S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాదమా.. అనువాదమా..

పల్లెకు పోదాం, పారును చూద్దాం, అల్లరి చేద్దాం, చలో చలో అంటాడు దేవదాసు. ఆ పాట వింటున్నా ఆ సినిమా చూస్తున్నా అదేదో అసలు సిసలు తెలుగు వాతావరణం అనిపిస్తుంది. కానీ అది శరచ్చంద్ర చటోపాధ్యాయ అనే శరత్‌బాబు బంగ్లా నవల ఆధారంగా రూపొందిన చిత్రం అని చాలామందికి తెలియకపోవచ్చు. మనవాళ్లు కొంతమంది చదువుకోవడానికి శాంతినికేతన్ వెళ్లారు. అక్కడ బెంగాలీ నేర్చుకున్నారు. విజయా సంస్థ యజమాని చక్రపాణి లాంటివారు బెంగాలీ నవలలను తెలుగులోకి తీసుకురావడం ప్రారంభించారు. వేంకట పార్వతీశ్వర కవులు కూడా బెంగాలీ సాహిత్యాన్ని తమ ప్రచురణ సంస్థ ద్వారా తెలుగు పాఠకులకు అందించారు అంటే ఆశ్చర్యమే మరి. రవీంద్రుని నవల గోరా నేను చదివింది వారి అనువాదమే. అప్పట్లో అపరాధ పరిశోధక నవలలు బెంగాలీ నుంచి అనువాదాలుగా వచ్చాయి. పత్తేదారు విజయ మోహనుడు చర్మ వేషమున తిరుగుచుండెను, అంటూ సాగిన రచనలు ఆసక్తికరంగా ఉండేది. కాలూరాయి అని ఒక నవల. ఇందులోని రాయి బహుశా రాయ్ అయి ఉంటుందని నాకు తోచలేదు. పాంచకడీదేవ్ అనే రచయిత పేరులోని చివరి మాట దేవ్ కాదని బహుశా అది డే అని కూడా అనుమానం రాలేదు.
అప్పట్లో అనువాద సాహిత్యం తెలుగు పాఠకులను ఉర్రూతలూగించింది. దుర్గేశనందిని, నవాబు నందిని లాంటి నవలలు సీరియల్స్‌గా వచ్చి ఎంతో ప్రభావం చూపించాయి. అలాగే రవిబాబు అనే రవీంద్రనాథ్ టాగోర్ లేదా గురుదేవ్ రచనలు కూడా ఎన్నో తెలుగులోకి వచ్చాయి. పడవ మునక అన్న టాగోర్ రచన అసలైన తెలుగు రచనలాగ నడిచి అందరినీ ముగ్ధులను చేసింది. నవలలో నుంచి కథ సూత్రాన్ని కొద్దిగా అందిపుచ్చుకుని ఒక తెలుగు సినిమాలో కూడా వాడుకున్నారు.
బెంగాలీ అనువాదాలను గురించి మాట్లాడవలసి వస్తే ముందుగా శరత్‌బాబు గురించి చెప్పుకోవాలి. ఆయన నవలలు, కథలు, అసంపూర్ణ రచనలు, చివరికి ఉత్తరాలు కూడా తెలుగులోకి వచ్చాయి. నాలాంటి వాళ్ళను చాలామందిని అవి పట్టి కుదిపాయి. బాటసారి, దేవదాసు లాంటి సినిమాలు శరత్ నవల ఆధారంగా వచ్చి పుస్తకాలు చదవడం అలవాటు లేనివారికి కూడా శరత్ రచనలలోని గొప్పతనాన్ని అందించాయి. నేను శరత్‌బాబు వీరాభిమానిని. ఎందుకు అంతగా ఆ రచనలను అభిమానించాను అని చెప్పడం మొదలుపెడితే ఈ వ్యాసం మరి ఎక్కడికో వెళ్లిపోతుంది. కనుక ఇప్పుడు ఆ పనిచేయను.
నేను మాయమయి అన్న ఒక్క సీరియల్ నవల క్రమాన్ని చదివినట్టు గుర్తు. అది కూడా బెంగాలీ నుంచే వచ్చింది. యువ అనే మాసపత్రికలో వరుసబెట్టి ప్రతినెల ఒక బెంగాలీ రచన కనిపించేది. అందుకు కారణం సంపాదకుడైన చక్రపాణిగారు. ఆ వరుసలోనే మొఘల్ దర్బార్ కుట్రలు అన్న నవల కూడా కొంతకాలం పాటు సీరియస్‌గా వచ్చినట్లు గుర్తు. ఈ నవల అంతకుముందే విచిత్రమైన సరళ గ్రాంధికభాషలో తెలుగులో వచ్చింది. కానీ యువ వారు చేసిన అనువాదం మరొక పద్ధతిలో సాగింది. అది అందరినీ సులభంగా చదివించింది. ఈ రకంగా బెంగాలీ సాహిత్యంతో తెలుగు పాఠకులకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. అలాగే ప్రపంచ భాషలు అన్నింటి నుంచి అనువాదాలు వచ్చాయి. చదివించాయి. నిజానికి షేక్స్‌పియర్ మహాకవి నాటకాల ఆధారంగా గుణసుందరి కథ లాంటి సినిమాలు వచ్చాయనే విషయం తెలియనివారు ఆశ్చర్యానికి గురవుతారు ఏమో!
చిన్నప్పుడే కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో అని ఒక పెద్ద నవలను చదివాను. అది ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగిన తీరు మరపురాదు. రచయిత పేరు అలెగ్జాండర్ డ్యుమా. అసలు రచన ఫ్రెంచ్ భాషలో ఉంటుంది. దాన్ని ఎవరు ఇంగ్లీషులోకి మార్చారు. అప్పుడు అది తెలుగులోకి వచ్చింది. కనుకనే నేను చదవగలిగాను. ఇనే్నళ్ల తరువాత డ్యూమా నవలను ఒకదాన్ని తెలుగులోకి అనువదించాను. దాని పేరు నల్లని పువ్వు. ఈ నవల చాలాకాలం క్రితమే నల్లకలువ అన్న పేరుతో తెలుగులోకి వచ్చిందని పెద్దలు ఒకరు చెప్పారు. నేను నిరుత్సాహపడలేదు. వెతికి వెతికి చదివే నా కంట పడలేదంటే ఆ పుస్తకం బజారులో లేదని నా నమ్మకం.
ఇంకా మరెన్నో రచనలు ఈ రకంగానే అటు ప్రపంచ భాషలు, ఇటు భారతీయ భాషల నుండి తెలుగులోకి వచ్చినందుకు వాటిలోని స్వారస్యం నావంటి పాఠకులకు అందింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది అనువాద ప్రక్రియ గురించి. నేను రాసిన పుస్తకాలలో సగానికి సగం అనువాదాలు అని మనసుకు తట్టినప్పుడు నాకు కొంచెం అనుమానం మొదలవుతుంది. నిజానికి కూడా అనువాద రచయితలకు అసలు రచయితలతో సమానంగా గౌరవం లేదు. అక్కడికి వీళ్లు చాలా సులభంగా అంటే కష్టపడకుండా పుస్తకాలను బయట పడేస్తున్నారు అని పాఠకులే కాదు ప్రచురణ సంస్థలు వారు కూడా భావిస్తారు. కానీ అనువాదం లేనిదే సాహిత్యం లేదు అన్న సంగతి అందరూ గుర్తించాలి.
నిజానికి మహాభారతం వ్యాసుని రచనకు అనువాదం కదా! అయితే అందులో కవితాశక్తిని జోడించి అసలు రచనలు మరిపించేలా రాసినందుకు కవిత్రయం ఇక అంత పేరు పొందారు. అదే రచనను మామూలు మాటల్లో చెబితే అంత గౌరవం కలిగి ఉండేది కాదేమో! కానీ తరువాతి కాలంలో పాఠకుల కోరిక ప్రకారమే భారతంతో పాటు మరెన్నో కావ్యాలు కూడా మామూలు వచన ధోరణిలో రాయవలసి వచ్చింది.
నాకు ఇక్కడ నండూరి రామకృష్ణమాచార్యగారి మాటలు గుర్తుకు వస్తున్నాయి. పద్యం రాయడం పట్టాల మీద రైలుబండి నడకలాంటిదని ఆయన అనేవారు. ఒకసారి ముందుకు కదిలితే అది ముందుకు పోతూనే ఉంటుంది. వచన కవిత రోడ్డుమీద కారు నడపడం లాంటిది అని ఆయన అన్నారు. దారి దొరికితే అటు ఇటుగా అది ముందుకు సాగుతుంది. ఇక కథ నవల రాయడం ఆకాశంలో విమానం నడపడం లాంటిది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంత సుఖంగా పోతున్నాము అన్న భావంలో ఉన్న అది ఏ క్షణాన కిందపడుతుందో తెలియదు. ఇంతకుముందు పడలేదు కనుక ఇప్పుడు కూడా పడదు అన్న భావంతో మనం కూర్చోవాలి. ఇక అసలు రచనను పక్కనబెట్టి, అనువాదం గురించి ఆలోచిస్తే ఉదాహరణగా ఏం చెప్పాలో నాకైతే తోచడం లేదు. నేను సైన్సు పుస్తకాలు, ఇటు సాహిత్య ప్రక్రియలైన కథ, కవిత, నవలలను పెద్ద ఎత్తున అనువాదాలు చేశాను. ఎక్కడికక్కడ నాకు అసంతృప్తి భావన కలిగేది. చదివినవాళ్లు మాత్రం బాగుంది అనేవారు. నాతోనే రచనలను ముందుకు సాగిస్తున్నాను.
