S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాది మేక చదువు...!

మేకలు ఛదువుతాయా? అనుకోకండి. అవి ఏ ఆకులు కొమ్మలు వాటికి తటస్థపడితే అవే నమిలేస్తాయి. అట్లా చిన్నప్పుడు ఏది దొరికితే అదే - పొట్లాల కాగితాలు సహా చదివేసేవాణ్ని. మా రోజుల్లో సంచులు ప్లాస్టిక్ బ్యాగులు గట్రా లేవు. పాత న్యూస్ పేపర్లకి గొప్ప డిమాండ్ - పప్పులైనా ఉప్పులైనా పత్రికల కాగితాలతోనే పొట్లాలుగా తెచ్చుకోవాలి. ఉదారంగా పేపర్‌లో పేపర్ దన్నుగా పెట్టి - మరీ ప్యాక్ చేసేవాళ్లు.. అది బరువులో కలిసివచ్చేది వాళ్లకి. ఈ పొట్లాలన్నీ విప్పి - ఆ కాగితాల్ని విడదీసి సాపు చెయ్యడానికి నేను రెడీ. సైజుల వారీగా పేర్చుకుని వంట ఇంటి నేల మీద పరచి చదివేసి కానీ - వాటిని ప్రక్కనపెట్టేవాణ్ణి కాదు. పొట్లాల కాగితాలు తెలుగైనా ఇంగిలీషు అయినా - ఎంత అర్థం అయితే అంతే. అదొక హాబీ. గోడల మీద ఈ కొస నుంచి ఆ కొసకి - వెంకట రామా అండ్ కో అనో.. జన సంఘం అనోరాసి వుంటే.. మేము వెంకటరామా అండ్ కో పప్పు తిని పండుకో అని అరిచేవాళ్లు.. నా ఫ్రెండ్స్.. జన సంఘం అన్న అక్షరాల ముందు ‘్భ’ చేర్చేవాళ్లు.. వాల్‌పోస్టర్లని గట్టిగా సినిమా పేర్లు కదా? చదివేవాళ్లం.
‘మీ పాపాయి ఏడుస్తోంది? గ్రైప్ వాటర్ పట్టండి బజ్జో పెట్టండి..’ అని పేపర్ క్లిప్పింగ్.. ‘వొళ్లంతా తామరా?..’ గట్టిగా చదివేవాణ్ణి ప్రకటనలన్నీ - అమ్మ కోప్పడేది. పోయి క్లాస్‌బుక్కు గట్టిగా చదువు అంతే కానీ ‘నీ జుట్టు రాలుతోందా? రీటా నూనె పట్టించు’ లాంటివి - డోంగ్రే వారి బాలామృతం త్రాగండి - బాదాం హల్వా కరాచీ బ్రాండు కావాలా? - అని చదివితే, అలాంటివి చదవకు.. అవన్నీ డబ్బులు మస్తుగా ఉన్న వాళ్లకి. అయినా వార్తలు చూడు చక్కెర కోటా పెరిగిందా? చూడు. అట్లాగా - విపణి వీధి - ధరవరలు దాకా చదివేసి.. పొట్లాలకున్న పురికొసలన్నీ తీసి - పీరుకి చుట్టేవాణ్ణి. పీరు అంటే.. కొండ చీపురుకట్ట ఉంటుందిగా దాని పుల్లలు తీసి మధ్యకి ఒకదాన్ని చీల్చాలి - ఒక్క పొడుగు ముక్కకి - రెండు పొట్టి ముక్కలు ఇంటూ ఆకారంలో పెట్టి కట్టేసేయాలి. ఇప్పుడు మరో ముక్క క్రాస్‌గా పెట్టి మధ్య ముక్కమీద నుంచి ఎక్కిస్తే అదే పట్టుకుని - అదో ‘పీరు’ అవుతుంది. దీనికి పురికొసలు అలాగే, దొరికిన రంగు దారం ముక్కలూ నైస్‌గా చుట్టెయ్యాలి. ఎక్కడ దారం ముక్క దొరికినా ఈ పీరుకి జల్లెడ అల్లినట్టు అల్లేసుకుంటూ ఉండడమే. నీ పీరు పెద్దదా? నాది చూడు హరివిల్లు లాగ ఎన్ని రంగులో? అని పోటీలుగా ఆడుకొనేవాళ్లం. అన్నట్టు ఓ మాట చెప్పాలి. పట్ట్భా సీతారామయ్యగారి ఫెదర్స్ అండ్ స్టోన్స్ - బుక్ దొరికింది. ఆయన అహ్మదాబాద్ ఫోర్ట్ (జైల్లో) వున్నప్పుడు - ఒక క్రమం లేని డైరీలాగ - విశేషాలు వ్యాఖ్యలు ఓ బుక్‌లో రాసేవారు. ఆయన గారి ‘నా శీర్షిక’ - ‘అవీ ఇవీ అన్నీ’ - నోట్స్ అన్న మాట. ఈ బుక్ ఫెదర్స్ అండ్ స్టోన్స్ క్యాలికో బైండ్ బుక్ నాకు ఇస్తూ నాన్నగారు అన్నారు. ఇందులో ఏ బిట్ చదివినా నీకు మనసు నిండా సంతోషం, ఆశ్చర్యం కలుగుతాయి.. మేకలు మొక్కలు కనబడితే ఛాయిస్ లేకుండా మోకాళ్ల మీద ఎగబడి తినడం చూశావా? ఆకులన్నీ తిన్న మేకపోతు కేలకాయ సిద్ధి? అని వేమన గారన్నాడు. అందుకని బెటర్ లుక్ అండ్ ప్రొసీడ్. దేని మీదనో ఆ రోజు విశేషం మీదనో సంఘటన మీదనో రాసుకో ఓ బుక్‌లో. సీతారామయ్యగారు సత్యాగ్రహులుగా ఉంటూ నెహ్రూ పటేల్ వంటి హేమాహేమీల సరసన తిరుగాడుతూ రాసిన ఈ జైలు కబుర్లు దేనికదే ఒక సమాచారం దట్టించిన బాంబు. ఆయన రాసిన సంగతులు - సారు.. మహామేధావి - అనుభవజ్ఞుడు కనుక - మాలాంటి కుర్రాళ్లకి ఒక బాలశిక్ష లాంటిది అది. అట్లా నెహ్రూ, పటేల్ సరసన ఉంటూ - అద్భుతంగా రాసి పెట్టుకున్నాడాయన. వాళ్లకి భోజనం అయినాకా - నాప్కిన్స్ లేవు కదా.. న్యూస్ పేపర్ కాగితాలకి ముందు జిడ్డుపోయే లాగ తుడిచేసుకుని ఆనక కడుక్కొనేవారు. ఈ కాగితాల్ని భద్రపరిచాడాయన. ఓసారి కుంపటి వెలిగించాల్సి వచ్చింది. కిరసనాయిలిస్తారా ఖైదీలకి? ఈ జిడ్డు కాగితాల ముక్కలు చేసి పెట్టి ముట్టిస్తే ఇట్టే రాజుకుందిట కుంపటి. పనికి రానిదంటూ లేదు.. అన్నాడాయన. అలాగా నేను చిత్తుకాగితాల్ని చిన్నగా ముక్కలుగా చేసి అమ్మకి విడిగా పెట్టేవాణ్ని. కుంపట్ల కాలమది. కట్టెపుల్లలతోనే నవకాయ పిండివంటలు చేసి వడ్డించే గొప్ప రోజులవి. కుంపటిలో క్రింద న్యూస్‌ప్రింట్ కాగితం ముక్కలు పెడితే త్వరగా బొగ్గులలు అంటుకునేలాగ అవి మండుతాయి. అయితే ఈ కాగితాన్ని చిన్నచిన్న ముక్కలుగా చింపి పెడితే ఒక్క అగ్గిపుల్ల చాలు అని చెప్పింది అమ్మ. ఓ బుట్టలో చిన్న కాగితం ముక్కలు అవీ పాత పేపరు ముక్కలు పెట్టి ఇచ్చేవాణ్ని. బొగ్గుల కుంపట్ల మీదనే కాఫీలు, టిఫిన్లు ఆఫీసు వేళకి పప్పు అన్నం రెడీ చేసేది అమ్మ. అవతల పెరట్లో కట్టెల పొయ్యి మీద బూసి ఇత్తడిగినె్నలో బుట్టలో కడిగిన బియ్యం ఎసరు పెట్టి పోసేది మామ్మ - ఆదివారం వస్తే అదే కట్టెల పొయ్యి మీద అమ్మ - మామ్మచేత అక్షింతలు వేయించుకుంటూ - పాలకోవా చేసేది. చిక్కని పాలు సన్న సెగన పెట్టి - అలా తిప్పుతూనే ఉండాలి. కోవా ముదురుపాకాన పడే దాకా గరిటె వేసి తిప్పుతూ కూర్చొనేవాళ్లం వంతులు వేసుకొని తమ్ముడూ నేనూ.. చేతులు శుభ్రంగా కడుక్కొని కోవా బిళ్లలు వేడి మీదనే చెయ్యాలి - అబ్బా ఇష్షూ అంటూ చేసేవాళ్లం లేదా కోవా బిళ్లల మీద మా హస్తరేఖలు కుళ్లుగా ముద్ర పడిపోయేవి.
మా అమ్మకి 1952లో సుస్తీ చేసింది. ఆంధ్ర సిమెంట్ కంపెనీలో ఉప్పల లక్ష్మణరావు గారు మేనేజర్ (ఇంజనీర్)గా పనిచేసేవారు. ఆయన ‘అతడు - ఆమె’ అనే ఒక డైరీ టెక్నిక్‌లో ఒక అద్భుతమయిన నవల రాశారు. అది నాకు అడిగి తెచ్చుకున్నాను. చదవడంలో లోపం లేదు చదివేశా. కానీ కొంచెం పెద్దవ్వాలి మళ్లీ చదవాలి అనుకున్నా. ఆయన సతీమణి నేల్లీ షోలిమ్గర్ స్విస్ వనిత. మా అమ్మను చూడ వచ్చింది. పొట్టిగా చిన్న క్రాపింగ్ నీలి కనులు.. ఖద్దరు అరచేతుల చొక్కా - ఖాదీ షరాయి.. అచ్చం మగాడే - చొక్కారావుగారు అని పేరెట్టేను నేను.. మా అమ్మకి నేను దుబాసిగా పనిచేసి నేల్లీగారి మాటల్ని తర్జుమా చేసి వినిపించడం (నా బొంద ట్రాన్స్‌లేషన్ లెండి.. హైస్కూలు కుర్రాణ్ణిగా.. ఏదో..) ఆమెకి అమ్మ మాటలు చెప్పేవాణ్ణి. గుడ్‌మార్నింగ్ మామ్.. వుయ్ లైక్ యు మామ్.. కం అగైన్ ప్లీజ్.. ఆవిడ నా తల నిమిరి ‘గ్రేట్ చక్కగా చదువుకో..’ అని భుజం మీద ఇలా తట్టి - బుగ్గ మీద చిటికె వేసింది. ఇహీమన్నాను. అతడు ఆమెలో డైరీ రాసే భార్య పాత్ర పేరు ‘శాంత’ - ఆమెకి ఈమెకి పోలికే లేదు మరి. ఆనక లక్ష్మణరావుగారు రష్యా దేశం వెళ్లిపోయారు కాబోలు - బోలెడు రష్యన్ బుక్స్ తెలుగులోకి అనువదించారు. రష్యా - తెలుగు డిక్షనరీ రాశారుట.. (ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com