S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభంజనం

134 కోట్ల జనభారతం!
చాలా దేశాలకు లేనిది..
మనకున్నది ఒకటే.. మానవ వనరులు..
అదేనండీ జనాభా..!
పెరిగిన జనాభానే భారతదేశానికి ప్లస్..
అదే.. మన ఆర్థికాభివృద్ధికి మైనస్..
మరి కొనే్నళ్ళల్లోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ప్రథమ స్థానంలో నిలువనుందా..? అవుననే అంటున్నాయి ప్రపంచ జనాభా నివేదికలు. ఆర్థికరంగాన్ని కుంగదీస్తున్న జనాభాను నియంత్రించాల్సిన సమయం వచ్చిందా..? ముమ్మాటికీ అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు.. నానాటికీ పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, వారికి ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఏటా జులై 11ను ‘ప్రపంచ జనాభా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.
విశ్వంలో మూడొంతులు నీరు ఉంటే ఒక వంతు మాత్రమే భూమి ఉంది. జనాభా ఇంతై.. ఇంతింతై.. అన్నట్లుగా పెరిగిపోయి జగమంతా జనమయమైపోతోంది. అప్పుడు భూమి పరిస్థితేంటి? పర్యావరణం, వాతావరణం, వనరుల స్థితిగతులు ఏవౌతాయి? ప్రజల జీవన ప్రమాణాల పయనం ఎలాగుంటుంది? అంతా అగమ్యగోచరం.. అత్యంత ప్రమాదకరం. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు? అధిక జనాభా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ పథకాలు, దిద్దుబాటు చర్యలు, కట్టుబాట్లను కనుగొనాలి. ఈ ఆలోచనలు ప్రపంచ గణాంక శాస్తవ్రేత్తలను, జనాభా నియంత్రణ నిపుణులను సుమారు అర్ధ శతాబ్దం క్రితమే జాగరూకల్ని చేశాయి. అప్పటి నుంచి ప్రపంచ జనాభాను కట్టుదిట్టం చేయాలని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని అన్ని దేశాల్లో చర్యలు మొదలయ్యాయి.
ఒకదేశ ఆర్థిక ప్రణాళికలు, సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరం. అటువంటి లెక్కలను ప్రతి దేశమూ సిద్ధం చేసుకుంటుంది. లెక్కల ఆధారంగానే సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన, వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల గుర్తింపు వంటివి జరుగుతాయి. అందువల్లే జనాభా లెక్కలకు అంత ప్రాధాన్యం, ప్రాముఖ్యం ఉంటాయి. 1987, జులై 11న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. అప్పటి నుండి జులై 11వ తేదీని ‘ప్రపంచ జనాభా దినోత్సవం’గా పాటిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలపై ప్రజల్లో అవగాహన, చలనం కలిగించేందుకు 1989లో ఐక్యరాజ్య సమితి దీనిని ప్రారంభించింది. సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత చూసుకుంటే ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంటే, భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ జనాభాలో నలభై శాతం చైనా, భారత్‌లే ఆక్రమించాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ముంబయి ఏడోస్థానంలోనూ, కోల్‌కత పదో స్థానం లోనూ ఉంది. చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటివి అత్యధిక జనాభా కలిగిన వంద నగరాల్లో నిలిచాయి.
భూమండలంలో మానవజాతి అతి వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో జనాభా నియంత్రణ, స్థిరీకరణ వంటి అనేక విషయాలపై జనంలో అవగాహన పెంచడం, చైతన్యం తీసుకురావడం ‘ప్రపంచ జనాభాదినోత్సవం’ ముఖ్య ఉద్దేశం. జగత్తులోని జీవరాశుల్లోకెల్లా మానవజాతి అత్యంత తెలివైనది. మానవుడు తను జీవించడానికి ప్రకృతి సిద్ధమైన వనరులైన భూ, జల సంపదలను వాడినంతగా ఈ జగతిలో మరే ప్రాణీ వాడి ఉండదు. అంతేకాదు మనిషి తన మనుగడ కోసం, అవసరాల కోసం, విలాసాల కోసం సహజ వనరులతో పాటు ఇతర ప్రాణులను కూడా నాశనం చేయగలడు. మానవ మేధస్సు అపారమైనది. దీంతో మనిషి అద్భుతాలను సృష్టిస్తున్నాడు. కానీ ఈ పరివర్తన వెనుక సహజ వనరుల నిర్మూలన, పశుపక్ష్యాదులు, వృక్ష జాతి వినాశనాలు, జల సంక్షోభాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణానికి, జనాభాకి మధ్య ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంది.
జనాభా అతిగా పెరగడం వల్ల కలిగే దుష్ఫలితాలు, వాటి నివారణ, జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ పథకాల రచన అనేవి ఇప్పటి లక్ష్యాలు. వీటిని జనంలోకి తీసుకెళ్లి వారిని చైతన్య వంతులుగా చేయడం కూడా ఒక బాధ్యతగా స్వీకరించింది ఐక్యరాజ్యసమితి. 1995-2000 మధ్య కాలంలో ఏటా 7.8 కోట్ల మంది చొప్పున ప్రపంచ జనాభా పెరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతి, ఆహార పదార్థాల ఉత్పత్తి పెరగడంతో పాటు మరణాల రేటు తగ్గిపోవడం జనాభా పెరుగుదలకు ముఖ్యకారణాలుగా పరిశోధకులు తేల్చారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉంటోంది. అందువల్లే డిమాండ్ అధికంగా పెరిగి సప్లై తగ్గుముఖం పట్టడంతో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్, సప్లైల మధ్య అగాధం పెరిగిపోతోంది. ఫలితంగా ఉన్నవాడు కొనుక్కుంటున్నాడు. లేనివాడు ఆకలి చావులను ఎదుర్కొంటున్నాడు.
సహజ వనరులకు ఒక పరిమితి ఉంటుంది. అవి పరిమిత జనాభా అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ పరిమితి అపరిమితమైతే వనరులు నిరుపయోగస్థాయికి చేరుకుంటాయి. పైగా మితిమీరిన సేద్యం, వినియోగం, విచ్చలవిడితనం వల్ల భూసారం తగ్గి కాలుష్యం పెరిగిపోతోంది. సంపదలున్నా అవి సరిపోని, పనికిరాని స్థితికి చేరుకుంటున్నాయి. ఫలితంగా దారిద్య్రం, ఆకలిచావులు, మోసాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు వంటి విపరిణామాలతో సమాజం అదుపు తప్పుతోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రతి సెకనుకూ ఐదు మంది పుడుతున్నారు, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకు ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోంది. అంటే నిమిషానికి 180 మంది, గంటకు 10,800 మంది, రోజుకు 2,59,200 మంది, ఏడాదికి 9,46,08,000 మంది పెరిగిపోతున్నారు. ఈ లెక్కలు ఇలాగే ఉంటే భూ సంపద క్షీణత వ్యతిరేక దిశలో పయనిస్తోంది.
భారతదేశ జనాభా అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాతో సమానం. ఇదేరీతిలో మన దేశ జనాభా పెరుగుదల కొనసాగితే 2025 నాటికల్లా భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఆవిర్భవించడం తథ్యం అని ఇటీవల అమెరికా గణన సంస్థ వెల్లడించింది. సత్వరమే భారత్ దిద్దుబాటు చర్యలు, జనస్థిరీకరణ, నియంత్రణకు పూనుకోవాలి. లేకుండా ఆఫ్రికా దేశాల్లా ఆకలి, పేదరికం అనివార్యమవుతాయి.
జనాభా లెక్కలు
సామాజిక శాస్త్రంలోనూ, జీవశాస్త్రంలోనూ ‘జనాభా’ అన్న పదాన్ని ఒక జాతికి చెందిన సంఖ్యను చెప్పడానికి వాడతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇత విజ్ఞానశాస్త్రాల్లోనూ ‘సముదాయం’ అన్న అర్థంలో కూడా వాడతారు. ఓ నిర్ణీత ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా. ఈ జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘వైయక్తిక ఆవరణ శాస్త ం’ లేదా ‘జనాభా జీవావరణ శాస్త్రం’ అంటారు. జనాభా నిరంతర పరిమాణంలో మార్పులకు గురవుతూ ఉంటుంది. దీని గురించి తెలిపేదే జీవ గతిజశీలం (పాపులేషన్ డైనమిక్స్).
శాస్ర్తియ పద్ధతిలో జనగణన 1872లో మొదలైంది. 1881లో తొలిసారి దేశవ్యాప్తంగా జనగణన మొదలైంది. స్వాతంత్య్రం వచ్చాక ప్రతి పదేళ్ళకోసారి జనాభాను లెక్కిస్తున్నారు.
