యువ తేజాలకు జేజేలు
Published Sunday, 5 August 2018జీవితంలో అనుకున్నది సాధించేవారు కొద్దిమంది మాత్రమే.. వాళ్లలో చిన్నవయసులోనే లక్ష్యాలను అందుకొనేవారు కొంతమందే.. అందులోనూ మరీ కొద్దిమంది మాత్రమే ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా ఎదుగుతారు. నాలుగు పదుల వయసులోపే అత్యంత ప్రభావశీల, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తలుగా రాణించిన నలభై మందితో ఇటీవల ‘్ఫర్చ్యూన్’ ఓ నివేదికను రూపొందించింది. ఇందులో నలుగురు భారతీయ సంతతివారు కాగా, అందులో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. ‘ఇన్‌స్టాగ్రామ్’ సహ వ్యవస్థాపకుడు కెవిన్ సిస్ట్రోమ్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌లు ఈ జాబితాలో అగ్రస్థానాన్ని పంచుకున్నారు.
ఇది కాకిలెక్కల కలగాపులగం నివేదికో, ఏసీ గదిలో వండివార్చిన పాత వాసనల పరిశోధనా పత్రమో కాదు. విశ్వవ్యాప్తంగా దీనికంటూ ఓ ప్రామాణికత ఉంది. నివేదిక రూపకర్తలు ఆ ప్రయత్నంలో అమెరికా, చైనా, జపాన్, భారత్.. ఇలా ఒకటేమిటి.. ప్రపంచమంతా అంజనం మేసి గాలించి తమ విజయగాథలను వెలువరించారు. ఇందులో యువ వ్యాపారవేత్తల వ్యక్తిగత, వ్యాపార చరిత్రలను తిరగేశారు. వారిని అందలమెక్కించిన మార్కెట్లను కూడా నిశితంగా పరిశీలించారు. అందులో అరవైశాతం మందివి మధ్యతరగతి నేపథ్యాలే.. ఎవరికీ తాతముత్తాతలు ఆస్తిపాస్తులు సంపాదించిపెట్టలేదు. ఎవరి పెరట్లోనూ నిధి నిక్షేపాలు దొరకలేదు. అంతా స్వయంకృషే. ప్రతి పైసా స్వార్జితమే.. నకలు తీసినట్టు ఈ నలభై మందిలోనూ అచ్చంగా ఒకలాంటి ప్రత్యేకతే కనిపించకపోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కో అరుదైన లక్షణం. ఏ వ్యాపారవేత్తకి ఆ వ్యాపారవేత్త భిన్నమైన వ్యక్తే! ఒకరిలో అపారమైన దీక్షాదక్షతలు ఉంటాయి. మరొకరిలో సాహస గుణం, ఇంకొకర్లో సృజనాత్మకత పొంగిపొర్లుతుంది. వీరందినీ ఒకేచోట గుదిగుచ్చితే అంతకు మించిన విజయసూత్రాలు ఏముంటాయి? వాటిని కనుక ఒంటబట్టించుకుంటే ఎవరైనా విజయవంతమైన వ్యాపారవేత్తలు కావచ్చు. అంతా యువతే కావడంతో భవిష్యత్తులో నవ యువ వ్యాపారవేత్తల సగటు వయసు మరింత తగ్గే అవకాశం ఉందని విశే్లషకులు భావిస్తున్నారు.
చిన్నవయసులో వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఎనె్నన్నో ఉపయోగాలు! ఎందుకంటే చేయాల్సిన తప్పులన్నీ చకచకా చేసేయ్యొచ్చు. భరించాల్సిన నష్టాలన్నీ వెనువెంటనే భరించవచ్చు. నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ ఒకదానివెంట ఒకటి నేర్చేసుకోవచ్చు. నలభై ఏళ్లు రాకముందే రాటుదేలిపోవచ్చు. ఇక ఎప్పుడూ వైఫల్యాలంటే భయాలుండవు.. ఎందుకంటే అప్పటికే ఒంటినిండా ఓటమి గాయాలుంటాయి కాబట్టి! అవరోధాల్ని తలచుకుని వెనుకడుగు వేయరు.. అలాంటి అనుభవాలు మెదడునిండా నమోదై ఉంటాయి కాబట్టి! బలాల్ని అతిగా ఊహించుకోవడమో, బలహీనతల్ని భూతద్దంలో చూసుకోవడమో ఉండదు.. ఎందుకంటే అప్పటికే తొలగాల్సిన భ్రమలన్నీ తొలగిపోయి ఉంటాయి కాబట్టి.. పక్కా వ్యాపారవేత్త అనిపించుకోడానికి ఆమాత్రం క్షేత్ర పరిజ్ఞానం ఉంటే చాలు.
