S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాయక కవి - కవి గాయకులు

కవులకూ, గాయకులకూ సమాజానికీ కాలాతీతమైన అవినాభావ సంబంధం ఏదో ఉంది. పుట్టుకతోనే కవులుగా జన్మించిన వారున్నారు. నలుగురినీ చూసి కవిత్వం అలవాటు చేసుకున్న కవులున్నారు. భాష మీద పట్టున్నా, సంగీత సాహిత్యాలు రెండూ తెలిసిన కవులూ, గాయకులు సాధారణంగా అరుదుగా వుంటారు. సంగీత హృదయమున్న కవీ, కవి హృదయమున్న గాయకులు మరీ అరుదు.
నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పనిచేసే రోజుల్లో డా.పద్మనాభరావనే సంచాలకులు ‘బాధ్రపద మాసంలో వినాయక చవితికి ‘కావ్య గణపతి’ అనే రూపకం రాసి నా చేతికిచ్చి పాడమన్నారు. అరగంట నిడివి గల చిన్న రూపకమది.
అల్లసాని పెద్దన మొదలు, ప్రముఖ కవులు ‘విఘ్నాధిపతి’ బొజ్జ గణపయ్యను ఎలా వర్ణించారో చెప్పే రూపకం. చెప్పేదేముంది? అద్భుతమైన ఆలోచన. ఏ రాగంలో పాడినా బాగుండే ఆణిముత్యాల్లాంటి ఆ పద్యాలు రికార్డ్ చేయబోతున్నాను.
ఏదో సాహిత్య చర్చా కార్యక్రమం కోసం సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ, జంధ్యాల మహతీ శంకర్, స్టూడియోలోకి వచ్చారు. ఆ ఇద్దరినీ చూడగానే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ‘ఈ సహజ కవుల చేత’ పద్యాలు పాడిస్తే బాగుంటుందనే ఆశ కలిగింది. పద్మనాభరావు గారికి చెప్పగానే ‘మంచి ఆలోచనే’ అడగమన్నారు. వారి సాహిత్య కార్యక్రమం రికార్డింగ్ అవ్వగానే మ్యూజిక్ స్టూడియోలోకి రమ్మని ‘నాలుగు పద్యాలు పాడమన్నా’ ఎదురుగా వయొలిన్, వీణ, తంబురా, క్లారినెట్‌లతో వున్న వాద్య బృందాన్ని చూడగానే ‘అయ్యా! ఏమిటి? వీళ్లతో మేం పాడగలమా? శ్రుతులు కలుస్తాయంటారా?’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. భలేవారే. మీ కవితా గానం విన్నవాణ్ణే. కవి హృదయంలో అంతర్గతంగా సంగీతమంటూ లేకపోతే పాట బయటకు రాదు. మీకెందుకు? నేనున్నానుగా? అంటూ ధైర్య వచనాలతో మైకు దగ్గరకు రమ్మని అందుకోమన్నాను. వాద్య బృందాన్ని వాళ్లను అనుసరించమన్నాను. ఆర్కెస్ట్రా అంతా కేవలం షడ్జంతో శ్రుతిని అందించారు. వారెలా పాడారో, అలాగే అనుసరించి వాయించారు. పద్యాలు ఎక్కడ ఎలా విరిచి పాడాలో, వారికి నేను చెప్పే అవసరం లేదు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య. అలవోకగా ఇద్దరూ అద్భుతంగా ఎక్కడా శ్రుతి భేదం లేకుండా గానం చేసేశారు.
ఒకరు హిందోళం, మరొకరు మోహన మధ్యమావతి రాగాల్లో పాడిన సంగతి వారికి తెలుసో తెలియదో నేనడగలేదు. ప్రసారమైంది. శ్రోతలు మెచ్చుకున్నారు. సంగీత హృదయమున్న కవులుంటారు. సంగీతం తెలిసిన వారికి సాధారణంగా కవి హృదయం లేకుండా పోదు. ఒక్కోసారి కొన్ని మాటలు రంగు రుచీ వాసనా లేకుండా నిస్తేజంగా ఉంటాయి. మరికొందరు కవుల మాటలు కొరకరాని కొయ్యల్లా సంగీతభరితంగా వుండవు. పాడబుద్ధి కాదు. తప్పనిసరై పాడాల్సి వచ్చినా వినబుద్ధి కాదు.
నాగఫణిశర్మ, మహంతో శంకర్ (జంధ్యాల)లను రికార్డింగ్ అవ్వగానే అభినందించాను. ఆ రూపకంలో 4,5 పద్యాలు మాత్రం మిగిలాయి. నేనే పాడాను.
