S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తన్ను తా తెలిసిన తత్త్వమేల?

మూడు పదుల వయసు దాటకుండానే ‘సత్సంగత్వే నిస్సంగత్వం’ అన్నాడు మహానుభావుడు ఆదిశంకరుడు. జీవితసారం మొత్తం ఆ మాటలో ఉంది. 1970లో విశాఖపట్నం ఆకాశవాణిలో నేను పనిచేసే రోజుల్లో బొజ్జా కృష్ణశాస్ర్తీ అనే మిత్రుడొకాయన వుండేవాడు. మిన్ను విరిగి మీద పడినా ఎక్కడా చలించేవాడు కాదు. నిబ్బరంగానే ఉండేవాడు. పైకి ఏదో గబగబా మాట్లాడినా అంతరగంలో ఎన్నో గంభీర భావాలుండేవి. దేవులపల్లి వారి పాటలంటే ప్రాణం. అందుకే ఆ పేరు పెట్టుకున్నాడు.
ఆయన ఒకసారి కూర్చుని సంభాషిస్తూ, పరమేశ్వరుడెంత మేధావో చూశావా? కోట్లాది జీవరాసుల్ని సృష్టించాడు. వేటికీ లేని సౌకర్యాలన్నీ మనకిచ్చేశాడు.
ఆకాశంలో తిరిగే ఆ పక్షుల్ని చూడు. వాటికి ఆకలేస్తే ఎవర్నీ అడగలేవు. రోగం వస్తే చెప్పలేవు. కోపం వచ్చినా కాస్సేపు కొట్లాడేసి చక్కా వెళ్లిపోతాయి. దేనితోనూ స్నేహం ఉండదు. వైరమూ ఉండదు - మనకేమో అన్నీ ఇచ్చాడు.
వాటికున్న స్వేచ్ఛ మనకుందా? చెప్పు’ అంటూ ఇంకా చాలా మాట్లాడుతూనే అన్నాడు.
మందలో ఎవరెవరు ఎటు పోతే, వెర్రిమొహాలతో వెంట తిరగటం తప్పిస్తే, ఆలోచన చేసేది వుంటుందా వాటికి? తల్లీ, తోడూ బంధువులూ, ఎవరెంతమంది పుట్టారో? ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, వాటి అజాపజా ఉంటుందా?
ఏ జాతికీ దక్కని అదృష్టాన్ని పొందిన జీవి మాత్రం ఒక్క మనిషే. కేవలం శరీరం ఇచ్చి ఊరుకున్నాడా? దీనిక్కావలసినవన్నీ ఎంతో చక్కగా అమర్చి పెట్టాడు. అన్నింటికంటే శరీరానికి త్యాగ గుణాన్నిచ్చాడు. గమనించు.’ అని కాస్సేపాగి, ‘రహస్య స్థావరాల్లోను వున్న అలీబాబా 40 దొంగలు’ సినిమాలో దొంగలు, సంకేత భాషలో ‘తలుపులు తెరచుకో’ అని గట్టిగా ఎవరైనా అరిస్తే, ఓ పెద్ద ద్వారాన్ని ఏభై మంది శరణార్థులు పెద్దపెద్ద పళ్ల చక్రాలను గానుగ ఎద్దులా త్రిప్పుతూంటే ధడేలుమని ఒక్కసారి తలుపులు తెరుచుకుంటాయి. మళ్లీ ‘ఆ దొంగల భాష’లోనే అరిస్తే వెంటనే మూసుకుంటాయి.
గుహలోకి ఎవరు ప్రవేశించారో ద్వారం తెరిచే మనుషులకు తెలియదు. దొంగలే ప్రవేశించారో, దొరలే దూరారో తెలియకపోయినా, వారి డ్యూటీ ఒకటే. పిలుపు వినగానే ఆ ద్వారాలు వెంటనే తెరవటమే ఉద్యోగం.
