S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాళికాదేవి రూపం( కథ)

గోవింద్‌సేన్ కలకత్తా నుండి ఈ పట్టణానికి వ్యాపారరీత్యా వచ్చి స్థిరపడ్డాడు. కాళికాదేవి భక్తుడు. పట్టణంలో ఉన్న కలకత్తా వాసులను కలిసి వారి సహకారంతో ప్రతి సంవత్సరమూ నవరాత్రుల సందర్భంగా కాళికాదేవి బొమ్మను తీసుకుని వచ్చి టౌన్‌హాల్‌లో ఉంచి పూజలు జరిపించేవాడు. ఆ పట్టణంలో దసరా వచ్చిందంటే భక్తులు చాలామంది కాళీ విగ్రహం చూసి పరవశించిపోయి భక్తితో పూజించి వెళ్లేవారు.
దసరా రావడానికి ముందుగానే కాళికాదేవి బొమ్మను తీసుకొని వచ్చే బాధ్యతను గోవింద్‌సేన్‌కు అప్పగిస్తే సంతోషంతో అంగీకరించాడు.
కాళికాదేవి బొమ్మను తీసుకొని రావడానికి లగేజ్ వ్యాన్ మాట్లాడుకున్నాడు. పదోతరగతి చదువుతున్న కొడుకు ‘నాన్నా నేనూ వస్తాను..’ అంటే సరేనంటూ అంగీకరించాడు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి వ్యాన్‌లో డ్రైవర్ పక్కన కూర్చొని బయలుదేరారు.
కాళికాదేవి బొమ్మను ఎక్కించుకొని తిరుగు ప్రయాణం పట్టారు. మధ్యదారిలో వారు పయనిస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి లోనయ్యింది.
అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. అంతా కాళికాదేవి మహిమ అనుకుంటూ మరింత భక్తితో మనసులో కాళికాదేవిని స్మరించుకున్నాడు గోవింద్‌సేన్. పట్టణం ప్రవేశించడానికి ముందు గోవింద్‌సేన్‌కు అనుమానం కలిగి డ్రైవర్‌ని బండి ఆపమన్నాడు. గోవింద్‌సేన్ కిందకు దిగి లగేజీ తలుపు తెరచి చూడగానే గుండె గుభేల్‌మంది. ‘అమ్మా కాళికాదేవి.. ఏమిటమ్మా నీ లీల.. నన్ను పరీక్షిస్తున్నావు. నాకు అవమానం కలిగేలా చేసావు’ అంటూ బోరుమని విలపించసాగాడు.
తండ్రి ఏడుపు విని కొడుకు విక్రమ్‌సేన్ దిగి వచ్చి చూశాడు. ఉగ్రరూపంలో ఉన్న కాళీ రూపు చెక్కుచెదరలేదు కానీ కాళీ కాలు కిందనున్న మహిషాసురుడు బొమ్మ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.
చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న తండ్రిని ఎంతగానో సముదాయించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
‘నాన్నా మీకు నా మీద నమ్మకం ఉన్నదా?’ అడిగాడు విక్రమ్‌సేన్.
కన్నీళ్లతోనే ఔనన్నట్టుగా తలాడించాడు. ‘మీరు ఇంటికెళ్లండి. రేపు ఉదయం అనుకున్నట్టుగా పూజ జరిగే సమయానికి రండి. ఈలోగా నేను కాళికాదేవి బొమ్మకు మంచి రూపం కలిగేలా అలంకరిస్తాను’ అన్నాడు విక్రమ్‌సేన్.
కొడుకు మీద నమ్మకం లేకపోయినా ఇక అవమానం తప్పదననుకుంటూ బాధతో ఇంటి దగ్గర దిగాడు గోవింద్‌సేన్.
ఉదయం ఇంటి నుండి బయలుదేరుతుంటే ఎదురుపడిన వ్యక్తి ‘గోవింద్‌సేన్ ఈసారి కాళికాదేవి అలంకరణ చాలా బాగుంది. చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు.
అతని మాటలు విన్న గోవింద్‌సేన్ ఆశ్చర్యంతో అయోమయంతో వేగంగా వెళ్లాడు.
టౌన్‌హాల్ లోనికి ప్రవేశించడానికి ముందే చాలామంది మెచ్చుకోవటంతో మరింత ఆశ్చర్యం చెందాడు.
కాళికాదేవి బొమ్మ కింద పగిలిపోయిన స్థానంలో మనిషి ఆకారంలో ప్లాస్టిక్ సంచులతో తయారుచేసి మార్కర్ పెన్నుతో రాక్షసుడి బొమ్మను గీసి పెద్ద అక్షరాలతో ‘ప్లాస్టిక్ రాక్షసుడు’ అని రాసి ఉంది.
‘మీ సమయస్ఫూర్తికి అందరూ మెచ్చుకుంటున్నారు. మహిషాసురుడు ఎన్నడో చనిపోయాడు. ప్లాస్టిక్ రాక్షసుడిని చంపి భూదేవిని కాపాడమని నేటి ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ చేతులు జోడించాడు టౌన్‌హాల్ సెక్రటరీ రాజశేఖర్.
దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న విక్రమ్‌సేన్‌ను చూడగానే మనసులోనే కొడుకును ఆశీర్వదించాడు గోవింద్‌సేన్.

-ఓట్ల ప్రకాష్‌రావు 97874 46026