S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అజీర్తిని జయంఛే ఆహారం

ప్రశ్న: అజీర్తి రాకుండా ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఏమేం తినాలి? ఏ మందులు వాడాలి?
-కె.వి.లక్ష్మణరావు (జగిత్యాల)
జ: ఆహారం వలనే అజీర్తి కలుగుతోంది. ఆహారమే ఈ అజీర్తిని పోగొట్టగలగాలి. ప్రతీ దానికీ డబ్బులు పారేసి మందులు కొని మింగటం పరిష్కారం కాబోదు. డబ్బుదేన్నయినా ఇవ్వవచ్చు. కానీ, ఆరోగ్యాన్ని మాత్రం కాదు. వ్యాధులు రెండు రకాలు - వచ్చేవి, తెచ్చుకునేవి అని! అజీర్తి మనం తెచ్చుకునేది. తెచ్చుకుంటూన్న కొద్దీ వ్యాధిగా మారుతూ ఉంటుంది.
అజీర్తిని వైద్యపరంగా కఒఔళఔఒజ్ఘ అంటారు. పై పొట్టలో అసౌకర్యంగా ఉండటం దీని లక్షణం. అజీర్తి ఒక వ్యాధి కాదు. అనేక వ్యాధులకు దారినిచ్చే ఒక మాతృక. పొట్ట ఉబ్బరం, వికారం, కడుపులో మంట, నొప్పి, ఆహారం తినబుద్ధి కాకపోవటం, పుల్లటి త్రేన్పులు, కడుపులోంచి పుల్లని ద్రవం గొంతులోకి ఎగజిమ్మటం, విరేచనాలు, మలబద్ధత, రెండు రొమ్ముల మధ్య భాగంలో నొప్పి (ఎపిగాస్ట్రిక్ పెయిన్), పేగుపూత, త్రేన్పులు, అపాన వాయువులు వెళ్లటం ఇవన్నీ అజీర్తి కారణంగానే వస్తాయి.
పర్వతాలు ఫలహారం చేయగల జీర్ణశక్తి ఉన్న వారికి మిరపబజ్జీని ఆవకాయలో ముంచి తిన్నా ఏమీ కాదు. జీర్ణపటిమ తక్కువగా ఉన్న వ్యక్తి పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకున్నానండీ.. తెల్లారేసరికి పొట్ట పట్టేసింది.. అంటాడు.
నూనె పదార్థాలు, అతిగా మసాలాలు, అమితంగా చింతపండు, అర్థం లేని శనగపిండి, అదే పనిగా తినే టిఫిన్లు వేళాపాళా లేని భోజన అలవాట్లు, మానసిక వత్తిడి.. ఇవన్నీ అజీర్తిని తెచ్చి పెట్టటంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. అజీర్తి కలగగానే ఆహారంలో కొవ్వుని, మసాలాలను, ఊరగాయ పచ్చళ్లు, కూల్‌డ్రింక్‌లు, కాఫీ టీలు.. మద్యపానం, ధూమపానం వీటిని ఆపితే అజీర్తి పోతుంది. రోజూ కనీసం 7 గంటలైనా నిద్ర పోగలిగితే అజీర్తి రాదు. లైఫ్ స్టైల్ మార్చటం అంటే ఇవి పాటించటమే.
అల్లాన్ని తగినంత ఉప్పు వేసి దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భోజనం తేలికగా అరుగుతుంది. అన్నహితవు కలుగుతుంది. భోజనం చేసిన తరువాత భుక్తాయాసం కలగకుండా ఉంటుంది. ఉసిరికాయ తొక్కుపచ్చడి (నల్లపచ్చడి)లో తగినంత అల్లం ముద్ద కలిపి నెయ్యి వేసుకుని ఒకటీ లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. అజీర్తి లేని వాళ్లు కూడా ఇది తింటూ ఉంటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.
