అమెరికానా...?
Published Saturday, 24 November 2018గడచిన సుమారు పది సంవత్సరాలుగా మా బాబు అమెరికాలో ఉంటున్నాడు. అయినా ఎందుకో గాని నాకు మాత్రం అమెరికా వెళ్లాలని అనిపించలేదు. మామూలుగా అందరూ తల్లిదండ్రులకు వచ్చే తప్పించుకోలేని తరువాతి తరం అవసరం కూడా మాకు రాలేదు. కనుక మేము అమెరికా వెళ్లాలని అనుకోలేదు. కానీ ఇనే్నళ్లకు ఇన్నాళ్లకు కేవలం సరదాగా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాము.
నిజానికి నాకు అమెరికా పట్ల అంత మంచి ఉద్దేశం లేదు. వాళ్లు ఏదో మనుషులను పీక్కు తింటారు అని ఒక భావం ఎక్కడో మనసులో ఉంది. వీసాకు వెళితేనే కనీసం కూర్చోమని కూడా అనకుండా నిలబెట్టి ప్రశ్నలడుగుతారని ఎవరో చెప్పారు. అవి నా గౌరవానికి భంగంగా ఉంటుందని నేను కూడా అనుకున్నాను. అబ్బాయి వీసా అప్లికేషన్‌లో అవసరమైన తతంగమంతా తానే చేశాడు. కేవలం ఇంటర్వ్యూకు మాత్రం మేము హైదరాబాద్‌లో వెళ్లక తప్పలేదు. అందరూ తెగ భయపెట్టారు. ఏవేవో కాగితాలు తయారుచేసుకోవాలి అన్నారు. అంతా సర్దుకుని వెళితే అక్కడ కిటికీ లోపల నిలబడి ఉన్న ఆవిడగారు కేవలం ఐదు నిమిషాలు లోపలే, నిజానికి అంత టైం కూడా పట్టలేదు. మీ వీసా ఇచ్చేస్తున్నాం పొండి అని చిరునవ్వింది. కనుక ఇక అమెరికా ప్రయాణం తప్పలేదు. ఒక రోజంతా విమానంలో కూర్చోవడం మాత్రం కొంచెం చికాకుగానే ఉంది. అయినా ఆ తరువాత కలిగిన కలుగుతున్న అనుభవాలతో నాకు అంతకు ముందు నా ఆలోచనలన్నీ మారిపోయాయి అనక తప్పదు.
అమెరికా వచ్చిన మూడవ రోజునే మా అబ్బాయి ముందే వేసిన పథకం ప్రకారం పొద్దునే్న లేచి చాలా దూరం ప్రయాణించి ఒక కమ్యూనిటీ కాలేజ్‌కు వెళ్లాము. ఎందుకో చెపితే బహుశా ఆశ్చర్యపోతారు. ఆ కాలేజీలో కంప్యూటర్లను గురించి ఒక సదస్సు జరుగుతున్నది. ఒకేసారి చాలా చోట్ల రకరకాల అంశాల గురించి ఉపన్యాసాలు, చర్చలు జరుగుతున్నాయి. అసలు ముందు వెళ్లగానే చక్కగా తిండి పెట్టారు. వందల మంది ఉన్నా వరుసల్లో వచ్చి అందరమూ హాయిగా తిన్నాము. కావలసినంత తిండి ఉంది. సావకాశంగా తినండి అని అక్కడ ఒక పెద్దమనిషి నిలబడి అందరినీ పిలుస్తున్నాడు. మా అబ్బాయి తనకు ఆసక్తిగల అంశాలను ఎంచుకుని వెళ్లాడు. చిత్రంగా అక్కడ నాకు బాగా తెలిసిన సాఫ్ట్ స్కిల్స్ గురించి కూడా సెషన్స్ జరుగుతున్నాయి. నేను వెళ్లిన మూడు సెషన్స్ లోనూ నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నిజానికి ఒక వక్త చాలా కొత్త ఆలోచనలను అందరి ముందు ఉంచాడు. అది సృజనాత్మకత, మెదడు లాంటి అంశాలకు సంబంధించిన విషయం. నేను ఆ అంశాలను గురించి చాలా చదివాను. చాలా రాశాను. నా పుస్తకం మెదడు - మనము లో అటువంటి సంగతులు రాశాను. ఆ సంగతి చెప్పి నేను ఆ యువకునికి ఒక అంశం సూచించాను. అతను చాలా సంతోషించాడు. ఆ మాట బయటకు చెప్పాడు కూడా. నిజానికి అతను మాట్లాడిన సంగతులు చాలామందికి అర్థం కాలేదన్నది అందరికీ అర్థమయింది. నాకు నా పట్ల నమ్మకం మరింత పెరిగింది.