పళ్ల చక్రాలను తిప్పుతూ, తలకాయలు వాల్చేసి అలా తిరిగే విధేయులు లోపల ఎక్కడో వున్నారని ఎవరికి తెలియదు. మన పరిస్థితీ అంతే. శరీరాలను ఆశ్రయించుకున్న యంత్రాంగం ఇంతకంటే భిన్నమా? వాటికున్న త్యాగగుణంలో ఒక్క శాతమైనా మనిషికుందా? ఎక్కడెక్కడో తిరిగి, ఏవేవో తినేసి వస్తే తిన్నది తిన్నట్లుగానే బాగా లోపల అరగదీసేసి, జీర్ణం చేసి మరుక్షణంలో మళ్లీ ఆకలి కలిగించి, ‘రెడీ సార్’ అంటూ తినటానికి సిద్ధపరిచే, అద్భుత వ్యవస్థను నడిపే వాడెవ్వడో ఒకడున్నాడని మనకు తెలియదా? తెలుసు. కానీ వాడు మన కంటికి కనిపించడుగా? అదీ చిక్కు. ఉన్నాడా? లేడా? అనే తర్క వితర్కాలతో మూడు వంతుల జీవితం హుళక్కి’ అనేవాడు. ఈ విషయాలు స్టూడియోలో చర్చించుకుంటూంటే, ఆ కాస్సేపు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండేది.
టైము తెలిసేది కాదు. ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తిగారు విజయవాడ సంగీత కళాశాలలో రిటైరై విశాఖపట్నం వెళ్లిన కొత్తల్లో, ఆయన్ని ఓ రోజు చూడాలనిపించి బయలుదేరి వెళ్లి నాలుగు రోజులుండి పోయాను.
ఆయనకు సంసార తాపత్రయం కంటే సంగీత వ్యాసంగమే ఎక్కువ. మిన్ను విరిగి మీద పడినా ఆ కాసేపూ ‘అలాగా?’ అని మళ్లీ ఆయన మనసు సంగీతం వైపు లాగేస్తూండటం నా అనుభవం.
ఓ రోజుదయం, తెల్లవారగానే నన్ను పై అంతస్తులోంచి కిందకి రమ్మని అన్నమాచార్య కీర్తన ఒకటి వినిపించారు. ‘హుస్సేని రాగం’లో ఒక పల్లవి పాడారు. ఎలా ఉందన్నారు? అలా అడగటం ఆయనకు అలవాటే.
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే
వింత వింత విధముల వీడునా బంధములు.
చ॥ మనుజుడై ఫలమేది మరి జ్ఞానిదాక
తనవెత్తి ఫలమేది దయ గలుగుగాక
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాక
పనిమాలీ ముదిసితే పాసెనా దేహము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాక
పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాక
మదికల్గి ఫలమేది మాధవుదలచుదాక
ఎదుట తాను రాజైతే ఏలెనా పరము

పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాక
జీవించి ఫలమేది చింతదీరు దాక
వేవేల ఫలమేది వేంకటేవు కన్నదాక
భావించి తా దేవుడైతే ప్రత్యక్షవౌనా!!
కర్ణాటక సంగీతంలో ‘హుస్సేని రాగం’.
ఆరోహణ, అవరోహణ తెలిసినంత మాత్రాన చటుక్కున పాడలేని రాగం.
సమర్థులైన విద్వాంసులు పాడితే, వినగలిగే సంస్కారమున్న వారికి ఆనందాన్నిచ్చే రాగాల్లో ఇదొకటి. వాగ్గేయకారులందరి కంటే ఎక్కువ కీర్తనలు రాసి పదే కవితా మహుడైన అన్నమయ్య సాహిత్యం అందరికంటే భిన్నంగా ఉంటుంది. కంఠంలో గమకాలతో భావాలు పలికించలేని గాయకులు వారికి తోచినట్లుగా పాడేస్తే రాగ సౌందర్యం, అందదు.
రాగం, భావం ఒక జంట. ఈ జంటను విడదీసి వినటం కుదరదు.
నేదునూరి స్వరపరచిన అన్నమయ్య కీర్తనలు.. అన్నీ రాగ ప్రధానంగా సాగినవే. ఒక్కో కీర్తన ఫలానా రాగంలోనే పాడాలనే నియమం ఎవరూ పెట్టరు. సాహిత్యాన్నిబట్టి, స్ఫురించేది రాగం. మనం ధరించే ఆభరణాలు ఎన్ని నగిషీలు చెక్కితే తయారై బయటకు వస్తున్నాయి? శ్రమ పడేదెవరు?
ఎలా చెక్కితే అనుకున్న రూపం వస్తుందో తెలిసిన బంగారం పనివాడే - జూవెలరీ షాపులో కూర్చుని డబ్బు లెఖ్ఖ పెట్టుకునే యజమానికీ, మెడలో ధరించి తిరిగేవారికీ ఇద్దరికీ తెలియదు.