ఇంగువ, సైంధవ లవణం, ధనియాలు, బిరియానీ ఆకు ముక్కలు, శొంఠి, పిప్పళ్లు, మిరియాలు - వీటన్నింటినీ సమంగా తీసుకుని మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యం, అందులో సగం చాయపెసర పప్పు తీసుకుని నీరు ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో ఈ పొడిని ఒక చెంచా లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి కాసేపు కాచి దింపండి. అష్టగుణమండం దీని పేరు. అజీర్తిని తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
లోపల గింజను తీసేసిన కరక్కాయ బెరడు, దానికి సమానంగా పిప్పళ్లు, ఈ రెండింటికీ తగినంత సైంధవ లవణం మూడింటినీ మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. రెండు లేక మూడు పూటలా అరచెంచా నుండి చెంచా పొడిని గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. అజీర్తి, కఫం తగ్గుతాయి. దీన్ని ‘అజీర్ణహర చూర్ణం’ అని పిలుస్తారు.
ఈ అజీర్ణ హర చూర్ణంలో పిప్పళ్లతో సమానంగా వాము, శొంఠి కూడా కలిపి తీసుకుంటే మరింత శక్తిమంతంగా పని చేస్తుంది. అజీర్తికరమైనవి తిన్నప్పుడు, ప్రయాణాలు చేసేప్పుడూ ఈ పొడిని వాడుకోవచ్చు. చాలామంది ఉద్యోగ రీత్యా మేం వొంటరిగా ఉండి హోటళ్లలో తినవలసి వస్తోందని, తమకు పొట్ట చెడకుండా ఉపాయం చెప్పవలసిందిగా కోరుతున్నారు. హోటళ్లలో తప్పనిసరిగా తినవలసిన వాళ్లు ఈ అజీర్ణహర చూర్ణాన్ని రోజూ ఒకటీ లేక రెండుసార్లు మజ్జిగతో కలిపి తాగుతుంటే నిజంగానే పొట్ట చెడకుండా ఉంటుంది.
వసకొమ్ముని దంచిన పొడిని నీళ్లలో వేసి టీ లాగా కాచుకుని తాగితే అజీర్తి తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విష దోషాలకు విరుగుడుగా పని చేస్తుంది. మొలలున్న వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. మలబద్దతను నివారిస్తుంది. ఉబ్బసంలో వచ్చే దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. వసకొమ్ము చాలా శక్తివంతమైన మూలిక. పరిమితంగా తీసుకోవాలి. అతిగా తాగితే వికారం కలిగిస్తుంది.
పెసర పప్పులో నీళ్లు ఎక్కువ పోసి కాచిన కట్టులో మిరప కారానికి బదులుగా మిరియాల పొడిని కలుపుకుని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.
ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి కాచి, అన్నంలో మొదటి ముద్దగా కలిపి తింటే కడుపులో నొప్పి తగ్గుతుంది.
మసాలా ద్రవ్యాల్లో బిరియానీ ఆకు నిరపాయకరమైనది. ఆరోగ్యాన్నిస్తుంది. బిరియానీ ఆకుని మెత్తగా దంచి మిరియాల పొడి ఉప్పు తగినంత కలిపి కారప్పొడి చేసుకుని తింటే అన్నహితవు కలుగుతుంది. మలబద్ధతని సరిచేస్తుంది. కడుపులో నొప్పిని హరిస్తుంది. పైత్యాన్ని (ఎసిడిటీని) పోగొడుతుంది. బాలింతలకు తల్లిపాలు పెరిగేలా చేస్తుంది. కడుపులో వాతం, గ్యాసు, ఉబ్బరం, దుర్గంధంతో కూడిన అపాన వాయువులు, విరేచనాలు ఆగుతాయి. నోటి దుర్వాసన పోతుంది.
బియ్యపు నూకను దోరగా వేయించి కాచిన జావలో తగినంత ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగితే అజీర్తి తగ్గుతుంది.
జీర్ణాశయం బలంగా లేనప్పుడు దంపుడు బియ్యం తినటం కన్నా రాగులూ సజ్జలూ, ఆరికల్లాంటి తృణ ధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు (బొరుగులు) ఇలాంటివి జీర్ణశక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవటం మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు చేస్తాయి.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com