కవి పండితుల చేత పాడించాననే తృప్తి నాకూ పాడామన్న ఆనందం ఆ ఇద్దరి కవులకూ కవి గాయకుల కలయికతో ‘కావ్య గణపతి’ ప్రసారమైనందుకు మా పద్మనాభరావు గారికి పరమానందం కలిగింది.
ఆలోచన ఆయనదేగా మరి!
అజ్ఞాత వాగ్గేయకారులు
సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పం, మొదలైన విద్యలన్నీ బజారులో దొరికేవి కావు.
బుద్ధికి తోచే విద్యలు. కోటి విద్యలూ కూటి కొరకే అనే మాట ఒకటుంది.
కేవలం భుక్తి గడవటమే లక్ష్యంగా లేని, కవులున్నారు, గాయకులున్నారు. చిత్రకారులున్నారు. కొందరికి ఇవి చాలా సహజమైన ప్రవృత్తులు.
ఇదో పిచ్చి అన్నవారూ వున్నారు. ఎవరి పిచ్చి వారికానందం. ఈ పిచ్చి అంటూ లేకపోతే ఈ కళలన్నీ ఎక్కడి గొంగళి అక్కడేలా ఒకచోట ఆగిపోయి వుండేవి. దక్షిణాదిలో ప్రముఖంగా కనిపించే దేవాలయాల్లోని శిల్పకళా చాతుర్యం చూడండి. వాళ్లకున్న అభిరుచి తెలిసిపోతుంది. సమాధిని ప్రపంచంలోనే అత్యంత వింతైన ఒక కళాఖండంగా మలిచిన షాజహాన్‌ను పిచ్చివాడని ఎలా అనగలం? ‘తాజ్‌మహల్’ అతడి రసజ్ఞతకు పరాకాష్ట.
వాగ్గేయకారులకూ, విద్వాంసులకు, కవులకు, గాయకులకు, నటీనటులకు నిలయం మన తెలుగు ప్రాంతం.
మన భాష తెలుగు. తెలుగు భాషలో వున్నన్ని రచనలు మరే ఇతర భాషల్లోనూ లేవు. విజ్ఞులు చెప్పే మాట ఇది.
తొలి తెలుగు పదం, కీర్తన, జావళి, అన్నీ ఇక్కడే పుట్టాయి. ఏమిటో! మన తెలుగు భాషను రక్షించుకుందామంటూ కేకలేస్తూంటారు, కొందరు.
మనవాళ్లను మనమే మరిచిపోయి, శుష్క నినాదాలు చేసేవారి వల్ల ఏమిటి ప్రయోజనం?
మనకు అన్నమయ్య, భద్రాచల రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య వంటి వారి పేర్లు మాత్రమే తెలుసు. వీరిలో చాలామంది అటు ఆదరణ బాగా వున్న చోట్లకు వెళ్లిపోయారు. గుర్తింపు నోచుకోని, వాగ్గేయకారులెందరో వున్నారు.
కాస్త పచ్చగా కనిపిస్తూ తిరుగుతూంటే జ్ఞాతులే తమ వాళ్లను పలుకరించరు. పట్టించుకోరు. ఇక అజ్ఞాతులను పట్టించుకునేవారెవరు?
మీకో సంఘటన గుర్తు చేస్తాను.
విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైలు వచ్చి ఆగింది. కట్టమంచి రామలింగారెడ్డిగారు బండిలోంచి దిగి వస్తున్నారు. ఇటువైపు ప్లాట్‌ఫారమ్‌పై హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు పిడికర్ర చేతబూని నిల్చున్నారు. ‘నమస్కారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గారూ! ఎక్కడి నుంచి రాక?’ అని ప్రశ్నించారు నారాయణదాసు గారు రెడ్డిగారిని పలుకరిస్తూ.
‘నమస్కారం దాసుగారూ! మీరే ఒక విశ్వవిద్యాలయం కదా!’ అన్నారు.
ఆ విషయం మీకూ నాకూ మాత్రమే తెలుసు. ఈ జనానికి తెలియదు కదా?’ అనేసరికి రెడ్డిగారు నవ్వుతూ కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు.
ఆత్మవిశ్వాసం మెండుగా వుండి కళారాధనే జీవితంగా భావించే వారికి లౌకికమైన కోరికలుండవు. గుర్తింపు కోసం ప్రాకులాడరు. హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు వంటి వాగ్గేయకారులు ఈ కోవలోవారే. ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయమన్న కవులున్నారు - వ్యక్తిగతమైన గుణాలను చూపించి గుర్తింపు కోరని మహానుభావులు ఈ లోకాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేసి మరీ దాటిపోయారు.