ఆ సంగతి అట్లా ఉండనిస్తే అక్కడికి వెళ్లి తిరిగి వచ్చిన దారిలో కొండలు కనిపించాయి. వాటి మీద ఎక్కడా చెట్లు లేవు. కింది వైపున చెట్లు ఉన్నాయి. రోడ్ల పక్కన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అక్కడ సహజంగా పెరిగినవి కావట. పూర్తిగా పెరిగిన చెట్లను మరొక చోటి నుండి తెచ్చి నాటి అక్కడ పెంచుతున్నారు. ఇది నిజానికి ఎడారి ప్రాంతం. కొండ ప్రాంతం కనుక చెట్లు తక్కువగా ఉన్నట్లు ఉన్నాయి. అలాగని అక్కడ చెట్లు లేవేమో అనుకుంటే మాత్రం తప్పు. ఫీనిక్స్ అనే ఈ నగరం కేవలం 120 సంవత్సరాల నాటిది. కనుక చాలా పద్ధతిగా ఒక పథకం ప్రకారం నిర్మాణాలు జరిగి ఉన్నాయి. చుట్టూ ఉన్న ప్రాంతం కొండలు లోయలతో ఎంతో అందంగా ఉంది. రోడ్ల పక్కన చాలా దూరం గోడలు ఉన్నాయి. రోడ్డు మీద రద్దీ చప్పుడు ఆ పక్కన ఉన్న వారికి వినిపించకూడదని ఆ రకంగా గోడలు కట్టారట. ప్రతి విషయానికి ఇక్కడ జాగ్రత్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్లు నడిపించే పద్ధతి చూస్తే మనవాళ్లు నేర్చుకోవలసింది ఎంతో ఉంది అనిపిస్తున్నది. జనం ఎవరూ లేని దారిలో కూడా అటు ఇటు చూసి జాగ్రత్తగా తమకు కావాల్సిన లేన్ లోకి మారే పద్ధతి చూస్తే మిగతా మనుషుల మీద అందరికీ గల గౌరవం అర్థం అవుతున్నది. నిజానికి ఇక్కడ అంతా బాగుంది కానీ మనుషులు మాత్రం కనిపించడంలేదు. మనకు ఇంట్లో ఉన్నా సరే గోల వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం ఉందా అన్నట్టు అంత నిశ్శబ్దంగా ఉంటుంది. రోడ్డు మీద ఎవరూ నడుస్తూ కనిపించరు. రోడ్డు పక్కన అంగుళ్లు అట్లాంటివి ఏవీ ఉండవు. ఉన్నా సరే కొంత దూరంలో గంభీరంగా తలుపులు మూసుకుని ఉంటాయి. కమ్యూనిటీ అనే పేరున కొన్ని అపార్ట్‌మెంట్లు ఒక కాంపౌండ్‌లో ఉన్నాయి. ఎన్ని రోజులైనా సరే పక్క ఇంట్లో ఎవరు ఉన్నది కనిపించలేదు. కానీ పద్ధతి మాత్రం చాలా బాగుంది. కావలసినంత పరిశుభ్రత ఉంది. మనవాళ్లు ఉన్నందుకు బహుశా అక్కడక్కడ సిగరెట్ పీకలు ఖాళీ సీసాలు పడేసి కనిపిస్తున్నాయి. అంతేకాని నిజానికి చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ కనిపించడంలేదు. ఈ కమ్యూనిటీలోనే ఒక గదిలో అందరి ఉత్తరాలు తెచ్చి పెట్టే అలమరలు ఉన్నాయి. అంటే మనిషి ఇంటింటికీ తిరగడు అని అర్థం. వచ్చిన ఉత్తరాలన్నీ ఇంటి నంబర్‌ల ప్రకారం లేదా అలాట్ చేసిన ప్రకారం అలమరలో పెట్టేస్తారు. ఓపిక ఉన్నప్పుడు వెళ్లి తెచ్చుకోవడమే.
