S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దొంగచాటు వ్యవహారం

ఎందుకు దొంగచాటు వ్యవహారం? రహస్యం కనుక. దాచవలసిన విషయం కనుక. తరచుగా మూడవ కంట పడకుండా అన్యాయంగా జరగవలసిన వ్యవహారం కనుక.
ఆడ, మగ పొందు సంగతి వచ్చేసరికి జంతుజాతులలో వింతవింత తేడాలు కనపడతాయి. సింహం వేటాడదు. కొన్ని ఆడ సింహాలను వెంటపెట్టుకుంటుంది. అవి వేటాడి తెస్తే తింటుంది. ఇది విపరీతమయిన పద్ధతి. చాలా జంతువులలో జంటకట్టడం తరువాత విధేయత అన్న ప్రశే్న ఉండదు. ఎవరి దారి వారిదే. మానవ సమాజంలో ఆడ, మగ బ్రతికినంత కాలం ఒకరికొకరు విధేయులుగా కలిసి ఉండాలన్న నియమం ఎప్పుడు, ఎందుకు వచ్చిందీ తెలియదు. బహుభార్యత్వం ఉన్నదని తెలుసు. ఒక ఆడమనిషికి ఎక్కువమంది భర్తలు ఉండడం కూడా తెలుసు. కానీ అవి మామూలు పరిస్థితులు కావు. వీటన్నిటికీ మించి శరీర పరంగా ఆడమనిషి విషయంగా ఒక విపరీతమయిన పరిస్థితి ఉంది.
పశువుల్లో ఎద అనే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎద సమయంలో మాత్రమే ఆడ పశువు జంట కట్టడానికి సిద్ధంగా ఉంటుంది. చాలా జంతుజాతులలో కూడా ఈ పద్ధతి ఉంది. ఒక్క మనిషిలో మాత్రమే ఇందుకు వ్యతిరేకమయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్ర్తి కాలాలు, రుతువులతో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా మగపొందు విషయంలో సిద్ధంగా ఉంటుంది. స్ర్తిలో అండం విడుదల పరిస్థితి బయటకు తెలియదు. నెలసరి అనే పద్ధతి ప్రకారం అండం గురించి అర్థం అవుతుంది. అండం ఫలదీకరణ చెందితే నెలసరి రాదు. మగ పొందుకు ఆడమనిషి సిద్ధంగా ఉందన్న సంగతి బయటకు తెలియవలసిన అవసరమే లేదు. ఇటువంటి పరిస్థితిలో కూడా పెద్ద సంఖ్యలో ఆడ, మగ ఉన్న మానవ సమాజంలో విధేయులయిన జంట పరిస్థితి కొనసాగుతున్నది. అంటే, ఆ పరిస్థితికి అడుగడుగునా అన్యాయం జరుగుతున్నది అని వేరుగా చెప్పనవసరం లేదు. భార్యాభర్తలు సంగమించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ లైంగిక ప్రక్రియ రహస్యంగా, దాపరికంగా జరుగుతుంది. ఈ పద్ధతి ఎప్పుడు, ఎందుకు వచ్చిందీ మరొకచోట చర్చించాలి. కానీ భార్యాభర్తలు కానివారు రహస్యంగా, దాపరికంగా కలవడం చాలా మామూలుగా సాగుతున్నది. ఈ విషయం ఇలా చెప్పినందుకు చాలామంది నొచ్చుకుంటారు. అంతే మంది ‘అవును’ అని తల ఆడిస్తారు కూడా. ఇంతకూ మరే జంతుజాతిలోను లేని పద్ధతిలో ఆడ, మగ పొందు ఒక్క మనిషి విషయంలోనే దొంగచాటుగా వ్యవహారంగా ఎందుకు మారింది?
ప్రపంచంలో మానవ సమాజాలు అన్నింటిలోనూ లైంగిక సంబంధాలు రహస్యంగానే సాగుతున్నాయి. ఇది కేవలం సంస్కృతి, నీతికి సంబంధించిన సంగతి కానేకాదు. కొన్ని జాతులలో మాత్రం గుంపులుగా లైంగిక చర్యలు జరుగుతున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్‌లోని కనెలా జాతివారు గుంపులుగా చేరి సంగమిస్తారట! అందులో జంటల మధ్యన విధేయత గురించి మాత్రం తెలియదు. విశృంఖలత ఉంటుందేమో! అనుమానం మాత్రమే. భారతదేశంలో ఒకప్పుడు రవికల పండుగ అని ఉండేదట. పండుగకు వచ్చిన ఆడవారు అందరు తమ రవికలను వదిలి ఒకచోట పడేస్తారు. పురుషులు వాటిలో నుంచి ఒకదాన్ని ఎందుకుంటారు. ఆనాటికి ఆ రవిక సొంతదారుతో పొంతన కుదురుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఎవరికో ఒకాయనకు తన భార్య రవిక దొరికిందట. పండుగనాడు కూడా పాతమొగుడేనా అన్న మాట అక్కడ పుట్టింది అంటారు. ఇటువంటి సందర్భాలు నిజంగా జరిగినా మామూలు మాత్రం కావు. సాధారణంగా మత్తు పదార్థాల ప్రభావంలో నాగరిక ప్రపంచంలో కూడా ఇటువంటి ఆర్గలు జరుగుతున్నట్టు చెబుతారు. వ్యవసాయం వృత్తిగా రాకముందు సమాజంలో సెక్స్ విషయంగా కొంత విశృంఖలత ఉండేది అనడానికి సూచనలు ఉన్నాయి. ఆ తరువాత మాత్రం లైంగిక సంబంధాలు రహస్యంగా మారాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ప్రైమేట్ జాతికి చెందిన చింపాంజీలు, ఒరాంగ్ - ఉటాన్‌లను గమనిస్తే కొన్ని వింత ధోరణులు కనిపిస్తాయి. చాలా జంతుజాతులలో మగ ప్రాణులు ఆడ పొందు కొరకు పోటీ పడతాయి. అటువంటి జాతులు అన్నింటిలోనూ దొంగచాటు సంగమం ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. మగ జంతువులు ఆడతోడు మీద అదుపును సంపాదించుకో గలిగితే అవసరం తీరుతుంది. ఒరాంగ్ - ఉటాన్‌లలో గుంపులు ఉంటాయి. దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ లీడర్ ప్రాణి బాహాటంగా కోరిన ఆడ ప్రాణితో కలుస్తుంది. దాని అధికారానికి ఎదురులేదు మరి. కానీ అధికారం లేని మగ ఒరాంగ్ - ఉటాన్‌లు మూడవ కంటికి తెలియకుండా దొంగచాటుగా సెక్స్‌లో పాల్గొనడం ఆశ్చర్యకరమయిన విషయం. కొత్తగా పుట్టిన కూనలకు తండ్రి ఎవరు అన్న విషయం రహస్యంగానే ఉండిపోయేది. ఆధునిక పరీక్ష పద్ధతులు వచ్చిన తరువాత పరిశోధకులు వాటిని వాడి ఎన్నో ఆసక్తికరమైన కలయికల రహస్యాలు తెలుసుకున్నారు. గొరిల్లాలలో కూడా ఈ నాయకుని బాహాటం పద్ధతి మిగతా గొరిల్లాల దొంగచాటు పద్ధతి మామూలే. ఇక బొనోబో కోతులలో పొందు గురించిన నిర్ణయాలు ఆడ జంతువులు తీసుకుంటాయ. అక్కడ అదుపు, ఆజ్ఞలు లేవు. ఆడదానికి ఇష్టమయితే అంతకాలం పొందు కొనసాగుతుంది. పోటీ అన్నది కూడా అక్కడ లేదు. కేవలం అవకాశం మాత్రమే పొందుకు ఆధారం. పోటీ ఉన్నచోట మాత్రం రహస్య పద్ధతి ఉన్నట్టు తెలిసిపోతున్నది. మనుషులలో కూడా పోటీ కారణంగానే బహుశా జంట పద్ధతిలో మార్పు వచ్చి ఉంటుంది.