క్రీ.శ. 1000వ శతాబ్దంలో ప్రపంచ జనాభా 40 కోట్లు మాత్రమే.. 1850లో మొదటిసారి ప్రపంచ జనాభా వందకోట్లను దాటింది.. అక్కడి నుంచి కేవలం 150 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య 650 కోట్లను దాటింది. అంటే మూడు రెట్లు ఎక్కువ అన్నమాట. ఇదే లెక్కన వచ్చే యాభై సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అదే మన భారతదేశంలో చూస్తే.. 1750లో మనదేశ జనాభా పనె్నండున్నర కోట్లు మాత మే. 1941 కల్లా అది 38.9 కోట్లు అయ్యింది. ఇప్పుడు 134 కోట్లు అయ్యింది. ఇలా జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో..
దేశంలో జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటరుకు 366 ఉంటే ప్రపంచ జనాభా జనసాంద్రత 50గా ఉంది.
భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ 19 శాతం ఉంటే అదే ప్రపంచంలో సోషల్ సెక్యూరిటీ సగటున అరవై శాతంగా ఉంది.
ప్రపంచంలో చాలా దేశాలు ప్రజారోగ్యం కోసం 58 శాతం నిధులను ఖర్చుచేస్తే.. మన దేశంలో ప్రజారోగ్యానికి 28 శాతమే ఖర్చు చేస్తున్నారు.
ప్రపంచంలో జనాభా వృద్ధిరేటు 2.53గా ఉంటే.. ఒక్క భారత్‌లోనే అది 2.66గా ఉంది.
ఈ లెక్కలు చాలు- జనాభా పెరుగుదల ఎంత ప్రమాదకరమో చెప్పడానికి.
కుటుంబ నియంత్రణ..
ప్రపంచంలో కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశ పెట్టిన దేశం భారతదేశమే. 1950లోనే కుటుంబ నియంత్రణకు నూతన సూత్రీకరణలు చేసి లక్షలు, కోట్లు ఖర్చు చేసింది. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి కారణాలు అనేకం కావచ్చు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం. దానితో పాటు ప్రభుత్వ పథకాలలో అవకతవకలు, పారదర్శకత లోపించడం, మూఢ నమ్మకాలు, అవిద్య, మహిళా సాధికారత లేకపోవడం వంటివి కూడా. ఇదే విషయంలో 1976లో దేశంలో జనాభా నియంత్రణ పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీనివల్ల జనాభాను మన ఆర్థిక రంగానికి అనుగుణంగా అన్ని కోణాల్లోనూ తీర్చిదిద్దడం, ఆర్థిక పరిస్థితిని పెరుగుపరచడం, జన జీవన శైలిని, ప్రమాణాలను వృద్ధి పరచడం కొంతమేరకు సాధ్యమైంది. చైనాలో వివాహిత మహిళలు 85 శాతం మంది గర్భనిరోధక సాధనాలను వాడుతున్నారు. మన దేశంలోని వివాహితల్లో 41 శాతం మంది మాత్రమే గర్భనిరోధక పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. చైనాలో ‘ఒక్క బిడ్డే ముద్దు.. రెండో బిడ్డ వద్దు..’ అనే విధానాన్ని గత పదేళ్ల నుంచి కఠినంగా అమలు చేస్తున్నారు. ఫలితంగా గడిచిన పదేళ్లలో అక్కడ జనాభా రేటు అంతగా పెరగలేదు. భారత్‌లో ‘ఇద్దరు పిల్లల కానె్సప్ట్’ జనాభా పెరుగుదలకు అడ్డంకిగా మారింది.
సాంకేతిక విషయాలు
జనగణనకు కొన్ని ప్రత్యేకతలుంటాయి. అవి జనన, మరణరేట్లు, వ్యాప్తి, సాంద్రత, వయోవ్యాప్తి, జనాభా నియంత్రణ.
* జనన, మరణాల రేటు అనేది నిర్ణీత కాల వ్యవధిలో జనాభాలో వచ్చే జననాల సంఖ్యను జననరేటు అంటారు. ఇందులో సమగ్ర జనన రేటు, విశిష్ట జనన రేటు, శక్త్యర్థ జనన రేటు, జీవావరణ జనన రేటు అనే వివిధ లెక్కింపు విధానాలున్నాయి. అలాగే మరణాల రేటులో కూడా సమగ్ర, విశిష్ట, శక్త్యర్థ, జీవావరణ మరణ రేట్లు ఉంటాయి. మరణాల రేటుకంటే జననాల రేటు ఎక్కువగా ఉన్నప్పుడే ఆ జనాభా పరిమాణం పెరుగుతుంది.