ఏలూరులో చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ప్రతి జిల్లాలో ప్రముఖులైన కవులకూ, గాయకులకూ, సంగీత విద్వాంసులకూ రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం ఒకసారి ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి.
ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఆ వేళ ఒకరిద్దరు మంత్రులు కూడా వున్నట్లు గుర్తు.
వేదికను ఎంతో వైభవంగా అలంకరించారు. జ్ఞాపికలతో వేదిక శోభాయమానంగా కనిపిస్తోంది. ఒక్కొక్కరూ పేరు పిలవగానే వేదికనెక్కి జ్ఞాపికలు తీసుకుని నమస్కరిస్తూ మెట్లు దిగి వెళ్తున్నారు. ఆహ్వానించబడిన కవులు, గాయకులు సన్మానం పూరె్తై ఆశీనులయ్యారు.
నాలుగో ఐదో జ్ఞాపికలు వేదికపై మిగిలాయి. మైక్‌లో ‘సభలో ఇంకా కవులూ, గాయకులూ ఎవరైనా వుంటే పేర్లు నమోదు చేసుకుని వేదికపై రావచ్చు’ననే ప్రకటన వెలువడింది. వాగ్గేయకారులు అజ్ఞాతంగా ఎందుకుండిపోయారో నాకు ఆవేళ తెలియదు. క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ తెలిసింది. ‘అరసిక జనరంజనం శిరసి మా లిఖి’ అని మహాకవులు ఎందుకు చింతించారో? విధాత ప్రసాదించిన విభూతితో తనను ఉద్ధరించుకుంటూ లోకాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేసిన విరాగులు, వాగ్గేయకారులు నిజంగా చెప్పాలంటే అజ్ఞాత వాగ్గేయకారులవటం విచారకరం.
బహుశా ఈ తెలుగు నేలపై జన్మించటం, గుర్తింపు కోసం రసజ్ఞత లేని ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకోలేక పోవటం, కీర్తికండూతి లేకపోవటం లాంటి కారణాలేవో ఉండి ఉండవచ్చు. నిజానికి నాదోపాసన మరిగిన వారికి ఇవేమీ కనిపించవు. వారి రచనలు ముద్రించి ప్రచారం చేసుకోవాలని వున్నా, రసికత కలిగిన వాణ్ణి వెతుక్కోవాలిగా?
అజ్ఞాత వాగ్గేయకారులని పిలవటం మన నిస్సహాయ స్థితికి నిదర్శనంగా భావించిన యువ సంగీత విద్వాంసుడు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం, ఆ మహానుభావుల రచనలకు బాణీలు కట్టి స్వరబద్ధం చేసి పుస్తక రూపంలో అచ్చువేయించారు. విద్వాంసుల ప్రశంసలందుకున్నారు.
13వ శతాబ్దంలో వర్థిల్లిన తొలి తెలుగు వచన సంకీర్తనకారుడు సింహగిరి కృష్ణమాచార్యులు, ఏకంగా నాలుగు లక్షలకు పైగా వచన సంకీర్తనలు రాశాడు. తూము నరసింహదాసు, అల్లూరి వెంకటాద్రి స్వామి, తచ్చూరి సింగరాచార్యులు, దాసు శ్రీరాములు, ప్రయాగ రంగదాసు (బాలమురళీ కృష్ణకు సమీప బంధువు), ఆదిభట్ల నారాయణదాసు, తిరుపతి విద్యల నారాయణ స్వామి (తిరుపతి), కొచ్చెర్లకోట రామరాజు, పేరి రామ్మూర్తి శాస్ర్తీ, హరి నాగభూషణం, పట్రాయిని సీతారామశాస్ర్తీ (ఘంటసాల గురువు), రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, మునుగంటి వెంకట్రావు పంతులు (వోలేటి వెంకటేశ్వర్లు ఆదిగురువు), డొక్కా శ్రీరామమూర్తి, ఓగిరాల వీర రాఘవశర్మ వంటి మరెందరో వాగ్గేయకారుల రచనలకు ప్రాణ ప్రతిష్ట చేసి పాడుకునే వీలు కలిగించిన బాలసుబ్రహ్మణ్యం కృషి అభినందనీయం, ఆదర్శనీయం.

- మల్లాది సూరిబాబు 90527 65490