కరకరలే కొంపముంచుతాయి
Published Saturday, 13 October 2018ఫ్రశ్న: నంజుడు కోసం వాడుకునే ఆహార పదార్థాలు, ఉదాహరణకు పెరుగు అన్నంలో గోంగూర పచ్చడి లాంటివి తినటం వల్ల కలిగే లాభనష్టాలు వివరంగా చెప్పగలరు..
-లక్ష్మీప్రసన్న దామరాజు (ఖమ్మం)
జ: మంచింగ్ అనే మాటకి కరకరలని భావార్థం. eating steadily and often audiblyఇక అని నిఘంటు అర్థం. మనం తింటున్నట్టు ఇతరులకు వినిపించే విధంగా తినవలసి వచ్చే పదార్థాలని మంచ్ అంటారు. ఆ పదార్థాల్ని కావాలని తెచ్చుకుని తినటం మంచింగ్. ఇది తెలుగు పదం కాదు. ఇంగ్లీషు మంచి. అవి అంత ‘మంచి’వేం కాదు.
మంచింగ్ పదార్థాలు కరకర నమిలేవిగానూ, చూ అని పీల్చేవిగాను, చప్ అని చప్పరించేవిగాను టక్‌టక్‌మని లొట్టలు వేసి తినేవిగానూ అనేక రకాలుగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా దేనితోపాటుగానైనా కలిపి తినవచ్చు. అలా ఇతర పదార్థాలతో కలిపి తినటాన్ని నంజుకుని తినటం లేదా నంజికుని తినటం అంటారు.
నంజుడు అంటే పచ్చడి అని అర్థం. ‘నంజుడుదిండి’ ‘నంజుడు మేపరి’ అని రాక్షసుడికి మరో పేర్లున్నాయి. నంజిలిపడటం అంటే వెనుకడుగు వేయటం అనే అర్థం కూడా ఉంది. దేవుణ్ణి కరుణ చూపించటానికి నంజిలి పడనేల? అని అల్లూరి వెంకటాద్రి స్వామి ఒక కీర్తనలో వ్రాస్తారు. అసలు ఆహార పానీయాలకన్నా నంజుల వాడకం విషయంలో జనం ఏ మాత్రం నంజిలిపడట్లేదనేది వాస్తవం.
నంజుకోవటం తప్పు కాదు గానీ, ఏం నంజుకుంటున్నాం అనేది ముఖ్యం. పెరుగన్నానికి గోంగూర పచ్చడి లేదా ఆవకాయ ముక్క, గారెలకు అల్లప్పచ్చడి, ఇడ్లీకి సాంబారు, ఆల్కహాలుకి పచ్చిమిరప బజ్జీలు ఇవన్నీ కొంపముంచే మంచింగుకి ఉదాహరణలు. ఆవడ మీద సన్న కారప్పూస కూడా ఇలాంటిదే!
ఒక ఔషధాన్ని తీసుకుంటూన్నప్పుడు అల్లం రసంతోనో తులసాకుల రసంతోనో, ధనియాల కషాయంతోనో తీసుకోవటాన్ని ‘అనుపానం’ (Adjuvant after Drink)అంటారు. ఈ అనుపాన ద్రవ్యం ఔషధాన్ని సరిగ్గా ఏ అవయవం మీద అది పని చేయాలో అక్కడికి వేగంగా తీసుకువెళ్లి, శక్తిమంతంగా పని చేయిస్తుంది. అనుపానం వలన ప్రయోజనం అది. మనం తీసుకునే మంచింగు కూడా అలా ఉపయోగపడ్తోందా అనే ప్రశ్న వేసుకుంటే ‘మంచింగూ’ మంచిదే!
ఆయుర్వేద శాస్త్రం ఆహార ద్రవ్యాలక్కూడా కొన్ని అనుపానాలు లేదా మంచింగ్ వివరించింది. ఉదాహరణకు కందిపచ్చడిని పచ్చి పులుసుతో తినటం వలన కందిలోని దోషాలకు విరుగుడుగానూ, రుచివర్థకం (టేస్ట్ మోడిఫయ్యర్) గానూ, తేలికగా అరిగేదిగానూ చేస్తుంది. అనుపానం లేదా నంజుడు ఇలా ఉపయోగపడేదిగా ఉండాలి. నంజుకునే ద్రవ్యాల్ని ఎంచుకోవటంలో మనకు యుక్తి ఉండాలని దీని అర్థం. ఆవకాయ అన్నాన్ని ఉత్తపప్పుతో నంజుకుంటే ఆవకాయ వలన కలిగే ఎసిడిటీని కొంతవరకూ తగ్గించేందుకు వీలౌతుంది. బిరియానీ, పలావ్ లాంటి వంటకాలను ఉల్లిపెరుగు రైతాతో తినడం కూడా ఇలా ఉపయోగపడేదే! గోంగూర పచ్చడిని ఎత్తుకెత్తుగా ధనియాలపొడి, వేగిన ఉల్లిముక్కలు కలిపి తింటే గోంగూర వలన కలిగే అపకారం తగ్గుతుంది. కందిపప్పు లేదా పెసరపప్పుని నేతితో తినటం ఉత్తమ మంచింగ్.
ఈ మంచింగ్ కొత్త ప్రమాదాలను తెచ్చిపెట్టేదిగా ఉండకూడదనేది శాస్తవ్రేత్తల హెచ్చరిక. కాఫీని లేదా టీని మనం పాలు, పంచదార కలిపి తీసుకుంటున్నాం. అక్కడితో ఆగట్లేదు. స్వీట్ సాల్ట్ బిస్కట్లతో నంజుకుంటూ తాగుతున్నాం. స్వయంగా కాఫీపొడి లేదా టీ పొడి కలిగించే అపకారం సంగతి అలా ఉంచితే, వాటితో సహపానం చేస్తున్న మంచింగ్ గురించి ఇప్పుడు మనం ఆలోచించాలి. కాఫీ టీల పేరుతో అధికంగా కొవ్వు, షుగరు శరీరంలోకి వెళ్లకుండా చూసుకోండి. పాలకు విరుద్ధ ద్రవ్యం కదా.. ఉప్పు కలిసిన బిస్కట్లను కాఫీ టీలలో ముంచుకుని తింటే కడుపులో అది విష దోషంగా మారే ప్రమాదం ఉంది కదా! ఆలోచించడం. కాఫీ లేదా టీ తాగగానే సిగరెట్ తాగాలనిపించటం కూడా ఇలాంటిదే!
ఆల్కహాల్ తీసుకునేప్పుడు పచ్చిమిరప బజ్జీలు వగైరా తినటం మంచింగ్ వలన కలిగే దుష్ట పరిణామాలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆల్కహాల్ స్వయంగా ఎసిడిటీని పెంచేది కాగా, ఈ మంచింగ్ కడుపులో ఆమ్ల సముద్రాలనే సృష్టిస్తుంది.
ఇడ్లీ తయారీకి ఉప్పుడు రవ్వ అవసరం. అది పులవబెట్టిన బియ్యపు రవ్వ. ఎసిడిటీ పెరిగేలా చేసే గుణం ఈ ఉప్పుడు రవ్వకి ఉంది. దాన్ని చింతపండు రసం నిండిన సాంబారుతోనూ, చింతపండు మయంగా ఉండే అల్లప్పచ్చడితోనూ, కారప్పొడితోనూ, శనగ చట్నీతోనూ లేదా ఆవకాయ మాగాయలతోనూ మంచింగ్ చేసుకుని తిన్నప్పుడు కడుపులో ఎంత ఎసిడిటీ ఏర్పడుతుందో గుర్తించండి. ఇడ్లీ 100 గ్రాములుంటే, మంచింగ్ 300 గ్రాములుంటుంది. ఈ మొత్తం కలిపి కడుపులో చేసే అలజడి ఎక్కువగా ఉంటుంది. మనం వండి, తినే పద్ధతిలో ఇడ్లీ అనుకున్నంత సురక్షిత ఆహార పదార్థమేమీ కాదు.
ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ పునుగులు ఇలాంటి టిఫిన్లన్నీ మన జీర్ణాశయ వ్యవస్థను పాడు చేసేవిగానే ఉంటున్నాయనేది ముఖ్యంగా గుర్తించాలి. ప్రొద్దునే్న ఉపాహారంగా టిఫిన్లకన్నా పెరుగన్నం లేదా మజ్జిగ అన్నం ఉత్తమమైనది. ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని దంచిన పొడిలో తగినంత ఉప్పు కలుపుకుని ఒక సీసాలో భద్రపరచుకోండి. రోజు మొత్తం మీద 3 లేదా 4 చెంచాల వరకూ ఈ పొడిని పెరుగన్నం లేదా మజ్జిగన్నంలో నంజుకోవటానికి వాడుకోండి. మంచింగ్ మేలు చేసేదిగా ఉండాలి.
మంచింగ్ అనే మాట ఎక్కువసార్లు మనకు ఆల్కహాల్ తీసుకునేవారి దగ్గర వినిపిస్తుంది. ఆల్కహాలికుల్లో ఎక్కువమందికి తాగినప్పుడు తమంత గొప్పవాడు ఇంకొకడు లేరనే భావన సహజంగా ఉంటుంది. ఆ సమయంలో కించపరిచే విధంగా మాట్లాడే మాటలు, చేసే చేష్టలు, తినే తిండి ఈ భావన కారణంగా విచిత్రంగా ఉంటాయి. ఆల్కహాల్ వలన కలిగే చెడు గురించి అలా ఉంచితే, దాన్ని సేవించేప్పుడు తీసుకునే మంచింగ్ వలన ఆ వ్యక్తులకి కలిగే అపకారం ఎక్కువగా ఉంటుంది. మంచింగే కొంప ముంచుతుంటుందొక్కోసారి.