చదువు, ఆపైన కొలువు.. ఈ అనుభవాలు అరుదైన పాఠాలను చెప్పవచ్చు. ఓటమి గొప్ప గొప్ప సత్యాల్ని బోధించవచ్చు. కాలాన్ని మించిన ఉపాధ్యాయుడు లేకపోవచ్చు. అయినా సరే.. క్యాంపస్ చదువులకు తిరుగులేదు. నల్లబల్ల పాఠ్యాంశాలకు ప్రత్యామ్నాయం కనిపించదు. నయా సీఈఓల్లో దాదాపు అందరూ పట్ట్భద్రులే. మేనేజ్‌మెంట్, కామర్స్, ఇంజనీరింగ్.. ఇలా ఏదో ఒక విభాగంలో డిగ్రీలు, పీజీలు చేసినవారే. ‘పట్టా’ కాగితం పట్టుకోని ‘ఫేస్‌బుక్’ జుకర్ బర్గ్‌లు, ‘మైక్రోసాఫ్ట్’ బిల్‌గేట్లూ అక్కడక్కడా ఉండవచ్చు కానీ.. ఆ సంఖ్య చాలా తక్కువ. ఉద్యోగంలో చేరేదాకా చాలామందికి జీవితం పట్ల స్పష్టతే ఉండదు. చదువైపోతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి అవకాశం వస్తుంది. జీతమూ బాగుంటుందని, జీవితమూ బాగుంటుందని మరో ఆలోచన లేకుండా ఉద్యోగంలో చేరిపోతారు. ఆ తర్వాత వారి భ్రమలన్నీ తొలగిపోతాయి. ఆ గానుగెద్దు బతుకు వృథా అనిపిస్తుంది. అలాంటి సమయంలో సాహసం ఎంతో అవసరం. అదే విజయం వైపు నడిపిస్తుంది. గెలుపు ఎప్పుడూ గాలివాటమో, గాయాల ఫలితమో కాదు. సాహసానికి ప్రతిఫలం. బంగారు భవిష్యత్తును పణంగా పెట్టినందుకు కాలం ఇచ్చే కానుక- ఆ గెలుపు. అయితే సాహసం ఒక మోస్తరుగా ఉంటే మోస్తరు విజయం, భారీగా ఉంటే మహా విజయం.. అంతే తేడా! కానీ ఆ సాహసంలో శాస్ర్తియత ఉండాలి. కాస్తో కూస్తో అంచనా వేసే వీలుండాలి. యుద్ధాన్ని ముందుగా ఊహించలేం. కానీ యుద్ధ ప్రభావాల్ని కాస్తయినా ఊహించగలం. విపత్తుల్ని కలగనలేం. కానీ విపత్తు వల్ల కలిగే నష్టాల్ని కొంతైనా అంచనా వేయగలం. ఈ యువ సీఈఓలు అటువంటి ‘చిక్కుల లెక్కల్లో’ ఆరితేరిపోయారు. రిస్కులోని రిస్కు శాతాన్ని వేళ్లపైనే లెక్కగట్టేస్తారు. ఆశావాదంతో కూడిన రిస్కే ఈ కొత్త సీఈఓల విజయ రహస్యం. ‘పడటం తప్పదని కచ్చితంగా తెలిసినప్పుడు- ఎంత త్వరగా పైకి లేవగలం’- అన్న విషయంపై దృష్టి సారించాలి. ఈ నలభైమంది యువ వ్యాపారవేత్తలందరూ సాంకేతిక విషయాలపై గట్టి పట్టున్నవారే. వారి అంబులపొదిలో బోలెడన్ని ‘ఐడియాల అస్త్రాలు’ ఉంటాయి. అవసరార్థాన్ని, మార్కెట్ పరిస్థితుల్ని బట్టి ఒక్కో ఐడియాను బయటకు తీస్తుంటారు. ఏది ఏమైనా
ఈ శతాబ్దాన్ని అపారంగా ప్రభావితం చేయబోయేది నాయకులో, సామాజిక సేవకులో కాదు.. ఈ యువ వ్యాపారవేత్తలే..
