బాల్యం.. అమూల్యం
Published Sunday, 11 November 2018అమ్మ కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ‘నారాయణ మంత్రం’ విని ఊకొట్టాడని.. తల్లిగర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ‘పద్మవ్యూహం’ గురించి విని నేర్చుకున్నాడని.. పురాణాల్లో చదువుకున్నాం. ఇవన్నీ పుక్కిటి పురాణాలుగా కొట్టేయకుండా తల్లి కడుపులోని శిశువు ఆరు నెలల వయసు నుంచే వినగలుగుతుందని పరిశోధకులూ తేల్చి చెప్పారు. ఇవి పుట్టకముందు సంగతులు.. మరి పుట్టాక..
అమ్మ లాలిపాట, గోరుముద్దలు, గుజ్జుముద్దలు, నాన్న మురిపెం, అమ్మమ్మ, తాతయ్యల గారాబం.. ఇలా ఎన్నో రకాల ప్రేమల మధ్య ఆ బాల్యం ఎంతో ఆనందంగా, అందంగా గడిచిపోతుంది. ఇదంతా ఒకప్పుడు..
నేడు..
నాన్న లాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ ‘విసిగించకు.’ అంటూ కోపంగా వేసే కసురులు.. అమ్మ వంటింట్లో పనిచేసుకుంటూ ‘డిస్ట్రబ్ చేయొద్దు నాన్నా.. పనిలో ఉన్నా.. ఆఫీసుకు లేటయిపోతుంది..’ అంటూ విసుగ్గా చెప్పే విన్నపాలు.. ఇక ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యల ఊసే లేదు. ఆ చిన్నారికి ఏం చేయాలో తోచదు.. ఏ స్మార్ట్ఫోన్ ముందో, టీవీ ముందో కాలం గడిపేస్తాడు.. ఇదీ ఇప్పటి తరం పరిస్థితి. దీనికి మనలాంటి పెద్దవాళ్లు.. ఆఫీసు పని ఎక్కువగా ఉందనో, సమయం లేదనో.. సాకులు ఎన్ని చెప్పినా.. నేటి తరాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేని బాధ్యత మాత్రం పెద్దవారిదే.. ‘అదేంటి.. నేను మా పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో వేశాను.. వాళ్ళే అన్నీ నేర్పిస్తారు’ అని గొప్పలకు పోతున్నారా? అన్నీ బడిలో నేర్చుకున్నా.. సంస్కారం మాత్రం ఇంటి నుండే మొదలవ్వాలి.
పూర్వం దక్షిణ భారతాన మహిళారూప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. అతనికి బహుశక్తి, అనంతశక్తి, ఉగ్రశక్తి అని ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురూ చదువుసంధ్యలు లేక మూర్ఖుల్లా తయారయ్యారు. ఎంత ప్రయత్నించినా వారికి చదువుపై శ్రద్ధ కలగలేదు. అందుకు ఆ రాజు మనోవేదన చెంది మంత్రులకు తన బాధను చెప్పుకున్నాడు. ఓ మంత్రి విష్ణుశర్మ అనే పండితుడి గురించి చెప్పి రాకుమారులను అతనికి అప్పగించమన్నాడు. రాజు విష్ణుశర్మను పిలిపించి ‘నా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పండి. మీకు తగిన పారితోషికం ఇస్తాను’ అని చెప్పగా, అందుకు విష్ణుశర్మ ‘నేను విద్యను అమ్ముకోను. నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను. నాకు ఎలాంటి పారితోషికమూ అవసరం లేదు’ అని చెప్పి రాకుమారులను తీసుకుని వెళతాడు. అలా విష్ణుశర్మ బోధించవలసిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి వాటిని పిల్లలకు చెప్పేవాడు. కథల్లో ఎక్కువగా జంతువులను ఉపయోగించి సరళంగా, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ ఆసక్తికరంగా చెప్పడం వల్ల పిల్లలు శ్రద్ధగా విన్నారు. పంచతంత్ర ద్వారా సమాజం, వ్యవస్థ, మానవ ధర్మం గురించి చెప్పడం వల్ల వారు ఆరునెలల్లోనే నీతిశాస్త్ర కోవిదులుగా మారిపోయారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తూ ఆసక్తికరంగా కొత్త విషయాలను చెప్తే వారు శ్రద్ధగా విని ఆచరిస్తారని తేలింది కదా..
వందల మంది ప్రేక్షకుల ముందు అనర్గళంగా ఉపన్యసించవచ్చు. కానీ ఓ పసివాడి మనసుకు హత్తుకునేలా మాట్లాడటం మాత్రం చాలా కష్టం. కారణం.. పెద్దల దగ్గర పదాల గారడీ చేయవచ్చు. ఉపమానాల్ని అరువు తెచ్చుకోవచ్చు. నానా విన్యాసాలూ చేయవచ్చు. పిల్లల విషయంలో అలా కుదరదు.. పిల్లల దగ్గర మనం మనలా ఉండాలి. మనలానే మాట్లాడాలి. గుడికెళ్లినప్పుడు, చెప్పుల్ని బయట వదిలిపెట్టినట్లు.. పిల్లలతో మాట్లాడేటప్పుడు మనకే అన్నీ తెలుసన్న అజ్ఞానాన్ని, అహాన్ని వదిలేసుకోవాలి. అప్పుడే పిల్లలు మనల్ని నమ్ముతారు. ప్రేమగా మన మాటల్ని ఆలకిస్తారు. అయినా ఇప్పటి తల్లిదండ్రులకి అంత ఓపిక, తీరిక ఎక్కడిది? సగటున ప్రతి తండ్రి రోజుకు ఎనిమిది నిముషాల సేపు, ప్రతి తల్లి పదకొండు నిముషాల సేపు మాత్రమే పిల్లలతో మాట్లాడతారని ఓ సర్వే సారాంశం. ఉద్యోగినులే కాదు.. కుటుంబ బాధ్యతలకే పరిమితమైన గృహిణి కూడా ముప్ఫై నిముషాలకు మించి బిడ్డలతో సంభాషించడం లేదని తేలింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, స్మార్ట్ఫోన్లు తండ్రుల నోళ్లనూ, టీవీ కార్యక్రమాలు, కొలువులు తల్లుల నోళ్లను కట్టిపడేస్తున్నట్లు ‘ఎర్లీ చైల్డ్ హుడ్ అసోసియేషన్’ అధ్యయనం చెబుతోంది. మనలాంటి కెరీర్ జీవుల్ని, డబ్బు మనుషుల్నీ నమ్ముకుని పసివాళ్లు ఈ భూమీదికొచ్చింది.. కాదు కదా.. అందుకే ఈ బాలల దినోత్సవం నుంచీ వారికి ప్రతి రోజూ ప్రత్యేకంగా ఉండేలా చూద్దాం.. ప్రేమగా, లాలనగా, స్వేచ్ఛగా పెంచుతూ సమాజం పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తూ వారిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దుదాం.
ఇంతకీ ఈ బాలల దినోత్సవం నాడు మీ పిల్లలకు ఏం బహుమతి ఇవ్వబోతున్నారు? పుస్తకాలు, బొమ్మలు, చాక్లెట్లు, హోటళ్లకు తీసుకెళ్లడం, పార్కులకు తీసుకెళ్లడం.. ఇలాంటివన్నీ ఎప్పుడూ ఉండేవే.. ఇవి కాసేపే సంతోషాన్ని ఇస్తాయి. జీవితాంతం కాదు. కాబట్టి పిల్లలకు అమ్మానాన్నలు ‘సంభాషణ’ను కానుకగా ఇవ్వాలి. ఈ రోజు నుంచి ప్రతిరోజూ పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించాలి. సంభాషణ ద్వారా బంధానికి బలం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. లేక ఇలా చెబితే తేలిగ్గా తెలుస్తుందేమో.. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందుతాయి. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు చక్కగా వింటున్నారంటే అది మంచి సంభాషణ అవుతుంది. ఇద్దరు మనుషుల మధ్య పరిచయాన్ని అనుబంధంగా మార్చే శక్తి కేవలం వినే ప్రక్రియకే ఉంది. స్నేహానుబంధాలు బలపడడానికి పునాది వేసేది ఇద్దరి మధ్యా జరిగే సంభాషణే. ఎదుటివారు చెప్పేది ఓపిగ్గా వినేవారే మంచి స్నేహితులు అవుతారు. ఇది ఇంటి నుంచే మొదలవుతుంది. పిల్లలు చెప్పినప్పుడు తల్లిదండ్రులు వింటూ ఉంటే.. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లలు కూడా అంతే శ్రద్ధతో వింటారు. వినేటప్పుడు మాట్లాడుతున్నవారి కళ్లలోకి చూస్తూ వినడం చాలా ముఖ్యం. పిల్లల వైపు మనం చూడకపోతే వారు వెంటనే చెప్పడం ఆపేస్తారు. ‘నేను చెప్పేది నువ్వు వినడం లేదు..’ అని మొహానే అడిగేస్తారు. కాబట్టి పిల్లలు చెబుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా వింటారో, పిల్లలు కూడా పెద్దవారు చెప్పేది అంతే శ్రద్ధగా వింటారు. పిల్లలు మూడేళ్లకు ముద్దు ముద్దు మాటలు మొదలుపెట్టినా మూడు నెలల వయసులోనే బిడ్డతో తల్లితో సంభాషణను మొదలుపెడుతుంది. నవ్వు, ఏడుపు, బుంగమూతి.. ఇలా ప్రతీదీ భావ వ్యక్తీకరణే.. ఆ సైగలకు కన్నవారు ఎంత బాగా స్పందిస్తే పిల్లల్లో అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంత తొందరగా మాటలు నేర్చుకుంటారని ఇండియానా యూనివర్శిటీ నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు మూడు, మూడున్నర సంవత్సరాలు వచ్చేటప్పటికి మాటలతో పాటు ప్రశ్నలనూ తల్లిదండ్రుల పైకి స్పందిస్తుంటారు. అదేమిటి? ఇదేమిటి? ఎందుకు? ఎలా?.. ఇలా ఆ బుజ్జి బుర్రలనిండా ఎన్నో సందేహాలు.. వీటిని తీర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. తెలిసో తెలియకో కన్నవారు విసుక్కుంటే ఆ వికాస ద్వారం మూసుకుపోయినట్టే. వీలైనంతగా పిల్లల ప్రశ్నల్ని స్వాగతించాలి. వీలైనంత ఎక్కువ సంభాషణను ప్రోత్సహించాలి. మనం ఏం చెప్పినా తలాడించే బుజ్జిశ్రోత దొరికాడని మురిసిపోకూడదు.. ఏకబిగిన ఉపన్యసించి మన నోటి దురదను తీర్చేసుకోకూడదు. సంభాషణ సంభాషణలాగే ఉండాలి. మనం తక్కువ మాట్లాడి వారిని ఎక్కువ మాట్లాడనివ్వాలి. మాటల వల్ల దగ్గరితనం పెరుగుతుంది. ఇష్టాయిష్టాలూ, అభిరుచులూ అర్థం అవుతాయి. ఎదిగే క్రమంలో ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో చిన్న చిన్న తేడాలుంటే సరిదిద్దే వీలూ ఉంటుంది.
