S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బబ్లూ.. ఆంటీ(కథ)

బబ్లూకి పదేళ్లు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. గారాబం ఉన్నా చదువులో ఫస్ట్. క్రికెట్ అంటే ప్రాణం. సెలవులు వస్తేచాలు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాలని ఆరాటపడతాడు. గేటు నుంచీ ఇంటి వరకు ఖాళీ స్థలం ఉండటం వల్లనయితేనేం, సొంత ఇల్లు కావటం వల్లనయితేనేం ఆడుకోవటానికీ, స్నేహితులకీ ఏ సమస్యా లేదు కానీ ఉన్న సమస్యల్లా పక్కింటి ఆంటీతోనే వస్తుంది.
ఆంటీకి అరుపులు, కేకలు, శబ్దం అంటే చాలా చిరాకు. కానీ పక్కపక్క ఇళ్లు, కామన్ కాంపౌండ్ వాల్, పొట్టిగా ఉండటం వల్ల వీళ్లు గోల చెయ్యక మానరు. ఆంటీకి కోపం రాకా మానదు.
సెలవులు వచ్చాయి. ఎప్పటిలానే బబ్లూ, వాడి ఫ్రెండ్స్ ఆటలు మొదలయ్యాయి. ‘ఏదో సెలవుల్లోనే కదా పిల్లలు ఆడేది, వదిలెయ్’ అని అంకుల్ అన్నా ఆంటీ పిల్లల్ని విడిచిపెట్టేది కాదు. వాళ్లని మందలిస్తూనే, అరుస్తూనే ఉండేది.
ఒకసారి బబ్లూ వాళ్లు వేసిన బాల్ ఆంటీ వాళ్ల అద్దాల కిటికీకి తగిలింది. ఇక చెప్పాలా? బబ్లూ తల్లిదండ్రులతో గొడవ పడింది.
బబ్లూ క్కూడా కోపం వచ్చింది. ‘మా ఇల్లూ.. మేం ఆడుకుంటాం. పగిలితే అద్దం కొనిస్తాం’ అన్నాడు. దాంతో ఆంటీ కోపం నసాళానికి అంటింది.
అప్పటి నుంచీ తమ ఇంట్లో పడిన బాల్స్ అన్నింటినీ దాచెయ్యసాగింది ఆంటీ.
బబ్లూ వాళ్లు అడిగితే ‘మా ఇంట్లో పడలేదు. కావాలంటే వెతుక్కో’ అంది.
లేనిది ఎలా దొరుకుతుంది? గట్టిగా అడిగితే ‘బాల్స్ నాకెందుకు? నేనేమన్నా ఆడుకుంటానా?’ అని కసిరింది.
* * *
బాల్స్ ఎన్నని కొనిస్తారు? దాంతో క్రికెట్‌కి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దీనికో పరిష్కారం కనుగొన్నాడు బబ్లూ. ఆంటీ వాళ్ల ఇంటిలో ప్రహరీ గోడ వారగా పూల మొక్కలు ఎన్నో ఉన్నాయి. చక్కటి పూలు పూస్తాయి. వాటిని ఆంటీ దేవునికి సమర్పించటం బబ్లూకి తెలిసిందే.
ఆనాటి నుంచీ ప్రతి రోజూ పూసే మొక్కలకు పూలు ఉండటం లేదు. వీధిలో ఎవరో ఒకరి తలల్లో కనిపించేవి. అదేమని ప్రశ్నిస్తే - బబ్లూ ఇచ్చాడని చెప్పేవారు. దాంతో ఆంటీ ఒకరోజు బబ్లూని ప్రశ్నించింది. ‘నేనేం అమ్మాయినా? పూలు నాకెందుకు? అలాంటి పూలు కాలనీలో ఇంకెవరి ఇంట్లోనూ పూయవా?’ అని ప్రశ్నించాడు.
ఈ సమాధానంతో ఆంటీకి ఏం చేయాలో తోచలేదు.
* * *
భర్తతో చెప్పింది ఆంటీ. ‘నాలుగు రోజులు ఓపిక పడితే పోయే దానికి రాద్ధాంతం చేసుకున్నావ్. పిల్లలన్నాక గొడవ చెయ్యరా? ఇరుగు పొరుగు అన్నాక కొన్ని సర్దుకోవాలి మరి’ అని ఆంటీనే మందలించాడాయన.
‘ఈ గొడవతో బబ్లూ తల్లిదండ్రులు కూడా మనతో మాట్లాడటం మానేశారు. చూస్తున్నావుగా’ అన్నాడు.
చేసేది లేక ఆంటీ బాల్స్ అన్నీ తెచ్చి బబ్లూని పిలిచి అప్పగించింది. ‘ఇదిగోనోయ్. చెట్ల మధ్య కనపడితే పనిపిల్ల తీసిందట. ఆడుకోండి. కానీ మెల్లగా కిటికీలకి తగలకుండా ఆడుకోండి. అద్దాలు పగిలితే మళ్లీ వేయించుకోవటం కష్టం కదా’ అంటూ రాజీ పడింది ఆంటీ.
‘సరే ఆంటీ’ అన్నాడు బబ్లూ, తన ఎత్తు ఫలించినందుకు ఆనందంగా.
బాల్ అన్న తర్వాత తగలకుండా ఉండదు కదా. అందుకే కొద్ది దూరంలో ఉన్న గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకొంటే ఎవరికీ ఇబ్బందీ ఉండదు. కొట్లాటలూ ఉండవు అని బబ్లూ, స్నేహ బృందం గ్రౌండ్‌కి వెళ్లటం మొదలుపెట్టారు.

-ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి 9849464017