాడు.
‘దేనికా వెధవ నవ్వు?’
నేను ఆ మాట చెప్తే అతను కూడా హాయిగా నవ్వాడు.

(రిచర్డ్ కర్టిన్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి