S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బుద్ధి చెప్పిన దొంగలు

రామాపురంలో గోవిందయ్య అనే అతను బజారులో కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవాడు. సామాన్లు అందివ్వడానికి ఎవరినో ఒకరిని పనికి పెట్టుకునేవాడు. కొంతకాలం అయ్యాక అతనికి జీతం ఇవ్వాల్సి వస్తుందని అతనిపై ఏదో ఒక నింద మోపి తరిమేసేవాడు. అలా అతని దగ్గర చాలామంది పనికి కుదిరి, ఆ తర్వాత దొంగని ముద్ర వేయించుకొని వెళ్లిపోయారు. ఆ వూళ్లో వాళ్లకి గోవిందయ్య సంగతి తెలియడంతో పనికి ఎవరూ రాలేదు. దాంతో తనకు ఒక పనివాడు కావాలని పొరుగూరిలో విచారించాడు.
వారం తర్వాత పొరుగూరైన కృష్ణాపురం నుండి రాజయ్య అనే అతను గోవిందయ్యని కలిసి ‘అయ్యా తమరు కొట్లో పని ఇస్తే చేస్తాను’ అని అడిగాడు.
‘సరే.. పని ఇస్తాను. నమ్మకంగా ఉండాలి. దొంగతనం చేసి దొరికావంటే జీతం ఇవ్వను. అంగీకారమేనా?’ అన్నాడు గోవిందయ్య.
‘నేనలాంటి వాడిని కాదయ్యా.. నమ్మకంగా పని చేస్తా!.. అయితే నాది పొరుగూరు కాబట్టి ప్రతిరోజూ ఇంటికి వెళ్లడం కుదరదు. నాకు తిండి పెట్టి, రాత్రికి బస చూపించాలి. దానికి అయ్యే ఖర్చు నా జీతంలో పట్టుకోండి..’ అని షరతు పెట్టాడు రాజయ్య.
మొదట వద్దనుకున్నా తనకు పనివాడి అవసరం వున్నందున గోవిందయ్య అతని షరతుకు ఒప్పుకున్నాడు. ప్రతిరోజూ రాత్రి కొట్టు మూసిన తర్వాత గోవిందయ్య ఇంట్లో అన్నం తిని వచ్చి కొట్టు ముందర వరండాలో మడత మంచం వేసుకొని పడుకొనేవాడు రాజయ్య.
రెండు నెలలు గడిచాయి. పది రోజుల నుండి రాజయ్య జీతం అడుగుతున్నాడు. ఏదో ఒకటి చెప్పి వాయిదా వేస్తున్నాడు గోవిందయ్య. అతను మనసులో రాజయ్యకి జీతం ఎలా ఎగ్గొట్టాలా అనే విషయం ఆలోచిస్తున్నాడు. ‘తిండి పెట్టి, పడుకోడానికి చోటు చూపించానుగా నిదానంగా ఇస్తాను’ అని సర్ది చెప్పాడు.
రాజయ్య కూడా డబ్బులు చేతికి ఖర్చయి పోతాయి. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో తీసుకుంటే ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు’ అని ఆలోచించాడు.
ఒకరోజు ఎప్పటిలాగే కొట్టు మూసిన తర్వాత అన్నం తిని, వచ్చి మడత మంచం వాల్చుకొని నిద్రపోయాడు రాజయ్య. అర్ధరాత్రి సమయంలో కొట్టు లోపల శబ్దాలు వినిపించి మెలకువ వచ్చింది రాజయ్యకు.
లోపల దొంగలు పడ్డారని గ్రహించి కొట్టు చుట్టూరా తిరిగి చూశాడు. గోడకి వేసిన కన్నం కనిపించింది. పెద్దగా అరిస్తే దొంగలు బయటకు వచ్చి తనను కొడతారేమో..! లేదా బయటకు వచ్చి పారిపోతారేమో అని.. ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నంతలో కాపలా భటులు అటుగా వెళ్లటం కంటపడింది. వారిని చూడగానే ధైర్యంగా ‘దొంగలు.. దొంగలు’ అని పెద్దగా కేకలు వేశాడు రాజయ్య. అతని అరుపులు విన్న కాపలా భటులు పరిగెత్తుకొచ్చారు. అరుపులకు కన్నంలోంచి బయటకు వచ్చిన దొంగలిద్దరినీ బంధించారు భటులు.
తెల్లారి దొంగలిద్దరినీ గ్రామాధికారి ముందర ప్రవేశపెట్టారు. గోవిందయ్యను, దొంగలను పట్టించిన రాజయ్యను కూడా పిలిపించాడు గ్రామాధికారి. దొంగలను చూడగానే గోవిందయ్య ఆశ్చర్యపోయాడు. కారణం వాళ్లిద్దరూ గతంలో గోవిందయ్య కొట్లో పని చేసినవాళ్లే.
‘అయ్యా మేము నిజమైన దొంగలము కాదు. ఈ గోవిందయ్య దగ్గర ఇంతకు ముందు జీతానికి కుదిరాము. మా చేత నెలల తరబడి పని చేయించుకొని, జీతం అడగ్గానే మామీద లేని దొంగతనాన్ని మోపి జీతం ఇవ్వకుండా తరిమేశాడు. దానికి ప్రతీకారంగా ఈ దొంగతనానికి పాల్పడ్డాము. మమ్మల్ని వదిలేయండి’ అని బ్రతిమాలారు.
గట్టిగా దబాయించేసరికి నిజం ఒప్పుకున్నాడు గోవిందయ్య. గ్రామాధికారి గోవిందయ్యను మందలించి ‘నువ్వు వారికి జీతం ఇచ్చే ఉంటే వారు ఇలా దొంగలయ్యేవారు కాదు. వీళ్లు మామూలు దొంగలు కాదు. నీకు బుద్ధి చెప్పాలని వచ్చిన దొంగలు. దీనికి కారణం నీవే..’ అని వారికి ఇవ్వాల్సిన జీతం బకాయిలను ఇప్పించాడు.
‘మీరు అతనికి బుద్ధి చెప్పాలనుకొన్న తీరు సరికాదు. మీకు అన్యాయం జరిగితే మాకు చెప్పాలి గానీ.. ఇలా కొట్టు మీద పడి దోచుకోవడానికి రావడం నేరం. దీనికి పరిహారంగా చెరో పది వరహాలు జరిమానా కట్టండి. మరోసారి పట్టుబడితే కఠిన శిక్ష తప్పదు’ అని వారిని హెచ్చరించి వదిలేశాడు.
తన కొట్టును కాపాడిన రాజయ్యను పనిలోంచి తీసేసే ఆలోచన మానుకొని నెలనెలా సక్రమంగా జీతం ఇస్తూ పనిలో కొనసాగించాడు గోవిందయ్య.

-కైపు ఆదిశేషారెడ్డి