S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

..శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం -- అరణ్యకాండ-21

వాసుదాసు వ్యాఖ్యానం
--------------------------
అరణ్యకాండ-21

తమ వెంట వస్తున్న సదాచార సంపత్తికల ధర్మభృతుడు అనే మునిని చూసి, శ్రీరామచంద్రుడు, మనుష్యులు లేకున్నా ధ్వనులొస్తున్న ఆ తటాకం వివరాలేంటి అని అడిగాడు. శ్రీరాముడు అడిగిన దానికి సమాధానంగా ఆ తటాకం చరిత్రను ధర్మభృతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ‘్ధర్మాత్ముడా! విను. ఇక్కడ మాండకర్ణి అనే గొప్ప తపస్వి తన తపోబలంతో దీనిని కల్పించాడు. ఇది వానలు లేకున్నా ఎండిపోయేది కాదు. చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఈ తటాకం పేరు పంచాప్సరసం. ఈ నీళ్లలో నుండి అతడు ఆహారం లేకుండా పదివేల సంవత్సరాలు గాఢమైన తపస్సు చేశాడు. ఆ మాండకర్ణి కొన్నాళ్లు జలం, కొన్నాళ్లు గాలి, మాత్రమే ఆహారంగా తీసుకొని కఠిన తపస్సు చేశాడు. దృఢచిత్తంతో ఆయన చేస్తున్న తపస్సు చూసి తమ పదవులను కోరుతాడేమోనని, ఎవరికి స్థానభ్రంశం కలుగుతుందోనని భయపడి, అగ్ని మొదలైన దేవతలు గుంపుగా ఒకచోట చేరి, ఎలా అతడి తపస్సు చెరచాలా అని ఆలోచన చేశారు. అతడింకా కామాన్ని జయించలేదు కాబట్టి ఆ దిశగా అతడి తపస్సు చెరచడానికి ప్రణాళిక వేశారు. ఐదుగురు అప్సరసలను ఆయన వద్దకు పంపారు దేవతలు. వారు ఆయన్ను వశపర్చుకొన్నారు. శ్రేష్ఠుడైన ఆ ఋషి, ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం కలిగినవాడైనప్పటికీ, కామాన్ని జయించనందున దేవతల కార్యం ఫలించేట్లయింది. తనను సమీపించిన ఆ స్ర్తిలను తన భార్యలుగా చేసుకొని, ఈ నీటిలో ఒక ఇంటిని కట్టుకొని, ఆ స్ర్తిలతో తన యోగబలంతో క్రీడిస్తున్నాడు. మహాత్మా! రామచంద్రా! ఇలా మునీశ్వరుడు ఆ స్ర్తిలతో సంతోషంగా ఉన్నప్పుడు వారి ఆట పాటల, భూషణాల ధ్వని చక్కగా వినపడేది.’
ఆ ముని ఇలా చెప్పగా శ్రీరామచంద్రమూర్తి విని, ఆశ్చర్యపడి, తమ్ముడు లక్ష్మణుడితో, భార్య సీతతో కూడి బ్రాహ్మణ సమూహంతో నిండిన ఆశ్రమం చూసి, వారంతా తనను పూజిస్తుంటే, అక్కడ తిరుగుతూ, వారికి రాక్షస బాధ లేకుండా విల్లంబులు ధరించి, ఆశ్రమాలలో సంచరించాడు. ఒక్కో స్థలంలో కొన్ని కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు చొప్పున రామచంద్రమూర్తి పది నెలలు అక్కడి ఆశ్రమాలలో గడిపాడు. ఆ తరువాత సుతీక్షణాశ్రమానికి పోయి అక్కడ ఆయన కోరిక మేరకు కొంతకాలం ఉన్నాడు. ఇలా వున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి మునీశ్వరుడితో ఇలా అన్నాడు.
‘మునీంద్రా! ఈ వనంలోనే అగస్త్య మునీశ్వరుడున్నాడని ప్రతిరోజూ అందరూ చెప్పుకుంటుంటే విన్నాం. కాని ఆయన వుండే ప్రదేశం నాకు తెలియదు. నేను నా భార్యతో, లక్ష్మణుడితో ఆయన్ను దర్శించుకోవాలని కోరిక ఉంది. అక్కడికి పోయే మార్గం తెలియజేయండి’ అని శ్రీరామచంద్రమూర్తి అడగ్గా, సుతీక్షుడు, తానే ఆ విషయం ఆయనకు చెప్పాలనుకున్నానని, కానీ ఈ లోపల ఆయనే అడిగాడని, అంటూ శ్రీరాముడిని అక్కడకు పొమ్మని చెప్తాడు. ‘ఇక్కడికి నాలుగు యోజనాలు దక్షిణానికి పోయి, అక్కడ నుండి మళ్లీ దక్షిణానికి నాలుగు యోజనాలు పో. అక్కడ ఒక రావి తోపుంది. అక్కడ తుమ్మెదల గుంపుతో అందంగా వికసిస్తున్న మడుగులు, పెద్ద చెట్లు, నీటి పక్షుల గుంపులు కనపడతాయి. అదే అగస్త్యుడి సోదరుడైన సుదర్శన ముని వుండే ఆశ్రమం. రాత్రికి అక్కడ ఉండు. ఉదయం కాగానే బయల్దేరి దక్షిణంగా ఒక ఆమడ దూరం పో. అక్కడ అగస్త్యముని ఆశ్రమాన్ని కన్నులపండుగగా చూడొచ్చు. అది అనేక వృక్షాలతో కూడి, గొప్పనైన వన ప్రదేశంగా అందంగా కనిపిస్తుంది. అక్కడ సీతా లక్ష్మణులతో నువ్వు సుఖంగా ఉండవచ్చు’ అని చెప్తాడు.
సుతీక్ష్ణ మహాముని చెప్పిన తోవ పట్టుకుని, అడవిలో ముగ్గురూ బయల్దేరిపోతూ, మార్గమధ్యంలో అందమైన వంకలను, సంతోషకరంగా వున్న సరస్సులను చూశారు వారు. ఇవన్నీ చూసి, రామచంద్రుడు మనస్సు సంతోషంతో పొంగిపోగా, లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘లక్ష్మణా! మనకు సతీక్ష్ణుడు చెప్పిన గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అగస్త్య సోదరుడి ఆశ్రమం ఇదే. మనోహరంగా సంతోషకరంగా ఉందిది. దీన్ని చూడు. లక్ష్మణా! చూడు. పళ్ల, పూల, మొగ్గల బరువు వల్ల చెట్లకొమ్మలు నేలనంటుతున్నాయి. పండిన రావిపళ్ల వగరు వాసనలు వాయుదేవుడు తెస్తున్నాడు. అక్కడక్కడా అగ్నిహోత్రాల కోసం చీల్చివేయబడిన కట్టెపుల్లల రాసులు కూడా ఉన్నాయి. దర్భలు నేల మీద పడి వున్నాయి. నల్లని మేఘాల లాగా అగ్నిహోత్రుడి పొగ కొనలు కనపడుతున్నాయి. అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమమని మనం దేన్ని గురించి విన్నామో అది నిశ్చయంగా ఇదే. ఇక్కడున్న సుదర్శనుడు లోకాలను ఏలేందుకు ఎవరైతే రాక్షసులను చంపి, ప్రజలు దక్షిణంగా వుండేట్లు చేశాడో అతడి తమ్ముడే.

-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12