S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శివాలయానికి రంగులు.. గ్రంథాలయానికి చెదలు!

తెలుగు నవల రెండో ప్రపంచ యుద్ధం తరువాత - ఒక రాజ్యమే ఏలింది. మొదట్లో ఆఖ్యాయిక అన్నారు. కాదంబరి అనుకోమన్నారు. పింగళి సూరన్న గారి కళాపూర్ణోదయమే - తొలి నవల అన్నారు. ఆయన మన తొలి తెలుగు నోవెలిస్ట్ అన్నారు. కానీ అందరికీ తెలుసు - నోవెల్ అన్న మాటే మనము ఫ్రెంచి భాష నుంచి అరుపు తెచ్చుకున్నాం - ‘నవల’ అని అనువాదం చేసుకున్నాము.
తెలుగు నవలకి సంస్కృతం పాఠాలు వొంటబట్టలేదు. బెంగాలీ నడబండీ పట్టుకుని కొంతకాలం నడిచింది. బంకిం చంద్రుడు - రవీంద్రనాథ్ టాగూర్ నుంచి శరత్ చంద్రుడు దాకానే కాదు.. మాణిక్ బందోపాధ్యాయ లాంటి వారు కూడా సీరియల్స్‌గా మనకి నచ్చారు. బెంగాలీ నడబండీ చాలాకాలం హుకుం చెలాయించింది. మొగలాయి దర్బార్ - మొసలికంటి సంజీవరావు గారి అనువాదంలో మూడు భాగాలు ముచ్చటగా పరుగులు తీసింది. వారపత్రికలో ఒక ఇంగ్లీష్ నవల - ఒక బెంగాలీ నవల సీరియల్స్‌గా వచ్చే రోజులు పోయి తెలుగు స్వతంత్ర నవల ధారావాహిక అయింది.
మా స్కూలు ఫైనల్ రోజుల్లో - తెలుగు పరీక్ష రోజున - మా ‘కాకర్ల’ - మొగలారుూ దర్బారు రెండో భాగం చదివి పడుకున్నాడు - మర్నాడు పరీక్ష (హిందూ హైస్కూలు)లో చక్కగా ఆన్సర్లు రాశాడు.’ వాడే వీడు కాలూరాయి నేనే’ అన్న మూడు భాగాల నవల ఒక ఊపు ఊపింది. ఇదే టాగోర్ గారి గీతాంజలి కన్నా గొప్పది అన్నాడు శ్రీశ్రీ. దాని మీద స్వతంత్ర వీక్లీలో పెద్ద చర్చ. నేను శ్రీశ్రీకే కొమ్ము కాశానని జ్ఞాపకం. తెలుగు నవలకి ఇంగిలీషు ఆయా దగ్గర సుద్దులు బాగా నచ్చాయి. ఇంటింటిలో పుస్తకాల అల్మరాలో శరత్‌బాబు ‘సెంటర్ ఆఫ్ ది స్టేజ్’ లాక్కున్నాడు కానీ, తెలుగు ‘స్వతంత్ర నావెల్’ - ఈలోగా ఊపిరి పోసుకుంది. కందుకూరి, చిలకమర్తి, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ భృతులు అందించిన వూతం- మన సొంత నవలకి ఊసులు విద్దేలు నేర్పింది. అదంతా, ఓ పెద్ద కథ. నేను ఆశ్రమ పాఠశాలగా భావించిన - భ్రమరాంబ మల్లేశ్వరి గ్రంథాలయంలోనే మొసలికంటి సంజీవరావు గారి మొగలాయి దర్బారు తెనుగు సేత - జొన్నలగడ్డ సత్యనారాయణ గారి ‘చిన్న హస్తం’ మాత్రమే గాక - శరత్‌చంద్రుని భారతి (గ్రేట్ నవల), చరిత్రహీన్ నవల (సావిత్రి మరుపురాని పాత్ర) లను చదువుకున్నాను. శరత్‌బాబు నవల కురిపించిన వెనె్నలని బొందలపాటి శకుంతల, చక్రపాణి ప్రభృతులు తెనుగు నాట కొవ్వలి జంపనలకి ఇంచుమించు పోటీగా అందించారు.
