S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మునులకు అభయం ఇచ్చి సుతీక్ష్ణాశ్రమానికి చేరిన శ్రీరాముడు

వాసుదాసు వ్యాఖ్యానం
అరణ్యకాండ-16
*
ఋషులందరూ చెప్పిన మాటలు విన్న శ్రీరామచంద్రమూర్తి వారితో ఇలా అన్నాడు. ‘మహానుభావులారా! మీరు నన్ను ఇలా గొప్పవాడిని చేసి మాట్లాడవచ్చా? నేను మీ ఆజ్ఞానుసారం నడుచుకునేవాడినే! మీరు ఆజ్ఞాపించాల్సిన వారే కాని విజ్ఞాపించాల్సిన వారు కాదు. నేను ఈ అడవుల్లోకి నా స్వకార్యం కొరకే వచ్చా. ఈ అడవుల్లోని రాక్షసులందరినీ వధించి మీకు మేలు చేయడమే నా స్వకార్యం. నా తండ్రిని సత్యవాదిని చేయడానికి అడవులకు రావడం నెపం మాత్రమే కాని యదార్థం కాదు. ఆశ్రీతులను రక్షించడం రక్షకుని విధి. నేను చేయాల్సిన కార్యాన్ని ఇంతవరకూ చేయకపోవడం నా లోపమే. నన్ను క్షమించండి. ఈ కారణం వల్ల మాకు అరణ్యవాసం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. యుద్ధంలో తమ్ముడితో కలిసి విరోధులను చంపుతా. అప్పుడు నా భుజశక్తి చూడండి.’
ఇలా ఆ ఋషులకు అభయమిచ్చిన శ్రీరామచంద్రమూర్తి తన మాట నెరవేర్చడానికి అభిలాషతో, తన వెంట మునీశ్వరులందరూ వస్తుంటే, సుతీక్ష్ణాశ్రమానికి పోయే దారిలో పయనించాడు. తన వెంట వచ్చిన వానప్రస్థులతో ముచ్చటించుకుంటూ నడిచిన శ్రీరాముడు అందమైన ఆశ్రమాన్ని చూశాడు. పూలతో నిండి, కొండలాగా నల్లగా వ్యాపించిన పర్వతంతో, సౌందర్య సంపత్తితో అలరారుతున్న ఆ శుభాశ్రమాన్ని సమీపించి, అక్కడ కూచున్న సుతీష్ణుడిని శ్రీరామచంద్రమూర్తి చూసి, ప్రీతితో ఇలా అన్నాడు: ‘ఋషీశ్వరా! పాపరహితుడా! నేను రాముడిని. నిన్ను దర్శించుకోవాలని మిక్కిలి సంతోషంగా వచ్చాను. మనసారా ప్రేమగల చూపులతో నన్ను చూడు’. వెంటనే ఆ మునిశ్రేష్ఠుడు రాముడిని కౌగిలించుకుని, ‘సీతేశ్వరా, నీకు క్షేమమే కదా?’ అని కుశలప్రశ్న వేస్తూ ఇలా అన్నాడు: ‘ఇతరులు చూసి సహించలేని తేజస్సు కలవాడా! నువ్వు రావడం వల్ల ఇక్కడి ఈ ఆశ్రమం మరింత పవిత్రమై, దిక్కుకలదిగా ప్రకాశిస్తున్నది. ఓ వీరుడా! నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసి శరీరాన్ని వదిలి దేవలోకానికి పోవడానికి ఇష్టం లేక ఇక్కడే నీ కొరకు కాచుకుని ఉన్నాను. నా పుణ్యం వల్ల నువ్వొచ్చావు నాయనా! కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడవు, మంచి పరాక్రమవంతుడవు అయిన శ్రీరామచంద్రమూర్తీ! రాజ్యాన్ని వదిలి మునివేషంతో చిత్రకూటలో నువ్వు నీ భార్యతో, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వున్నావని విన్నాను. రామచంద్రా! నేను సంపాదించిన పుణ్యంతో స్వర్గాన్ని పొందాను. అక్కడికి రమ్మని ఇంద్రుడు నన్ను పిలవడానికి వచ్చాడు. కాని నువ్వు ఇక్కడకు వస్తున్నావని తెలిసి, అక్కడికి పోకుండా, నీ దర్శనం కొరకు ఇక్కడే కాచుకుని ఉన్నాను. నన్ను అనుగ్రహించి ఇక్కడ విహరించు’ అని అన్నాడు.
జవాబుగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: ‘మునీంద్రా! నీ తపః ఫలం నువ్వు నాకివ్వాల్సిన అవసరం లేదు. ఫలకాంక్ష లేకుండా రామార్పణం అని నువ్వు సంకల్పిస్తే చాలు. అవే వచ్చి నాలో కలుస్తాయి. అప్పుడు నేను గ్రహిస్తా. మేముండడానికి అనువైన స్థలం చూపించు. నీ గురించి అంతా శరభంగుడు చెప్పాడు’. ఈ మాటలు వినగానే మునీంద్రుడు శ్రీరాముడితో ‘శ్రీరామచంద్రా ఈ ఆశ్రమ భూమియే రమ్యమైనది. గుణం కలది. ఋషులెందరో ఇక్కడ తపస్సు చేస్తున్నారు. ఫలమూలాలు దండిగా దొరుకుతాయిక్కడ. ఇక్కడ భయమంటే ఏమిటో తెలియదు. కాకపోతే ఇష్టం వచ్చినట్లు తిరిగే మృగాలు వచ్చి దేహాలను తాకటం వల్ల తపస్సుకు విఘ్నం కలుగుతుంది. అది తప్ప మరే భయం లేదు. కాబట్టి ఇక్కడే ఉండండి’ అన్నాడు. తాను ఆ మృగాలను చంపితే మునీంద్రుడికి మనోవ్యధ కలుగుతుంది కాబట్టి తానక్కడ ఎక్కువ రోజులుండకూడదని అంటూ శ్రీరాముడు, సరస్సుకు పోయి సాయం సంధ్య పూర్తి చేశాడు. ఆ ముని ఇచ్చిన ఆహారాన్ని తిన్నాడు. ఆ రాత్రి సీతాలక్ష్మణులతో అక్కడే గడిపాడు.
తెల్లవారుఝాము కాగానే లక్ష్మణుడు ముందుగా లేచి, స్నానం చేసిన తరువాత సీతాదేవి కూడా నిద్రలేచి అలాగే చేసింది. శ్రీరామచంద్రమూర్తి కూడా తటాక జలాలలో స్నానం చేసి, హోమం చేసి, ఇష్టదైవ ప్రార్థన చేసి, సూర్యోదయం కాగానే సూర్యుడికి నమస్కారం చేసి సుతీక్ష్ణ మునిని సమీపించి అంజలి ఘటించి ఇలా అన్నాడు: ‘తపస్సు వల్ల పవిత్రమైన హృదయం కల మునీంద్రా! నువ్వు మమ్మల్ని గారవించి గౌరవించడం వల్ల రాత్రి మాకు హాయిగా గడిచింది. ఇక బయల్దేరి పోవడానికి అనుమతి ఇస్తారా? ఎక్కడికి పోతారంటారేమో? తమ తమ ఆశ్రమాలకు రమ్మని దండకారణ్యంలో నివసించే మునులు మమ్మల్ని అడుగుతున్నారు. వారి వెంట మేం పోవాలనుకుంటున్నాం. కాబట్టి మా మీద దయతో అనుమతి ఇవ్వండి. ఎండ సోకక ముందే వెళ్లడానికి సెలవివ్వండి’. ఇలా చెప్తూ శ్రీరాముడు ముని పాదాలను తాకి నమస్కరించాడు. శ్రీరాముడిని ముని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకుని, ‘రామచంద్రా! నీ నీడ నిన్ను విడిపోకుండా నీ వెంట వచ్చే విధంగా, సీత నిన్ను కొలుస్తుండగా పోయిరా! నువ్వు ఎవరి వెంట పోవాలనుకుంటున్నావో ఆ ఋషులు మిక్కిలి పుణ్యాత్ములు. వారు నిన్ను పాపపు పనులు చేయమని ప్రోత్సహించరు. కాబట్టి వారి ఇష్టప్రకారం పో. దానివల్ల నీకు కీడు లేదు. మేలు కలుగుతుంది. లక్ష్మణా! ఇక్కడి కొండలు, వృక్షాలు, సరస్సులు అందలి నెమళ్లు మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి సుఖంగా పోయిరండి. పాపరహితుడవైన శ్రీరామచంద్రా! నా ఆశ్రమానికి మళ్లీ రండి’ అని అంటాడు.
అప్పుడు లోకసుందరి అయిన సీత విల్లంబులను, ఇతర ఆయుధాలను అంబుల పొదులను రామలక్ష్మణులను తీసుకొమ్మని చెప్పి ఇచ్చింది. వాళ్లు వాటిని తీసుకుని తమ దగ్గర వుంచుకుని ఎక్కుపెట్టారు. రామలక్ష్మణులు విండ్లు ధరించిన విధం చూసి ఆయుధాల పట్టువిడుపులు తెలిసిన సీతాదేవి వారు యుద్ధ సన్నద్ధులైనారని తెలుసుకుంది.
-సశేషం

*
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా.. 7036558799 - 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12