* జనాభాలోని ‘జీన్‌పూల్’ని ప్రభావితం చేసే విషయాల్లో వలసలు అనేవి ముఖ్యమైన అంశాలు. వీటి ఫలితంగా జనాభా పరిమాణంలో వృద్ధి లేదా క్షీణత సంభవిస్తాయి.
* ఒక ఆవాసంలోని నిర్దిష్టమైన వైశాల్యం లేదా ఘన సాంద్రతలో నివసించే జీవుల సంఖ్యను జనసాంద్రత అంటారు. నేలపై తిరిగే జీవులకు వైశాల్యాన్ని వీటిలో ఉండే జీవులకు ఘన పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకుంటారు.
* అనుకూలమైన పరిస్థితుల్లో నివసించే జనాభా జీవసామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుమీరక పోవడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జీవి చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే జీవసామర్థ్యం అంటారు.
* జనాభా ప్రధాన లక్షణాల్లో వయో వ్యాప్తి ఒకటి. జనాభాలో మూడు గ్రూపులుంటాయి. ఒకటి ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు), రెండోది ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు), మూడోది ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు). ఈ మూడు సమూహాల మధ్య వయో వ్యాప్తి జనన, మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
తక్షణ కర్తవ్యాలు
జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని జనాభా నియంత్రణ అంటారు.
* జన స్థిరీకరణ, నియంత్రణ, ప్రస్తుత ఆర్థికరంగానికి అనుసంధానం చేస్తేనే జన జీవనజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంది. భూమాత భారం తగ్గుతుంది.
* ఒక ప్రాంతంలో సంతానోత్పత్తి రేటులో వచ్చే తేడాలు, పెద్ద ఎత్తున జరిగే వలసలు, రోగాలు, కరువులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాల వల్ల జనాభా తరగవచ్చు.
* జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాలను రెండు విధాలుగా విభజించవచ్చు. అవి..
1. సాంద్రతా పరతంత్ర కారకాలు. అంటే ఇవి జనసాంద్రతపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు.. వంటివన్నమాట.
2. సాంద్రతా స్వతంత్ర కారకాలు. వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహార కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివన్నమాట.
* ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహించబడే జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకునే నియంత్రణకు గల భేదాన్ని గమనించాల్సి ఉంటుంది. వ్యక్తులు తమకు పిల్లలు కావాలనుకునే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన ఆన్‌లీ కోలే విశే్లషణ ప్రకారం జనాభా పెరుగుదల తగ్గడానికి మూడు వౌలికమైన కారణాలు ఉన్నాయి.
1. సంతానోత్పత్తి కేవలం అదృష్టం (్ఛన్స్) లేదా దేవుడి అనుహ్రం కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉందని గ్రహించడం.
2. పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అనుకోవడం.
3. నియంత్రణకు అవసరమైన విధానాల గురించి అవగాహన పెంచుకోవడం.
* కేవలం ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు మూడు. అవి..
1. పిల్లలను కనడం ఆలస్యం చేయడం.
2. బిడ్డకు, బిడ్డకూ మధ్య ‘విరామం’ ఎక్కువకాలం ఉండేలా చూసుకోవడం.
3. అసలు బిడ్డలను కనకపోవడం.
* ఇప్పటి సమాజంలో స్ర్తివిద్య, ఆర్థిక స్వావలంబన అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీరు కొద్దిగా నియంత్రణ పాటించినట్లైతే సంతానోత్పత్తి రేటు కచ్చితంగా తగ్గుతుంది.
* వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కన్నా ప్రభుత్వాలు పాటించే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.
* జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్ళు కూడా సమర్థనీయమే. 30, 31 ఏళ్ళ వయసులో వివాహం చేసుకునే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
* ఉపాధ్యాయులు, అధ్యాపకులు గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. వైద్య, ఆరోగ్య శాఖ చొరవ తీసుకోవాలి. ఆడపిల్ల అయినా, మగపిల్లాడు అయినా సమానమనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి. ఫలితంగా మగబిడ్డ గురించి ఎదురు చూడకుండా ఎవరైనా సరే అనుకుని ఒక్కబిడ్డతోనే ఆగిపోతారు.
* 18 ఏళ్లలోపే పెళ్లిళ్ళు చేసుకోవడం, 13 నుంచి 19 సంవత్సరాల్లోనే పిల్లల్ని ఎక్కువగా కనడం వంటివి జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయని ఓ అంచనా.
* ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనాభా నియంత్రణకు సమావేశాల్ని నిర్వహించాలి. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలి. జనాభా నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి. *

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి