S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వశక్తి

సత్యానంద మహర్షి దగ్గర చాలామంది శిష్యులుండేవారు. వారిలో వివేకుడు, సుబుద్ధి అనే ఇద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ కవల సోదరుల్లా కలసిమెలసి తిరిగేవారు. వివేకుడు కొంచెం మందబుద్ధి. గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడు కాదు. ధ్యాస మరెక్కడో వుండేది. లేదా పాఠం చెబుతున్నప్పుడు కునికిపాట్లు పడుతుండేవాడు.
అది చూసి ఎన్నోసార్లు సుబుద్ధి స్నేహితునితో శ్రద్ధగా వినమని చెప్పేవాడు కానీ, ఫలితం వుండేది కాదు. ఎప్పుడైనా గురువుగారు శిష్యులకు పరీక్షలు పెట్టినపుడు సుబుద్ధే సహాయం చేసి వివేకుడిని దండించకుండా ఆదుకునేవాడు.
అలాగే రోజులు గడిచేకొద్దీ వివేకుడికి బాగా అలవాటై, ఏ పనీ చేతకాకుండా ఏ విధమైన విషయ పరిజ్ఞానం లేకుండా మొద్దులా తయారయ్యాడు.
స్నేహితుని తీరు బాధ కలిగించినా అతన్ని మార్చలేక, అలాగని గురువుకు తెలిస్తే ఎక్కడ తన స్నేహితుడ్ని కేకలేసి పంపివేస్తాడేమో అని భయపడి స్నేహితుడ్ని ఆదుకునేవాడు.
ఒకసారి సోదరి వివాహం వున్నందున సుబుద్ధి తప్పనిసరిగా వెళ్లవలసి వచ్చింది. అన్ని జాగ్రత్తలూ వివేకుడికి చెప్పి వెళ్లాడు సుబుద్ధి.
మర్నాడు గురువు వివేకుని పిలిచి, అడవికి వెళ్లి హోమానికి కావలసిన సమిధలు తెమ్మని పంపాడు. సరే అంటూ వెళ్లాడు కానీ అతనికి ఏ పుల్లలు హోమానికి వాడుతారో తెలీక పేరు తెలియని పిచ్చి పుల్లలు ఏరి తెచ్చాడు. అది చూసి గురువు ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. దాంతో బిక్కచచ్చిపోయిన వివేకుడు క్షమించమని వేడుకుని, మరొక శిష్యుని సహాయంతో వెళ్లి మంచి సమిధలు తెచ్చాడు.
నెల రోజుల తరువాత వచ్చిన సుబుద్ధి, తన మిత్రుడు తన సహాయం లేకుండా అన్ని విషయాల్లో మెరుగై కనిపించేసరికి ఆశ్చర్యపడి ఆనందపడ్డాడు. ఆ విషయమే వివేకుడితో అన్నాడు.
దానికి వివేకుడు నవ్వి ‘అవును మిత్రమా ఇన్నాళ్లూ నువ్వెన్ని చెప్పినా పట్టించుకోలేదు. నువ్వు లేని సమయంలో నేను చేసిన తప్పు తెలిసి వచ్చింది. అప్పట్నుంచీ ఒళ్లు దగ్గర పెట్టుకొని పాఠాలపై శ్రద్ధ పెట్టాను. ఇప్పుడు నాకూ చాలా తృప్తిగా, భయం లేకుండా ఉంది’ అన్నాడు.
‘నిజమే. నేను కూడా నువ్వే ఇబ్బందులు పడుతున్నావో అని నినే్న తలుచుకుంటూ వుండేవాడిని. ఇప్పుడు నాకూ నిశ్చింతగా ఉంది’ అన్నాడు సంతోషంగా స్నేహితుని అభినందిస్తూ.
‘అవును మిత్రమా! స్వశక్తితో ముందుకు పోవాలంటే నాలాగా అశ్రద్ధ వుండకూడదు. అలాగే స్నేహితుని మీది వెర్రి అభిమానంతో నీలాగా అనవసర సహాయమూ చేయకూడదు’ అన్నాడు నవ్వుతూ వివేకుడు సుబుద్ధిని ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ.
నిజానికి వీళ్లిద్దరి సంగతీ కనిపెట్టిన గురువుగారే కొన్నాళ్లు సుబుద్ధిని స్నేహితునికి దూరం చేసి, అతనిని దారిలో పెట్టాడన్న విషయం ఎవరికీ తెలియదు.

-డేగల అనితాసూరి