S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనల్ప శిల్పం.. గజల్

ఆయన గాత్రం సుమధురం..
ఆయన గానం మహోన్నతం..
ఆయన వ్యక్తిత్వం వౌన తరంగం..
అతనే మెహదీ హసన్. గజల్ గానంలో సంచలనాన్ని సృష్టించి విశ్వశ్రోతలను సంపాదించుకున్న ఆ మహోన్నత వ్యక్తి పుట్టినరోజు జులై 18. ఈ సందర్భంగా గజల్ అవలోకనం మీ కోసం..
గజల్ ఓ చక్కని కవితా ప్రక్రియ. ఇది తెలుగు సాహిత్యంలోని 1963లో అడుగుపెట్టింది. ఉర్దూ భాష వల్ల రాజిల్లిన ప్రక్రియే గజల్. అలాగే ఉర్దూ భాషను రాజిల్ల చేసిన ప్రక్రియ కూడా గజలే.. గజల్ అనేది ఓ అరబీ పదం. ఇది పుట్టింది కూడా అరబీలోనే.. ఫార్సీలో పెరిగింది. ఫార్సీ భాష మూలంగానే ఇది మనదేశంలోకి వచ్చింది. ఇస్లాంకు ముందే ఉన్న కవితా ప్రక్రియ గజల్. అరబీ భాషలో గజల్‌కు తొలిదశ కవులు అంతర్ తుల్ అబసి, హరీరిలు. అరబీలో గజల్ ఒక దశ వరకూ రూపుదిద్దుకుని ఫార్సీలో పరిపూర్ణతాన్ని సంతరించుకుంది. ఫార్సీ భాషలో రూద్ కీ, వౌలానా జలాలుద్దీన్ రూమీ, సాదీలు తొలిదశ కవులు. ప్రస్తుతం ఉన్న గజల్ రూపానికి ఆద్యుడు సాదీ కవి.
అరబీ భాషలో గజల్ పదానికి పూర్వరూపం ‘గజ్జాల్’. గజ్జాల్ అంటే లేడి, జింక అని అర్థం. ఇరాన్ దేశపు రాగాల్లో ఒక రాగానికి గజ్జాల్ అనే పేరు ఉండేది. గజల్ అన్న పదానికి చాలా అర్థాలున్నాయి. ‘స్ర్తీలతో సంభాషణ’ అనేది ప్రధానమైన అర్థంగా కూడా ఉంది.
ఎడారిలో పూలు పూయవనే విషయం అందరికీ తెలుసు. కానీ గజల్ అనే వాడని పువ్వు పూసింది మాత్రం అరేబియా ఎడారిలోనే..! ఎడారిని అరేబియాలో ‘రేగిస్థాన్’ అంటారు. ఆ అరేబియా ఎడారిలో రోజంతా కష్టపడి పనిచేసే కార్మికులు రాత్రివేళల్లో ఆటపాటలతో ఆనందిస్తూండేవాళ్లు. వాళ్లు తమ నాయకుడిని స్తుతిస్తూ ‘కసీదా’ను పాడేవాళ్లు. ఆ కసీదాను పాడబోయే ముందు రెండు వాక్యాలలో ప్రేమను, అనురాగాన్ని సూచిస్తూ పాడే అలవాటు ఉండేది. ఆ రెండు వాక్యాలే కాలక మేణా గజల్ ప్రక్రియకు నాంది అయినాయి. గజల్ కసీదా నుంచి విడివడి ఒక ప్రత్యేకమైన కవితా ప్రక్రియ అయింది. ప్రాథమికంగా గజల్ ‘షేర్’ల కూర్పు. షేర్ అనేది ‘షవూర్’ నుంచి వచ్చింది. షవూర్ అంటే ఎరుక లేదా స్పృహ లేదా జ్ఞాన స్పృహ అనే అర్థాలను చెప్పుకోవచ్చు. ఒక షేర్ రెండు పాదాల్ని కలిగి ఉంటుంది.
‘హాఫిజ్’ అనే కవి ఫార్సీలో మహోన్నతమైన గజళ్లు రాసి కాలానికి కానుక చేశాడు. పర్షియన్ రాజులు మన దేశాన్ని పాలించడం మొదలయ్యాక గజల్ మన దేశపు గడప తొక్కింది. 13వ శతాబ్దంలో ఫార్సీ కవి హజ్రత్ అమీర్ ఖుస్రో గజల్‌కు మనదేశంలో ప్రాణప్రతిష్ట చేసి, నిలిపి నడిపించాడు. టర్కీ భాషా పదమైన ఉర్దూ అన్న పేరుతో మన దేశంలో ఒక బాష పుట్టి బాగా పెరిగాక వలీ దక్కనీ అనే దక్షిణ భారతదేశపు కవి ఉర్దూ భాషలో గజళ్లు రాసి ఢిల్లీలో కవి, పండిత, పామరుల్ని ఒప్పించి, మెప్పించి ఉర్దూ గజళ్లకు వ్యాప్తిని తీసుకువచ్చాడు. వలీ దక్కనీని ‘ఉర్దూ కా బాబా’ అనేవాళ్లు.
స్ర్తీలతో సంభాషణ అనే ప్రధానమైన అర్థమున్న గజల్, తొలిరోజుల్లో ప్రేమ, స్ర్తీ వర్ణన అన్న ఇతివృత్తాలతో సాగినా కాలక్రమేణా సూఫీ చింతనతోనూ ఇతర ఇతివృత్తాలతోనూ ముందుకు సాగింది. ఇబా హిమ్ ఆదిల్ షాహ్, మొహమ్మద్ కులీకుతుబ్ షాహ్, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షాహ్, అబ్దుల్ హసన్ తానాషాహ్ వంటి రాజకవులూ, మీర్ తకీ మీర్ వంటి కవులూ గజల్‌ను చాలా గొప్పగా నడిపించారు. మొగల్ రాజుల కాలంలో మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్, జౌక్, మొమిన్, సిరాజుద్దీన్ షాహ్ బహాదుర్ షాహ్ జఫర్ వంటి కవులు ఉర్దూ గజల్‌ను సుసంపన్నం చేశారు. చివరి మొగల్ రాజైన సిరాజుద్దీన్ షాహ్ బహాదుర్ షాహ్ జఫర్ రాజ్యాన్ని కోల్పోయి చెరసాలలో గజళ్లు రాసుకుంటూ జీవితాన్ని వెళ్లబుచ్చాడు.
జఫర్ శోకాన్ని, మొమిన్ ప్రేమను, జౌక్ భోగలాలసతను, గాలిబ్ తాత్త్విక చింతనను తమ తమ గజళ్లకు ఇతివృత్తాలుగా తీసుకున్నారు. గాలిబ్‌ను ‘ఖుదా ఎ గజల్’ అంటే గజల్ దేవుడు అని స్తుతించేవాళ్లు. గజల్ గగనంలో ఫైయ్ జ్, దాగ్, హాలీ వంటి కవులు కూడా నక్షత్రాలయ్యారు. ఆంగ్లేయుల పాలనలోకి దేశం వెళ్లడం.. దేశ స్థితిగతులు మారడం.. స్వాతంత్య్ర పోరాటం ఊపందుకోవడం.. సామాజిక స్పృహ, సంఘ సంస్కరణలు పొటమరించడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో గజల్ గమనం మందగించింది. ఒకదశలో గజల్‌కు వ్యతిరేకత కూడా పొడసూపింది. దేశ విభజన జరిగిపోయింది. పాకిస్తాన్ ఏర్పడింది. ఉర్దూ భాష పాకిస్తాన్ అధికార భాష అయింది. కానీ ఉర్ద్భూష, గజల్ ప్రక్రియ మనదేశంలోనే సుసంపన్నంగా ఉన్నాయి.
దేశ విభజనకు ముందే గజళ్లు 78 ఆర్.పి.ఎమ్. రికార్డులపై విడుదలై జనరంజకమైనాయి. 1907కే గజల్ రికార్డుపైకి వచ్చింది. ‘జేమ్స్ ఓపెరా ఫోన్ రికార్డ్’ వారు మొహమ్మద్ హుస్సేన్ అన్న గాయకుడు పాడిన గజల్ రికార్డును విడుదల చేశారు. ఇది భారతదేశపు తొలి గజల్ రికార్డు. బేగం అఖ్తర్, సైగల్ వంటి గాయకుల గజళ్ల గానం చాలామందిని ఆకట్టుకుంది. 1935లో బేగం అఖ్తర్ పాడిన గజళ్లు రికార్డులపై వచ్చాయి. 1936లో కె.ఎల్. సైగల్ పాడిన గజళ్లు వచ్చాయి. అవి చలన చిత్రాల కోసమూ, విడిగానూ వచ్చాయి. ముఖ్యంగా తలత్ మొహమూద్ రికార్డులపై పాడిన కొన్ని గజళ్లు విపరీతమైన జనాదరణ పొందాయి.
తలత్ మహ్‌మూద్
1944లో తమ ఇరవై ఏళ్ల వయసులో తలత్ మహ్‌మూద్ ‘‘తస్ వీర్ తేరి దిల్ మెరా బెహ్ లా’’ అన్న గజలల్‌ను పాడి రికార్డ్‌పై విడుదల చేశారు. ఈ గజల్ విడుదలైన మొదటి నెలలో లక్షన్నర రికార్డులు అమ్ముడుపోయాయి. ఈ గజల్‌కు సంగీతం కమల్‌దాస్ గుప్తా. మనదేశంలో ఇక్కడ నుండి గజల్ గానానికి ఊపు వచ్చింది. నిజానికి తలత్ మహ్‌మూద్ 1939లోనే గజల్ గానాన్ని మొదలుపెట్టారు. తలత్ మహ్‌మూద్ గాన విధానం ఆ తరువాత గజల్ గానానికి, లలిత గానానికి, చలనచిత్ర గానానికి ఆదర్శమయింది. భారతదేశంలో తొలిసారి లలిత, చలనచిత్ర సంగీతాలలో తీర్చిదిద్దిన, మేలైన గానాన్ని చేసినది తలత్ మహమూద్. గొప్ప గాయకులు మొహమ్మద్ రఫీ కూడా తలత్ నుంచి స్ఫూర్తి పొందారు. తలత్ మహ్‌మూద్ వేసిన బాటలోనే మనదేశపు లలిత, చలనచిత్ర, గజల్ గానాలు నడిచాయి. ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు మెహదీ హసన్‌కు కూడా తలత్ మహ్‌మూద్ స్ఫూర్తి. ఒక కచేరీలో తలత్ మహ్‌మూద్‌ను అనుకరించి పాడితే ‘‘తనపై శ్రోతలు 14,000 రూపాయలు నగదును విరజిమారు’’ అని మెహదీ హసన్ చెప్పుకున్నారు.
