S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేశ రక్షా బంధనం

**రాఖీ పూర్ణిమ వస్తోందంటే చాలు పిల్లల్లో పెద్దల్లో ముఖ్యంగా మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తుంటుంది. తాము పుట్టింటికి వెళ్లే అవకాశముంటుందనో లేదా సోదరులు తమ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటారనో ఎదురుచూస్తుంటారు. సమాజంలో దశాబ్దాలుగా ఇది అన్నాచెల్లెళ్ల పండుగగా ప్రసిద్ధి చెందింది. కుటుంబాల మధ్య ఆత్మీయతకు ఈ బంధనం అవసరమే. అయితే దీని వెనుకనున్న తాత్వికత ఏమిటి? అని ఆలోచించాలి. అనాదిగా ఇది మన జనజీవనంలో మనిషిని కర్తవ్య పరాయణుడిగా, మానవతా మూర్తిగా నడిపించే ఒక గొప్ప జీవన సూత్రంగా కనిపిస్తుంది.**
--------------------------------------------------------------------

మనిషి ఏ పని ప్రారంభించినా ఆ పని నిర్విఘ్నంగా సాగి విజయవంతం కావాలని సంకల్పం చేసుకుంటాడు. సంకల్పం బలీయంగా ఉండటం కోసం దీక్ష తీసుకుంటాడు. ఆ దీక్షను గుర్తు చేయడం కోసం ఆ దీక్షావ్రతం పూర్తి కావడం కోసం ముంజేతికి కంకణ ధారణ అనగా పసుపు తాడును బంధించుకునే ఆచారముంది. అలా బంధించుకునే సూత్రానే్న దీక్షా సూత్రమని, దీక్షా కంకణమని పిలుచుకునే సంప్రదాయం ఒక జీవనంలో చోటు చేసుకుంది. వ్రతాలు, పూజలు, నోములు వంటివి చేసుకున్నా, శుభకార్యాలు తలపెట్టినా ఇటువంటి తోరబంధనం జరుగుతుంటుంది. అదే దీక్షా ధారణ. వ్రత దీక్ష, కార్యదీక్ష అనే నానుడులు కూడా మనం విని ఉంటాం. తోరబంధనమే దీక్షాబంధనమైంది. అదే నేటి రాఖీ బంధనంగా, రక్షా బంధనంగా రూపాన్ని సంతరించుకుంది. రక్షాబంధనం దీక్షా ధారణ కార్యమని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తోంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు నూతనంగా వేదాధ్యయనం చేసే విద్యార్థులు అధ్యయన దీక్షను స్వీకరిస్తారు. దానికి సంకేతంగా జంధ్యాలు మార్చుకొంటారు. అందుకే ఇది జంధ్యాల పూర్ణిమ అని లోక ప్రసిద్ధి పొందింది.
వేద యుగంలో అందరూ వేదాలనే అధ్యయనం చేస్తుండేవారు. దీనినిబట్టి అందరూ యజ్ఞోపవీత ధారణ చేసుకునేవారని మనం గుర్తించాలి. ఈనాడు మనం చదువుకునే వివిధ శాస్త్రాల విజ్ఞానమంతా ఆ వేదాల నుండే పొందుతుండేవారు. అయితే దాని రూపురేఖలు, పరిణామాలు నేడు మనకు కనిపిస్తున్న తీరులో కాకుండా మరో రూపంలో ఉండవచ్చు. అలా అధ్యయన దీక్షలో ఉన్నవారు ప్రతి యేటా శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యాలు మార్చుకుంటూ దీక్షను స్మరించుకుంటూ, నూతనోత్సాహాన్ని, నూతన శక్తిని పొందుతుంటారు. తదనంతర కాలంలో వేదాధ్యయనాన్ని ఒక కులానికే పరిమితం చేయడం దురదృష్టకరమైన పరిణామం. ఇప్పుడు మళ్లీ హిందూ సమాజంలో మార్పు కనిపిస్తోంది. ఆసక్తి, దీక్ష, దక్షత ఉన్నవాళ్లు వేదాధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తున్న సంస్థలను మనం చూస్తున్నాం.
శ్రావణ పూర్ణిమ వేదధ్యయనారంభ దినమే కాక వేదాధ్యయన పునశ్చరణ కాలం కూడ. ఎందువలననగా ఈ పూర్ణిమ వర్ష ఋతువులో వస్తుంది. పీఠ, మఠాధిపతులు చాతుర్మాస్య దీక్షాకాలంలో ఉంటారు. ఆ సమయంలో అధ్యయనానికి చాలా అనుకూలమైన రోజులుగా ఉంటాయి. వేద శాస్త్రాల అధ్యయనం, చర్చలు బాగా సాగుతుంటాయి. దీనిని పాల్కురికి సోమనాథ కవి ‘నూలి పున్నమ’ పండుగ అని పేర్కొన్నాడు. సముద్ర తీరవాసులు ఈ శ్రావణ పూర్ణిమ రోజున సముద్రాన్ని పూజించి నారికేళాలు సమర్పించుకుంటారట. అందుకే దీనిని ‘నారికేళ పూర్ణిమ’ అని కూడా అనేవారని ప్రతీతి.
రక్షాబంధనం రోజున ఋషి తర్పణ చేస్తారని, అక్షతలు, తెల్ల ఆవాలతో రక్షకు, పూజ చేసి-
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వాం అభిబధ్నామి రక్షే మా చల మా చల - అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ రక్షాబంధనం చేసుకుంటారని హేమాద్రి పండితుడు పర్వదిన వర్గులో తెలియజేశాడు. ఈ రక్షాపాశము చేతనే బలి చక్రవర్తి బంధింపబడినాడు. దేవతా లోకం రక్షింపబడింది. రాక్షస రాజైన బలి చక్రవర్తి గొప్ప దాతయే కావచ్చు. కాని ముల్లోకములను జయించి తనకు ఊడిగం చేయాలని ఆదేశించాడు. అంటే ప్రజలను దాస్యంలోకి నెట్టివేశాడన్నమాట. దేవతలు అవమానాగ్నిలో దహించుకుపోతుంటే శచీదేవి ఇంద్రునిలో పౌరుషాగ్నిని రగుల్కొల్పింది. ‘సంపూర్ణ సమాజ మరియు ధర్మ రక్షణ కొరకు మీరు యుద్ధం చేయాలి. మీ సంరక్షణ కోసం, మీకు జయం కలగడానికి పూజింపబడిన ఈ రక్ష మీకు అండదండలనిస్తుంది. మీకు రక్షగా నిలుస్తుంద’ని చెప్పి శచీదేవి దేవతల ప్రతినిధిగా ఇంద్రునికి రక్షను కడుతుంది. అంతే, దేవేంద్రుడు జాగృతుడైనాడు. రక్ష శక్తినిచ్చింది. దేవలోక హితం కోసం, మానవాళి శ్రేయస్సు కోసం, ధర్మ సంరక్షణ కోసం యుద్ధం చేశాడు. విజయం సాధించాడు. ఆ విధంగా రాక్షస రాజును బంధించిన ఈ రక్షాబంధన మంత్రాన్ని పఠిస్తూ సమాజ రక్షణ కోసం రక్షను కట్టుకొనే ఆచారం ప్రజలలో చోటు చేసుకుంది.. అనే గాథ కూడా మన పురాణాలలో కనిపిస్తోంది. అది పురాణ యుగంలోనే కావ చ్చు. అయినా ఎంతో గొప్ప సందేశం ఇమిడి ఉంది. రాక్షస శక్తి విజృంభించినప్పుడు దానిని ప్రతిఘటించి ఆత్మరక్షణ శక్తిని పొందాలి. సమాజానికి భౌతిక శక్తిని, సంఘటనా శక్తిని సమీకరించుకోవలసిన అవసరముంది. మేధాశక్తితోపాటు సంఘటనా శక్తి కూడా అవసరమే. ఆ భావనను చైతన్యపరచేదే రక్షాబంధనం. అలా సమాజ రక్షణ దిశగా రక్షాబంధనం సమాజంలో స్థానాన్ని సంపాదించుకుంది.