దివ్యా సూర్యదేవర (39)
భారతీయ సంతతికి చెందిన వారిలో ప్రభావశీల వ్యక్తిగా దివ్యా సూర్యదేవర నాలుగో స్థానంలో నిలిచారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ ముప్ఫై తొమ్మిదేళ్ళ తెలుగు మహిళ తన ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లోనూ నిబద్ధతతో పనిచేస్తూ తమ నైపుణ్య, సామర్ధ్యాలను చాటుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రఖ్యాత ఆటోమొబైల్ సంస్థ ‘జనరల్ మోటార్స్’ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా మొట్టమొదటిసారిగా ఒక మహిళను నియమించుకుంది. పురుషుల ఆధిక్యత అధికంగా ఉండే వాహన రంగంలో, అది కూడా బ్యూక్, కాడిలాక్, చావర్లెట్ వంటి కార్లను రూపొందించే అగ్రగామి సంస్థ అయిన ‘జనరల్ మోటార్స్’లో ప్రవాస భారతీయురాలైన ఒక మహిళ ముఖ్య ఆర్థిక అధికారిగా ఎన్నిక కావడం అంటే ఆషామాషీ విషయం కాదు. అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే తప్ప ఈ స్థాయికి ఎవరూ చేరుకోలేరు.
దివ్యది తెలుగు కుటుంబం. ఎప్పుడో వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఆమెకు చదువంటే చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచీ బాగా చదువుకుని ఉన్నతస్థానంలో నిలబడాలని ఆశించేది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెకు అండగా నిలిచి పెంచి పెద్దచేసింది. దివ్యవాళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్లు. దివ్య తల్లి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అప్పు చేసి మరీ పిల్లల్ని చదివించింది. పిల్లలు బాగా చదువుకుని మంచి లక్ష్యాన్ని చేరుకోవాలనేదే ఆమె ఆశ. జీవితంలో ఏర్పడిన కష్టాల మూలంగా దివ్యకు చిన్నవయస్సులోనే ఉన్నతంగా బతకడం అనుకున్నంత సులభం కాదని, దానికోసం ఎంతో కష్టపడాలని నిర్ణయించుకుంది. ఆ దిశగానే అడుగులు వేసింది. తనకోసం ఆరాటపడుతున్న తల్లిని కష్టపెట్టకూడదనే నిర్ణయం కూడా చిన్నవయస్సులోనే తీసుకుంది దివ్య. అందుకే ఉన్నత చదువుల కోసం దివ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. ఉద్యోగం చేసేటప్పుడు ఆ రుణాలను చెల్లించింది. మద్రాసు యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఇరవై రెండేళ్ల దివ్య అమెరికా వెళ్లి, అక్కడి హార్వర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది. చదువుతూనే ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకు యూబీఎస్‌లో విధులు నిర్వహించింది. ఆ తరువాత 2005లో విశ్వవిఖ్యాత వాహన తయారీ సంస్థ అయిన జనరల్ మోటార్స్‌లో ఉద్యోగం లభించింది. అప్పుడు ఆమె వయస్సు పాతిక సంవత్సరాలు. తరువాత ఆమె తన కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోలేదు. సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న దివ్య 2016లో ‘ఆటోమోటివ్ రైజింగ్ స్టార్’గా పేరు తెచ్చుకుంది. నలభై మంది విజేతల్లో మొదటిస్థానంలో నిలిచింది. జనరల్ మోటార్స్ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో చాలా కీలకపాత్ర పోషించింది. సంస్థకు చెందిన ఐరోపా అనుబంధ సంస్థ ‘ఓపెల్’ విక్రయంలో, స్వీయ చోదక వాహన అంకుర సంస్థ ‘క్రూజ్’ స్వాధీనతలో కూడా దివ్య ముఖ్యపాత్ర వహించింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి జనరల్ మోటార్స్ రేటింగ్స్ మెరుగుపరిచేందుకు దివ్య చాలా కృషి చేసింది. ఇలా అతి తక్కువకాలంలో జనరల్ మోటార్స్‌లో పలు కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వహించిన మహిళగా కీర్తి గడించింది దివ్య. 2017లో సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందింది. దివ్యలోని అకుంఠిత దీక్ష, ప్రతిభ, పట్టుదల, నాయకత్వ లక్షణాలతో తాము వాణిజ్యపరమైన లాభాలను ఎన్నింటినో చవిచూశామని ‘జనరల్ మోటార్స్’ కొనియాడింది.
దివ్య కుటుంబం న్యూయార్క్‌లో స్థిరపడింది. ఆమె భర్త రాజ్ సూర్యదేవర వ్యాపారి. వీరికి ఒక కుమార్తె. ఉద్యోగ రీత్యా దివ్య డెట్రాయిట్‌లో ఉంటూ వారాంతాల్లో న్యూయార్క్‌లోని కుటుంబం వద్దకు వెళుతూ ఉంటుంది. అటు తాను పనిచేసే సంస్థను, ఇటు కుటుంబాన్ని రెండు కళ్లుగా చూసుకుంటూ తనదైన బాటలో దూసుకుపోతూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచింది దివ్యా సూర్యదేవర.
అంజలి సూద్ (34)
అంజలి సూద్ ‘విమియో’ సీఈఓగా పనిచేస్తోంది. ఆమె చిన్నప్పుడు మసాచ్‌సెట్స్ బోర్డింగ్ స్కూల్లో చదివింది. ఆ వయసులోనే ఆమె ఫిలిప్స్ అకాడమీ నుంచి స్కాలర్‌షిప్ పొందింది. తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదివింది. ఆ తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏను పూర్తిచేసింది. వీడియోలను బదిలీ చేసుకునేందుకు వీలు కల్పించే వెబ్‌సైట్ విమియోలో మార్కెటింగ్ విభాగాధిపతిగా 2014లో చేరింది సూద్. తరువాత ఆ కంపెనీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆ కంపెనీ షేర్లు అకస్మాత్తుగా పెరిగాయి. 2017లో ఆ కంపెనీ సీఈఓగా మారింది సూద్. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు వీడియోలు రూపొందించుకుని, వాటిని ‘షేర్’ చేసి తద్వారా లాభం పొందేందుకు వీలుగా ఈ క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను రూపొందించుకునేందుకు సూద్ చాలా కృషి చేసింది. గతేడాది సీఈఓగా పదోన్నతి పొందిన సూద్ వీడియోల రూపకల్పన, పంపిణీ, చట్టబద్దంగా తయారుచేయడంలో క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌గా ఆ సంస్థను తీర్చిదిద్దుతోంది. వ్యక్తులతో పాటు చిన్న, మధ్యస్థాయి సంస్థలను తన కంపెనీలో ఖాతాదార్లుగా మార్చుకుంటోంది సూద్. ఫార్చ్యూన్ నివేదికలో అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తగా 14వ స్థానాన్ని సంపాదించుకుంది.
బైజు భట్ (33)
అసలు పేరు బైజు ప్రఫుల్‌కుమార్ భట్. బైజు ఫిజిక్స్‌లో డిగ్రీ, మాథ్స్‌లో మాస్టర్స్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో పూర్తిచేశాడు. అక్కడే అతనికి వ్లాదిమిర్ లాద్ తెనవ్‌తో దోస్తీ కుదిరింది. అలా ఆర్థిక సేవల సంస్థ ‘రాబిన్ హుడ్’ను లాద్ తెనవ్‌తో కలిసి 2013లో స్థాపించాడు బైజు భట్. పాత బ్రోకరేజీ సంస్థలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయంగా ఈ సంస్థను తీసుకొచ్చానని సవాలు విసిరారు. అయిదేళ్లలోనే సంస్థ విలువ 5.6 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 38,000 కోట్లకు పైగా చేరింది. అలాగే ఈ ఏడాది బిట్‌కాయిన్‌తో పాటు మరిన్ని క్రిప్టో కరెన్సీలను ట్రేడింగ్‌కు జతచేశారు. అలా పూర్తిస్థాయి డిజిటల్ బ్యాంకుగా రాబిన్‌హుడ్‌ను మార్చే ప్రక్రియలో నిమగ్నమయ్యాడు బైజు భట్. ఇతను ఫార్చ్యూన్ స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తల్లో 24వ స్థానంలో నిలిచాడు.
అనూ దుగ్గల్ (39)
ఫార్చ్యూన్ నివేదికలో ఉన్న ప్రతిభావంతమైన యువ సీఈఓల్లో అనూ 32వ స్థానంలో నిలిచింది. అనూ దుగ్గల్ డిగ్రీ వస్సార్ కాలేజీలో, ఎంబీఏ లండన్ బిజినెస్ స్కూల్లో చేసింది. తరువాత తన జీవితంలో ఓ కొత్త దారిని ఎంచుకుంది. మహిళలు స్థాపించే టెక్నాలజీ అంకుర సంస్థల్లో తొలిదశ అంటే సీడ్ స్టేజ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ ఫండ్‌గా ఫిమేల్ ఫౌండర్స్ ఫండ్‌ను 2014లో మొదలుపెట్టింది. తొలుత ఐదు మిలియన్ డాలర్లతో ప్రారంభించిన ఈ సంస్థ, 2018 మే నెల్లో రెండోదశ ఎర్లీస్టేజ్ ఫండ్‌కు 27 మిలియన్ డాలర్లు సమకూర్చింది. మిలిందా గేట్స్ వంటి భాగస్వాములు అనూ దుగ్గల్‌తో ఉన్నారు.
అక్షయ్ రూపరేలియా(19)
మనిషి తలచుకుంటే ఏ వయసులోనైనా అద్భుత సంపదను సృష్టించవచ్చు అని నిరూపిస్తున్నాడు టీనేజ్‌లో ఉన్న అక్షయ్ రూపరేలియా. భారత సంతతికి చెందిన అక్షయ్ కేవలం 19 సంవత్సరాల వయస్సులో 103 కోట్లు సంపాదించాడు. బ్రిటన్ కోటీశ్వరుల్లో ఒకడిగా నిలిచాడు. కేవలం 16 నెలల్లో తన వ్యాపారంలో 103 కోట్లకు పైగా సంపాదించి ఈ ఘనతను సాధించాడు అక్షయ్. బంధువుల నుంచి అప్పుగా తెచ్చిన ఆరు లక్షల రూపాయలే అతని పెట్టుబడి. ‘డోర్‌స్టెప్స్.కో.యూకే’ అనే సంస్థను స్థాపించడం ద్వారా తనది యూకేలోనే 18వ అతిపెద్ద స్థిరాస్థి సంస్థగానూ నిలబెట్టాడు. విద్యార్థిగా ఉంటూనే కంపెనీని అభివృద్ధి చేశాడు. యూకేలో స్వయం ఉపాధి సాధిస్తున్న తల్లుల నుంచి స్థిరాస్థి సమాచారం తెలుసుకోవడమనేది అతని వ్యాపార ఆలోచనల్లో కీలకం. ఇంతవరకు తాను దాదాపు 860 కోట్ల స్థిరాస్తుల్ని విక్రయించినట్లు అక్షయ్ తెలిపాడు. ఆర్థిక, గణిత శాస్త్రాల్లో చదువుకోవడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి అవకాశం వచ్చినప్పటికీ అక్షయ్ తన వ్యాపారాన్ని విస్తరించడానికే ప్రాధాన్యతను ఇచ్చాడు. మొత్తానికి ఈ కుర్రాడు సాధిస్తున్న అనూహ్య సంపదను చూసి విశ్వ కోటీశ్వరులు సైతం అవాక్కవుతున్నారు.
అతి పిన్న సీఈఓలు
శ్రవణ్ (12), సంజయ్ (10)
ఒక కంపెనీకి సీఈఓ కావడం అంటే దానికి చాలా పట్టుదల, కృషి అవసరం. టాలెంట్‌తో పాటు ప్రోత్సాహం కూడా ఉంటే సాధ్యం కానిదేదీ లేదని నిరూపించారు ఈ చిచ్చర పిడుగులు. ఆ ఇద్దరే శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్. సోదరులైన వీరిద్దరూ పనె్నండు, పది సంవత్సరాల వయసున్న పిల్లలు. కంప్యూటర్‌లో అద్భుతాలు చేసే సంజయ్, శ్రవణ్‌ల తల్లిదండ్రులైన జ్యోతిలక్ష్మి, కుమరన్‌లు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. అంతేకాదు అమ్మ జ్యోతిలక్ష్మి, ఇంజనీరింగ్‌లో అద్భుతాలు సాధించిన భారతరత్న మోక్షగుండం విశే్వశ్వరయ్యకు చాలా దగ్గరి బంధువు. అలా తల్లి నుంచి సంక్రమించిన విద్యతో ఆ చిచ్చర పిడుగులు ఇద్దరూ అమ్మానాన్న లాప్‌టాప్‌లతో ఆడుకోవడమే కాదు, దాని లోతుపాతులూ చూసేశారు. కంప్యూటర్ సైన్స్‌లో జీనియస్‌లు అయిపోయారు. బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినది ఈ కుటుంబం. శ్రవణ్ ఏడోతరగతి, సంజయ్ ఆరోతరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచీ సైంటిస్టుల గురించీ, వారు సాధించిన అద్భుతాల గురించీ వింటూ పెరిగిన ఈ పిల్లలు తామూ ఏదో ఒకటి సాధించాలన్న తపన పెంచుకున్నారు. సాఫ్ట్‌వేర్‌పై బాగా స్టడీ చేసిన ఇద్దరూ చిన్న వయస్సులోనే కోడైమెన్షన్ అనే కంపెనీని మొదలుపెట్టారు. కంపెనీ చైర్మన్‌గా శ్రవణ్, సీఈఓగా సంజయ్ వ్యవహరిస్తున్నారు. తమ మొబైల్ ద్వారా గేమ్స్, లెర్నింగ్ అప్లికేషన్స్, లైఫ్‌స్టైల్ అప్లికేషన్స్‌ను తయారుచేశారు. క్యాచ్ మీ కాప్, కలర్ పల్లెట్, ఆల్ఫా బిగ్‌బోర్డ్, ప్లేయర్ ప్లానెట్ వంటి ఏడు యాప్‌లను తయారుచేశారు. మొబైల్ రంగంలో యాప్స్‌కు మంచి అవకాశాలున్నాయని, తాము అందులోనే దృష్టి పెట్టామని, ఐపాడ్, ఐఫోన్ వంటివి వాడుతుంటే చాలా మజాగా ఉంటుందని, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను బిల్‌గేట్స్ పది సెకన్లలో అమ్మేస్తాడని, ఆయనే తమ మార్గదర్శి అని ముక్తకంఠంతో చెబుతారు ఈ చిచ్చర పిడుగులు. వివిధ దేశాల ప్రధానులు వీరి ప్రతిభకు అబ్బురపడి వీరిని ప్రత్యేకంగా తమ దేశాలకు ఆహ్వానించారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం ఈ ఇద్దరు అన్నదమ్ములకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వివిధ దేశాల నుంచి వీరికి వచ్చే సందేశాలు, అభినందనలు కోకొల్లలు. ప్రస్తుతం వీరు రూట్‌మాప్, వాతావరణ కాలుష్యం, మరికొన్ని గేమ్ అప్లికేషన్స్‌ను తయారుచేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు.
అయాన్ చావ్లా (13)
పదమూడేళ్ల వయసు అంటే లోకం పోకడ తెలియని వయసు. చదువు, ఆటలు, స్కూలు, ఇళ్లు తప్ప బాహ్య ప్రపంచం తెలియని కుర్రతనం. అలాంటి వయసులోనే ఎంట్రప్రెన్యూర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఢిల్లీకి చెందిన అయాన్ చావ్లా. సూటిగా చెప్పాలంటే పదమూడు సంవత్సరాలకే కంపెనీకి సీఈఓ అయ్యాడు. బేసిక్‌గా స్టార్టప్ ఐడియాలు, వ్యాపారం చేయాలన్న ఆలోచనలన్నీ క్యాంపస్ కెఫెటేరియాలో స్నేహితులు మాట్లాడుకునే సమయంలో వారి మెదళ్లలో మెరుస్తాయి. ఎందుకంటే ఆ పీరియడ్‌లోనే ఉద్యోగమా? లేక వ్యాపారమా? అన్న దిశగా వారి మనసు ఆలోచిస్తుంది. విచిత్రంగా అయాన్ తొమ్మిదో తరగతి చదివేటప్పుడే వ్యాపార సూత్రాలను ఒంటబట్టించుకున్నాడు. అది కూడా టెక్నాలజీ రిలేటివ్ బిజినెస్. అమ్మానాన్నలు కంప్యూటర్ కొనిస్తే దాంతో వీడియోగేమ్‌లు ఆడుకోవాల్సిన వయస్సులో ఎంట్రప్రెన్యూర్‌షిప్ గురించి ఆలోచించాడంటే అతని చిట్టిబుర్రలో ఎన్ని అద్భుత ఐడియాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయాన్ ఎనిమిదేళ్ల వయసులో అమ్మానాన్నలు కొనిచ్చిన కంప్యూటర్‌లో ఆటలు ఆడే బదులు వాటిని ఎలా ఎడిట్ చేయాలా? అని ఆలోచించాడు. అలా చేస్తున్న సమయంలోనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది అతనికి. వెబ్‌సైట్స్ ద్వారా యాప్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనుకున్నాడు. ఒక పక్క చదువుతూనే మరో పక్క టెక్నాలజీ అంతుచూశాడు. పదమూడేళ్లు వచ్చేసరికి ఓ ఐడియా అతను ఎంట్రప్రెన్యూర్ అవడానికి ఊతమిచ్చింది. ఏడాదిపాటు దానిపైనే మనసు లగ్నం చేశాడు. ఎవరి సాయం తీసుకోలేదు. టెక్నాలజీ రిలేటెడ్ బుక్స్ అన్నీ తిరగేశాడు. గదిలో కూర్చుని ఒక్కడే టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. అలా 2011లో ‘ఏషియన్ ఫాక్స్ డెవలప్‌మెంట్’ అనే సంస్థను స్థాపించాడు. సంస్థకు సంబంధించిన లీగల్, ఫైనాన్షియల్ విషయాలన్నీ అతని తల్లి చూసుకుంటుంది. అయాన్ చదువు గురించి కానీ, అతను సంస్థను స్థాపించడంలో కానీ తల్లిదండ్రులు ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఐటీ, వెబ్, మార్కెటింగ్ ప్రాడక్ట్స్ సర్వీసెస్ వంటి విషయాలను చూస్తుంది ఈ సంస్థ. ఈ కంపెనీతో పాటు అయాన్ మరో మూడు సంస్థలను స్థాపించాడు. వాటికోసం అయాన్ ఏనాడూ, ఎవ్వరినీ ఇనె్వస్ట్ చేయమని అడగలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ సంస్థల కోసం అయాన్ ఖర్చు పెట్టింది కేవలం పదివేలు మాత్రమే..!