S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వర సంచారులు.. సాధనా దురంధరులు

సంగీతం మీద వ్యామోహం కొద్దీ పాడాలనే తపనతో అన్నీ వదిలేసి, దానినే పట్టుకుని సాధనతో పైకొచ్చిన వారినీ, నటన మీద ఉండే పిచ్చి ఆసక్తితో నాటకాలే జీవితంగా బ్రతికిన వాళ్లున్నారు. చూస్తూ వుంటాం. ఇప్పుడు సినిమాలు బయలుదేరాయి. ఒరేయ్! ఈ సంగీతం కూడు పెట్తుందా? ఉద్ధరిస్తుందా? నీ పిచ్చేగాని - అని వెనక్కి లాగేవాళ్లూ, ఈ నాటకాలేమైనా నిన్ను ఉద్ధరిస్తాయా? అంటూ నిరుత్సాహపరుస్తూ నీరుగార్చేలా మాట్లాడేవాళ్లకు లోటు లేదు. అయినా, పట్టువదలని విక్రమార్కుల్లాగా పుట్టుకతో వచ్చిన పిచ్చి పెరిగీ పెరిగీ పాకానబడిన వాళ్లే నటులయ్యారు, వాళ్లే గాయకులయ్యారు. కళను నమ్ముకున్న వారిలో కొందరైతే కట్టుకున్న వారినీ, కడుపున పుట్టిన వాళ్లను సైతం పట్టించుకోని వాళ్లెందరో. ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. కానీ భావితరాలకు వాళ్లే మార్గదర్శకులు. ఆ పిచ్చే కనక లేకపోతే ఈ లలిత కళలకు ఎక్కడా ఎదుగూ బొదుగూ వుండదు. యింతమంది కళాకారులూ, కవులూ, గాయకులూ అవతార పురుషులవ్వరు. అలాంటి వారికి నమ్ముకున్న కళ కంటే ఏదీ ఎక్కువ కాదు. ఉపాసనంటే అదే. ప్రక్కనే వుండేవాళ్లకు పిచ్చిలా కనిపిస్తుంది.
అత్యద్భుతమైన తాజ్‌మహల్ నిర్మాణం? కట్టిందెవరు? కట్టించిందెవరు? షాజహాన్ చక్రవర్తి ప్రతి శిల్పి హృదయంలోనూ కూర్చుని ప్రతి కదలికలోనూ, శిల్ప కళాచాతుర్యం ఉట్టిపడేలా చేసి దాన్ని ఓ చారిత్రాత్మకమైన కట్టడం చేశాడు. అది అతని పిచ్చి అనగలమా? ఊహిస్తే తెలిసేదొక్కటే. తన భార్యను ఎంతగా ప్రేమించాడో ఆ కళనూ అంతగా ప్రేమించాడన్నమాట. నాదమే తననువైన భోళాశంకరుడు, ఉమ్మెత్త పువ్వులను శిరస్సు మీద ధరించటం ఆయనకు భలే ఇష్టం. పిచ్చివాడిలా తిరగటం కూడా సరదాయే. అలాగే ‘కళ’ కూడా ఒక రకమైన పిచ్చియే. ఆకలేస్తే కాస్త ప్రసాదం తినటం, చీకటి పడిన తర్వాత నిద్రొస్తే కాసేపు కునుకు తీయటం మినహా త్యాగరాజు జీవితమంతా సంగీతంతోనే గడిచిపోయింది. అందులోనూ ఒక ఉన్మత్తుడిలా ‘ఆవేశం వచ్చినప్పుడు ఆశువుగా రాగయుక్తంగా కీర్తన పాడే సమయంలో గబగబా శిష్యులు దగ్గరకు చేరి కూర్చుని వినేవారు. విన్నదంతా గుర్తుంచుకునేవారు. గుర్తున్నది స్వర సహితంగా రాసి పెట్టుకుని పాడేవారు. గురువు గారడగ్గానే పాడి వినిపించేవారు. క్రమంగా త్యాగయ్య తన కీర్తనకు తానే మురిసిపోతూ రాగభావం వచ్చేలా అందచందాలను కలుపుతూ గానం చేసి శిష్యుల చేత పాడించేవాడు. ఆయన కీర్తనలన్నీ అలౌక ఆనందంతో వచ్చినవే. మొత్తం ఆయన జీవితమంతా అదే దినచర్య. ఆయన లక్ష్యం బ్రహ్మానంద ప్రాప్తి. ఆత్మోద్ధరణే ముఖ్యమనుకున్నాడు. సంగీతం ఆత్మవిద్య అని నమ్మాడు. హృదయగత సంస్కారం అటు గురువుకీ, నేర్చుకునే శిష్యునికీ కూడా ఉన్నప్పుడే ఉభయులూ ప్రయోజనం పొందుతారు. అటువంటి వాళ్లే శిష్యులయ్యారు. కోనేరి రాజపురం వైద్యనాథ భాగవతార్ (1875-1921) అనే మహా విద్వాంసుడుండేవాడు. ఆయన జీవించిన కాలం తక్కువ. కానీ పాడవలసినదంతా పాడేసి వెళ్లిపోయాడు. సంగీతం కోసమే పుట్టాడని భావించేవారు. దురదృష్టమేమంటే భగవంతుడు ఆయనకు మధురమైన కంఠాన్నివ్వలేదు. సముద్రమంత ఆశ వుండేది కానీ ఏం ప్రయోజనం? సుస్వరంతో కంఠం వుండాలిగా? ఇది మాత్రం భగవంతుడు అందరికీ ప్రసాదించడు. వారివారి పుణ్యాన్ని బట్టి లభించవలసినదే.
