S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 98 మీరే డిటెక్టివ్

చాలా కోపంతో, తొందర పడే లక్ష్మణుడ్ని శాంతింపజేస్తూ రాముడు చెప్పాడు.
‘గొప్ప బుద్ధి, ధనస్సు గల భరతుడే స్వయంగా వస్తూంటే మనకి ధనస్సుతో కాని, కత్తి, డాలుతో కాని ఏం పనుంది? లక్ష్మణా! తండ్రి మాటని నిజం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన నేను, చూడటానికి వచ్చిన భరతుడ్ని చంపి, అపకీర్తితో సంపాదించే రాజ్యాన్ని ఏం చేసుకోను? బంధుమిత్రులకి నాశనం కలగడం వల్ల లభించే ధనాన్ని విషంతో వండిన పిండివంటల్లా ముట్టుకోను. ధర్మార్థ కామాలని, ఈ రాజ్యాన్ని కూడా మీ కోసం కోరుతున్నాను కాని నా కోసం కాదు. ఒట్టు పెట్టి చెప్తున్నాను. లక్ష్మణా! నేను రాజ్యాన్ని కోరుతున్నానంటే అది సోదరులైన మిమ్మల్ని కూడగట్టుకోవడానికి, మీ సుఖం కోసం మాత్రమే. ఆయుధాలని తాకి శపథం చేస్తున్నాను. నేను తలచుకుంటే సముద్రమే వస్త్రంగా గల ఈ భూమి మొత్తం మీద నాకు ఆధిపత్యం లభిస్తుంది. అధర్మం వల్ల వచ్చే ఇంద్ర పదవి కూడా నాకు ఇష్టం లేదు. భరతుడు, నువ్వు, శతృఘు్నడు అనుభవించని ఏ మాత్రం సుఖం నాకు కలిగినా దాన్ని అగ్ని భస్మం చేయుగాక! సోదరుల మీద ప్రేమ కలవాడు, నాకు ప్రాణాలకంటే ప్రియుడైన భరతుడు అయోధ్యకి తిరిగి వచ్చాక, జటలు, నారచీరలు ధరించి నీతోను, జానకితోను నేను అడవికి పంపివేయబడినట్లు తెలుసుకుని, పెద్ద కొడుకే రాజు కావాలనే కులధర్మం వల్ల, మిత్రభావంతో, శోకంతో ఇంద్రియాలు బాధ పడగా మనల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాడు తప్ప ఇంకో కారణం వల్ల కాదు అని నేను అనుకుంటున్నాను.
‘శ్రీమంతుడైన భరతుడు తల్లి మీద కోపించి, ఆమెని కఠిన మాటలతో దూషించి, తండ్రి అనుగ్రహింప చేసుకుని నాకు రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. భరతుడు మనల్ని చూడడానికి రావడానికి ఇది తగిన సమయమే. అతను మన విషయంలో ఏ మాత్రం చెడు చేయాలని మనసులో కూడా ఆలోచించడు. నీకు పూర్వం ఎన్నడైనా అపకారం చేశాడా? లేదా అలాంటి భయాన్ని కలిగించాడా? నువ్వు ఇప్పుడు భరతుడి గురించి ఇలా శంకించడానికి కారణం ఏమిటి? భరతుడి విషయంలో పరుషమైన చెడు మాటలు మాట్లాడద్దు. అలా మాట్లాడితే అవి నన్ను గురించి చెప్పినట్లే. భరతుడ్ని తిడితే ననే్న తిట్టినట్లు అవుతుంది. లక్ష్మణా! ఎంత ఆపదలో ఉన్నా కొడుకులు తండ్రిని చంపుతారా? సోదరుడు తన ప్రాణ సమానుడైన సోదరుడ్ని చంపుతాడా? నువ్వు రాజ్యం కోసమే ఇలా మాట్లాడుతున్నావేమో? అలాగైతే రాజ్యాన్ని నీకు ఇవ్వమని భరతుడితో చెప్తాను. రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇవ్వు అని నేను చెప్పగానే భరతుడు కూడా ‘తప్పక అలాగే చేస్తాను’ అంటాడు.’
రాముడికి మంచి జరగడం మీదే ఆసక్తి గల లక్ష్మణుడు ఆ మాటలు విని, సిగ్గుతో కృంగిపోయి చెప్పాడు.
‘మన తండ్రి దశరథ మహారాజు నిన్ను చూడటానికి స్వయంగా వస్తున్నాడని అనుకుంటాను.’
లక్ష్మణుడు సిగ్గు పడ్డట్లుగా తెలుసుకున్న రాముడు చెప్పాడు.
‘మహాబాహువైన దశరథ మహారాజు మనందర్నీ చూడటానికి ఇక్కడికి వచ్చాడని తలుస్తాను. లేదా వనవాసంలోని కష్టాలని గ్రహించి మనిద్దరం సుఖాలకి అలవాటు పడ్డవాళ్లం కాబట్టి తప్పక మనల్ని ఇంటికి తీసుకెళ్తాడని అనుకుంటాను. మన తండ్రి చాలా సుఖాలకి అలవాటు పడ్డ ఈ సీతనైనా అడవి నించి తీసుకుని వెళ్తాడు. ఓ వీరుడా! అదిగో. ఉత్తమ జాతిలో పుట్టినవి, అందమైనవి, వాయువేగంతో సమానమైన వేగం కలవైన రెండు ప్రసిద్ధ గొప్ప గుర్రాలు సైన్యం ముందు కళకళలాడుతున్నాయి. ధీమంతుడైన మన తండ్రి ఉపయోగించే పెద్ద శరీరం గల ఏనుగు ఇదిగో, సేనలకి ముందు కదులుతూ వస్తోంది. లక్ష్మణా! ప్రజలంతా గౌరవించే మన తండ్రి తెల్లటి గొడుగు మాత్రం ఎందుకో ఏనుగు మీద కనపడటంలేదు. కాబట్టి నాకు అనుమానం కలుగుతోంది. నువ్వు చెట్టు మీద నించి దిగి నేను చెప్పినట్లు చేయి’
శతృసంహారకుడైన లక్ష్మణుడు సాలవృక్షం మీంచి దిగి, చేతులు జోడించి రాముడి పక్కనే నిలబడ్డాడు.
‘రాముడి ఆశ్రమానికి మనుషుల తాకిడి కలగకూడదు’ అని భరతుడు ఆజ్ఞాపించడంతో ఏనుగులు, గుర్రాలు, రధాలతో నిండిన భరతుడి సైన్యం పర్వతం చుట్టూ ఒకటిన్నర యోజనాల దూరం ఆవరించి విడిది చేసింది. ధర్మం కోరి, దర్పాన్ని విడిచి, రాముడి అనుగ్రహం కోసం నీతిమంతుడైన భరతుడు తీసుకువచ్చిన సేన చిత్రకూట పర్వత ప్రాంతంలో కళకళలాడుతోంది.
(అయోధ్యకాండ 97 సర్గ)
మానవుల్లో ఉత్తముడు, ప్రభువైన భరతుడు సైన్యాన్ని నిలిపి తండ్రి ఆజ్ఞతో అడవుల్లో నివసించే రాముడి దగ్గరకి నడిచే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ సైన్యాన్ని ఆయా స్థానాల్లో నిలిపిన తర్వాత భరతుడు వినయవంతుడైన సుమంత్రుడితో చెప్పాడు.
‘ఓ సౌమ్యుడా! నువ్వు మనుషుల గుంపుతో ఒకచోటే ఉండే ఆటవికులతో కలిసి వెంటనే ఈ అరణ్యాన్నంతా వెతుకు. గుహుడు బాణాలు, కత్తులు ధరించిన వెయ్యి మంది బంధువులతో కలిసి స్వయంగా ఈ అడవిలో రామలక్ష్మణులని వెతకాలి. నేను స్వయంగా మంత్రులు, పౌరులు, గురువులు, బ్రాహ్మణులతో కలిసి ఈ అడవంతా కాలినడకన తిరుగుతాను. రాముడ్ని, బలశాలైన లక్ష్మణుడ్ని, భాగ్యవంతురాలైన సీతని చూసేంతవరకు నాకు శాంతి లేదు. చంద్రుడితో సమానమై, పద్మాల రేకుల వంటి కళ్లు గల రాముడి మంగళకరమైన మొహాన్ని చూసే దాకా నాకు మనశ్శాంతి లేదు. రాజచిహ్నాలతో కూడిన అన్న పాదాలని నా తల మీద ఉంచుకునేదాకా నాకు మనశ్శాంతి కలగదు. రాజ్యానికి తగిన ఆ రాముడు రాజ్యాభిషేక జలాలతో తడిసి, తండ్రులు, తాతల నించి సంక్రమించి వచ్చే రాజ్యాన్ని పొందేంత వరకు నాకు మనశ్శాంతి కలగదు. స్వచ్ఛమైన చంద్రుడితో