కాలం గడుస్తున్న కొద్దీ మనుషులలోని ఆడపొందు విషయంగా ఎన్నో చిక్కులు, చికాకులు మొదలయ్యాయి. ఆడమనిషి ఎప్పుడయినా పొందుకు సిద్ధంగా ఉంటుంది. ఎద అన్న ప్రశ్న లేదు. ఎప్పుడు సంగమిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అన్న సంగతి కూడా అంత సులభంగా అర్థం కాలేదు. కనుక పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది నాటి నుంచి నేటి వరకు ఒక నమ్మకం మాత్రమే. ఈనాటికయినా ఒక తల్లి తన శిశువుకు తండ్రిగా పరిచయం చేసిన వ్యక్తిని అంగీకరించక తప్పడంలేదు. అసలు సంగతి ఆ తల్లికి మాత్రమే తెలుసు. నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు జన్యుపరంగా పరీక్షలు చేయడం ఈ కాలంలో మామూలు అయింది. అటువంటి పరీక్షలు చేసిన కొన్నిచోట్ల ఒక వ్యక్తి అందరు అనుకుంటున్న తండ్రికి కొడుకు కాడు అని తెలిసిపోయింది. దానితో నేరాలు - ఘోరాలు మరింతగా పెరిగాయి. ఈ విషయం ఆధారంగా ఆ మధ్యన జోనెస్‌బో అనే రచయిత ఒక గొప్ప క్రైం థ్రిల్లర్‌ను రాశాడు. అలాగని తండ్రి ఎవరో తెలియని పరిస్థితి ఎక్కడో ఒకచోటే ఉందని అనుకోడానికి వీలులేదు. రహస్య సంగమం కారణంగా చాలా విషయాలు రహస్యంగా మిగిలిపోతున్నాయి.
కుటుంబానికి బాధ్యులు ఎవరు అన్నది మరొక ప్రశ్న. శరీర దారుఢ్యం గల మగ జంతువుల లాగే మనుషులలో కూడా మగవారు ఆ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారు. ఆడ మనుషులు తాము కన్న పిల్లలను పోషించి పెద్దచేసే బాధ్యతను తీసుకున్నారు. అందుకు అనుబంధంగా వంట, తిండి పంచడం లాంటివి కూడా ఆడమనిషి బాధ్యతలుగా మారాయి. ఈ పరిస్థితులలో ఒక మగ మనిషికి ఒకే భార్య అన్న పద్ధతి మొదలయింది. పోషించగలిగితే ఎక్కువమంది భార్యలను పెట్టుకోవచ్చు. కానీ ఆ భార్యల మధ్యన పోటీ మొదలవుతుంది.
మనిషి సమాజంలో అంటే గుంపులలో బతికాడు. ఒక జంట అనుకున్న భార్యాభర్తలు విధేయులుగా ఉండడం మామూలు పరిస్థితి. అయితే గుంపులో అవిధేయతకు అవకాశాలు మాత్రం నిండగా ఉంటాయి. ఇది ఈనాటికీ కొనసాగుతున్న ఒక సామాజిక పద్ధతి. అయితే అందులో ఆపదలు ఎక్కువయ్యాయి. నేరాలు - ఘోరాలు మొదలయ్యాయి. జంతువులలో పుట్టిన శిశువులను చంపే పద్ధతి ఒకటి ఉన్నది. మనుషులలో కూడా ఈ పద్ధతి సాగిందని పరిశోధకులు కనుగొన్నారు. ఆడ, మగ జంట కట్టిన తరువాత చాలాకాలం కలిసి ఉండాలంటే వారికి పుట్టిన పిల్లలు గట్టి కారణంగా నిలుస్తారు అనడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ప్రేమ అన్న ఒక భావన సహజంగా పుడుతుంది. భార్యపట్ల ప్రేమ, ఆ భార్య తనకు అందించిన బిడ్డల పట్ల ప్రేమ, కుటుంబ వ్యవస్థకు పునాదులు. కానీ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అవిధేయత ప్రదర్శించిన చోట ప్రేమకు బదులుగా కక్షలు మొదలయ్యాయి. కథలు నడిపించాయి. రహస్యంగా జంట కట్టిన ఆడ, మగ మధ్యన ఆకర్షణను ప్రదర్శించుకునేందుకు అవకాశాలు ఎక్కువ. ఆ పనిని వారు బాహాటంగా చేస్తే ఎవరికీ నచ్చదు. ఇది చిత్రమయిన పరిస్థితి. నా భార్య కనుక నలుగురిలో ఉన్నప్పుడు కూడా నా ప్రేమను ప్రదర్శిస్తాను అంటే సమాజం ఊరుకోలేదు. ఈనాటికీ ఊరుకోవడం లేదు.

-కె.బి.గోపాలం