ఇక కమ్యూనిటీ మధ్యలోనే ఒక జిమ్ ఉంది. అందులోకి స్విమ్మింగ్ పూల్‌లోకి ప్రవేశించడానికి ఎవరి తాళం చెవులు వారికి ఉంటాయి. మా అబ్బాయి నాకు కూడా ఒక తాళం చెవి ఇచ్చాడు. చిత్రంగా జిమ్‌లో వ్యాయామానికి మా వాడితో పాటు నేను వాళ్ల అమ్మ కూడా వెళ్లాము. ఎవరి మానాన వారు తమ వ్యాయామం చేసుకుంటున్నారు. ఎవరు ఎవరిని పట్టించుకోరు. పలకరింపులు కూడా ఉండవు. అయితే తెలిసిన వారు తెలియని వారు అన్న తేడా లేకుండా అందరూ ఒక చిరునవ్వు మాత్రం తప్పకుండా పడేస్తారు.
పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. నిజానికి వాతావరణం బాగా చల్లగా ఉంది. కనుక పూల్ నీళ్లు కూడా చల్లగా ఉన్నాయి. అందులోకి దిగాలంటే కొంచెం ధైర్యం కావాలి. అయితే ఆశ్చర్యంగా ఆ పక్కనే ఒక చిన్న కొలను ఉంది. అందులో నీళ్లు వేడిచేసి ఉన్నాయి. వెచ్చని ఆ నీళ్లలో కూర్చోవడానికి వీలుగా అది కేవలం మూడు అడుగుల లోతు మాత్రమే ఉంది. అయితే మడుగు మరీ పెద్దవి కాదు ఒక నలుగురైదుగురు మాత్రం ఒకే సమయంలో దిగవచ్చు. ఆ పూల్ గోడలలో రంధ్రాలున్నాయి. వాటి నుంచి వెచ్చని నీరు రకరకాల బలంతో చిమ్ముతున్నది. ఆ ముందు కూర్చుంటే నడుము మీద మర్దనా చేసినట్టు నీళ్లు వచ్చి తగులుతున్నాయి. ఈ పద్ధతిలో జాకుజీలని ఉంటాయని తెలుసు. ఇక్కడ మాత్రం అది అందరికీ అందుబాటులో ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పెంపొందించుకునేందుకు ఇట్లా ఉచితంగా సౌకర్యాలు ఉండడం నాకు ఎంతో అనుకూలంగా కనిపించింది. వరుసపెట్టి జిమ్, పూల్ రెండింటికీ రెగ్యులర్ అయ్యాను. నాకు మామూలుగా ఉండే వాతం నొప్పులు తగ్గిన భావం సులభంగానే కలిగింది.
ఇక్కడికి వచ్చినందుకు ఏదో దేశం వదిలి వచ్చిన భావన కలగడంలేదు. మొదటి నాడే మధ్యాహ్నం భోజనానికి ఓం ఇండియన్ బిస్త్రో అనే ఒక హోటేల్‌కు వెళ్లాము. అక్కడ చక్కని రొట్టెలు, తాలింపు అన్నం, కూరలు, మజ్జిగ దొరికాయి. దారిలో తిరిగి వస్తూ ఒక సూపర్ బజార్‌కి వెళ్లాము. అక్కడ భారతీయ వస్తువులే. ఉత్తర భారతదేశం వారు నడుపుతున్న పద్ధతిగా కనిపించింది. సిబ్బంది మాత్రం నేపాల్ ఉత్తరాఖండ్ వాళ్లు అని అనిపించింది. చిత్రంగా జంతికలు, మురుకులు, కారప్పూస లాంటివి పెద్దపెద్ద గుమ్మి లాంటి కర్ర పాత్రల్లో పోసి అమ్ముతున్నారు. దొరకని వస్తువు లేదు. పక్కనున్న మరొక గదిలోకి వెళితే దేవుని బొమ్మలు పూజకు పనికి వచ్చే సామగ్రి ఇలాంటివే అన్ని కనిపించాయి. నాకు ఆశ్చర్యం మాత్రం కాలేదు.
