S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొయ లౌటా ధె ముఝే

మెరే బీతె హుయే దిస్.. ప్యార్ పల్‌చిస్..! -కిశోర్ కుమార్ తన సొంత చిత్రం ‘దూర్ గగన్ కి చావోమ్ మే’ కోసం పాడిన ఈ పాట 1964 - గుండెలు పిండేసే తమకం, భావోద్వేగం పెనవేసి నన్ను వెంటాడుతూ వుండేది. ఈ పాట ఈ భావోద్వేగం నాకు 1959లోనే వినపడుతూ ఉండేదా? - కిషోర్ జీ, నాడే, ఏనాడో, నా కోసం - ఈ పాట పాడాడా? అనిపించేది.. మద్రాస్ నుంచి అరవై ఐదులో బెజవాడ వచ్చేశాక ఓ కిల్లీకొట్టులో నుంచి వినపడ్డదీ పాట. ఎవరికోసమైతే నేనీ గతం అన్న హాలాహలాన్ని మింగానో వాళ్లకి - అమ్మానాన్నలకి బాకీ తీర్చాలి. పైకం సరే, అది వాళ్లకి నా తమ్ముళ్లు నలుగురున్నారు వాళ్లు ఇవ్వవచ్చు. కానీ వీడు మా కొడుకు అని వాళ్లకి మనసు నిండా - తృప్తి, గర్వం ఇవ్వగలనా? మద్రాసుకి పోయినా బెజవాడ వచ్చేసినా - విశాఖ చినవాల్తేరు - ‘పామ్ బీచ్ కెరటాల నాట్యం’... నా చెవులలో గొణుగుతూ వుండేది. కెరటాలు ముందుకు చొచ్చుకుని బోర విరుచుకు వస్తున్న భీమసేనుడి లాగా ఎగసి ఎగసి వస్తాయ్?... తిరిగి తన్నులు తిన్న కుక్కలాగ తోక ముడుచుకుని వెనక్కి పోతాయి.. కానీ ఓడిపోవు... మళ్లీ పడగలెత్తి ద్విగుణీకృత ఉత్సాహంతో దూసుకు వస్తాయి. అట్లాగా జీవితంలోని సంఘటనలు వస్తాయా? రావు.. అంటే ప్రత్యక్షంగా రావు కాని... కాని ‘లమ్హే’ అంటే స్మృతులై లయలై అలలై కలలై.. అనుభవాల మూటలై వస్తాయి.. వీటిని దింపుకోవాలి.. ఈ భారంతో మలుపు తిరగలేము.. 1959లో తొలిమలుపు రాయడానికి కూర్చున్నాను - పగలు కాదు.. రాత్రుళ్లు.. మా ఇంట్లో కరెంటు వుందిప్పుడు.. నా ఒక్కడికే టేబిల్ ఫ్యాన్.. అంతా గజచిత్తలో వున్నాయి తొలి మలుపు - మరకలు మెరుపులు. మొదట నవలకి నేను పెట్టిన పేరు ‘వెలక్కాయంత రాతిగవ్వ’. తెల్లని దవ్వబిల్లం ల్లాంటి కాగితాల మీద నేను - పార్కర్ పెన్నుతో గిలుగుతాను.. అనడానికి అమ్మ దగ్గర సిగ్గు వేసింది. ‘ఇదుగోనమ్మా! నా జీతమని అమ్మ కొంగుకి - ఔను కొంగుకే.. అమ్మకి వ్యానిటీ లేదు వ్యానిటీ బ్యాగు లేదు.. అమ్మకి కొంగు మాత్రమే ఉంది. అదే మాకు మూతి, మొహం తుడుస్తుంది.. అదే మాకు కొసనున్న ముడి విప్పి చిల్లర పైసలిస్తుంది. ఆ కొంగుకి పదులు అయిదులు పత్రికల నుంచి అడపాతడపా వచ్చే మనియార్డర్లు ముడి కట్టలేము.. ఇదుగో అమ్మా! ఇది నా జీతం అని కట్టవలసింది పోయి - తెల్లకాగితాలకి.. తల్లినీ తండ్రినీ.. ఛీ! ఔను మేము పేదవాళ్లమే. కాని దరిద్రులం కదు. పేదతనం వేరు - దరిద్రం వేరు. దరిద్రం దుర్భరం. నేరం పాపం కూడాను. కాని పేదతనము ఎంజాయ్ చేస్తే - పోయిన పౌర్ణమి నాటి వెనె్నల దాచుకుని అనుభవిస్తున్నట్లు ఉంటుంది. మాకో ముద్దుపేరు ఉంది. లోయర్ మిడిల్ క్లాసు అని మా రాధాకృష్ణ గారంటే - ఆంధ్రపత్రిక యువబాసు - అంటూ వుండేవాడు. మేము కూడా (అంటే శంభుప్రసాద్ గారు వాళ్లు) మిడిల్ క్లాస్సే.. తాతాలం బిర్లాలం కాదు - వాళ్లని రిచ్ క్లాస్ అనాలి. మేము అప్పర్ మీరు లోయర్ అంతే అని... అట్లాగా ఏనాడూ మేము ధనాభావాన్ని ఫీల్ అవలేదు. మద్యతరగతి మందహాసం మాది. ఎగువ తరగతిది ‘మందుహాసం’ అనేవాణ్ణి సరదాగా.. మాకు క్యూటిక్యూర (ఇమ్పోర్తేడ్) సబ్బు జేమ్స్‌పోమెడ్, నువ్వుల చాయపప్పు నూనె, నంబర్ల బియ్యం, అమ్మకి తలనొప్పికి ‘యుడుకోలేన్’ విష్ణుమార్కు నీలగిరి తైలం, మాకు - హార్లిక్స్, ఓవల్‌టీన్, పెద్దలకి ఫిల్టర్ కాఫీ... అమృతాంజనము, పింగాణీ పళ్లెలు, ఇవన్నీ మా అమ్మకి స్టాటస్ సింబల్స్‌గా నాన్నగారు ఎండార్స్ చేసినవి. నాన్నగారి కోటు జేబే అమ్మ ‘ఎటిఎం’ ఎస్బీడీ ఒక్కటే - నాన్నగారికి లగ్జరీ. నేను మునగచెట్టు కథ రాశాను. - ఎద్దు - కథా రాశాను. పత్రిక; ప్రభా కూడా కళ్లకద్దుకున్నాయి. చావు ఖరీదు పావలా.. కథకి తెనాలి ఆర్టిస్టు గోలి శివరాం - హాఫ్‌టోన్ చిత్రం వేశాడు. ‘పెళ్లీడు కుర్రాడివి - అబ్బే.. కోతులు ఎద్దులూ ఇవా? రాస్తావ్; రొమాంటిక్ స్టోరీ రాయవయ్యా పొంతులూ’ అంటూ సిమెంటు కంపెనీ అసిస్టెంటు యార్డు సూపరింటెండెంట్ రామచంద్ర చౌదరి వాత్సల్యంగా కవ్వించాడు.. నేనప్పుడు అప్రయత్నంగా నిశ్శబ్దంగా చేసిన మందహాసం - అతను గ్రహించాడో లేదో తెలియదు కాని - నవల రాస్తున్నాను చూడు అంకుల్ అని నిశ్శబ్దంగా అతనికి జవాబు చెప్పినది అది. అదే టైములో నాన్నగారు కూడా వినిపించకుండా కనిపించే - నవ్వొకటి - నవ్వేరు - ఎవైఎస్సూ (అతన్ని అలాగే పిలిచేవారు) శాబాబు కూడా (మా తమ్ముణ్ణి ‘శాస్ర్తీ’ అని పిలిచేవారు) అదే దారిలో పోతున్నాడయ్యా - అవనీ.. శంకరుని సంకల్పం అదే.. ఒకడుకి కుంచె, ఒకడికి కలం అబ్బాలని నా కోరిక - పెద్దవాడికి సంతకం కలెక్టర్ అయితే ఇలా పెట్టాలి చూడు అని రెండు స్ట్రోక్స్‌తో, గొప్పగా సంతకం నేర్పించారు నాన్నగారు నాకు. కాని నేను రాతా తమ్ముడు గీత - కూర్చుకొని సొంత సంతకాలు పెట్ట నేర్చాము. నేను యాభై అరవైల సంగతి ఇప్పుడు ఉటంకిస్తున్నాను. నాన్నగారు వాడికి ‘యు సేడ్ ఇట్ -ఆర్కే లక్ష్మణ్ పాకెట్ కార్టూన్) సంపుటి ప్రెజెంట్ చేశారు. నాకు సోమర్సెట్ మామ్‌గారి సమ్మింగ్ అప్ - ఉప్పల లక్ష్మణరావు గారిచ్చింది. తెచ్చి ఇచ్చారు. తమ్ముడప్పుడే నవయుగ మేనేజర్ కాట్రగడ్డ నరసయ్యగారి పూనికన కమర్షియల్ ఆర్టిస్ట్ లైన్‌లో పడిపోయాడు. విశాలాంధ్రకి రేడియోకి కూడా నేను వైజాగ్ నుంచి వచ్చాక వాడే నన్ను పరిచయం చేశాడు. ప్రజాశక్తి నగర్‌లో శ్రీ మహీధర రామ్మోహన్‌గారి ఇంట శనివారం శనివారం జరిగే సాహితీ పిచ్చాపాటి సమావేశాలకు (గ్రేట్) లాక్కుపోయాడు.. అదో మలుపు!
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com