సమానమై, పద్మాల వంటి కళ్లతో, గొప్ప కాంతితో ప్రకాశించే రాముడి ముఖాన్ని ఎల్లప్పుడూ చూసే లక్ష్మండు అదృష్టవంతుడు కదా. సముద్రం వరకు వ్యాపించిన ఈ భూమికి అంతటికీ ప్రభువైన రాముడ్ని అనుసరించి వెళ్లిన మహా భాగ్యవంతురాలైన సీత చాలా అదృష్టవంతురాలు. ఇంద్రుడు నందనవనంలో నివసించినట్లు రాముడు హిమవత్పర్వతం మీద నివసిస్తున్నాడు. అందువల్ల ఈ పర్వతం అదృష్టవంతురాలు. క్రూరమృగాలతో నిండి, ప్రవేశించడానికి శక్యం కాని ఈ అడవి కూడా ఎంతో పుణ్యం చేసుకుంది. ఎందుకంటే మహాతేజశ్శాలి, ఆయుధాలు ధరించే వాళ్లల్లో గొప్ప వాడైన రాముడు ఇందులో నివసిస్తున్నాడు.’
మహా తేజశ్శాలి, పెద్ద చేతులుగల, మగాళ్లల్లో శ్రేష్ఠుడైన భరతుడు ఇలా చెప్తూ ఆ మహావనంలోకి కాలి నడకన ప్రవేశించాడు. మాటల్లో నేర్పరైన భరతుడు పర్వత చరియల మీద పెరిగి పుష్పించిన పై భాగాలు గల చెట్ల సముదాయం మధ్య నడుస్తూ సాగాడు. చిత్రకూట పర్వతం మీది పుష్పించిన ఓ సాలవృక్షాన్ని చేరుకుని రాముడి ఆశ్రమం నించి పైకి వచ్చే పొగని చూశాడు. బంధుసమేతుడైన భరతుడు దాన్ని చూడగానే రాముడు అక్కడే ఉన్నాడని తెలుసుకుని చాలా సంతోషించాడు. మహాత్ముడైన ఆ భరతుడు చిత్రకూట పర్వతం పైన పుణ్యాత్ములతో నిండిన రాముడి ఆశ్రమాన్ని చూసి సేనని దూరంగానే ఉండమని కోరి గుహుడితో కలిసి తొందరగా నడుస్తూ వెళ్లాడు.

---------------------------------
(అయోధ్యకాండ 98 సర్గ)

ఆశే్లష హరికథని తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి తల్లికి వినిపించాడు. శారదాంబ మొత్తం విని చెప్పింది. ‘ఆయన చెప్పిన దాంట్లో ఐదు తప్పులు ఉన్నాయి. అవేమిటో తెలుసా?’
‘తెలీదు’ ఆశే్లష చెప్పాడు. ‘అవేమిటో చెప్తా విను’

మీరు ఆ ఐదు తప్పులని కనుక్కోగలిగారా?
*
1.సౌగంధికా సరస్సు ‘కుబేరుడిది’ అని రాముడు సీతకి చెప్పాడు. హరిదాసు దీన్ని విస్మరించాడు.
2.శుభప్రదంగా కూసినవి చక్రవాక పక్షులు. కాని హరిదాసు చిలుకలు అని చెప్పాడు.
3.అయోధ్య బదులు హరిదాసు మిథిల అనే తప్పుగా చెప్పాడు.
4.మందాకిని నదీ నీళ్లని తాగే జంతువుల పేర్లలో లేళ్లు, పులులు లేవు. హరిదాసు వాటిని తప్పుగా చెప్పాడు.
5.96వ సర్గ మొదట్లో రాముడు మైథిలి అనే పేరుని వాడాడు కాని సీత కాదు.
6.లక్ష్మణుడు ఎక్కింది సాలవృక్షం. ఆ పేరుని హరిదాసు చెప్పలేదు.
*
మీకో ప్రశ్న
*
విష్ణుమూర్తికి చెందిన ఏ ఆయుధం
భరతుడిగా జన్మించిందని కథనం?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
మందాకిని అంటే అర్థం ఏమిటి?
*
మందాకిని అంటే ప్రశాంతంగా ప్రవహించేది అని అర్థం.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి