S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జర్నలిజమే ఖరారు..

ఇంఛిపేటలో మొదట్లో మా ఇంట్లో మంచినీటి పంపు కరెంటు రెండూ లేవు. ఆనక వచ్చాయి. పేట మొత్తానికి సరిపడా నీరు ఇవ్వగల పదహారు పంపుల ట్యాంక్ - (దానినే బావి పంపులు అనేవారు) ఉండేది. ఆఫీస్ బాయ్ కొట్టు దగ్గర మునిసిపల్ మంచి నీటి పంపు వుండేది. ఫాతిమా బీ మాకు నీళ్లు తెచ్చి పోసేది బిందెల లెక్కన. కాని మా మామ్మ (నాయనమ్మ) వచ్చినప్పుడు తన మడి నీళ్లు పంపు దగ్గరకి వెళ్లి కూచి బిందెలోకి నీళ్లు పట్టుకొని సంకన బెట్టుకొని తెచ్చుకొనేది. అదో చిత్రమయిన దృశ్యం. బామ్మతోపాటు ఖాసిం పహిల్వాన్ తయినాతుగా వుండేవాడు. పంపు దగ్గర అంతా ఖాళీ (ఓ చిన్న సైజు కర్ఫ్యూ) చేసేవారు. ఆమె నీళ్లు పట్టుకుని వచ్చి ‘అల్లా చల్లగా చూస్తాడు. మా కోడలు టీ ఇస్తుంది తాగి ఆనక వెళ్లు ఖాసిం ఖాన్’ అని పంపేసేది. ఆపాటికి రేడియోలో ‘ఏమిసేతురా లింకా..! గంగ ఉదకమ్ము తెచ్చి.. చేదమూ అంటే చేపపిల్ల ఎంగిలి అంటున్నాయిరా.. లింగా’ అని బాల మురళీకృష్ణ గారి ముక్తాయింపు.. వినబడేది వినవచ్చేది - నాకు కితకితలు పెట్టినట్లు ఉండేది.
మేము కనకదుర్గ కొండ మీదికి వెనుక మెట్ల మీద నుంచి ఎక్కేసి, కొండ మీద దొంగాట ఆడుకొనేవాళ్లం. క్రింద కొత్త గుళ్లు అనే కొత్త టెంపుల్స్ సముదాయం వెలసింది. సామరంగం చౌక్ దాటాక- దుర్గమ్మ గుడి దారిలో బ్రామ్మన వీధిలో వున్న సందులో మెట్లు ఉండేవి. అదే మా అడ్డదారి. సరే కొత్త గుళ్లు చూద్దాం - దానిలోని ప్రసాదాలు తెచ్చి ప్రక్కనే రోడ్డు మీదకి కనపడే దుకాణంలో (గుడికి అనుబంధం) అమ్మేసేవారు - అదో మాదిరి టిఫిన్ సెంటర్ లాంటిది. నా (మా) వొళ్లు మండిపోయింది. మా వూళ్లో ముసలమ్మ / మరణం ఆకలి కారణం/ గుళ్లో దేవుడి ప్రసాదం/ అమ్మకాని కుపయోగం../ ఏది ఖరారేది ఖరారు? అంటూ ప్రసాదాలు టిఫిన్ సెంటర్‌లో అమ్మడం మీద ప్రతిస్పందించాను. కోపంగా ఇది రాశాను. ఏది ఖరారేది? ఈ శీర్షికకి ప్రోత్సాహం లభించింది - ఈ మకుటంతో వో సిరీస్ రాశాను - అందులో మరో స్టాంజా;
అయ్యవారికి చాలు ఐదు/ రూకలు అబ్బాయికి ఐదు/ మార్కులే పదివేలు/ దసరా పజ్యానికి ఇది చైతన్యం (కలం చిందులు) ఏది ఖరారేది? ఖరారు?
ఈ కవితలు అచ్చయిన పత్రికని తెలుగు మాస్టారికిచ్చాను. చదివి.. కండువా తీసి నెత్తిన వేసుకున్నాడాయన. అది ఆయన మేనరిజంలెండి - భేష్ అంటూ మెచ్చి భుజం తడుతూ ‘బ్రా’మ్మిగాడివేగా అని మెల్లిగా అన్నాడు. తలూపాను. ‘పైకి, వస్తవ్ పో’ అన్నాడు - కాని, బ్రాహ్మణ లోగిళ్లకి దూరంగా శ్రామిక పేటల మధ్య పెరుగుతున్న మాకు ఈ వాకబు చిత్రంగానే తోచేది. మా ఇంటికి దగ్గరలో మసీదు సెంటర్‌కి మూలగా - ఓ మున్సిపల్ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు వుండేది. అందులో మా తమ్ముళ్లు చదివారు ఎనిమిదో క్లాసు దాకా... దానికి కొన్నాళ్లు కృష్ణమూర్తి గారని హెడ్మాస్టరు ఉండేవాడు. క్రైస్తవం తీసుకున్నాడు కాని మా వాణ్ణి మీ ఇంటికి పోయి మరచెంబుతో నీళ్లు తెచ్చి పెట్టు నేను బ్రాహ్మన్ని అనేవాడు.. ఔరా?
తెలుగు స్వతంత్ర పత్రిక ఖాసా సుబ్బారావు గారిది. ఆయన ఉభయకవి మిత్రుడు ఆంగ్లం ఆంధ్రం.. రెండూ మాస్టర్ చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఆంధ్రప్రభకి కూడా ఎడిటర్. తెలుగు స్వతంత్ర ఆయన సొంత బిడ్డ. నా పొయిట్రీ ఆ ‘స్వతంత్ర కోట’లో పాగా వేసింది. ఖాసా సారూ దగ్గర నుంచి వచ్చిన కార్డు - ఆనక వచ్చిన ఎనిమిది రూపాయల మనియార్డరు ఫార్మ్ ముక్క ఎన్నాళ్లో పదిలంగా దాచుకున్నాను. ఆ పత్రిక తెరవగానే ఓపెనింగ్ పేజీలో మన రచన పడితే అదో స్వర్గమే.. అట్లాంటి గౌరవం అందుకున్న ఈ కవిత.
‘అమ్మా నాకీ చదువ్వొద్దు’ అన్న కవిత అది. మచ్చుకి కొన్ని చరణాలు అందులోనించి.
‘అమ్మా నాకీ చదువ్వొద్దు/ కొత్త పలకాబలపం పుచ్చుకు/ ఇంచక్కా బళ్లోకి వెళతాను/ కొత్తక్షరాభ్యాసం చేసుకుంటాను/ మరి రెండు చరణాల తర్వాత ఇంకో పాదం ఇలా ఉంది: ‘పెద్ద బళ్లోకి వెళ్లి కొత్త/ జీవితం లాభనష్టాలు రాగభోగాలూ తులాయిస్తాను/ మనుషుడికి అవసరమైన/ దారిలో కళలూ కర్మాగారాలు ఫిరాయిస్తాను/ (స్థల విస్తరణ భీతి చేత క్లుప్తంగా ఇలా ‘/’తో పాద విభజన ఇస్తున్నాను) హృదయం పలక మీద / అనురాగం పలకపుల్లతోను/ అనుభవం అక్షరాలు రాస్తాను/ ఐకమత్యం గుణకారాలు హెచ్చు వేస్తాను
చివరి చరణం: అనుకరణల కంఠోపాఠో పాఠాలకు/ ఆరోగ్యాలు ఖర్చు పెట్టి అయిన/ వాళ్ల పరువు కుదువబెట్టి/ చెలామణీ మార్కులే ఇంచుకోను../ కొత్తక్షరాభ్యాసం చేసుకుంటాను/ కొత్త జీవితం చదూకుంటాను...
ఆ పత్రికని ఆనందంగా - చూపెడితే మాస్టారన్నాడు. ‘ఓరయ్యా! ఆదిలోనే పప్పులో కాలేశావ్ - కొత్త అన్న మాట తెలుగు పదం అక్షరాభ్యాసమ్ సంస్కృతం - యడాగమం చెయ్యాలే కాని సమాసం చెయ్యరాదు’ అన్నాడు. నవ్వేశాడు మా కాకర్ల.
‘అదే కదా సారూ వాడేమి చెబుతున్నాడు? నాకీ చదువులొద్దు కొత్త స్కూలు నాది అని కదా? అందుకే హెడ్డింగ్‌లోనే కొత్తదనం తెచ్చాడు మనవాడు. దీనిని.. స్వతంత్ర ఎడిటర్‌గారు ఓకే చేశాడు సార్ - అని వెంటనే, అక్కడ నించి పారిపోయాం. ఈ కవిత - నాకు గొప్ప ఊతం ఇచ్చింది. అంచెలంచెలుగా.. భారతికి కూడా విజయవంతంగా కవితలు పోస్ట్ చేశాను. కాగా ‘కలం చిందులు’ కాలమ్‌లో మచ్చు ఒకటి.. ‘యతి పడలేదని మతి పోతున్నది దేవా../ (అంటే) డడడా.. పాటలు పాడుతూ నిదురోలేవా?’ అని హాస్యంగా రాస్తే కవితలు ప్రేలేయి. (సో, హాస్యం నా (అ) జెండా?) అప్పట్లో ‘జీవితం - వైజయంతిమాల తొలి చిత్రం అనుకుంటాను - అందర్నీ ఓ ఊపు ఊపేసిన పాట డడడా.. డడడాం.. పాటకిది పేరడీ. ‘వ్యంగ్యం అవశ్యం..’

(ఇంకా బోలెడుంది)

-- వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com