చారిత్రక కాలంలో మొగలాయిలతో పోరాడి అలసిపోతున్న బుందేల్‌ఖండ్ రాజు వీర ఛత్రసాల్ బాజీరావు పీష్వా సహాయాన్ని అర్థించినప్పుడు పీష్వా ఛత్రసాల్‌కు రక్ష పంపి సహాయమందించినట్లు చరిత్ర చెప్తోంది. అరబ్బులు, మొగలాయిల దాడులు భారతదేశం మీద జరుగుతున్నప్పుడు భారతీయ మహిళ తన, మాన, ప్రాణ సంరక్షణకై తోటి వ్యక్తిని సోదరునిగా సంబోధించి రక్షణను కల్పించమని అర్థిస్తూ రక్ష కట్టే సంప్రదాయం సమాజంలో చోటు చేసుకుంది. అలా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఆత్మీయతానురాగాల బంధం రక్షాబంధనంలో పెనవేసుకుంది. అందుకే ఇది అన్నాచెల్లెళ్ల పండుగగా వాడుకలోకి వచ్చింది.
‘నేను ఈ పనిని చేస్తున్నాను’ అని సంకల్పించుకుంటూ సంకల్ప చిహ్నంగా రక్షను కట్టుకునే ధార్మిక సంకేతం నుండి తోబుట్టువుల పండుగతోపాటు సమాజ రక్షా బంధనం వరకు మనిషిని వికసింపజేసిన క్రియ ఈ రక్షాబంధనం. సమాజ పురోభివృద్ధికి విద్యా, విజ్ఞానాభివృద్ధితో పాటు దానిని నిలబెట్టుకునే సమాజ శక్తి అవసరం. అది సంఘటన రూపంలో ఉంటుంది.
‘అగ్రతః చతురో వేదాన్ పృష్ఠతః సశరం ధనుః’ అని శాస్త్ర వచనం. అంటే వేదాలు ముందుంటే దాని వెనుక వాటిని రక్షించగల సాయుధ పాణులైన సమాజ శక్తి ఉండాలి అని అర్థం. అటువంటి సమాజం ఎప్పుడు నిర్మాణవౌతుంది? సమాజంలో బీద, ధనిక, ఉచ్చ నీచ భేదాలు అంతరించినప్పుడు, విభేదాలు సమాజంలో చోటు చేసుకోవడమే బలహీనత. వాటిని తొలగించి సమాజాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. అదే దేశభక్తుల లక్షణం. అలా జరుగుతోందా?
ప్రతి దేశానికి సాంస్కృతిక మూలాలుంటాయి. వాటిని సంరక్షించుకోవడం దేశ ప్రజల కర్తవ్యం. అలాగే మన భారతీయ సాంస్కృతిక మూలాలను మనం రక్షించుకోవాలి. రామాయణాది పవిత్ర గ్రంథాలపై కువిమర్శలు, వాటిపై చర్చోపచర్చలు చేస్తూ పదేపదే మాధ్యమాలలో ప్రసారం చేస్తూ కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ విశ్వాసాలను బలహీనపరచే ప్రయత్నం జరుగుతోంది. ఆ గ్రంథాలు భారతీయ జన జీవన ప్రతిబింబాలు. జాతీయ గ్రంథాలు. వాటి పవిత్రతను కాపాడటం మన కర్తవ్యం. అందుకే కర్తవ్య దీక్ష స్వీకరించాలి.
అలాగే రాజకీయ స్వార్థం కోసం బెంగాల్ వంటి రాష్ట్రాల్లో శ్రీరామ నవమి ఊరేగింపులపై, దుర్గామాత ఉత్సవాలపై ఆంక్షలు విధించడం, కొన్నిచోట్ల ప్రభుత్వాలే మత శక్తులతో చేతులు కలిపి హిందూ విశ్వాసాలను దెబ్బ తీయడం వంటి ఆంతరంగిక సమస్యలు సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయి. మరోవైపు వేర్పాటువాద ధోరణితో సమాజాన్ని బలహీనపరచడం కోసం కొన్ని కులాల వాళ్లను వేరుచేసి మైనారిటీలని రకరకాల పేర్లు పెట్టి భారతీయ జీవన స్రవంతి నుండి కొంతమందిని పక్కకు తప్పించే ప్రయత్నం లేదా చీలికలు తెచ్చే కుట్ర జరుగుతోంది. ఇలాంటి ఆంతరంగిక సమస్యల నుండి సమాజాన్ని రక్షించుకునే ప్రయత్నానికి మనం ఉద్యుక్తులం కావాలి. సమాజ రక్షకులం కావాలి. సమాజ ప్రేమికులం కావాలి.
భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాదుల అణచివేతను మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ ఐ.రా.స. మానవ హక్కుల మండలి భారతదేశాన్ని ప్రపంచ వేదిక మీద అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేస్తోంది. సమాజం ముక్తకంఠంతో దానిని ఖండించాలి. మన దేశ ప్రతిష్ఠను మనమే కాపాడుకోవాలి. ఉగ్రవాదాన్ని అణచివేయాలి. కొన్ని దశాబ్దాలుగా ఒక కుట్రతో, వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి ప్రవేశిస్తూ వచ్చిన అక్రమ చొరబాటుదార్ల నుండి దేశభద్రతకు ముప్పు పొంచి ఉంది.. అనే సత్యం అందరికీ తెలిసినదే. ఉన్నత న్యాయస్థాన సూత్రాలకు లోబడి ఎన్.ఆర్.సి. అమలుపరచే ప్రయత్నం సంపూర్ణంగా జరగాలి. కానీ, స్వార్థ రాజకీయం కోసం మోకాలడ్డుతున్న
శక్తులు విజృంభిస్తున్నాయి. దేశం, దేశ రక్షణ నాకు ముఖ్యం అనే దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ‘నాకు నా దేశం ముఖ్యం ఆ తరువాతే నేను’ అనేది జాతికి జీవన సూత్రం కావాలి.
మరోవైపు చైనా హిందూ మహాసముద్రంపై నౌకా స్థావరాల నేర్పరచుకుంటూ భారత్ చుట్టూ ఉన్న చిన్నచిన్న దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంటూ భారత్‌కు సవాలు విసురుతోంది. సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తోంది. మన సైన్యం ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నా, అప్రమత్తంగా ఉంటున్నా దేశ ప్రజలలో దేశభక్తి చైతన్యవంతంగా లేకపోతే వాళ్లు మానసికంగా బలహీనులవుతారు. కాబట్టి దేశాన్ని రక్షించుకునే శక్తి సమాజం మీద, ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలను సమైక్యతా సూత్రంలో బంధించడమే రక్షాబంధనం యొక్క ప్రధానోద్దేశం.
ఆధునిక యుగంలో అడుగుపెట్టాం. సాంకేతిక రంగం, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. అవి అభివృద్ధి చెందవలసిందే. అంత మాత్రాన విలువలు దిగజారిపోకూడదు. సమాజాన్ని కాలుష్య భూతం ఆవరించకూడదు. పర్యావరణ కాలుష్య భూతం నుండి కూడ సమాజాన్ని కాపాడుకోవాలి. అలాగే మన దేశంలో ఉన్న అపరిశుభ్రత కారణంగా ఏటా 4 లక్షల మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంచనా. వీరందరి అరోగ్యాలను రక్షించుకోవలసిన బాధ్యత కూడా సమాజానిదే. అందుకే ప్రతి వ్యక్తి స్వచ్ఛ భారత్ పిలుపు నుండి ప్రేరణ పొందాలి. కాలుష్యాల బారి నుండి సమాజాన్ని రక్షించుకోవాలనే దీక్షను స్వీకరించాలి.
వీటన్నింటికి ఆధారం మనిషే. ఆ మనుషుల మధ్య స్నేహ సౌభ్రాతృత్వ భావాలు పెంపొందుతూ, తరతమ భేదాలు తొలగిపోవాలి. ఉచ్చ నీచ, బీద ధనిక అంతరాలు సమసిపోవాలి. అంటరానితనం వంటి దురాచారాలు నిర్మూలింపబడాలి. దేశం కోసం కుల మత రాజకీయ భేదాలు తొలగిపోవాలి. ప్రతి వ్యక్తిలో దేశం కోసం జీవించాలి అనే భావన జాగృతం కావాలి. అప్పుడే దేశాన్ని ఆంతరంగిక, బాహ్య సమస్యల నుండి రక్షించుకోగలుగుతాం. అందుకు రక్షాబంధనమే దీక్షా బంధనం కావాలి. అదే భారత మాతకు జయకేతనం.
దేశ రక్షా సమం పుణ్యం దేశ రక్షా సమం వ్రతం
దేశ రక్షా సమంయాగో దృష్టోనైవచ నైవచ॥
భావం: దేశ రక్షణకు సమానమైన పుణ్యము, వ్రతము, యాగము, మరెక్కడనూ కానరాదు.
*

--డా. అన్నదానం సుబ్రహ్మణ్యం 9440678802