మెహదీ హసన్
గజల్ ప్రక్రియ రికార్డులకు ఎక్కినందువల్ల జనబాహుళ్యానికి బాగా దగ్గరైంది. కొందరు గజల్‌ను సంగీతపరమైన ప్రక్రియ అని పొరబడ్డారు. కానీ అది తప్పు. గజల్ నూటికి నూరుపాళ్లూ ఒక కవితా ప్రక్రియ. పాకిస్తాన్ దేశపు గాయకులైన మెహదీ హసన్, గులాం అలీల వల్ల గజల్ గానం విశ్వవిఖ్యాతమయింది. ‘మహోన్నత గానం’ అన్న దానికి అభివ్యక్తి మెహదీ హసన్. ఆయన గజల్ గానాన్ని చేపట్టాక గజల్ గానంలో ఓ సంచలనం రేగింది. పాకిస్తాన్ రేడియోలో రుమీ గాయకుడిగా నియోగించబడి తరువాత ఆ దేశపు చలనచిత్ర గాయకుడై ఆపై గజల్ గాయకుడిగా వినుతికెక్కారు మెహదీ హసన్. తన నిండైన, సమమైన పురుష గాత్రం (రౌండెడ్ ఈవెన్ బారీ టోన్)తోనూ, సంగీతపరమైన ప్రజ్ఞతోనూ పాకిస్తాన్ నుంచి గజల్ గానాన్ని రాయల్ ఆల్బర్ట్ హాల్‌కు చేర్చారు. విశ్వశ్రోతలను మెప్పించారు.
గులాం అలీ
గజల్ గానంలో మరో శిఖరం గులాం అలీ. స్వతహాగా పంజాబీ అయిన గులాం అలీ గజల్ గానానికి మరో పార్శ్వం. మరో సాగరం. తన ఉత్సాహభరితమైన గజల్ గానంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. కర్ణాటక సంగీత విద్వాంసులు గులాం అలీని ‘‘స్వర సరస్వతి’’ అన్నారు.
ఫరీదా ఖానం, ఆబిదా పర్వీన్, మున్నీ బేగం పాకిస్తాన్ గజల్ గాయనీమణులు. మొహమ్మద్ రఫీ ఖయ్యూమ్ సంగీతంలో ఉర్దూ గజళ్లను గానం చేశారు. మన్నాదె, లతా మంగేశ్కర్, ఆశాభోంస్లే వంటి వాళ్లు కూడా గజల్ గానం చేశారు. జగ్జీత్ సింగ్, పంకజ్ ఉధాస్, అనుప్ జలోటా, తలత్ అజీజ్, చిత్రాసింగ్, భూపేంద్ర, హరిహరన్‌లు చెలామణిలోకి వచ్చిన మనదేశపు ఉర్దూ గజల్ గాయకులు. ఖయాల్ గానంలోని సాంద్రత, రుమీ గానంలోని భావనాత్మకత సమ్మిళితమై పరిపుష్టమైన గజల్ గానమయింది. ఉర్దూ గజల్ గానానికి పునాదులు ఖయాల్, రుమీ లే. గులాం అలీ తరువాతి రోజుల్లో పాశ్చాత్య సంగీత ధోరణిలోనూ గజళ్లను పాడారు.
గజల్ అనే మాట స్ర్తీలింగ శబ్దం. గజల్ రాసి చెప్పే వ్యక్తిని ‘‘గజల్ గో’’ అంటారు. గజల్ రాయడాన్ని ‘‘గజల్ గోరుూ’’ అంటారు. గజల్ పాడడాన్ని ‘‘గజల్ సరారుూ’’ అంటారు. గజల్ పాడే వ్యక్తిని ‘‘గజల్ సరా’’ అంటారు. చెప్పడానికి, పాడడానికి మధ్యలో గజల్‌ను చెబితే దాన్ని ‘తహతుల్ లఫ్జ్’ అంటారు. గజల్‌ను స్వరయుక్తంగా పాడడాన్ని ‘తరన్నుం’ అంటారు.