ప్రయాణం సమయంలోనే ప్రపంచమంతటా భారతీయులు వ్యాపించి ఉన్న పద్ధతి నాకు కొంత అర్థం అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బ్రిటీష్ ఎయిర్వేస్ వారి విమానంలో ఒక అందమైన యువకుడు ఫ్లైట్ అటెండెంట్ కనిపించాడు. నా సహజమైన పద్ధతి ప్రకారం అతనితో మాట కలిపాను. నేను బాంబే వాడిని. చక్కగా హిందీ మాట్లాడుతాను అంటూ అబ్బాయి నాకు లండన్‌లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చెప్పాడు. విమానాలులోనే కాలం గడుపుతాడు కాబట్టి అతని మాటలే నిజం అయ్యాయి. లండన్‌లో మేము విమానాశ్రయంలోని ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్‌కి మారాలి. అందరూ కలిసి స్పెషల్ అసిస్టెన్స్ అడగాలి అన్నారు. చక్రాల కుర్చీ తెచ్చి గమ్యానికి చేరుస్తారు అన్నారు. లండన్ విమానాశ్రయంలో దిగితే అక్కడి సిబ్బంది సగానికి సగం భారతీయులు. అయితే భారతీయులు కాని ఒక అమ్మాయి ఫీనిక్స్ వెళ్లే వాళ్లు ఎవరు అంటూ ప్రశ్నించింది. చిన్న కారు లాంటి ఒక వాహనంలో కూర్చుని పక్క టెర్మినల్ వెళ్ళే వచ్చే చోటికి చేరుకున్నాము. అక్కడ మాత్రం ఎవరు పట్టించుకున్నట్లు కనిపించలేదు. నిజానికి వాళ్లను వీళ్లను అడిగే సమయం కూడా లేదు. ఫలానా విమానం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అన్నది అక్కడ తెర మీద కనిపించింది. దగ్గరలోనే ఉండకపోతుందా అని అటువైపుగా నడక సాగించాను. ఆ టెర్మినల్లో ఆశ్చర్యంగా ఒకేసారి 40 విమానాలు బయల్దేరే ఏర్పాటు ఉంది. కనుకనే హీత్రో అనే ఆ విమానాశ్రయాన్ని ప్రపంచంలోకెల్లా పెద్దది అంటారేమో. నడిస్తే నడిచాము కానీ మొత్తానికి గమ్యం చేరుకోగలిగాను. అక్కడ ఎక్కవలసిన విమానం వెళ్లిపోయే సమయం దగ్గర పడింది. తీరా వెళ్లి అడిగితే మా కోసమే అన్నట్టు ఏదో కారణంగా ఆ విమానం ఆలస్యం అయింది అని చెప్పారు. హాయిగా కూర్చోండి అన్నారు. నేను కాళ్లు చాపుకుని కూర్చున్నాను. ఒక పెద్దాయన వచ్చి నా కాళ్ల వల్ల దారికి అడ్డు వస్తున్న భావంతో నిలబడ్డాడు. ఎక్కనున్న మరొకతను నా వేపు చూచి అతడిని చూపించాడు. నాకు అక్కడ హిందీ మాట్లాడే అవకాశం కూడా కనిపించింది. మీరు భారతీయులు. నేను మీ దేశం వాడిని. అంతగా బిగుసుకు పోకపోతే, బాబు కాళ్లు తీయమని మీరే చెప్పి ఉండచ్చు కదా అన్నాను హిందీలో. చుట్టుపక్కల కనీసం నలుగురైదుగురు నా వేపు మనలాగా చూడటం కనిపించింది. అంత మంది భారతీయులు కనిపించడం నాకు మాత్రం ఆశ్చర్యంగా కనిపించింది. ప్రయాణీకులే కాదు సిబ్బందిలో సగానికి సగం మీద భారతీయులు ఉండడంతో నాకు ఒక ఆలోచన కలిగింది. భారతదేశంలో కన్నా ప్రపంచంలో మిగతా చోట్ల భారతీయులు ఎక్కువగా ఉన్నారు అనిపించింది. అక్కడి నుంచి ఫీనిక్స్ వెళ్లే విమానం ఎక్కితే అందులో ప్రయాణీకులు చాలామంది దక్షిణ భారతదేశం వాళ్లు.