అన్నట్లు జొన్నలగడ్డ వారూ, విశ్వనాథ వారూ మాకు ఇంటర్మీయెట్‌లో ఇంగ్లీషు, తెలుగు లెక్చరర్స్ - జొన్నలగడ్డ వారి - నా మహారాష్ట్ర యాత్ర - (యాత్ర నవల) నాకు చాలాచాలా ఇష్టం. మర్చంట్ ఆఫ్ వెనిస్ చెప్పేవారు జో.గారు... ఆయనది లౌడ్‌స్పీకర్ వాయిస్.. ఇద్దరు మహా సత్యనారాయణల మధ్య మాత్సర్య అగ్ని రగులుతూనే ఉండేది. ఆ కథ ఈ పట్టు చెప్పుకుందారి - నన్ను ఇంప్రెస్ చేసిన పుస్తకాలన్నీ, పాండవోద్యోగ విజయాలు సహా అక్కడ బంగారు కొట్ల బజారులో వున్న బంగారం లాంటి లైబ్రరీలో ఆస్వాదించినవే - చవి చూసినవే.
1956లో వదిలేశాను ఆ ప్రాంతాన్ని - ఆట పాత చదువు అన్నీ సాగించిన అద్భుత ప్రాంతమది.
నా దారి, కాలేజీ - మాచవరం డౌన్ - ఎస్సారార్ అండ్ సీవీఆర్ వేపు మళ్లింది. ఈ గుడి మీది పుస్తకాల ‘గుడి’ని (లైబ్రరీని) 1920లో పొట్టి వెంకట సుబ్బయ్యగారు - గుడి మీదనే వున్న ఒక పెంకుటింటిలో ప్రారంభించారు. మళ్లీ 2004లో నేను అక్కడికి వెళ్లాను. ఈ మధ్యలో అది మేడ అయింది. కానీ, 2004 పుష్కరాలకి - బెజవాడ భూమి ఆదివారంనాడు వస్తున్న నా ధారావాహిక కాలంగా బెజవాడ బాతాఖానీకి చేస్తున్న ఫీచర్లలో దీనికి ప్రాముఖ్యత పెట్టుకొన్నాను.’
కాని, వెళ్లి చూతును కదా? గుండె చెరువు అయిపోయింది. అప్పటి లైబ్రేరియన్ ఆలపాటి రామచంద్రరావు గారు - గుర్తుకొచ్చాడు. ‘తలుపులు మూసుకోవాలి - ‘ఏయ్, పిల్లకాయలు పొండర్రా’ అంటూ తను ఇటు కొడితే అటు పరుగెత్తి.. ‘ఇంకొక్క పేరా సారూ’ అని దుఃఖంపెట్టేవాళ్లం.
కానీ ఇవాళ శిథిల గ్రంథాలయం అయిపోయింది. చెదలకి ఆవాసం అయిపోయింది అది!
ఆగస్టు 22, 2004, ఆంధ్రభూమి డైలీ నా ‘బెజవాడ బాతాఖానీ’లో ఈ జీర్ణ దేవాలయం లాంటి లైబ్రరీ మీద కన్నీటి వ్యాసం రాశాను. అక్కడ, బ్రౌన్ దొర వేమనగారి పద్యాల పుస్తకం ఒకటి దుమ్ములో దొర్లుతోంది. ఎత్తితీసి దుమ్ము దులిపి - కళ్లకు అద్దుకుని గోడ వారా ర్యాకులో పెట్టాను కానీ అక్కడన్నీ చెదలే.. ఈ శిథిల మందిరానికి అక్కడ ఓ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలని సముదాయించుకుంటూ కాపలా కాస్తోంది. (ఔను ఆమె కేర్ టేకర్ మాత్రమే) ఆమె పేరు విరోధాభాసంగా ఉందా? సరస్వతి. ఇంటి పేరు చుండూరు వారు. దీని పునరుద్ధరణకి మొన్నటి పుష్కరాలలోనైనా బాగు చేశారేమో తెలియదు.

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com