లాసరా అన్న తమిళ రచయిత నవల ఒకదాన్ని, నిజానికి రెండు నవలలు అనాలి, నేను ఒక దిల్లీ సంస్థ కారణంగా ఇంగ్లీషులో చదవగలిగాను. ఆయన రచనా ధోరణి చాలా నచ్చింది. ఇంత గొప్ప రచయిత రచనలు తప్పకుండా ఇంగ్లీషులోకి మరిన్ని వచ్చి ఉంటాయని అనుకున్నాను. చాలా వెతికాను. ఒక్కటి కూడా దొరకలేదు. మద్రాసులోని మిత్రులతో సంప్రదించి చూస్తే నిజంగానే అనువాదాలు రాలేదని తెలిసింది. ఇదే పరిస్థితి కన్నడానికి కూడా ఉంది. మాస్తి వెంకటేశ అయ్యంగార్ రచనలు గొప్పవి. సాహిత్య అకాడమీ కారణంగా చిక్క వీరరాజేంద్ర మాత్రం తెలుగులో కనిపిస్తుంది. ఒక కథా సంకలనం కూడా వచ్చినట్టు ఉంది. నిజానికి ఆయన రచనలలో చిక్క వీరరాజేంద్ర గొప్పది కానేకాదు. నేను ఒకప్పుడు సుబ్బన్న అనే ఒక అనువాద నవల చదివాను. అది అయ్యంగారు రచన. అనువాదంగా తెలుగులోకి వచ్చిందన్నమాట. మరి నేను తెలుగులోనే చదివాను. ఎంత వెతికినా ఇప్పుడు నాకు ఆ పుస్తకం కనిపించడం లేదు. అటువంటి రచనలు చదివిన తరువాత నాకు అనువాదాలను గురించి ఆలోచన పెరుగుతుంది.
నేను ప్రపంచ భాషల కథా సంకలనాలను సేకరిస్తున్నాను. ఈ మాట వల్ల అపార్థం పుట్టే ప్రమాదం ఉంది. నేను రచనలను వాటి అసలు భాషలో సేకరించడం లేదు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. వచ్చిన అనువాదాలను సేకరిస్తున్నాను. వాటిని చదివి ఆనందిస్తున్నాను. నా ఆనందం అంతటితో ఆగదు. 100 దేశాల నుంచి 100 కథలను సేకరించి ఒక సంకలనంగా తీసుకురావాలని నా సంకల్పం. ఈ విషయాన్ని ఒకరిద్దరు మిత్రులతో ప్రస్తావించాను. వాళ్లు ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడారు. ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది.
అయితే ఈలోగా తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకి అనువాదం గురించిన ఆలోచన మరింత ఎక్కువయింది. బహుశా తెలుగులోకి అనువదించేవారు, నాకన్నా బాగా రాయగలిగినవారు కూడా చాలామంది ఉంటారు. ఇంగ్లీషులోకి అనువదించేవారు ఎక్కువగా లేరని తెలిసింది. నిజానికి తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ఒక సమావేశం పెట్టి నా వంటి అనువాదకులను ఒకచోట చేర్చారు. ఈ కథలను ఎంపిక చేసి వాటిని ఇంగ్లీషు, హిందీలలోకి తర్జుమా చేసే ప్రయత్నాన్ని కూడా వారు మొదలుపెట్టారు. అందులో నాకు కొంత పాత్ర ఉండడం ఆనందకరమైన విషయం.
ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అనువాద సాహిత్యం పెద్ద ఎత్తున రావాలి. అప్పుడే భాష గురించి మనకు అవగాహన కలుగుతుంది. పక్కన ఉన్న తమిళ భాషలో ఏం రాసుకుంటున్నారో మనకు తెలియదు. మన దగ్గర ఉత్తర రచనలను గురించి ఆ పక్కవాళ్లకు తెలియదు. ఈ రకంగా అక్కడ బతకడంలో ఆనందం లేదన్న విసయం అందరూ అంగీకరిస్తారు. మరి అనువాదాలను ప్రోత్సహించడానికి ఏం చేయాలి. అది నా ప్రశ్న! పత్రికల వారంతా పనిగట్టుకుని ప్రతి సంచికలోనూ కనీసం ఒకటైనా అనువాద రచన ఉండేటట్లు చూస్తే పరిస్థితి కొంచెం మెరుగవుతుందేమో! అనువాదాలకు సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. కానీ అవి సాహిత్య అనువాదాలను పట్టించుకోవు అని నాకు తోచింది. ఈ విషయంగా కూడా సంస్థల వారు పూనుకుని కొత్త అనువాదకులను తయారుచేయాలి. అనువాదం అన్నది మిగతా రచనలతో బాటు గౌరవం పొందిననాడు అందరూ అటువైపు కూడా చూస్తారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. నా మట్టుకు నాకు అనువాదం చేస్తాడు అని పేరు వచ్చినా సరే పర్వాలేదు. చేతనైనంత కాలం అనువాదాలు చేస్తూనే ఉంటాను.

-కె.బి.గోపాలం