S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 102 మీరే డిటెక్టివ్

హరిదాసు ఆ రోజు రామాయణం హరికథని ఆరంభిస్తూ ఇలా చెప్పాడు.
‘ఇందాక ఎవరో అడిగారు. మనకి హనుమంతుడు ఎప్పుడు వస్తాడు. వచ్చే కాండలో వస్తాడు. మనం అయోధ్యకాండలో దాదాపు చివరికి వచ్చేసాం. ఇంకో రెండు, మూడు కాండలతో అది పూర్తయి సుందర కాండలోకి ప్రవేశిస్తాం. సరే. నిన్న దానికి కొనసాగింపుగా మిగిలింది చెప్తాను. శ్రద్ధగా వినండి.
పెద్దల మీద ప్రేమ గల భరతుడ్ని లక్ష్మణుడితో కలిసి రాముడు ఓదార్చి మళ్లీ ప్రశ్నించాడు.
‘నారచీరలు, జటలు, కృష్ణాజినాలు ధరించి, రాజ్యం నించి ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు?’
రాముడ్ని గట్టిగా కౌగలించుకుని నమస్కరిస్తూ భరతుడు జవాబు చెప్పాడు.
‘మహాబాహువైన మన తండ్రి నిన్ను అడవికి పంపడం అనే చేయకూడని పని చేసి, పుత్రశోకంతో స్వర్గస్థుడయ్యాడు. శత్రువుల్ని సంహరించే ఓ రామా! మన తండ్రి తన కీర్తిని నశింపచేసే ఈ మహాపాపం చేశాడు. మా అమ్మ రాజ్యం లభించక, వైధవ్యం మాత్రం పొంది, శోకంతో కృశించి భయంకరమైన నరకంలో పడుతుంది. దాసుడినైన నన్ను అనుగ్రహించి ఇప్పుడే పట్ట్భాషిక్తుడివి అవు. మన ప్రజలు, భర్తని కోల్పోయిన మన తల్లులు అందరూ నీ దగ్గరికి వచ్చారు. అనుగ్రహించు. మన వంశక్రమాన్నిబట్టి పెద్దవాడైన నీకు సంక్రమించినది, తగినదైన ఈ రాజ్యాన్ని ధర్మానుసారంగా స్వీకరించి నీ మిత్రుల కోరికని తీర్చు. శరత్ కాలపు రాత్రి నిర్మలమైన చంద్రుడ్ని పొందినట్లు సమస్తమైన ఈ భూమి నిన్ను ప్రభువుగా పొంది, సనాధురాలు అగుగాక! ఈ మంత్రులు, నేను అంతా కూడా తల వంచి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ సోదరుడు, శిష్యుడు, దాసుడైన నన్ను అనుగ్రహించు. శాశ్వతమైనది, తండ్రి నించి వంశక్రమంగా వచ్చింది, పూజింపబడేదైన ఈ ప్రకృతి మండలం చేసే ప్రార్థనని కాదనకు.’
మహాబాహువైన భరతుడు ఇలా చెప్పి కన్నీరు కారుస్తూ రాముడి పాదాల మీద తల ఆనించి నమస్కరించాడు.
రాముడు మాటిమాటికీ నిట్టూరుస్తూ, మదించిన ఏనుగులా ఉన్న తమ్ముడు భరతుడ్ని కౌగలించుకుని చెప్పాడు.
‘ఉత్తమ గుణంలో పుట్టినవాడు, బలవంతుడు, తేజస్వి, మంచి వ్రతాలు ఆచరించే నీలాంటి వాడెవడైనా పాపం చేస్తాడా? భరతా! నీలో కొద్దిగా కూడా దోషం నాకు కనపడటం లేదు. చిన్నతనంతో నువ్వు నీ తల్లిని కూడా నిందించద్దు. మహా బుద్ధిమంతుడివి, పాపరహితుడివైన భరతా! పెద్దలు సమర్థులైన తమ భార్యాపుత్రుల విషయంలో తమ ఇష్టం వచ్చినట్లు చేయచ్చని శాస్త్రం. సత్పురుషులు లోకంలో భార్యాపుత్ర శిష్యుల విషయంలో ఏ విధంగా చెప్తున్నారో మనం దశరథుడికి అలాంటి వాళ్లమనే విషయం తెలుసుకో. నా చేత నారచీరలు, కృష్ణాజినం కట్టించి అరణ్యంలో నివాసం ఉండమనడానికి గాని, నిన్ను రాజ్యాభిషిక్తుడ్ని చేయడానికి కాని మహారాజుకి అధికారం ఉంది. ధర్మజ్ఞుడైన తండ్రి విషయంలో లోకులంతా మెచ్చుకునేలా ఎంత గౌరవం చూపించాలో అంతటి గౌరవాన్ని తల్లి విషయంలో కూడా చూపించాలి. ధర్మశీలులైన నా తల్లిదండ్రులు ఇద్దరూ నన్ను అరణ్యానికి వెళ్లమని ఆజ్ఞాపిస్తే నేను మరోలా ఎలా చేస్తాను? నువ్వు అయోధ్యలో లోకుల గౌరవానికి పాత్రమైన రాజ్యపాలన చేయాలి. నేను నారచీరలు ధరించి దండకారణ్యంలో నివసించాలి. దశరథ మహారాజు ప్రజల సమక్షంలో ఇలా పంపకం చేసి మనల్ని ఆజ్ఞాపించి స్వర్గస్థుడయ్యాడు. ధర్మాత్ముడు, లోకానికి పూజ్యుడైన ఆ మహారాజు మాటలని నువ్వు ప్రమాణంగా తీసుకుని నీకు తండ్రి ఇచ్చిన భాగాన్ని అనుభవించాలి. మహాత్ముడైన తండ్రి పధ్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో నివసించడమనే నాకు ఇచ్చిన భాగాన్ని నేను అనుభవిస్తాను.’
(అయోధ్యకాండ సర్గ 101)
రాముడు మాటలు విన్న భరతుడు చెప్పాడు.
‘్ధర్మవిహీనుడినైన నాకు రాజధర్మంతో ఏం ప్రయోజనం? రామా! మన వంశంలో ఎప్పుడూ ఉన్న శాశ్వత ధర్మం ఏమిటంటే, పెద్ద కొడుకు ఉండగా చిన్న కొడుకు రాజు కాకూడదు. అందువల్ల నువ్వు నాతో కలిసి సమృద్ధిగా ఐశ్వర్యం గల అయోధ్యకి వచ్చి మన కులానికి క్షేమం కలగడానికై రాజ్యాభిషిక్తుడివి అవు. ప్రజలు రాజు కూడా మనిషే అని అనుకోవచ్చు కాని ధర్మార్థాలని సంరక్షించే చరిత్ర గల రాజు మనుషులకి శక్యం కాని ప్రభావం గల దేవత అని నా అభిప్రాయం. నేను కేకయ దేశంలో ఉండగా నువ్వు అరణ్యానికి వెళ్లావు. అనేక యజ్ఞాలు చేసినవాడు, పూజ్యుడు, సత్పురుషులకి ఇష్టమైన వాడైన మహారాజు నువ్వు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్లిన వెంటనే స్వర్గస్థుడయ్యాడు. రామా! లేచి తండ్రికి జలతర్పణాలు ఇవ్వు. నేనూ, శతృఘు్నడు ఆ పని ఇదివరకే చేశాం. ఇష్టమైన కొడుకు ఇచ్చింది పితృలోకాల్లో అక్షయంగా ఉంటుందని చెప్తారు కదా? మన తండ్రికి ప్రియమైన కొడుకువి నువ్వే. అందుచేత నువ్వు ఆయనకి అపర కర్మలు చెయ్యి. నీ తండ్రైన దశరథుడు నువ్వు దూరంగా వెళ్లిపోవడంతో నీ గురించే దుఃఖిస్తూ, నిన్ను చూడాలని కోరుకుంటూ, నీ మీద లగ్నమైన మనసుని మరల్చలేక, నీ గురించిన శోకంతో మునిగిపోయి నినే్న స్మరిస్తూ చచ్చిపోయాడు.’
(అయోధ్యకాండ సర్గ 102)
భరతుడు చెప్పిన విచారకరమైన తండ్రి మరణవార్తని విని రాముడు అచేతనుడై మూర్ఛిల్లాడు. శతృసంహారకుడైన రాముడు యుద్ధంలో దేవేంద్రుడు ప్రయోగించిన వజ్రం లాంటి, భరతుడు చెప్పిన విచారకరమైన వాక్కనే వజ్రం తగలగానే రెండు చేతులు మెలి వేసి, అరణ్యంలో గొడ్డలితో నరకబడ్డ, పుష్పించిన వృక్షంలా నేలకూలాడు. సమీపంలోని సోదరులు, సీత ఏడుస్తూ నేల మీద పడి, నదీ తీరాన్ని పొడిచి, పొడిచి అలసి నిద్రిస్తున్న ఏనుగులా ఉన్న, మహాధనుర్దారీ, శోకంతో కృశించిన వాడు, భూపతైన రాముడి మీద నీళ్లు చల్లారు. రాముడు మూర్ఛ నించి తేరుకుని లేచి కన్నీరు కారుస్తూ దీనంగా, పెద్దగా ఏడవడం ఆరంభించాడు.
తర్వాత ధర్మాత్ముడైన రాముడు తండ్రి స్వర్గస్థుడైనట్లు విని భరతుడితో ధర్మసమ్మతమైన మాటలు చెప్పాడు.
‘తండ్రి మరణించిన తర్వాత ఆ అయోధ్యతో నాకేం పని? ఆ రాజశ్రేష్ఠుడు లేని అయోధ్యని ఎవరు పాలించగలరు? నా గురించిన విచారంతో మరణించిన ఆ మహాత్ముడికి నేను అంతిమ సంస్కారం కూడా చేయలేకపోయాను. చెడ్డ పుట్టుక గల అలాంటి నా వల్ల ఆయనకి ఏం ప్రయోజనం? దోషాల్లేని భరతా! నువ్వు, శతృఘు్నడు మన తండ్రికి చేయాల్సిన ప్రేత కార్యాలన్నీ చేసి సత్కరించారు. అందువల్ల మీరిద్దరూ కృతార్థులు. మహారాజు చనిపోవడంతో ప్రధాన పురుషుడు లేక వ్యాకులంగా ఉన్న ఆ అయోధ్యకి నేను వనవాసం తర్వాత కూడా వెళ్లాలి అని కోరుకోను. తండ్రి మరణించాడు కదా? భరతా! నేను వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకి తిరిగి వచ్చాక అక్కడ నాకు ఉపదేశం చేసే వాళ్లెవరు? పూర్వం మన తండ్రి నా మంచి నడవడికని చూసి ఆనందిస్తూ, నన్ను సంతోష పెట్టడానికి కొన్ని మాటలు చెప్పేవాడు. చెవులకి సుఖకరమైన అలాంటి మాటలని ఇక మీదట నేను ఎవరి నించి వినగలను?’
*
(అయోధ్యకాండ సర్గ 103-13వ శ్లోకం దాకా)

కథ పూర్తయ్యాక ఓ శ్రోత లేచి ఆ రోజు హరిదాసు మొత్తం నాలుగు తప్పులని చెప్తాడని చెప్పాడు.
మీరా తప్పులని పట్టుకోగలరా?

1.రాముడు భరతుడ్ని ప్రశ్నించడం కొనసాగించాడు. కాని హరిదాసు శతృఘు్నడ్ని అని తప్పుగా చెప్పాడు.
2.స్ర్తిలతో మంచి మాటలు మాట్లాడుతూ వాళ్లని బాగా రక్షిస్తున్నావు కదా? అని అడిగాక ‘వాళ్ల మాటలని నమ్మడం లేదు కదా? వాళ్లకి రహస్యాలేమీ చెప్పడం లేదు కదా?’ అని కూడా రాముడు ప్రశ్నించాడు. చివరి రెండు ప్రశ్నలని హరిదాసు చెప్పలేదు.
3.ఏనుగులుండే నాగవనాన్ని రక్షిస్తున్నావు కదా? అని రాముడు అడిగాడు. ‘ఏనుగులుండే’ అని హరిదాసు చెప్పలేదు.
4.మంచి విద్యావంతులైన నీ మంత్రులు ధనికుడికి లేదా దరిద్రుడికి కష్టం వచ్చినప్పుడు పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నారు కదా? అని రాముడు అడిగిన ప్రశ్నని హరిదాసు చెప్పలేదు.
5.స్వపక్షానికి చెందిన ఏడుగురిలో హరిదాసు చేర్చిన బావమరిది లేదు. అది తీసేస్తే మిగిలిన ఏడు మాత్రమే వాల్మీకి చెప్పాడు.
6.రాముడు భరతుడ్ని రాజనీతికి చెందిన వివిధ అంశాలని ప్రశ్నించాడు. కాని చివర్లో హరిదాసు లక్ష్మణుడు అని తప్పుగా చెప్పాడు.
*
మీకో ప్రశ్న
అయోధ్యకాండలో ఉన్న, గాయత్రి మంత్రంలోని బీజాక్షరం ‘ణ’ ఏ సర్గ, ఏ శ్లోకంలో ఉందో చెప్పగలరా?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
రాముడు చెప్పిన రాజనీతిలో మండలం మధ్యలో ఉన్న రాజుని ఏమంటారు?
విజిగీషువు
*

-మల్లాది వెంకట కృష్ణమూర్తి