ఈ వైద్యనాథయ్యర్ సాధనతో ఎలాగైనా పాడి పదిమందినీ మెప్పించాలని కలలు కనేవాడు. ఓ సాయంత్రం తమిళనాడులోని మాయవరంలోని గుళ్లో పాడుతోంటే ఆ రోజుల్లోనే బాగా ప్రసిద్ధుడైన వీణ విద్వాంసుడు వీణ వైద్యనాథ భాగవతార్ ఎదురుగా కూర్చుని వింటున్నాడు. ‘ఎందుకొచ్చిన పాట? ఏదో ఉద్యోగం చూసుకుని బ్రతకచ్చుగా? మాకెందుకీ శిక్ష?’ అని రహస్యంగా ఎవరితో అన్న మాటలు ఆయన చెవిన పడ్డాయి. అంతే నీరుగారిపోయాడు. నిరుత్సాహ మావరించేసింది. అయినా నిరాశ చెందలేదు. పట్టుదల పెరిగింది. నిద్రాహారాలను పట్టించుకోకుండా నిత్య సంగీత సాధనలో మునిగిపోయాడు. వశిష్ట మహర్షితో వచ్చిన పేచీ కారణంగా విశ్వామిత్రుడు ‘బ్రహ్మర్షి’ అనిపించుకునేందుకు ఎంతటి కఠోరమైన తపస్సు చేశాడో, భగీరథుడు గంగావతరణం కోసం ఎలాంటి ఘోర తపస్సు చేశాడో, అంతటి సాధన వైద్యనాథయ్యర్ చేశాడు. ‘అనగననగ రాగమతిశయించు తినగ తినగ వేము తియ్యనుండు’ అన్నట్లుగా క్రమంగా నాదామృతంలోని రుచిని అనుభవిస్తూ తనను తాను మర్చిపోతూ పాడసాగాడు. సాధన చేసే గది మొత్తం తంబురా నాదంతో నిండిపోయేది.
రాత్రి సాధన పూరె్తై నిద్రించే సమయంలో కూడా గది గోడలు తంబురాధ్వనితో ప్రతిధ్వనించేవని ప్రత్యక్ష సాక్షులు చెప్పుకునేవారంటే ఆయన సాధనా బలం ఎంతటిదో ఊహించండి. ఇది నమ్మవచ్చునంటారా? అని అడగాలనిపిస్తుంది మీకు. విద్యుత్ కంటికి కనపడదు. దాని శక్తి కనిపిస్తోంది. అలాగే నాద శక్తి కూడా. స్విచ్ లాంటిది మనస్సు. విద్యుత్ లాంటిది నాదం.
విద్యుత్ పరిమితం. నాదం అపరిమితం.
సగుణ నిర్గుణానికి మెట్లు నిర్మించుకుంటూ వెళ్తే పైకి పోవచ్చు, క్రిందకూ దిగవచ్చు.
ఉదాత్త భావాలే ప్రధానం. ఇదంతా అనుభవిస్తేనే తెలిసేది. ఆకాశం శబ్ద వాహకం. రేడియో సెట్లున్నచోట ఎక్కడి నుంచో సంగీతం ప్రసారం కావటం లేదా? ఎక్కడో నాదం ఉండబట్టే వినగలుగుతున్నాం. ఇది లోకాంతరాల్లో కూడా ఉంది. కానీ వాళ్లకు రేడియో సెట్లు అవసరం లేదు. మనస్సుతోనే వింటారు. మనసు పెట్టి వింటారు. మన కంటికి కనిపించని ‘ముప్పది ముక్కోటి దేవతలకు కూడా ఈ నాదమే ఊపిరి’. దేవతల అంతరంగాల్లోని భావాలు ఎప్పుడూ నారాయణ చరణ భజన యందే లగ్నమై ఉంటాయి. అటువంటి రాగ, తాళ సమన్వితమైన గానంతో దేవతలను ప్రసన్నం చేసుకో గలిగిన వారంతా తనకెంతో ఆప్తులని ఎందరో మహానుభావులనీ, వేనోళ్ల పొగిడి పరవశించాడు, త్యాగయ్య. ‘ఇక్యూ’ అనే జెన్ తత్త్వవేత్త ‘నేను వేల మైళ్ల దూరాన వున్న మేఘాలను చూడగలను. దేవదారు వృక్షాల్లోని సంగీతం వినగలను’ అంటాడు. ఇది ఎలా సాధ్యవౌతుంది? అనిపించవచ్చు. కానీ రష్యాలో ‘సౌండ్ టెక్నాలజీ’పై అనేక ప్రయోగాలు జరిగాయి. మన చుట్టూ వున్నది మామూలు ఆకాశం కాదని, శబ్ద నాద తరంగాలను గ్రహించి (రికార్డు చేసి) ఉంచగల శక్తి ఆకాశానికి వుందని గ్రహించారు.
మన దగ్గర గ్రామఫోన్ రికార్డులు, విసిఆర్, ఆడియో కేసెట్లున్నట్లుగా ఆకాశంలోని శబ్ద దృశ్య తరంగాలు ప్రకటితమవ్వడానికి కావలసిన పరికరాలు ఇంకా విజ్ఞానం అభివృద్ధి చేయాలి. శ్రోతలు బాగా వింటున్నారా? లేదా? కరతాళ ధ్వనులతో అభినందిస్తున్నారా? అనే ధ్యాసలో వున్నవారికి ఈ నాదానందం దొరకదు.
నాద వినోదానికీ, నాదానందానికీ ఎంతో తేడా వుంది. స్వరాల అమరికలోని సౌఖ్యం సమర్థుడైన గాయకుడికే తెలుస్తుంది. సంగీతం ఏదో కొందరి కోసం, కొందరి చేత, కొందరి యొక్క అవసరమైన విలాసవంతమైన వస్తువుగా భావించే వారికిప్పుడు నాదానుభవం ఆమడ దూరంలోనే ఉంటుంది. కారు డ్రైవ్ చేస్తూ, ఆగి వెళ్తేనే గమ్యం ఎంత దూరంలో వున్నదో తెలిసినట్లుగా, నిర్దిష్ట వ్యవధిలో గానం చేస్తూ ఒక స్వరం మీద ఆగితే తర్వాత ఏం పాడాలో ఆ స్వరమే సూచిస్తుంది. అసలు ఆగాలనిపించాలిగా? నాద రహస్యం ఇదే అంటూండేవారు మా గురువుగారు.
‘సంగీత కచేరీలతో బిజీగా వున్నప్పటికీ నాదనిధిగా ప్రసిద్ధి పొందిన వయొలిన్ విద్వాంసులు డా.ద్వారం వెంకటస్వామి నాయుడు జీవితంలో ఎక్కువ భాగం సాధనకే కేటాయించేవారు. అందులోనూ తెలిసిన కీర్తనలే, రోజూ వాయించినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులు వస్తూండేవని చెప్పేవారట.
ఆయన సంగీత కచేరీలలో వినిపించిన కీర్తనలే మళ్లీ మళ్లీ వినిపించడానికి అదే కారణమని డా.పినాకపాణిగారు చెప్పారు.
నాదానందంలోని రుచి మరిగిన మహా విద్వాంసుల్లో నాయుడు గారొకరు. తెలిసిన వాటితో తెలియవలసినవన్నీ తెలుస్తాయి. మనోధర్మ సంగీతం పెంచుకునే తేలికైన మార్గం ఇదే.

- మల్లాది సూరిబాబు 90527 65490