S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగులో సైన్స్

భాషను గురించి మాట్లాడటం అంటే మాటను గురించి మాట్లాడటమే. మాట ఒక్క రూపంలో ఉండదు. పాట కూడా మాటలతో కూడినదే. కానీ పాట, మాట వేరు అనే పరిస్థితి వచ్చింది. మాట వ్యాసంగా ఉంటుంది. కథగా, కథానికగా, నవలగా, నాటకంగా, మరెన్నో రకాలుగానూ ఉంటుంది. ప్రపంచానికి, పత్రికల వారికీ ఇవన్నీ కావాలి. కానీ బతుకు గురించి వివరించి చెప్పే సైన్స్ మాత్రం ఎవరికీ పట్టకుండా పోతున్నది. యాభయి సంవత్సరాల నాటి పాత పత్రికలను తీసి చూస్తే ఏదో ఒక మూలన ఒక సైన్స్ వ్యాసం కనబడుతుంది. అప్పటికి తెలిసిన ప్రకారం సైన్స్ గురించి వాళ్లు బాగానే రాసుకున్నారు. ఇది సైన్స్ అని ప్రత్యేకంగా చెప్పి కూడా రాసుకున్నారు. ఎందుకో తెలియదుగానీ మధ్యలో ఎక్కడో సమస్యలు వచ్చేసినట్టున్నాయి. ప్రస్తుతం దినపత్రికలు, మిగతా పత్రికలలో కూడా సైన్స్ అంతగా కనిపించటంలేదు. నిజానికి సైన్స్ పత్రికలు ఉండాలి. ఒకటి, రెండు ఉన్నాయి కూడా. కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ పరిస్థితులలో ఒకసారి సైన్స్ లేకుండానే తెలుగు ముందుకు సాగాలా? అన్న ప్రశ్నను వేసుకుని మనం జవాబులు వెతకాలి.
సైన్స్ అంటే జీవితం. వివరించగలిగితే ప్రతి విషయమూ ఈ పరిధిలోకి రానే వస్తుంది. అయినా సరే అందరూ కథానికలు, నవలలు మాత్రమే జీవితం అనుకుంటారు. నాటకం కనిపించకుండా పోయిందని చెపితే ఈ సందర్భంలో ఎవరికీ ఆశ్చర్యం కలగకూడదు. కవితల రూపం గురించి కూడా అంతే సంగతి. కవిత్వాన్ని కవులు మాత్రమే చదువుతారు అని ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు. అయినా సరే దినపత్రికలలో కూడా కవితలను మాత్రం అచ్చు వేస్తున్నారు. వీటి మధ్యన ఎక్కడయినా గేయాలు, గేయ రచనలు కనపడుతున్నాయా అన్నది గమనించవలసిన ప్రశ్న.
ఇక సైన్స్ గురించి నేరుగా రాయడం ఒక పద్ధతి. సైన్స్ రాయడం మరొక పద్ధతి. ఈ తేడాను చాలామంది పట్టించుకోవడం లేదు. సైన్స్ ఎందుకు, అది ఎలాగుండాలి, ఎవరి కొరకు లాంటి ప్రశ్నలకు జవాబులు రాస్తే అది సైన్స్ రచన కాదు. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, చివరికి మానసిక శాస్త్రంతో కూడా కలిపి గతం నుంచి మొదలు ఇటీవలి దాకా వస్తున్న పరిశోధనల గురించి, అవగాహనల గురించి రాస్తే మాత్రమే అది అసలయిన సైన్స్ రచన. సైన్స్ గురించిన రచనలు చాలా అవసరం. కానీ సైన్స్‌లోని లోతులను అందరికీ అందించే అసలయిన సైన్స్ రచనలు అంతకన్నా అవసరం. ఈ మధ్యన సైన్స్ పేరున వస్తున్న రచనలలో అసలయిన సైన్స్ అంతగా రావడం లేదని అందరికీ తెలుసు.
గమనించి చూస్తే, చాలాకాలంగా కొంతమంది మాత్రమే సైన్స్ రాస్తున్నారు, సైన్స్ గురించి కూడా రాస్తున్నారు. కొత్త వాళ్లు ఎవరూ ఈ ప్రయత్నాలు చేయడంలేదు. అసలు కవిత్వం గానీ, మరో రకం సీరియస్ సాహిత్యంగానీ నలభయి, యాభయికి పైబడిన వాళ్లే రాస్తున్నారు. చదువుతున్నారు అని ఒక వాదం ఉంది. యువతకు తెలియకుండానే బతుకు ఒక సమస్యగా మారిపోయింది. వీలయినంత కాలం చదువు, ఆ తరువాత ఆటవిడుపు తప్పిస్తే నిజంగా ఆటలు, ప్రపంచం గురించిన అవగాహన అవసరమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తడం లేదు. యువ వయస్సు వారికి మెదడు బుర్రలో ఉండడం లేదు. అరచేతుల్లో ఉంటున్నది. ఆ యంత్రాలే వాళ్లకు మెదడు. ఇక వాళ్లు సాహిత్యం చదవరు. సైన్స్ అంతకన్నా చదవరు. కనుకనే పాతవాళ్లే రాస్తున్నారు. కనుక పాత సంగతులు రాస్తున్నారు.
పాత వాళ్లు పాత సంగతులే రాయడంలో ఒక వీలు ఉన్నట్టుంది. ఇవాళటికి కూడా ఇంకా విశ్వం గురించి, గ్రహాలు, నక్షత్రాల గురించి పాత సమాచారాన్ని చెపుతూ పుస్తకాలు వస్తున్నాయి. ఆశ్చర్యంగా విషయానికి కాలదోషం పట్టినాసరే, పాత పుస్తకాలను తిరిగి అచ్చు వేసుకుంటున్నారు. అవి సులభంగా అందుబాటులో ఉన్నాయి కనుక వేయడం తప్పితే ఆ పుస్తకాల వల్ల ఇప్పుడు ఏం ఒరుగుతుందన్నది ఎవరూ ఆలోచించడం లేదు.
పుస్తకాల సంగతి ఇలాగుంటే, ఇక పత్రికల గురించి మాట్లాడి లాభం లేదు. పత్రికలకు సైన్స్ రాసేవారు లేరు. ఇక ఒక సైన్స్ పత్రిక అని పెట్టి, ఆ రోకలిని తలకు చుట్టుకోవటం ఎవరు మాత్రం కోరుకుంటారు. దశాబ్దాల క్రితం ఒకటి, రెండు ప్రయత్నాలు జరిగాయి. సులభంగానే చతికిలపడ్డాయి. కనుక సైన్స్‌ను కూడా చదవవలసిన విషయంగా ప్రజలకు అందించే పద్ధతి ఇంచుమించు తెరమరుగయింది. ప్రచురణకర్తలకు సైన్స్ పుస్తకాలు వేస్తే అమ్ముడుపోతాయని తెలుసు. ఆ మాటను వాళ్లు అందరి ముందు చెపుతారు కూడా. కానీ రాసేవాళ్లు ఎక్కడ? ఉన్న ఒకరిద్దరు పట్టువదలని విక్రమార్కులలాగ రాస్తూనే ఉన్నారు. ఎవరు వాళ్లు? తెలుగులో సైన్స్ అనగానే అందరికీ వసంతరావు వెంకటరావు గారు గుర్తుకు వస్తారు. ఆయన తమకు తెలిసిన సైన్స్‌ను ఛాదస్తం కిందకు మార్చి, చివరికి పద్యాలు, కవితలు కూడా రాశారు. తరువాత తరంలో నళినీ మోహన్, కోనేటిరావు లాంటి వారు ఎందుకు రాయాలని అడగకుండా వీలయినంత వరకు రాస్తూ కొనసాగారు. కోనేటిరావు గారు ఎనభయ్యవ పడిలో ఇంకా రాస్తున్నారంటే ఆశ్చర్యం. సైన్స్ రచయితలను గురించి సమీక్షించడం ప్రస్తుత అంశం కాదు.
మొత్తానికి కొత్త రచయితలు ఎవరూ రావడంలేదు. రాసే వాళ్లకు ప్రోత్సాహం లేదు. కొత్త వాళ్లు వచ్చి ఎవరి కోసం రాయాలి, ఎక్కడ ప్రచురించాలి అన్నవి పెద్ద ప్రశ్నలు. రాసే వాళ్లు లేరు కనుక మేము వేయడం లేదు అంటారు పత్రికల వాళ్లు. అది ఒకందుకు నిజమే. కొత్త రచయితలను ప్రోత్సహించడానికి ఏం చేయాలన్నది జవాబులేని ప్రశ్న. అలుపు లేకుండా రాసిన వారికి గుర్తింపు లేదు. అవార్డులు అంతకన్నా లేవు. ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకోవడానికి అసలయిన ఆధారం సైన్స్. దాన్ని గురించి రాసేవారిని ప్రపంచం ఆకాశానికి ఎత్తుతుంది. మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి ఏ భాషలోనూ అంత గొప్పగా ఉన్నట్టు కనిపించదు. సాహిత్య అకాడెమీ కాని, రాష్ట్ర స్థాయిలో మరొకరు కాని సైన్స్ రచనలను ప్రోత్సహించే విధంగా పథకాలు, పతకాలు ఏమీ పెట్టిన దాఖలాలు లేవు. తెలుగు విశ్వవిద్యాలయం వారు పద్యానికి ఒకటి, వచన కవితకు ఒకటి బహుమతులు ఇస్తారు. కానీ సైన్స్‌ను మాత్రం ‘ఇతరాలు’ అనే శీర్షిక కిందకు చేరుస్తారు. ఇటీవలి వరకు బాల సాహిత్యం పరిస్థితి కూడా ఇట్లాగే ఉండేది. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు బాల సాహిత్యానికి ప్రత్యేకంగా అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు. కనుక రాసేవాళ్లలో ఒక రకంగా ఊపు మొదలయింది.
సైన్స్ రాయదలచుకున్న వారు అవగాహన కొద్దీ రాస్తారు కానీ అవసరం కొద్దీ రాయరని మరో వాదం ఉంది. సైన్స్ అంతా ఇంగ్లీషులో సాగుతున్నది. చిత్రంగా జాతీయ స్థాయిలో కూడా అంటే ఇంగ్లీషులో కూడా ఒక పాపులర్ సైన్స్ పత్రిక లేదూ అంటే ఆశ్చర్యం. ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతున్నది? జీవితాన్ని తాకుతున్న సైన్స్‌ను వివరిస్తూ రాస్తే ప్రజలు చదువుతారన్నది మాత్రం తిరుగులేని నిజం. మళ్లీ మళ్లీ అచ్చువేస్తున్న పుస్తకాలు కూడా అమ్ముడు పోతుండడం అందుకు నిరూపణ. ఇన్ని మాటలు చెప్పినా అసలు సమస్య ఎక్కడ ఉన్నదీ బయటపడటంలేదు.
సైన్స్ రాయడం అనగానే పదజాలం గురించి చర్చ మొదలవుతుంది. అరబ్ దేశాల మొదలు జపాన్ దాకా ఎవరికీ రాని ఈ సమస్య మన తెలుగులో ఎందుకు ఎదురవుతున్నది? కన్నడ, మలయాళ భాషలలో పాపులర్ సైన్స్ సాహిత్యం బాగా వస్తున్నట్టు చెపుతారు. వాళ్లకు పదజాలం సమస్య కాలేదా? లేక మరేదయినా జవాబు దొరికిందా? తెలుసుకోవడం సులభంగానే వీలవుతుంది. ఇది నిజానికి ప్రత్యేకంగా చర్చించవలసిన విషయం. ప్రభుత్వపరంగా, పత్రికలు, ప్రచురణకర్తల పరంగా పెద్దఎత్తున పట్టించుకోవలసిన సమస్య ఇది.
పత్రికలలో సైన్స్ కాలమ్స్ ఏమయ్యాయి? ఎందుకు రావటంలేదు? మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. రాసేవాళ్లు లేరు. తెలుగులో జర్నలిజం పాఠశాలలు నడుస్తున్నాయి. వాళ్లు ప్రయత్నించి సైన్స్ రచయితలను తయారుచేయవచ్చు. బాధ్యతగా చేయాలి కూడా. అప్పుడు పరిస్థితి మారే వీలుంది.
తెలుగు భాష సుసంపన్నం కావాలంటే పద్యాలు, కవితలు, కథానికలు రాసుకుంటే సరిపోదు. సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే రచనలన్నీ తప్పకుండా రావలసిందే. అసలు జీవితానే్న నిర్వచించే సైన్స్‌ను ప్రజలకు విప్పి చెప్పినప్పుడు సమాజంలోని ఎన్నో రుగ్మతలకు జవాబులు వాటంతట అవే దొరుకుతాయి. మత ప్రచారం మరీ ఎక్కువయింది. నమ్మకాలు వాటి దారిన పోతున్నాయి. ఎవరినీ తప్పుపట్టి ప్రయోజనం లేదు. అసలు విషయాన్ని వివరించి అందిస్తే, తెలివిగల మనుషులు స్వయంగా ఆలోచించుకుంటారు. అనుసరించవలసిన మార్గాన్ని ఎంచుకుంటారు. అందరూ వెళ్లి బురద నీటిలో మునిగితే వచ్చేది పుణ్యమా? అనారోగ్యమా? అన్నది ఒక ప్రశ్న. వెంటనే చర్‌మని ఎదురుతిరిగే వాళ్లు చాలామంది ఉంటారు. ఈ రకంగా ఎదురు తిరగనవసరం లేకుండానే అర్థం చేసుకోదగిన జీవిత సత్యాలు మరెన్నో ఉన్నాయి. వాడెవడో తాను అమ్మే మంచినీటిలో మూడు వందల శాతం ఆక్సిజన్ ఎక్కువగా ఉందంటాడు. అప్పుడది మంచినీరు ఎలాగయ్యిందని అడిగేవారు లేరు. తల్లి ఇచ్చే చనుబాలలో డిడిటి ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. అది ఎవరికీ పట్టదు. అదేదో కూల్‌డ్రింక్‌లో యాసిడ్ ఉందంటే మాత్రం దాన్ని బాత్రూం కడగడానికి మాత్రమే వాడాలని గొంతెత్తి అరుస్తారు. ఇలా ఎన్ని విషయాలయినా చెప్పవచ్చు.
ఆలోచించకుండా, ప్రశ్నించకుండా బతుకుతామంటే పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు. ప్రపంచాన్ని ప్రపంచంగా వివరించి మన ముందు ఉంచగలిగేది సైన్స్ ఒకటే. ఆ సైన్స్‌ను అర్థం చేసుకోవడం కొరకు, అది తెలుగు కానీ, మరొక భాష కానీ, ఉద్యమంగా ప్రయత్నించాలి. అప్పుడు జీవితంతోపాటు భాష కూడా సంపూర్ణమవుతుంది. లేదంటే రెండూ అరకొరగానే మిగిలిపోతాయి.

-కె.బి.గోపాలం