తయారుచేసేవాడికే అందచందాలు తెలిసేది. సంగీతం కూడా అంతే. విద్వాంసులు పడ్డ శ్రమ, చేసిన సాధన, కూర్చుని వినేవారికేమీ తెలియవు.
ఇష్టం లేకుంటే లేచి వెళ్లిపోవడమే తెలిసినంత సులువుగా, శుద్ధమైన మనసుతో ప్రాణం పెట్టి సుస్వరంతో పాడే పాటను అర్థం చేసుకుని ఆనందించే సంస్కారం అందరికీ వుండదు.
అందుకే సంగీతం ఆత్మ దక్షిణాదిలోనే ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. వాగ్గేయకారులంతా అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఆ వ్యక్తులంతా ఎవరైనా వారి భావజాలంలో మార్పేమీ కనిపించదు.
మహాభక్తులైన వాగ్గేయకారుల రచనలు శిష్య వర్గం లేక ప్రచారం కాని పరిస్థితులలో ఆ కీర్తనల సాహిత్యానికి దీటైన రీతిలో సంగీతముండాలి. కేవలం కాలక్షేపం కోసం పాడే గాయకులు భావ సౌందర్యంతో పాడలేరు. గమక పుష్టి, రాగభావాలపై ఎక్కువ దృష్టి పెట్టరు.
పైగా గమకాలు అందరి కంఠాల్లోనూ ఒకే రకంగా పలకవు.
ఆ మహనీయుల కడుపులో పుట్టిన భావజాలాన్ని ఆవిష్కరించగల స్థాయిలోనే వుండాలి సంగీతం.
‘హుస్సేని’ 22వ మేళకర్త రాగమైన ఖరహర ప్రియజన్యం. భైరవి, ముఖారి రాగాలు పక్కపక్కనే వుంటాయి. ఒక రాగం పాడుతూ మరో రాగస్వరాలు పొరబాటునైనా వినబడక పోవటం సంప్రదాయం.
త్యాగరాజ కీర్తన, ‘ఏమని వేగింతునే’ దీక్షితుల వారి ‘పాహిమాం బృహన్నాయకా’ హుస్సేని రాగంలో ప్రసిద్ధమైన కీర్తనలు. ఈ రాగం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ప్రసిద్ధమైన క్షేత్రయ్య పదం ‘అలిగితే భాగ్యమాయె’
‘ఆధ్యాత్మిక సంగీతాన్ని సంగీత మార్గంలో తిన్నగా హృదయానికి చేరవేయటంలో కీర్తన స్థాయి తగ్గకూడదు’ అనేవారు సంగీత కళానిధి నేదునూరి. ధనవంతుడై దానం చేయకపోతే ఫలం లేదు. ఎంత చదువు చదివినా శాంతి లేకపోతే సుఖం లేదు. అంతరంగ శుద్ధితో పరమాత్మను తలుచుకోపోతే జన్మకు పరమార్థం లేదనే సత్యాన్ని హుస్సేని రాగం ద్వారా ఆవిష్కరించారు నేదునూరి.
తన మనస్సనే బంగారు సింహాసనం మీద దైవాన్ని కూర్చోపెట్టుకుని నామకుసుమాలతో అర్చించాడు త్యాగయ్య.
తనువూ, మనసూ తన సర్వస్వాన్నీ శ్రీహరికి సమర్పించి చరితార్థుడయ్యాడు అన్నమయ్య.
సంగీతమొక మహాసాగరం. అగాధమైన ఆ జలనిధిలో కష్టపడి వెదికితే, కొందరికి దొరికేవి ‘ఆణిముత్యాలు.’ చూస్తే చాలనుకుని తృప్తిపడితే లభించేవి ‘నత్తగుల్లలే’.
‘నోరు తిరుగుతోంది కదాయని విన్న ప్రతి పాటా కరకరా నమిలేసి, ఊదేస్తే సంగీతం వచ్చేసినట్లు అనిపిస్తుంది. కేవలం కాషాయ వస్త్రాలు ధరించి తిరిగితే వైరాగ్యం వచ్చినట్లు కనిపిస్తుంది. నియమనిష్టలతో కూడిన సంగీతానికి కావాలి కఠోర సాధన. సర్వసంగ పరిత్యాగికి కావాలి నిష్కామ భావన.
*

- మల్లాది సూరిబాబు 90527 65490