పిల్లల ముందు జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్లో సహోద్యోగితో సంభాషిస్తున్నప్పుడూ చాలా చాలా ఎరుకతో వ్యవహరించాలి. పిల్లల ముందు ఏం మాట్లాడాలి? వారికి ఇబ్బందులు తెలియకూడదు కాబట్టి అప్పుల గురించీ, ఆర్థిక సమస్యల గురించీ చర్చించకూడదు.. చావు తీవ్రమైన విషయం కాబట్టి మరణాల ప్రస్తావన వద్దు.. శరీర వ్యవస్థకు సంబంధించో, లైంగికతకు సంబంధించిన ప్రస్తావన వస్తే.. వెంటనే చర్చ ఆపేస్తాం.. ఇలా ఎంతకాలమని నిజాల్ని గుప్పిట్లో దాచి ఉంచుతాం? ఎన్ని రోజులని సమాజాన్ని చూడకుండా చుట్టూ తెరకట్టి కాపలా కాస్తాం.. సిద్ధార్థుడి తండ్రిలా..! ఎప్పుడో ఒకప్పుడు వాళ్లు ఈ చేదు నిజాల్ని తెలుసుకోవాల్సిందే.. కఠిన వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సిందే.. వయసును బట్టి, సందర్భాన్ని బట్టి, వారి మానసిక పరిణితిని బట్టి పెద్దలు, పిల్లలతో క్రమక్రమంగా చర్చించడంలో తప్పులేదు. కన్నవారు కొన్ని విషయాలను మాట్లాడటం మానేస్తే, పిల్లలూ కొన్ని విషయాలు చెప్పడం ఆపేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చినా అబద్ధం చెబుతారు. డొంక తిరుగుడుగా వ్యవహరిస్తారు. పెద్దయ్యాక కూడా ఆ డొంకతిరుగుడు తనమే కొనసాగుతుంది. సూటిగా మాట్లాడలేరు. స్పష్టంగా ఆలోచించలేరు. అమ్మానాన్నలు నిజాయితీగా ఉంటే.. పిల్లలు కూడా నిజాయితీగా ఉంటారు. పెద్దలు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే పిల్లలు కూడా తప్పులను ఒప్పుకుంటారు.
పుస్తకం మంచి నేస్తం
నేటితరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. పిల్లలకు చదివే అలవాటు ఎలా చేయాలన్నదే నేడు పెద్దలకు దిక్కుతోచని సమస్యగా మారింది. వారికి చిన్నప్పటి నుంచే పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. ఇలా జరగాలంటే వారితో పాటు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకం ఆత్మీయుడైన స్నేహితుడిలాంటిది. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి పుస్తకాలను సమకూర్చాలి. పుస్తకాలు లేని ఇల్లు, కిటికీలు లేని గది ఒక్కటే.. పిల్లలందరూ కలిసి సరదాగా చదువుకున్నా, వారితో పాటు పెద్దలు కూడా కూర్చుని చదువుకున్నా ఆనందమే.. చదివేటప్పుడు అర్థం కాని విషయాల్ని, పదాల్ని పిల్లలు అడిగినప్పుడు విసుక్కోకుండా వివరించి చెప్పాలి. అలా పిల్లలకు సమాజంలో జరుగుతున్న మంచీచెడులను తెలియజెప్పాలి. పత్రికలు చదివే అలవాటు చేయాలి. ఇప్పుడు దినపత్రికల్లో పిల్లలకోసం ప్రత్యేకంగా కొన్ని పేజీలు వస్తున్నాయి. చదువుకు సంబంధించినవీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కూడా.. పజిల్స్ వంటివి కూడా.. పిల్లలకు రోజుకో పజిల్‌ను ఇచ్చి చేయమనాలి. మనం కూడా వారితో పాటు కూర్చుని ఒక పజిల్‌ను చేయాలి. ఇలా చేయడం వల్ల వారికి చురుకైన మెదడు సొంతం అవడంతో పాటు పాఠాల్లోని లెక్కలు కూడా త్వరగా చేయగలుగుతారు. మార్కెట్లో ఇలాంటి తరహా పజిల్స్ బోలెడన్ని ఉంటాయి. వాటిని కొని తెచ్చి పిల్లలకు అందివ్వాలి.
విజ్ఞాన యాత్రలు
పిల్లలను విహార యాత్రలతో పాటు అప్పుడప్పుడూ విజ్ఞానయాత్రలకు కూడా తీసుకెళ్లాలి. అంటే జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలు, ప్లానిటోరియంలు ఇలాంటివి అన్నమాట. అక్కడ ఉపగ్రహాల పనితీరు, వాటి ప్రయోగాలు, సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలను చూపించడం వల్ల వారు సైన్స్ సూత్రాల్ని బట్టీ పట్టడం కాక- ఇలాంటి చోటికి తీసుకెళ్తూ ఉంటే వారికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఫలితంగా సొంతంగా ప్రయోగాలు చేయడం మొదలుపెడతారు.
స్మార్ట్ఫోన్‌లతో..
ఇటీవల ఎవరి ఇంట్లో చూసినా, ఏ పిల్లాడి చేతిలో చూసినా స్మార్ట్ఫోనే్ల దర్శనమిస్తున్నాయి. ఆటలు, వీడియో గేమ్స్, సినిమాలు, యూ ట్యూబులే వారి ప్రపంచాలైపోయాయి. ఇది అంతర్జాల ప్రపంచం. మనం కోరుకున్నదాన్ని అరచేతిలో వీక్షించే సదుపాయం ఉంది. అలాంటి స్మార్ట్ఫోన్‌ను పిల్లలు ఆటలకు, సినిమాలకు ఉపయోగించకుండా చూడాలి. ‘మనం ఎప్పుడూ గాంధీజీ వంటి గొప్ప గొప్ప నాయకులను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కదా.. ఇప్పుడు ఈ ఫోన్ ద్వారా వారిని కలుసుకుందాం’ అంటూ వారి విజయగాథలు, స్ఫూర్తి నింపే మాటలు, డాక్యుమెంటరీలను వారితో కలిసి చూస్తూ, వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తుంటే మరింత సంతోషపడతారు.
పిల్లలు. వ్యక్తిత్వ వికాస పాఠాలు, మంచి మంచి కథలను కూడా పిల్లలతో కలిసి ఇలాగే చూడవచ్చు.
వంటింటి పాఠాలు
పిల్లలు వంటింట్లోకి వస్తే వారికి ఏమైపోతుందో అని తల్లిదండ్రులు భయపడే రోజులివి. అందుకే పెళ్లీడుకి వచ్చినా పిల్లలకు కనీసం టీ పెట్టుకోవడం, అన్నం వండుకోవడం కూడా తెలియడం లేదు. వంటనేది జీవన నైపుణ్యం. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇల్లు వదిలి వెళ్లినప్పుడు వంట రాని లోటు తెలిసొస్తుంది. అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది. ఈ కష్టాలు రాకుండా ఉండాలంటే హైస్కూలు వయసులోనే పిల్లలకు వంటగదిని పరిచయం చేయాలి. కూరలు తరగడం, పాలు కాచడం, అన్నం వండడం, మ్యాగీ చేయడం, ఆమ్లెట్ వేయడం వంటి చిన్న చిన్న పనులతో ప్రారంభించి ఒక్కో కూరనూ రుచి, శుచిగా ఎలా చేయాలో చెప్పాలి. ఇలాంటివి చేసినప్పుడు పిల్లలకు ఆహారం విలువ, తల్లి శ్రమ పిల్లలకు తెలిసి వస్తుంది. పైపెచ్చు పిల్లలు జంక్‌ఫుడ్స్ జోలికి వెళ్లకుండా వారి కష్టపడి చేసుకున్న వంటకే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. గ్యాస్ స్టవ్, ఎలక్ట్రికల్ పరికరాల వాడకంలోని జాగ్రత్తలను తెలియజేయాలి. వారు వంట చేస్తున్నా పెద్దవారు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించవచ్చు.