గజల్ అంటే పద్యం కాదు. గజల్ అంటే పాట. మనం చెప్పుకున్నాం గజల్ అనేది షేర్ల కూర్పు అని. షేర్ అనేది రెండు పాదాలు కలది. ద్విపద. ఒక గజల్‌లో ఐదు, ఏడు, తొమ్మిది.. ఇలా ఎన్ని షేర్‌లైనా ఉండచ్చు. కనీసం ఐదు షేర్‌లైనా ఉంటేనే అది గజల్ అవుతుంది. షేర్లలోని పాదాలను ‘మిస్రా’లు అంటారు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఒక షేర్‌లోని మొదటి పాదాన్ని ‘‘మిస్రా ఎ ఊలా’’ అనీ, రెండో పాదాన్ని ‘‘మిస్రా ఎ సానీ’’ అనీ అంటారు. ఒక గజల్‌లో అన్ని పాదాలు ఒకే తూగులో ఉండాలి. ఈ సమతౌల్యాన్ని ‘‘వజ్న్’’ అంటారు. గజల్‌లో ఒక పాదం పెద్దదిగానూ, మరోపాదం చిన్నదిగానూ ఉండకూడదు. ఒక గజల్‌లో ముఖ్యమైన లేదా ఉన్నతమైన షేర్‌ను ‘‘బైతుల్ గజల్’’ అంటారు. షేర్‌లను రాయడానికి ఉర్దూలో పర్షియా, అరబీల నుంచి తీసుకున్న ‘బహర్’లు ఉన్నాయి. బహర్ అంటే ఛందస్సు లేదా మీటర్ అని తీసుకోవాలి. బహర్‌లు ‘రుక్న్’లతో ఉంటాయి. రుక్న్‌లు అన్నవి మన ఛందస్సులో ‘గణం’లాంటివి. గజళ్లకు, ఇతర ఫార్సీ కవితారూపాలైన ‘రుబారుూ’, ‘కత్ అ’లకు నిర్ణీతమైన బహర్‌లు ఉన్నాయి. గురజాడ అప్పారావు ముత్యాల సరాలు ఫార్సీ బహర్‌ల నుంచి వచ్చినవే. రెండు ఫార్సీ బహర్‌లను కలిపి వారు ముత్యాల సరంగా చేశారు.
గజల్‌లో మొదటి షేర్‌ను ‘‘మత్ లా’’ అంటారు. చివరి షేర్‌ను ‘‘మక్ తా’’ అంటారు. గజల్ చివరి షేర్‌లో కవి పేరో అతని కలం పేరో ఉండొచ్చు. మన కీర్తనలలో వచ్చే ముద్ర లాగా.. అలా ఉంటే దాన్ని ‘‘తఖల్లుస్’’ అంటారు. ఈ తఖల్లుస్ అనేది నియమం కాదు. గజల్‌కు అతి ముఖ్యమైనవి ‘కాఫియా, రదీఫ్’లు. కాఫియా అంటే అంత్యానుప్రాస. రదీఫ్ అంటే పునరావృతం అయ్యే పదం. ఒక గజల్ రదీఫ్ లేకుండా ఉండొచ్చు. కానీ కాఫియా లేనిది గజల్ కాదు. ఒక గజల్ మొదటి షేర్‌లోని రెండు పాదాలలోనూ కాఫియా, రదీఫ్‌లు ఉండాలి. తదుపరి షేర్‌లలో ప్రతి షేర్‌లోని రెండో పాదంలో కాఫియా, రదీఫ్‌లు ఉండాలి. నిజానికి ఈ కాఫియా, రదీఫ్‌లే ఆ గజల్‌ను కలిపి, నిలిపి ఉంచే సూత్రాలు. రదీఫ్ అనేది కాఫియాకు తరువాత పాదానికి చివరగా ఉండే పదం. గజళ్లకు శీర్షికలు ఉండవు. ఒక గజల్‌లోని షేర్‌లు అన్నీ భావసారూప్యతతో ఉండక్కరలేదు. ఏ షేర్‌కు ఆ షేర్ విడిగా ఉంటుంది. కాఫియా, రదీఫ్‌లు మాత్రమే ఆ గజల్‌ను కలిపి ఉంచుతాయి. ఒకే భావంతో షేర్‌లు ఉన్న గజల్‌ను ‘‘గజలె ముసల్ సల్’’ అంటారు. రదీఫ్ లేని గజల్‌ను ‘‘గయర్ మురద్ద్ఫి గజల్’’ అంటారు. అరబీ గజల్‌లో రదీఫ్ లేదు. ఫార్సీలోకి వెళ్లాకే గజల్ రదీఫ్‌ను అద్దుకుంది.
గజల్ తనాన్ని ‘గజలియత్’ అంటారు. ఈ గజలియత్, ఇతర రచనా విధానాల నుంచి శైలిపరంగా గజల్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంది. గజల్ వ్యక్తీకరణ విధానంలోని ప్రత్యేకతే లేదా శిల్పం గజలియత్. గజల్‌కు శయ్య (పదాల కూర్పు) కూడా ప్రత్యేకమే. గజల్ అన్నది వౌలికంగా ప్రక్రియ. సారూప్యంగా శిల్పం.
కావ్యరచన అనువాదంగా మొదలయినట్టుగానే గజల్ రచన కూడా తెలుగులో అనువాదంతోనే మొదలైంది. తొలి తెలుగు గజల్ కవి దాశరథి స్వీయ గజళ్లను రాయడానికి ముందు ‘ఖుదాయే గజల్’ అయిన గాలిబ్ గజళ్లను తెలుగులోకి అనువదించారు. 1961లో అవి ‘గాలిబ్ గీతాలు’ పేరిట ఒక సంకలనంగా వెలువడ్డాయి. నిజానికి ఈ గాలిబ్ గీతాలు అంతకు ముందే భారతి పత్రికలో అచ్చయ్యాయి. ఇవి గజల్ ప్రక్రియలో రాసినవి కావు. గాలిబ్ గజళ్లనే కాకుండా దాశరథి మీర్ తకీ మీర్ గజళ్లలోని కొన్ని షేర్‌లను తెలుగులోకి అనువదించారు. ‘జఫర్ తరంగాలు’ పేరుతో బహ్‌దూర్ షాహ్ జఫర్ గజళ్ల కొన్ని షేర్లను ఎన్నుకొని తెలుగులోకి అనువదించారు. 1972లో వల్లపురెడ్డి బుచ్చారెడ్డి వంటి కొందరు ఉర్దూ కవుల గజళ్ల షేర్‌లను తెలుగులోకి అనువదించారు. అవి ‘ముక్త గీతికలు’, ‘మధుగీత’ పేర్లతో వెలువడ్డాయి. 2013లో రామచందర్ దీకొండ కొన్ని గాలిబ్ గజల్ షేర్‌లను తెలుగులోకి అనువదించి ‘గాలిబ్ కవితా కౌముది’ పేరిట ప్రకటించారు.
తొలి తెలుగు గజల్
తెలుగులోకి గజల్ 1963లో వచ్చింది.
‘‘రమ్మంటే చాలుగానీ రాజ్యాలు విడిచి రానా
నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు నడచి రానా!’’
అనే షేర్‌తో మొదలయ్యే ఐదు షేర్‌ల ఆ గజల్ తొలి తెలుగు గజల్. ఆ గజల్ కవి దాశరథి. ఇది 1984లో వచ్చిన ‘జ్వాలా లేఖిని’ అన్న సంపుటిలో ఉంది. కానీ దీన్ని 1963లోనే దాశరథి రాశారు. తెలంగాణ మనీషి దాశరథి. కోస్తా ఆంధ్ర మనీషి పి.బి. శ్రీనివాస్‌ల సమిష్టి కృషి ఫలితమై ఈ తొలి తెలుగు గజల్ తమిళనాడు చెన్నైలో పుట్టింది. తెలుగు గజల్‌ను మొట్టమొదటిసారి పాడి వినిపించింది పి.బి. శ్రీనివాస్. 1967లో దాశరథి రాసిన ‘‘అధరాల వీధిలోన మధుశాలలున్నదాన’’ అన్న గజల్‌ను ఈమని శంకరశాస్ర్తి సంగీతంలో వారు పాడారు. ఆ గజల్‌ను కొలంబియా రికార్డ్స్ వారు విడుదల చేశారు.
తొలి తెలుగు గజల్ వాగ్గేయకారులు పి.బి. శ్రీనివాస్. వారు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన గజల్
‘‘కల్పనలు సన్నాయి ఊదే వేళ చింతలు దేనికి?
కవితలనె అర్పించు కానుక లోక కల్యాణానికి’’
ఇది 1978లో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమయింది. పి.బి. శ్రీనివాస్ తొలి తెలుగు గజల్ గాయకులు, తొలి తెలుగు గజల్ వాగ్గేయకారులు. ఉర్దూ గజళ్లలో మనకు కనిపించే హుస్న్ ఎ మత్‌లాలు మొదట తెలుగులో రాసింది కూడా వారే. తెలుగులో గజల్‌ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన కవి సి. నారాయణరెడ్డి. వారి గజళ్ల వల్ల తెలుగు సాహిత్యంలో గజళ్లకు ఊపు వచ్చింది. వారు రాసిన ఒక గజల్‌లోని షేర్.
‘‘ఎదురుగ క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం
కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం’’
దాశరథి, పి.బి. శ్రీనివాస్, సి. నారాయణరెడ్డి తెలుగు గజల్ ముమ్మూర్తులు.
సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షాహ్ (1565 1611) దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజు. హైదరాబాద్ నగర నిర్మాత. ఆయన ఒక రాజు, నగర నిర్మాత, ప్రేమికుడు మాత్రమే కాదు ఒక గొప్ప కవి కూడా! ఆయనకు తెలుగుపై మంచి పట్టు ఉండేది. తొలి తెలుగు గజల్ ఆయనే వ్రాశాడన్న మాట ఉంది. కానీ ఆధారాలు దొరకలేదు. తెలుగు వారందరూ గర్వించతగ్గ విషయం ఏమిటంటే పి.బి. శ్రీనివాస్ తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ మొత్తం ఎనిమిది భాషలలో గజళ్లను రాశారు. ప్రపంచంలోనే ఎనిమిది భాషలలో గజళ్లను రాసిన ఏకైక వ్యక్తి పి.బి. శ్రీనివాస్. 1981, 1984లలో పి.బి. శ్రీనివాస్ ‘సంగీతా రికార్డ్స్’ ద్వారా రెండు ఉర్దూ గజళ్ల ఆల్బంలను విడుదల చేశారు. ఒక కన్నడ గజళ్ల రికార్డ్‌ను విడుదల చేశారు. 1996లో విడుదలయిన ‘గాయకుడి గేయాలు’ అన్న సంకలనంలో వారు కొన్ని గజళ్లను పొందుపరిచారు. 1997లో విడుదలైన ‘ప్రణవం’ అన్న తమ అష్ట భాషా కవితా సంకలనంలో వివిధ భాషల గజళ్లను పొందుపరిచారు. తమిళ, కన్నడం, మలయాళం భాషలలో వారే తొలి గజల్ రాసినట్లు తెలుస్తోంది. వారు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉర్దూ గజళ్ళను ఆలపించారు.
హిందీ చలన చిత్రాలలో గజళ్లు వినిపించడం అందరికీ తెలిసిందే. 1979లో వచ్చిన ఎన్.టి. రామారావు చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’ అనే తెలుగు చిత్రంలో సి. నారాయణరెడ్డి రాసిన ఒక గజల్ మనకు ‘మొహమ్మద్ రఫీ’ గొంతుతో వినిపిస్తుంది. సి. రామచంద్ర సంగీతం సమకూర్చిన ‘‘తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏం చేయను’’ అన్న ఆ గజల్ సంగీత, సాహిత్యపరంగా ఒక చక్కటి గజల్. అదేచిత్రంలో కథానాయిక పాత్ర కోసం సి. నారాయణరెడ్డి కొన్ని షేర్లను పలికించారు.
1983లో..
‘‘చిరునవ్వు పలికించే స్వర కల్పనలెనె్నన్నో
హృదయాలను ఒలికించే మృదు చిత్రణలెనె్నన్నో’’
అన్న షేర్‌తో మొదలయ్యే సినారె గజల్‌ను ఎం. చిత్తరంజన్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి స్వీయ సంగీత సారథ్యంలో పాడి ప్రసారం చేశారు. కొన్ని చలన చిత్రాలకు సంగీతం సమకూర్చిన తెలుగువారు బి. శంకర్ ఉర్దూ గజళ్లు పాడేవారు. తెలుగువారైన విఠల్‌రావు ఉర్దూ గజల్ గాయకులు. నిజాం ఆస్థాన గాయకులు కూడా వారు. ప్రముఖ వైణిక విద్వాంసులు ఈమని శంకరశాస్ర్తి కుమార్తె దేవి విష్ణ్భుట్ల తెలుగువారై 1982లో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉర్దూ గజల్ గాయనిగా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తరువాత హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలోనూ, బయటా తమ గజల్ గానాన్ని సాగిస్తున్నారు. ‘‘నిజాం ఆఖరు నవాబ్ పట్ట్భాషేకం సందర్భంలో ఒక తెలుగు గజల్‌ను ఇక్రాముద్దీన్ అనే ఆయన పాడారనీ, నిజాం రేడియో రికార్డ్‌పై అది విడుదలయిందన్న సంగతి విన్నాను’’ అనీ ప్రముఖ సంగీత పరిశీలకులు వి.ఎ.కె. రంగారావు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని ధ్రువీకరించే ఆధారం ఆయన దగ్గర లేదు. ఆ రికార్డ్ దొరకలేదు. ఆ విషయం నిరూపణకు నోచుకోలేదు.
జనం జీవితాలలోకి అంతర్జాలం ప్రవేశించాక, సాహిత్యం అంతర్జాలంలోనూ చోటుచేసుకున్నాక తెలుగు గజల్ కూడా అంతర్జాలంలోకి వచ్చింది. 2002లో వెబ్‌ప్రపంచం.కాం అనే అంతర్జాల పత్రికలో రోచిష్మాన్ రాసిన ఓ గజల్ అంతర్జాలంలో వచ్చిన తొలి తెలుగు గజల్‌గా నమోదయింది. అది..
‘‘నవుతూ నువ్వుండిపోతే నాకు తోడయి ఓ ప్రియా
ఉండిపోదా సౌఖ్యమంతా నాకు ప్రేమయి ఓ ప్రియా?’’
తెలుగులో శాస్ర్తీయమైన బహర్‌లో వచ్చిన తొలి తెలుగు గజల్ కూడా ఇదే. ఫాయిలాతున్, ఫాయిలాతున్, ఫాయిలాతున్, ఫాయిలున్ అనే ‘రమల్ ముజాహఫ్ బహర్’లోని గజల్ ఇది. తొలి తెలుగు గజల్ కవయిత్రి స్వరూపరాణి (రత్నజ) 2008 ఏప్రిల్ నెల భూమిక పత్రికలో ఆమె రాసిన గజల్ అచ్చయింది. అది ఒక కవయిత్రి రాసిన తొలి తెలుగు గజల్.
తొలి తెలుగు గజల్ గాయని పి. సుశీల. 1986లో విడుదలైన ‘సంసారం ఓ సంగీతం’ అనే చలనచిత్రంలో పుగళేంది సంగీతంలో ‘‘ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు’’ అన్న సి. నారాయణరెడ్డి గజల్‌ను ఆమె పాడారు. అటు తరువాత గాయని శొంఠి పద్మజ 1989లో సినారె గజల్‌ను హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం కోసం పాడారు.
పి.బి. శ్రీనివాస్, ఎ.సి. వెంకటాచలం, మొహమ్మద్ రఫీ, ఎమ్. చిత్తరంజన్, సి. నారాయణరెడ్డి ప్రభృతుల తరువాత గజల్ గానాన్ని చేపట్టింది కేశిరాజు శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్‌గా మనమందరమూ ఎరిగిన వీరు తమ గానంతో తెలుగు గజల్‌ను విశ్వవిఖ్యాతం చేశారు. ఇతర భాషలతో ఉన్న గజల్ గానానికి భిన్నంగా గజల్ శ్రీనివాస్ మన తెలుగు హరికథా గాన విధానాన్ని తోడు తీసుకుని జానపద ధోరణిలో సాగే గానంతో తెలుగు గజల్‌ను జనరంజకం చేశారు.
పి.బి. శ్రీనివాస్ తెలుగు గజల్‌కు ‘వల్లరి’ అనే పేరు పెట్టారు. వారు ఆ పేరుతోనే తమ తెలుగు గజళ్లను ప్రకటించారు. ఈ వల్లరి పేరును దాశరథి కూడా తమ గజళ్లకు ఉపయోగించుకున్నారు. తొలి తెలుగు గజల్ రికార్డ్ వల్లరి పేరుతోనే విడుదలయింది. తెలుగువారైన అమన్ హిందూస్థానీ 1958లోనే ఉర్దూ గజళ్లను రాశారు. పి.బి. శ్రీనివాస్, అమన్ హిందూస్థానీ, రోచిష్మాన్ ఆంగ్లంలో కూడా గజళ్లను రాశారు. దక్షిణాఫ్రికాలోని పొయట్రీ మూవ్‌మెంట్ వారు రోచిష్మాన్ రాసిన ఒక ఇంగ్లీష్ గజల్‌ను 2016లో ఒక సంకలనంలో ప్రచురించి దానికి భారతీయ వనిత భరతనాట్యం చేస్తున్నట్టు బొమ్మ వేశారు. 2012 డిసెంబర్ 28వ తారీఖున తిరుపతిలో ప్రపంచ మహాసభల సందర్భంగా ‘తొలి తెలుగు గజల్ ముషాయిరా’ జరిగింది. ఈ అంతర్జాల యుగంలో ఫేస్‌బుక్ మాధ్యమంలో ‘గజల్ లోగిలి’ పేరుతో ఒక బృందం తెలుగు గజళ్ల కోసం మొదలై సాగుతోంది. గజల్ తెలుగులోకి మూడు దోషాలతో వచ్చింది. ఒకటి కాఫియా విషయంలో జరిగింది. రెండవది బహర్ లేకుండా రావడం. మూడవది గజలియత్ (శైలీ, శయ్య) లేకపోవడం.
తెలుగు కాఫియా(అంత్యానుప్రాస) ‘ఈతా ఎ కఫీ’, ‘ఈతా ఎ జలీ’ దోషాలతో ఉంది. నిర్దిష్టమైన కాఫియా ఇంకా తెలుగుకు అలవాటు కాలేదు. దాశరథి, సినారెలు గజల్ శైలి, శయ్యల (గజలియత్)తో గజళ్లు రాయలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే గజలియత్‌ను విడిచి పెట్టానని స్వయంగా సినారె చెప్పుకున్నారు. వారు కాఫియా విషయంగానూ స్వేచ్ఛ తీసుకుని నిర్దిష్టమైన కాఫియాకు దూరమయ్యారు. గజల్‌కు ఉండే ప్రత్యేకమైన శైలి, శయ్యల (గజలియత్)ను తొలిసారి తెలుగులోకి తెచ్చినది పి.బి. శ్రీనివాస్. ఇలా..
‘‘తోటకాదాపల, జీవితం సమరాంగణం’’ (1997లో వెలువడిన ‘‘గాయకుడి గేయాలు’’ సంపుటి నుంచి) / కలలు చూపే కల్లపేరే జీవితం (గాయకుడి గేయాలు నుంచి) / దేవుడు రాసిన కథలలో నాది విరోధాబాసం / తృప్తి లేని మదిలో నిరాశ పెదవులపై దరహాసం (2015లో వెలువడిన ‘గేయకవితలు’ సంపుటి నుంచి) / ఎడదలెన్నో వలపుల వలలందున పడి విఱిగెను (గేయ కవితలు నుంచి).
రోచిష్మాన్ చూపిన గజల్ శయ్య.. బాధే పుండై పీడిస్తుండే ప్రేమికుడివి అని అన్నారు / వ్యథల వల్ల జీవనాన జీవితం కమిలిపోయింది / రోచిష్మాన్‌ను ఎపుడో జీవితం లోలోన మరణించాను / జీవితంపై, వ్యథ కతె్తై పడి కోసేస్తున్నా / గాయం గేయంలో బ్రతుకును చదవాలని ఉంది. తెలుగులో మరెవ్వరూ గజల్ శైలి, శయ్యల (గజలియత్)ను ప్రదర్శించలేదు.
గజల్‌కు నిర్దిష్టమైన కాఫియా, రదీఫ్, వజ్న్, శైలి, శయ్య ముఖ్యమైనవి. ఇవి లేనివి మామూలు గేయాలు అవుతాయి. భావకవిత్వం ఎలా శిల్పాత్మకమయినదో గజల్ కూడా అలా శిల్పాత్మకమైనదే. గజల్ శిల్పం లేదా గజలియత్ లేకపోతే ఆ రచన ఒక మామూలు పాట అవుతుంది. గజలియతనం తెలుగులోకి చలనచిత్ర గీతాల ద్వారా వచ్చింది. 1953లో వచ్చిన దేవదాస్ చిత్రంలో మనం విన్న ‘‘మరపురాని బాధకన్నా మధురమే లేదు’’ అన్నదీ, ‘‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’’ అన్నదీ గజల్ వ్యక్తీకరణమే. 1960లో వచ్చిన చివరికి మిగిలేది చిత్రంలో మల్లాది రామకృష్ణ శాస్ర్తి ఒక పాటలో ‘‘చినికిన చినుకెల్లా మంచి ముత్యము కాదు / మెరసిన మెరుపులో లేత వెనె్నల లేదు’’ అనడం గజల్ భావన. గుంటూరు శేషేంద్ర శర్మ గజళ్లు రాయలేదు కానీ తమ ప్రేమలేఖలు రచనలో చక్కటి గజలియత్‌ను ఆవిష్కరించారు. 1984లో ఈ నగరం జాబిల్లి పేరుతో వారు గజల్‌పై వ్యాసాలు రాశారు.
దాదాపుగా తెలుగులో గజళ్లపై రచనలూ, సిద్ధాంత (పిహెచ్‌డి) వ్యాసాలు తప్పులతోనూ, అబద్ధాలతోనూ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సామల సదాశివ, పెన్నా శివరామకృష్ణ వంటివారు గజల్ గురించి తప్పులే చెప్పారు. కుహనా కవులు కొందరు తెలుగులో గజల్‌నే కాదు గజల్ పేరుతో ‘‘వచ్చావూ, చూపాలీ, నవ్వావూ’’ వంటి అపభ్రంశ పదాలు రాస్తూ తెలుగును కూడా భ్రష్టుపట్టించేశారు. ముద్దుపూలు కురుస్తుంది, స్వప్న శిల్పాలు వంటి ఘోరమైన వాక్యాలు తెలుగు గజల్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. ‘‘ముక్క అన్న పదం బహువచనం’’ అని అనే శంకర్‌లూ, ‘‘జ్ఞాపక పుటలు’’ అని అనే వాహెద్‌లూ మామూలు తెలుగు కూడా తెలియకుండా గజళ్లూ, గజళ్లపై రచనలు రాస్తూ తెలుగుకు, గజల్‌కు తీవ్రమైన హాని చేస్తున్నారు. తెలుగు గజల్‌కు బహర్‌లు పనికిరావు అన్న తప్పుడు ఆలోచనను కొందరు సృష్టించారు. అది సరికాదు. ఏ కొన్నో తప్ప 95 శాతం బహర్‌లు తెలుగుకు పొసగుతాయి. తెలుగులో మామూలు గేయాలు, ప్రచార గేయాలు గజళ్లుగా చలామణి అవుతున్నాయి. చివరికి కాఫియా కూడా లేని రచనలు కూడా తెలుగులో గజళ్లుగా చలామణి అవుతున్నాయి. ‘‘గజళ్ల సంకలనం’’ అని అనడం కూడా తెలియకుండా ‘‘గజల్ సంకలనం’’ అని అనే దారుణమైన స్థితిలో ఇవాళ గజల్ తెలుగు ఉంది. ‘‘గుల్దస్తా ఎ గజల్’’ లేదా ‘‘గజల్ కా గుల్దస్తా’’ అని అనాలని తెలియక ‘‘గజల్ గుల్దస్తా’’ అన్న పేరుతో ఇటీవల ఒక సంకలనం రావడం శోచనీయం. ఈ గజల్ గుల్దస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధనంతో అచ్చయింది. గజల్ పేరుతో ప్రభుత్వ ధనం, సాహిత్య అభిరుచి ఇలా పెడత్రోవ పట్టాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రాంతాల పేర్లతో తెలుగులో గజళ్లు అని రాయబడుతున్నాయి. భవిష్యత్తులో ‘కులం గజళ్లూ, మతం గజళ్లూ’ అనే దుస్థితి కూడా తెలుగులో వచ్చేస్తుందేమో?
తెలుగు గజల్ గానం కూడా జాతీయస్థాయిలో లేదు. లేకితనంతోనూ, శ్రుతి, తాళంలు కూడా లేకుండానూ గాన సరస్వతుల గజల్ గానం తెలుగుకు తలవంపులు తెచ్చేదిగా ఉంది. ‘ఎరుక’ లేకపోవడం వల్ల తెలుగులో గజల్ పాడయిపోయింది. ఒక ప్రక్రియపై సరైన అవగాహన ఉండాలి. లేకపోతే ఆ ప్రక్రియ వక్రిస్తుంది. తెలుగులో గజల్ విషయంలో అదే జరిగింది. భాషపరంగానూ, శిల్పం పరంగానూ తెలుగులో గజల్ ఒక వికృత రచన అయింది. తెలుగు గజల్ ‘‘అజల్’’ అయిపోయింది. బాధాకరమైన విషయం ఇది. ప్రస్తుతం తెలుగులో గజల్‌కు శుద్ధి జరగడం, గజల్‌పై అవగాహన రావడం అత్యవసరం. తెలుగులో గజల్ ‘గజల్’గా పునరుద్భవించాలి. ఇకనైనా ‘తెలుగు గజళ్లు’ కాదు ‘తెలుగులో గజళ్లు’ రావాలి.. కావాలి..

--రోచిష్మాన్ 94440 12279