S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాధ.. భావన

అరిసి కూట్టు అత్తా మగనే, నీ కూట్టుంబోదు వెలిక్కవిల్లియో, అని ఒక తమిళ సినిమా పాట. పాపము శపించుగాక. కొంతమందికి అర్థం తెలియలేదని నాకు తెలిసింది. బియ్యం దంచే అత్తకూతురా (బియ్యం దంచేది అత్త అనుకునేరు గనుక. సాక్షాత్తు అత్తకూతురే దంచుతూ ఉంటుంది!) (మధ్యలో మాట దారి మళ్లిందా? మళ్లా క్షమించండి..) అత్తకూతురా దగ్గర కదూ అన్నాము. పాటలోనండీ! నీవు దంచుతుంటే నొప్పి పుట్టలేదా? అని సదరు బావగారు, చివరికి మిగిలేది పద్ధతిలోనయితే వబారుగా (ఇదేమిటో తెలియని వారికి క్షమాపణలు. ఆ నవల్లో నాయకుడు అనగా వీరో అనగా హీరో గారిని ఒక బావమరిది అట్లా పిలుస్తుంటాడు లెండి!) ఆ అమ్మడును పాట వరుసకు, మాట వరుసకు అడుగుతాడు. (ఇక్కడ తాడు అన్న ప్రయోగము బాగ లేదు గనుక అడుగుతడు అందమా) అవునండీ ఎవరో గింజుకుంటున్నట్టు గుంజుకుంటున్నట్టు అనుమానం కలుగుతున్నది. కొంపదీసి, తీసి నేను గాని కాని మాట ఏదయినా అంటినా? ఇందులో ఎక్కడన్న అప్రాచ్యపు పలుకులు వినిపించెనా? బూతు కనిపించెనా? హా హతవిధీ, వీధీ కాదు, ఇట్లెట్లాయె? గిసుమంటి, ఇటువంటి విషయాలు అనగా సంగతులు నా ఓటి బుర్రకు, మట్టిబుర్రకు ఆసానుగ అనగా సులభంగా సమఝకు రావు అంటే అర్థంగావు. (రావు అనగా ఒక లేదా చాలామంది పెద్దమనుషుల పెర్ల చివరన ఉండు అక్షరములు. గావు అనగా పోతరాజును అడుగవలెను. దున్నపోతును చంపెటందుకు గాయినె అనగా ఆయల గావు వడుతడు. అంటే గట్టిగ పట్టుకుంటడు.) ఒద్దుగాని నాకు బుద్ధిలేదు, నొప్పిగూడ సమంగ అంటే సరగ్గా తెలువదు అంటని మా నాయిననే అన్నడు. (తమ్ముడు గాదు.) ఆ సంగతి గురించి, గూర్చి కూడ చెప్పాల మరి.
దీపావళికి ఇంటికి వెళ్లాను. నిజానికి అది విద్యార్థి దశ కానేకాదు. అప్పటికి లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. అలవాటు కొద్దీ బోలెడన్ని టపాకాయలు తెచ్చుకున్నాము. వరుసపెట్టి కాలుస్తూనే ఉన్నాము. కొంచెం ధైర్యం ఎక్కువయిందేమో పూల బుడ్డి అనే ఫ్లవర్ పాట్‌ను చేతిలో పట్టుకుని వెలిగించడానికి ప్రయత్నం చేశాను. అది ఎడమ చేతిలో ఉంది. కుడిచేతిలో కొవ్వొత్తి ఉంది. నిజానికి పాట్ చిన్నది కూడా కాదు. అది ఒక్కసారిగా ఢామ్మని పేలింది. కళ్లముందు పెద్ద వెలుతురు కనిపించింది. కొంతసేపు దాకా మరేమీ కనిపించలేదు. చెయ్యి ఉందా లేదా తెలియలేదు. కుడిచేత్తో ఎడమచేతిని తడిమి చూశాను. చెయ్యి ఉంది. కాకుంటే బాణసంచాలోని మందు ఆ చేతికి అతిగా పట్టుకున్నది. అప్పటికి నేను జంతుశాస్త్రం లెక్చరర్‌గా పని చేస్తున్నాను. అందుకు నాకు రెండు చేతులు అవసరం. ఇప్పుడిక ఎడమ చెయ్యి పని చెయ్యకుండా పోతే నేను మళ్లీ ఒకసారి వదిలి వచ్చిన తెలుగు ఎమ్మే చదవాలి. అప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన అది. చూస్తుండగా చెయ్యి పూరి లాగ పొంగింది. నాకు చెప్పరాని మంట పుడుతున్నది. ఆ పుట్టే మంట ఎక్కువా తక్కువా అన్న సంగతి నాకు అర్థం అయినట్టు లేదు. మొదటి నుంచి నా పద్ధతి అంతే. దెబ్బ తగిలితే లేదా తలనొప్పి పుడితే అక్కడి నొప్పి గురించి దాని స్థాయి గురించి నాకు అర్థం అయ్యేది కాదు. పెయిన్ త్రెషోల్డ్ అని వైద్యశాస్త్రంలో ఒక పద్ధతి ఉంటుంది. ఒక మనిషి నొప్పిని భరించడానికి గల స్థాయిని అది చూపిస్తుంది. కొంతమంది ఎక్కువ నొప్పిని భరించ గలుగుతారు. కొంతమంది తక్కువ నొప్పికి గిలగిల లాడిపోతారు. నేను మొదటి రకంలో వాడిని అని నాకు అర్థం అయింది.
ఆ దీపావళి రాత్రి నాకు నరకం లాగా ఉంది. చెయ్యి కొలిమిలో పెట్టినట్టు మండుతున్నది. నాకంటే మాత్రం కన్నీటి చుక్కగాని నూట ఒక బాధమయమైన మాటగాని రాలేదు. లోపలి గదిలో పడుకుని ఉన్నాను. చేతికి అమ్మ ఏదేదో ఉపశమనం చేస్తున్నది. నాకు ప్రభావం తెలియడంలేదు. నా మంట దాని స్థాయిలో అది మండుతూనే ఉన్నది. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఇంతలో నాన్న గదిలోకి వచ్చాడు. ఆయన గంభీరంగా ఉండే మనిషి. నన్ను చూచి ‘నా కడుపున రాక్షసుడవు పుట్టావు. నీకు బాధ కలగడం లేదా’ అని అడిగాడు. నేను నవ్వేను. అంత బాధలోనూ నవ్వగలిగే ఓపిక కనిపించింది. నేను ఏడుపు మొదలుపెడితే ఇంట్లోని మిగతా వాళ్ల బాధ ఒక మెట్టు పైకి పోతుంది. ఏమీ జరగనట్టు ఉంటే వాళ్లు కూడా బహుశా ఏమీ జరగలేదు అనుకుంటారు. కానీ ఏదో జరిగింది అన్నది ఎదురుగా తెలుస్తూనే ఉన్నది.
మిస్సమ్మ సినిమాలో గోవింద్ అని ఒక పాత్ర ఉంటుంది. బాలకృష్ణ ఆ పాత్రలో నటించాడు. అతను నాగేశ్వరరావుకు సహాయకుడుగా ఉంటాడు. నాగేశ్వరరావు తనను తాను డిటెక్టివ్ అనుకుంటాడు. తన గదిలో వింత ఏర్పాట్లు చేసుకుంటాడు. చెప్పకుండా గదిలోకి వచ్చిన వారి బుర్ర మీద ఒక గుండు వచ్చి కొట్టుకుంటుంది. ఈ గోవింద్ అన్న వాడు గదిలోకి వస్తాడు. దెబ్బ తింటాడు. తల విదిలించి తన పనిలో తాను వెళ్లిపోతాడు. నాగేశ్వరావు అతడిని పట్టుకుని ‘గోవింద్, నీది మట్టిబుర్ర’ అంటుంటాడు. నాకు నాయకుడు దొరకలేదు గాని నేను కూడా మట్టిబుర్ర బాపతే.
ఒకసారి పాలమూరులో ఇంట్లో బాయిలర్‌లో వేయడానికి కర్ర ముక్కలు నరుకుతుంటే వెనుక నుంచి తల మీద ఒక కర్ర దుంగ వచ్చి పడింది. నేను మాత్రం కదలలేదు మెదలలేదు. ఒకే కంటిలో ఒక చుక్క నీరు వచ్చినట్టు నాకు గుర్తుంది. శరీరంలో కలిగిన బాధకు అది ప్రతిక్రియ అని అప్పట్లో నాకు అర్థం కాలేదు. అయినా గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నాను. ఇనే్నళ్ల తరువాత ఇప్పుడు కాలికి తగిలిన చిన్న దెబ్బకు కూడా కంటనీరు వస్తున్నది. ఒంటికి చమటలు పడుతున్నాయి. అంటే నొప్పిని భరించే శక్తి ఈ శరీరం పూర్తిగా పోగొట్టుకున్నది అని అర్థం. నొప్పి అనివార్యం. కానీ అనుభవించే పద్ధతి మాత్రం మన ఇష్ట ప్రకారం జరుగుతుంది, అని వైద్యంలో వారు అంటుంటారు. వినడానికి మాట బాగానే ఉంది. శరీరానికి బాధ అన్నది లేకపోతే ఇక సుఖం గురించి ఏం తెలుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవడానికి ముందు జబ్బు పడవలసిన అవసరం లేదని కూడా ఒక మాట ఉంది. నొప్పి శరీరానికి అయితే భరించడం పద్ధతి. కానీ అది మనసుకు కలిగిన నొప్పి అయితే మరీ సలుపుతుంది.
చెయ్యి కాలిన నాడు నాకు రాత్రి నిద్ర పట్టలేదు. మరుసటి నాడు బయలుదేరి హైదరాబాద్ వెళ్లిపోయాను. బస్సు దిగి మిత్రుల దగ్గరికి వెళ్లాలని సిటీ బస్సు ఎక్కాను. ఎదురు సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు. అతను కుడి చేతికి కట్టుకుని ఉన్నాడు. నేనింకా జేబు రుమాలు చుట్టుకోవటంతోనే ముగించాను. అతనికి గాయం మరీ ఎక్కువగా అయినట్టుంది. ఆ విషయంలో తాను అన్నగారు అనిపించింది. అతడిని చూసి నేను పక్కున నవ్వాను. అతను నవ్వే ప్రయత్నం చేశాడు. బాధ అంటే అదే.
ఎవరో జారి పడతారు. చెయ్యి లేదా కాలు విరిగినా విరిగి ఉండవచ్చు. అయినా ఆ మనిషిని చూచిన మిగతావారు మొట్టమొదట పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతారు. చేయి అందించి లేపుదామని ఎవరూ అనుకోరు. మనిషిలోని మనస్తత్వం అటువంటిది. మరొకరి బాధను చూసి సంతోషించ గలగడం మనుషులం అనే మనకు మాత్రమే చేతనైంది. మొత్తానికి నా చేతికి ఏమీ కాలేదు. వారం రోజుల్లో అది మళ్లీ బాగా ఐపోయింది. మచ్చ పడింది కానీ కూడా కొంత కాలానికి తగ్గిపోయింది. ఇప్పుడా సంఘటన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నందుకు తప్ప మనసులో లేదు.
తనువుకు ఎన్ని గాయాలైన మానిపోవు ఎలాగైనా, మనసుకు ఒక్క గాయమైన మరువలేము చితి లోనయినా అంటాడు సినిమా కవి. మామూలు కవి మరొక రకంగా చెప్పే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు.
వేలిముద్రలు ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండవు. నిజం చెప్పాలంటే నొప్పి కూడా ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండదు. ఎవరి అనుభవం వారిదే. ఒక ఎనభయి ఏళ్ల ముసలాయన ఆసుపత్రిలో చేరాడు. ఖర్మకొద్దీ ఆయన కొడుకు కూడా అక్కడే డాక్టరు. పెద్దాయనకు ఏదో ఎముక విరిగింది. సర్జరీ చేయాలి. ఆయనకు కావలసినన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. కనుక మాంచి మత్తుమందు ఇచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. సాయంత్రానికి ఆయనను గదికి కూడా మార్చారు. మరునాడు పెద్దాయన గాభరాగా గోల చేశాడు. ఏమిటో చూడాలని డాక్టర్లు పరుగున వచ్చారు. సహోద్యోగి తండ్రి కూడా మరి. అపరేషన్ ముగిసి ఇరవై నాలుగు గంటలయింది. నాకింకా ఎక్కడా నొప్పి లేదేమిటి అని ముసలాయన అడిగాడట. నాకేమో నొప్పి ఉన్నా తెలియదు. ఈయనగారికి అది లేకపోవడం సమస్యగా కనిపించింది.
ఏమిటో ఈ నొప్పి? ఏమిటో ఈ బాధ? రెండూ ఒకటేనేమిటి కొంపదీసి! నాకు అర్థంగాదు మరి!

-కె.బి.గోపాలం