నీరు-మొక్కలు
వంటింటి పాఠాలతో పిల్లలకు నీటి విలువ కూడా తెలిసి వస్తుంది. ఎంత శ్రమపడితే ఇంటిలోకి నీళ్లు వస్తున్నాయో పిల్లలకు తెలియజేయాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ జలవనరులు అడుగంటిపోతున్నాయి. ప్రాణాధారమైన నీటి ప్రాధాన్యం గురించి ప్రతి పౌరుడికీ తెలియాలి. జలం ప్రకృతి ప్రసాదమని, లక్షలు ఖర్చుపెట్టినా మనిషి సృష్టించలేని అమూల్య వనరు అని పిల్లలకు చెప్పాలి. నీటితో పాటు పిల్లలకు చెట్ల గురించిన అవగాహన కలిగించాలి. మనిషి ప్రకృతికి దూరమైనకొద్దీ, పర్యావరణానికి హాని పెరిగిపోతోందని.. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాల నిర్మాణమే కాదు, అంతటా పరుచుకున్న పచ్చదనం అనే విషయాన్ని చిన్న చిన్న మాటలు, చేతల ద్వారా వారికి తెలియజేయాలి. ఇందుకోసం వారితో చిన్నచిన్న కుండీల్లో, తొట్లలో మొక్కలు నాటించడం, వాటిని జాగ్రత్తగా చూసుకునేలా చేయడం వంటివి చేయిస్తే వారికి బాధ్యత, శ్రద్ధ పెరుగుతుంది. ఆ మొక్క పూలు పూసినా, కాయలు కాసినా వారి ఆనందానికి అవధులు ఉండవు.
జీవన విషయాలు..
నగరంలో ఉండే పిల్లలకు మార్కులు, ర్యాంకులు తప్ప నిజ జీవితంలో చాలా విషయాలు తెలియవు. వారికి పాలంటే ప్యాకెట్ పాలు అనే తెలుస్తుంది కానీ ఆవు, గేదె నుంచి పాలు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. ఇంకా నవ్వు వచ్చే విషయం ఏంటంటే.. పాలు గేదె నుంచి వస్తాయా? దున్నపోతు నుంచా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియక బిక్కమొహం వేస్తారు చాలామంది హైస్కూలు పిల్లలు. అందుకని వారికి తాగే పాలు, తినే బియ్యం, వండే కూరగాయలు.. ఇలా ప్రతీదీ చూపించాలి. అప్పుడప్పుడూ పల్లెలకు తీసుకువెళ్లి వారు ప్రకృతికి దగ్గరగా జీవించేలా చెయ్యాలి. పిల్లలకు పశువులకొట్టం, పాల కేంద్రం, పొలాలు, ధాన్యం మిల్లులు, నూనె గానుగ, పిండి గిర్నీలు.. ఇలా ప్రతి దాన్ని దగ్గర నుంచి చూపించడం వల్ల వారికి ఆహార పదార్థాలపై ఇష్టం పెరుగుతుంది. మనం తినే ఆహార పదార్థాల తయారీకి ఇంత కష్టపడాలా? అని శ్రమ విలువ తెలుసుకుని ఆహార పదార్థాలపై గౌరవం పెరిగి వృథా చేయడానికి ఇష్టపడరు.
పెద్దలను గౌరవించాలి..
సెలవుల్లో పిల్లలను అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి పంపుతూ ఉండాలి. దీంతో పెద్దవారికి, పిల్లలకు మధ్య ఆత్మీయత పెరుగుతుంది. పెద్దలు చెప్పే కథలు, గోరుముద్దలు పిల్లలకు ఎంతో నచ్చుతాయి. తాతయ్య, నానమ్మలు కనిపించగానే వారికి ఎలా నమస్కరించాలి, వారితో ఎలా మర్యాదగా నడుచుకోవాలి..
ఇలాంటివన్నీ మన ద్వారానే పిల్లలకు వస్తాయి. మనం పెద్దల విషయంలో కటువుగా ఉంటూ, పిల్లల ముందు పెద్దవారిని చులకన చేస్తే వారికీ ఆ అలవాట్లే అబ్బుతాయి. రేపు మన పరిస్థితి కూడా ఇంతకంటే దారుణమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అమ్మమ్మ, తాతయ్యలకు పిల్లల చేత అప్పుడప్పుడూ ఉత్తరాలు రాయించాలి. ఇప్పుడు ఈ-మెయిల్స్, వాట్సప్‌లు ఉత్తరాలను మింగేశాయి కానీ ఆత్మీయతను పంచడానికీ, పెద్దవాళ్లని పలకరించడానికి ఉత్తరాన్ని మించినది మరొకటి లేదు. అప్పుడప్పుడూ మనం పిల్లలకు సరదాగా ఉత్తరాలు రాసి సర్‌ప్రైజ్ చేస్తే వారికీ ఉత్తరాలు రాయడం అలవాటు అవుతుంది. ఉత్తరం అనేది ఒక సాహిత్య ప్రక్రియ. దీని ద్వారా మాతృభాష అభివృద్ధి చెందుతుంది.
అలవాట్లు
అలవాట్లకు మనిషి బానిస. పాత అలవాట్లు ఒక పట్టాన మారవు. ఆలోచనలు పనులుగా, పనులు అలవాట్లుగా, అలవాట్లు వ్యక్తిత్వంగా రూపాంతరం చెందుతాయనేది శాస్త్రం. మంచి అలవాట్లు ఏర్పడాలంటే మంచి ఆలోచనల బీజాలు నాటాలి. ఒక అలవాటుని జీవితంలో భాగం చేసుకోవాలంటే ఎంత కష్టమైనా 21 రోజులపాటు అమలుచేసి తీరాలంటారు పెద్దలు. అప్పుడది మన వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. పిల్లలకూ, పిల్లల గురించి మనకూ అనేక ఆకాంక్షలు ఉంటాయి. పరిధులు, పరిమితులూ లేకుండా ఆలోచించడం పిల్లలకు అలవాటు. వయసు పెరిగే కొద్దీ వారి ఆలోచనలకు సంకెళ్లు పడతాయి. అందుకే చిన్నప్పటి నుంచీ కష్టమైనా మంచి అలవాట్లను పెద్దలు పిల్లలతో కలిసి ఆచరించడం వల్ల వారు ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎదుగుతారు. స్కూలు చదువు పూర్తయ్యేలోపు తల్లిదండ్రులూ, కుటుంబ సభ్యులూ, ఉపాధ్యాయులూ కొన్ని వేలసార్లు వారి ఆలోచనలపై, ఆశలపై నీళ్లు చల్లుతారు. ‘నువ్వు చెయ్యలేవు, నీ వల్లకాదు, నీ మొహం.. నీకంత సీన్ లేదు’ వంటి మాటలు పిల్లల్ని కుంగదీస్తాయి. ప్రేమతో వారిని లాలిస్తూ చెప్పడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ముందుచూపు ఏర్పడుతుంది. ఫలితంగా సంకల్పం కలుగుతుంది. పిల్లలు తమ అంతరంగాన్నీ, ఆకాంక్షల్నీ గుర్తించేలా ‘్భవిష్యత్ దర్శనం’ తప్పక చేయించాలి. ఆలోచనలు మనసులోనే ఉండిపోతే, చివరికి అవి ఆకాంక్షలుగానే మిగిలిపోతాయి. అమలులో పెడితేనే వాటి విలువేంటో తెలుస్తుంది. అందుకే.. తల్లిదండ్రులూ.. ఇప్పుడే.. ఈ బాలల దినోత్సవం రోజే పిల్లలను పిలవండి.. మీకూ, వాళ్ళకీ కూడా నచ్చిన ఓ ఆలోచనతో ముందడుగు వేయండి. మంచిపనికి ఈ రోజు, ఈ నిమిషం, ఈ క్షణం మించిన మంచి ముహూర్తం మరొకటి ఉండదు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది నవ సమాజ స్థాపనకు అంకురార్పణ చేయండి. ఆల్ ది బెస్ట్..